Previous Page Next Page 
జనవరి 5 పేజి 27

 

       "దేనికయినా... ఏ వ్యాపారానికయినా మానవ మనస్తత్వమే ప్రాతిపదిక. మానవ బలహీనతలే పునాది. అభిరుచులే ఆలంబన. వీటిని నేను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకుంటూ ముందుకు సాగుతాను. యిక పోటీ అంటారా... పోటీ ఎందులో లేదు. ప్రారంభదశలోనే అలాంటి హర్డిల్స్ గురించి యోచిస్తే మనం పైకెలా వస్తాం? ఫ్యాషన్ల ప్రపంచంలో ఒక సంచలనం సృష్టించగలమనే నమ్మకం నాకుంది. మీకు నా మీద నమ్మకం వుంటే కలసి రంగంలోకి దిగుదాం. ఇప్పుడే మీ నిర్ణయాన్ని తెలియపర్చక్కర్లేదు. ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించుకునే చెప్పండి. ఉన్నది పోగొట్టుకుని లేనిదాని కోసం అర్రులు చాచటం మూలంగా అసలుకే మోసం వస్తుందని మీకేదైనా భయం వుంటే చెప్పండి. మీ పేరున బ్యాంక్ లో చెరో పాతికవేలు డిపాజిట్ చేస్తాను. ఆపైన మీమీ వృత్తుల్లో మీకు అపార్ధమైన అనుభవం వుంది. చేస్తున్న చోట జాబ్ పోతే బ్రతకలేమన్న ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ మీకు రాదనే నా నమ్మకం" మేఖల కంఠం గంభీరంగా వుంది.
   
    వాళ్ళు వెంటనే ఏమీ మాట్లాడలేదు.
   
    వారి ముఖాలలో మారిన భావాలని బట్టి, వాళ్ళు ఆలోచనల్లో పడ్డట్లు గ్రహించింది మేఖల.
   
    "నా ఆలోచనలు, కలలు కార్యరూపం దాల్చి నిజమైతే, మనందరి బ్రతుకులు మారిపోతాయి. మీ పిల్లలకు బంగారు భవిష్యత్ ని మీరందించగలుగుతారు. మీ జీవన విధానాలే మారిపోతాయి. అందుకుగాను మీరు చేసే రిస్క్ చాలా చిన్నది. నిజానికి నేను చేస్తున్న రిస్కే చాలా పెద్దది. నేనోచోట లక్ష రూపాయలు వడ్డీకి తెచ్చాను. ఆ లక్షను పదిలక్షలు చేయాలను కున్నదే నా పట్టుదల. నా ప్రయత్నం విజయవంతం కాకపోతే మీకు చెరో పాతికవేలు మిగులుతాయి. మరి నాకో....? రిక్తహస్తాలతో రోడ్డెక్కాలి. నా రుణదాతకు సమాధానం చెప్పుకోవాలి. మరో విషయం ఇప్పుడు నా వ్యాపారానికి పెట్టుబడి లక్షకాదు. కేవలం యాభైవేలే. ఎందుకంటే మరో యాభైవేలు మీ పేర్లతో డిపాజిట్ చేస్తున్నారు కదా? ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అప్పుడు ఆలోచించండి. రేపిక్కడే, ఇదే టైంకి మీకోసం ఆశగా ఎదురుచూస్తుంటాను. మీ నిర్ణయమేదైనా వినేందుకు నేను సిద్దమే. ఇక మీరెళ్ళి రావచ్చు" అంది మేఖల ఆ ఇద్దరికేసి ఆశాభావంతో చూస్తూ.
   
    వాళ్ళిద్దరూ లేచి వస్తామన్నట్లు కళ్ళతోనే సంజ్ఞచేసి బయటకు నడిచారు.
   
    వెళ్తున్న వారి కేసే చూస్తుండిపోయింది మేఖల.
   
                      *    *    *    *    *
   
    సరీగ్గా 45 సంవత్సరాల క్రితం 1946 మే 7 సాయంత్రం రెండవ ప్రపంచ యుద్దంలో దెబ్బతిన్న ఒక డిపార్టుమెంటల్ బిల్డింగ్ మూడవ అంతస్థులో 20మంది యువకులు అత్యవసరంగా సమావేశమయ్యారు.
   
    అప్పుడా యువకుల ముందున్న సమస్యలు ఆకలి, పేదరికం, నిరాశా, నిస్పృహలు.
   
    జపాన్ రాజధాని టోక్యోలో ఓ మూలగా వున్న ఆ బిల్డింగ్ లో ఒక అనితర సాధ్యమైన నిర్ణయం తీఉస్కోబోతున్నట్లు ప్రపంచ ప్రజకు తెలీదు.
   
