ఒకటీ - పదీ
ఈ ఫస్టోబరు రోజు ఎవరా వస్త
చెప్పండి కాస్త ఎవరా వస్తున్న రాజు
ఆరంభ మంగళముహూర్తం ఆసన్నమయింది
ఆహ్వానం కోసం మా గానం ఆయత్తమయింది
అయితే ఆ వస్తున్నది ఆం అవునో కాదో
ఆస్వాదించబోయే అనుభవం ఆఖరుకు తీపో చేదో
శ్రీరాములుచుట్టి చిత్తగించవలెను దాకా
ప్రవహించిన విజయ ప్రభవించే తనయ
ఆం కాకపోతే ఏం అందులో ఒక ముక్క
ఆ ముక్కలో ఒక చెక్క అయినా ఇదే మా ఓం
అదో పదో నెల బాల
హాస విశాల
పుట్టింటి కొస్తోంది
పూర్ణ గర్భిణి
2
తారంగం తారంగం లాలీ లాలీ
ఆనందం ఆనందం హాయీ హాయీ
శంఖాలూ ఢంకాలూ మ్రోగించండీ
స్నేహర్ద్రం సౌహార్దం సాధించండీ
రైలుబండి లేటయిందా
వంతెన చుట్టూ వరదలా
ఇంజన్ సరిగ్గా లేదూ
ఎందు కదంతా పోదూ
పూలదండతో
నిండింది స్టేషన్
కోటి గొంతుకలతో
పాడింది నేషన్
పదిలంగా పొగబండి
చేరింది డెస్టినేషన్
రారండీ రారండీ యావన్మందీ
ఆడండీ పాడండీ హ్లాదం చెందీ
ఆంధ్రరాష్ట్రం ఆగమనం
అసత్యం కాజాలని చారిత్రక వాగ్దానం
మన చారిత్రాత్మక నిరంతరాందోళన
చరితార్ధ మయిందీనాడు
ఈ రాష్ట్రం ఇదిగో ఇప్పుడే చెబుతున్నా
ఏదో కొందరి సదుపాయాని కేర్పడలేదు
ఎవరో కొందరుద్యోగులకని వేర్పడలేదు
ముక్కోటి ఆంధ్రుల అంకురిత దీక్ష
అజేయ సంకల్పం
ఆంధ్రావతరణకి కారణం
ఈ రోజు ఊరేగింపులు జరుగుతాయ్ నిజమే
ఉత్సవాలు జరుగుతాయ్ నిజమే
ఉత్సాహం ఉప్పొంగుతుంది నిజమే
యథావిధిగా అన్ని లాంఛనాలూ సాగుతాయ్ నిజమే
కాని ఆ లాంఛనాలన్నింటి తర్వాత
వచ్చిన అతిథులు వెళ్ళిపోయిన తర్వాత
పాటలూ ప్రసంగాలూ జయ జయధ్వానాలూ చల్లబడ్డ తర్వాత
సంబరాల తర్వాత
సంపాదకీయాల తర్వాత
సామాన్య మానవుడి భుజస్కంధాలమీద
సమస్తభారం పడుతుంది
అతనిదీ ఈ రాష్ట్రం
అతనికోసం ఈ రాష్ట్రం
పెత్తనం చెయ్యాలని ముందుకొచ్చే
పెద్దలిది గ్రహించాలని హెచ్చరిక
శుభంగా శోభావహంగా
ఆకారం తాల్చుతున్న ఆంధ్రరాష్ట్రం
ఆంధ్రజాతి కంతటికీ విజయం
ఆంధ్ర సంస్కృతికి అఖండ విజయం
ముఖ్యంగా అతి ముఖ్యంగా
ఆంధ్రభాషకిది అపూర్వ విజయం
ఇది వినండి మరి
విప్లవం మున్ముందు మనుష్యుని మనస్సులో ప్రారంభమవుతుంది
మనఃప్రపంచానికి బాహ్య స్వరూపం భాష
భాషావిప్లవమే భావ విప్లవం
అందుకే ఈ ఆనంద సమయంలో
భాషలోనూ భావంలోనూ విప్లవం తెచ్చిన
మహా మానవులైన
మన గిడుగు గురజాడ వీరేశలింగం
మహనీయులను
నా మనఃఫలకం ముందు సాక్షాత్కరింపజేసుకొని
నమస్కరిస్తున్నాను
వారిచ్చిన ఆశీర్వాదాలు
తీర్చిదిద్దిన ఒరవడులు
చిరకాలం మన ఆంధ్రావనికి
శ్రీరామరక్ష
దేవతలే మానవులై దీవిమ్చాలి
దేశంలో దేవత్వం దీపించాలి.
