"మొన్న రాత్రి విజయవాడ పని మీద వెళ్ళి ఇప్పుడే నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో వచ్చానండీ."
ఇన్ స్పెక్టర్ శవం వంక నిశితంగా చూసి, "వంటి మీద నగలు ఏమి లేవా.... ఇంట్లో సామాన్లు అవి అన్నీ సరిగ్గా ఉన్నాయా...."
"వంటి మీద చేతికి రెండు జతల గాజులు, మెడలో సూత్రం తాడు, చేతికి ఉంగరం ఉండాలి లేవు. బీరువాలో ఇంక డబ్బు, కొన్ని నగలు, వెండి సామాను కొంచెం ఉన్నాయి. ఇంక చూడలేదు అవి ఉన్నాయో లేదో."
"శేషాద్రీ. బీరువా మీద ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేశావా. కత్తి మీద ఇంకెక్కడ దొరికితే అక్కడ తీసుకో . బీరువా పనయిందా" అడిగాడు ఫింగర్ ప్రింట్ అతన్ని.
"బీరువా అయింది చూడొచ్చు సార్" అన్నాడు శేషాద్రి.
ఇన్ స్పెక్టర్ సుధాకర్ తో , "బీరువా తెరిచి ఏమన్నా పోయాయోమో చూడండి" అన్నాడు.
సుధాకర్ లాకర్ తెరచి , బట్టల మధ్య వెతికి, "సరోజది నెక్లెస్ సెట్, ఒకటి రెండు ఉంగరాలు , కాష్ 2,3 వేలుండాలీ సార్ అదీ లేదు" అంటూ వెతికి, 'ఖరీదైన కెమెరా ఫారెన్ ది - అదీ లేదు సార్" అన్నాడు.
"అంటే , అంతా కలిపి అరవై డెబ్బై వేల పైమాటే గదా" ఇన్ స్పెక్టర్ అన్నాడు.
"అనుకుంటానండీ."
"అంటే ఇది డబ్బు కోసం చేసిన హత్య అయి ఉంటుందా? ఇంతకీ ఇది దొంగతనం కోసం అయితే దొంగలు ప్రవేశించే అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి?"
"కేవలం వీధి గుమ్మం నించి తప్ప మిగతా బాల్కనీల్లో అక్కడ గ్రిల్స్ ఉన్నాయండి. అక్కడెక్కడ నుంచి ఎవరూ వచ్చే వీలులేదు" సుధాకర్ అన్నాడు.
తలుపు పరీక్షించి "తలుపు బలవంతంగా తీసిన గుర్తులు లేవు. అంటే మీ ఆవిడ తీసి ఉండాలి - ఎవరన్నా బెల్ కొడితే తీసి ఉంటారా - తెలిసినవారు పిలిస్తే తీసి వుండొచ్చా."
సుధాకర్ అయోమయంగా చూస్తూ "నాకెలా తెలుసుందండి . అసలు ఏ టైములో ఈ హత్య జరిగిందో - అర్ధరాత్రి ఎవరన్నా పిలిచినా తలుపు అంత వెంటనే తీస్తుందా - తెలిసిన గొంతు అయితే తప్ప....' గొణిగినట్లన్నాడు.
"ఊ, అదీ కరెక్టే. శవాన్ని పోస్టుమార్టమ్ చేస్తే తప్ప టైము సరిగ్గా తెలియదు. టైముని బట్టి ఆలోచించాలి. డబ్బు తప్ప ఇంకేదన్నా మోటివ్ వుందా అని కూడా ఆలోచించాలి. చూడండి సార్. మీ ఆవిడకి తెలిసిన వారు, స్నేహితులు, బంధువులు ఎవరన్న రాత్రివేళ వచ్చే అవకాశం ఉందా."
తల అడ్డంగా ఊపాడు సుధాకర్.
'ఆవిడ బంధువులు ఎవరూ లేరండి. స్నేహితులున్నారేమో ఆఫీసులో కొలీగ్స్ వాళ్ళు నాకు తెలిసినంత వరకు అంత చనువుగా రాత్రి యింటికి వచ్చేవారు లేరనుకుంటున్నాను.'
"సరే , మీరు స్టేషను కొచ్చి రిపోర్టు రాసిచ్చి, సంతకం చేయండి. బాడీ పోస్టుమార్టమ్ అయ్యాక అప్పగిస్తాము. ఈలోగా మీకేదన్నా అనుమానం, ఆచూకీ క్లూ లాంటివి ఏమన్నా దొరికితే చెప్పండి. ఆ వన్ మినిట్ , మీరు మొన్న రాత్రి ఊరెళ్ళామన్నారు , ఏ ఊరు?"
"విజయవాడండి.'
"నిన్నంత విజయవాడలోనే ఉన్నారా?" సందేహంగా చూస్తూ అడిగాడు ఇన్ స్పెక్టర్.
సుధాకర్ బెరుకుగా చూస్తూ తనని అనుమానిస్తున్నాడా అన్న భయంతో, "నిన్నంతా విజయవాడలోనే వుండి రాత్రి ట్రైను పట్టుకుని వచ్చానండి" అన్నాడు.