    కొన్ని గంటలు సుదీర్ఘంగా చర్చించుకున్న ఆ యువకులు టోక్యో కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ కార్పొరేషన్ అనే పేరుతో ఒక కంపెనీ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
   
    అప్పుడు వాళ్ళ చేతుల్లో చిల్లి గవ్వలేదు.
   
    వారిలో ప్రోది చేసుకున్న ఆశాభావం, ఆత్మవిశ్వాసమే వాళ్ళ కప్పుడున్న పెట్టుబడి.
   
    కాలగమనంలో అదే దిగ్రేట్ సోనీ కార్పొరేషన్. నవ చైతన్యమెప్పుడూ కంటిన్యుటీలోంచి ఉద్భవించదేమో....? స్మశాన వైరాగ్యంలోంచి శిధిల భవనాల్లోంచి, కరువు కాటకాల్లోంచి, పదునుదేరి, కదనుదొక్కే ప్రభంజనం లాంటి యువత పద ఘట్టనలోంచి, నిరాశా నిస్పృహల్లోంచి, ఒక కొత్త ఆలోచన పుట్టుకొస్తుంది. సమస్యల ఒరిపిడి లోంచి పరిష్కారపు నిప్పురవ్వ ఉద్భవిస్తుంది.
   
    దేశ స్వాతంత్ర్యం కోసం తమ సర్వస్వం ధారబోసిన ఆ తరానికి, నేటి తరానికి మధ్య సంధికాలపు తరం వచ్చి స్వార్ధంతో చేసిన వెర్రిపనుల మూలంగానే దేశం నేడు ఇంత వెనకబడి పోయింది.
   
    విద్యాధికులు, స్కాలర్స్, విద్య సభ్యసిస్తున్న యువతీ యువకులు కళ్ళముందు కనిపిస్తున్నది కేవలం నిరాశా నిస్పృహలు మాత్రమే. మనం బ్రతగ్గలం, మరికొంతమందిని బ్రతికించగలం, విద్యలేని నిరుద్యోగులని సయితం వారి సేవలని ఉపయోగించుకొని బ్రతికించగలం అనే నమ్మకం కొరవడి పోయింది.
   
    దేశాభివృద్దికి, మనుగడకు ఉపయోగపడవలసిన యువత, డిప్రెషన్, ఫ్రస్టేషన్ పరవాల అడుగున నిస్తేజంగా మిగిలిపోతుంది.
   
    ఏమిటి పరిష్కారం...?
   
    ఈ దేశ రాజకీయ నాయకులు నాలుగు దశాభ్దాలు పదవీ వ్యామోహంలో పడి వ్యక్తిగత స్వార్ధంతో దేశాన్ని వెనక్కి నడిపిస్తున్నారు. కనీసం ఇప్పటికయినా కళ్ళు తెరిచి, దేశయువత తమ మీద విరుచుకుపడకుండా చర్యలు తీసుకుంటుందా....?
   
    ముగ్గు బుట్టలాంటి జుత్తుతో, చిన్ని చిన్ని కళ్ళతో, ఆ కళ్ళకు గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలతో, చిరునవ్వు ముఖంతో, డార్క్ బ్లూ కలర్ ఫుల్ హేండ్స్ షర్ట్ ని టక్ చేసి, మెరున్ కలర్ టై బిగించి ఎప్పుడూ బిజీగా చిటుకు చిటుకు మంటూ నడుస్తూ, నడుస్తూనే భూగోళాన్ని తన సొంతం చేసుకోవాలనే జిజ్ఞాసతో అనవసరంగా శ్రమించే ది గ్రేట్ బిజినెస్ మన్, ఇంటర్నేషనల్ సెలబ్రిటీ, ఎలక్ట్రానిక్ యుగపు భీష్మాచార్యుడు, హాలీవుడ్ స్టూడియోలని, అంతర్జాతీయ స్థాయి చిత్ర నిర్మాణ సంస్థలని అవలీలగా సొంతం చేసుకున్న అనితరసాధ్యుడు మోరిటా....సోనీ కార్పొరేషన్ అధినేత అకియో మోరిటా చిత్రపటం ఇప్పుడు విమల్ టేబుల్ మీదున్న గ్లాసు క్రింద ఉంది. అతను తనకేసే, స్వార్ధంతో, సోమరితనంతో నిద్రిస్తున్న తన జాతి ప్రజలకేసే చూస్తున్నట్లుగా భావించి ఒకింత గిల్టీగా ఫీలయ్యాడు- విమల్.
   