ఈ ఫస్టోబరు శుభవేళ
నిన్నటి మన స్వరూపం స్మరించి
నేటి మన స్వభావం గ్రహించి
రేపటి మన సమాజంకోసం కలిసి మెలిసి క్రమించుదాం
నిన్న మన ఓడరేవులనుంచి దేశదేశాలకి
మన నాగరికత నౌకాయానాలు చేసింది
నేడు మన రహదార్లు ఎద్దుబళ్ళకి ఏడుపు తెప్పిస్తున్నాయ్
ఇనుపదార్లు ఇరుకైపోయినాయి
రేపు మన విశాలాంధ్ర విమానాశ్రయాలనుంచి
మహాకాశాల్లో మన విమానాలు ప్రయాణం చేస్తాయ్.
నిన్నటి మన రాజనగరాల్లో
రత్నరాసుల విపణివీధులు
విదేశీయులకి విభ్రాంతి కలిగించాయ్
నేడు పట్టణాల పాలకసంఘాలు
దరిద్రాలను తరిమివెయ్యలేక
అంధకారాన్ని అరికట్టలేక
అటమటించి అల్లాడుతున్నాయ్.
రేపటి మన జల విద్యుత్ ప్రణాళికలు
సిమెంట్ కాంక్రీట్ వినిర్మాణాలు
ట్రాక్టర్లు బుల్ డోజర్లు
పారిశ్రామిక వ్యవసాయక సహసమానాభివృద్ధిలో
ప్రతి కుటుంబానికీ ఒక నివాసగృహం చూపిస్తాయ్
ప్రతి వ్యక్తిచేతికీ ఒక పని కల్పిస్తాయ్
ప్రతి మనస్సులో ఒక పరిశుభ్రమైన గీతం పలికిస్తాయ్.
నిన్న మనదేశం మహామంత్రులైన అక్కన్న మాదన్నలని లోకానికిచ్చింది.
నేడు మంత్రి పదవుల మంతనాలతో వాతావరణంలో
దుమ్ముదుమారం చెలరేగింది
రేపు జాతినంతటినీ ఏకమార్గంలో నడిపించి
అఖిల భారతావనికే ఆదర్శం చూపించగల
మహానాయకుడు మనకు లభిస్తాడు
నిన్న తమకంటె హెచ్చువారి కాళ్ళు పట్టుకొని కొలిచి
తమకన్న తక్కువవారిని కాళ్ళకిందపట్టి అణచి
చిరునవ్వుతో స్తిమితంగా సర్దుకుపోయే మనస్తత్వం
నేడు ఆ మనస్తత్వపు అవశేషాల నెదిరించి
పోరాడుతున్నవారి తిరుగుబాటు
రేగించిన ప్రచండ సంఘర్షణల
ప్రభంజన గర్జన
రేపు మానవుడు మానవునిలోని మాన
వత్వం గురించి మహనీయములై
సరికొత్త మర్యాదలు సృష్టించే
మహత్తరకాలం
నిన్న కవిత్వానికి రాజాధిరాజుల ఆదరణ
నేడు ప్రభువులలో పరిపాలకులలో ఇంకిపోతూన్న రసహృదయం
ఆనందానికి అవకాశాలూ తీరుబాటూలేని
అసంఖ్యాక ప్రజానీకం
రేపు మేలుకొన్న ప్రజలు శిరస్సున ధరించి
ఆదరించే అతి నవీన కవితామాధుర్యం
సంతోషం సంరంభం నేడే నేడే
సౌమార్గ్యం సౌభాగ్యం రేపే రేపే
- తెలుగు స్వతంత్ర వారపత్రిక - 2.10.1953