"మీరు అక్కడ ఉన్నట్టు ఋజువు చేయగలరా, ఎవరన్నా సాక్ష్యం చెప్పగలరా - సారీ, మా పోలీసులు అన్ని వైపుల నుంచి ఆలోచించాలి. దోషి దొరికే వరకు అందరినీ అనుమానించడం మాకు తప్పదు. అందుకని అడుగుతున్నాను" అన్నాడు ఇన్ స్పెక్టర్.
సుధాకర్ తేలికగా నిట్టూర్చి , "దాందేముందండీ . నేను అక్కడ ఉన్నట్టు ఎవరైనా చెపుతారు. ఇద్దరు ముగ్గురు మెడికల్ షాపు వాళ్ళని , ఒక డాక్టరు పెద్ద ఆర్డరు ఇస్తానంటే కలవడానికి వెళ్ళాను. దురదృష్టవశాత్తు అయన అర్జంటుగా ఊరికి వెళ్ళారు. సాయంత్రానికి వస్తే కలవచ్చు అన్నారు ఇంట్లో వారు - మెడికల్ షాపు వారిని అడగండి నేనెప్పుడూ వెళ్ళే లాడ్జి వారిని అడగండి ."
"లాడ్జిలో ఎప్పటి వరకు ఉన్నారు. మెడికల్ షాపుల కెప్పుడు వెళ్ళారు?" ఆతరవాత ఇంకేం చేశారు?"
"ఉదయం దిగి లాడ్జి కెళ్ళి స్నానం చేసి, టిఫిన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుని పది గంటలకి మెడికల్ షాపుల వారిని కలిశాను. డాక్టరుని కలవాలని ఫోను చేస్తే సాయంత్రానికి గాని రారనడంతో చేసేదేం లేక వంటిగంటకి భోం చేసి మాట్నీ సినిమా కెళ్ళాను. సాయంత్రానికి కూడా డాక్టరు గారు రాలేదు. అంచేత సినిమా చూసి కాసేపు యిటు అటు తిరిగి స్టేషను కెళ్ళి అక్కడ భోం చేసి రాత్రి నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ పట్టుకున్నాను. డాక్టరు సాయంత్రం కూడా రారని ముందే తెలిస్తే వెంటనే ఏదో ట్రైనో బస్సో పట్టుకు వచ్చేసేవాడిని. అలా వచ్చేసి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదేమో" - మళ్ళీ కళ్ళు నిండాయి అతనికి.
"సారీ సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు - మాకివి రొటీన్ ప్రశ్నలు. సాయంత్రం వరకు మీరక్కడే వున్నారనడానికి రుజువు తెలిసినవారు, చూసిన వారు ..." ప్రశ్నార్ధకంగా చూస్తూ అన్నాడు.
"సాయంత్రం సినిమా నించి వచ్చాక నేనింక ఎవరిని కలవలేదండీ..." అంటూ ఆగిపోయి ఏదో గుర్తు వచ్చినట్టు పేంటు జేబులు వెతికి సినిమా టిక్కెట్లు పైకి తీశాడు సంతోషంగా. "ఓగాడ్, లక్కీగా ఇది జేబులో ఉండిపోయింది" అంటూ ఇచ్చాడు.
"యిదేమిటి , టిక్కెట్టు మొత్తం ఉంది?" ఇన్ స్పెక్టరన్నాడు.
"ఆదా నేను వెళ్లేసరికి సినిమా మొదలై పదినిమిషాలు అయింది. తలుపు దగ్గర ఎవరూ లేరు. సీటు వెతుక్కుని నేనే వెళ్ళి కూర్చున్నాను. ఆడిగితే చూపిద్దాం అని జేబులో పెట్టుకున్నాను. ఎవరూ వచ్చి అడగనే లేదు."
"ఐసీ! ఏం సినిమా అన్నారు?" అంటూ పేరు చూసి, టిక్కెట్టు తన జేబులో పెట్టుకుంటూ, "ఇది నా దగ్గర వుండనీయండి. అన్నట్టు రైలు టిక్కెట్టు కూడా వుందా?"
"వుందండీ . టిక్కెట్టు ఎప్పుడూ నేను గేటు దగ్గర చూపించి ఉంచుకుంటాను. నేను టి.ఏ బిల్లు సబ్ మిట్ చేయాలి గదా."
"సరే మరో ప్రశ్న. ఈ కత్తి మీ ఇంట్లోదా..... చెప్పగలరా?"
"ఉండండి" అంటూ వంటింట్లో కి వెళ్ళి వచ్చి, "మాదానిలాగే ఉందండి. మా దగ్గర డీ కత్తుల సెట్ వుందండి. ఐదు రక రకాలు - తరగడానికి సైజుల వారిగా సెట్ వుంది. మా ఆవిడెవరో సేల్స్ మెన్ ఇంటి కొస్తే కొంది. అదే ఇది అనుకుంటున్నాను" అన్నాడు.