    శిధిలాల్లోంచి, మేం, మా శిరస్సులని పైకెత్తుకొని పైపైకి వెళ్తుంటే, మీరు మహనీయులయిన మీ పూర్వీకుల త్యాగాలతో, అహింసా సిద్దాంతంతో, మీ ముంగిట నిలిచినా స్వేచ్చాసంపదలలో ఉష్ట్రపక్షుల్లా కూరుకుపోతున్నారే అని పరిహసిస్తున్నట్లుగా ఉంది మోరిటా నవ్వు....
   
    అదృష్టానికి అడ్డదారులని, అందలానికి అక్రమ పద్ధతులని ఆశ్రయిస్తున్నారా....? ఎంత పిచ్చివాళ్ళు మీరు...? అని ప్రశ్నిస్తున్నట్లు ఉలిక్కిపడి ఓ క్షణం కళ్ళు మూసుకొని తిరిగి తెరిచాడు.

    మోరిటా చాయా చిత్రానికి రెండు సెంటీమీటర్స్ దూరంలో మరో వ్యక్తి ఫోటో ఉంది.
   
    బ్రాస్ బౌల్ ని బోర్లించి నట్లున్న బట్టతల.... తన చుట్టూ వర్తులా కారంలో మిగిలిన కొద్దిపాటి నెరసిన వెంట్రుకలు... ఫార్ ఈస్ట్ రేస్ ని తలపింప చేసే పల్చగా పర్చుకున్న మొఖం... ఉబ్బిన కనురెప్పల మధ్య ఉండుండి మెరుస్తున్న భ్రాంతిని కలిగిస్తున్న చినిచిన్ని కళ్ళు... సన్నగా, హెల్దీగా వున్న శరీరం....వయస్సును దాచుకొనేందుకు కాక, ఉత్సాహాన్ని వ్యక్తపరచేందు కన్నట్లు వేసుకున్న సాటిన్ టీ షర్ట్, గ్రీన్ కలర్ ఫాంట్... కాళ్ళకు అతి సాధారణమైన స్లిప్పర్స్.....చేతులు కట్టుకొని, చేవ ఉన్నవాడిలా చూస్తున్న హోండా....సాయ్ చిరో హోండా....
   
    ఇప్పుడు ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ సరసన నించోగల ఒకప్పటి సాధారణ సైకిల్ మెకానిక్....
   
    టోక్యో కి సౌత్ వెస్ట్ దిశలో 270 కిలోమీటర్ల దూరంలో వున్న కోమ్ యో గ్రామంలో ఒక పేద కమ్మరికి జన్మించిన హోండా....
   
    సైడ్ లైన్ గా ఆ కమ్మరి సైకిళ్ళను రిపేర్ చేస్తుండేవాడు. తండ్రిని అమితంగా ప్రేమించే హోండా, తండ్రి రిపేర్ చేసే సైకిళ్ళను కూడా ప్రేమించేవాడు. యంత్రాల పట్ల మక్కువ అప్పటినుంచే హోండాలో ప్రారంభమయింది. తరుచూ సైకిల్స్ రిపేర్ చేయటంలో తండ్రికి సహకరించేవాడు హోండా. తండ్రి వ్యాపార సంబంధమైన పత్రిక ఒకదానిలో ఒక యాడ్ కి స్పందించిన హోండా ఎంతో కొంత సంపాదించి తండ్రికి ఆర్ధికపరమైన ఆసరా ఇవ్వాలనే పట్టుదలతో తన స్కూల్ చదువును అర్ధాంతరంగా ఆపేసి, తండ్రి చెప్పినా వినకుండా వెళ్ళిపోయాడు ఇంటినుంచి.
   
    తన పదహారవ ఏట 270 కిలోమీటర్లు ప్రయాణించి, టోక్యో చేరుకొని, ఆర్ట్ షోకయ్ అనే చిన్న ఆటోమోబైల్ రిపేర్ షాప్ లో అప్రెంటీస్ గా చేరాడు.
   
    అప్పుడతని నెలసరి జీతం 1.25 అమెరికన్ డాలర్స్ అంటే రూ. 20.75 పైసలకు సమానం. అనుక్షణం తన భార్యా పిల్లలకోసం తమ తండ్రి పడే బాధల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఆ షెడ్ లో పనిచేసే వాళ్ళు నిద్రపోయాక, నిశ్శబ్దంగా లేచి, ఒక పాడయిన యంత్రాన్ని తీసుకొని, షెడ్ బయటకు వెళ్ళి, దాన్ని శోధించేవాడు. కనీసం పదిహేనేండ్లు శ్రమించి నేర్చుకుంటే తప్ప రాని పనితనాన్ని కేవలం ఆరేండ్లలో తన సొంతం చేసుకున్నాడు హోండా.
   
    22 ఏండ్ల వయస్సుకే ఆటోమోబైల్ యంత్ర రహస్యాన్ని ఔపోసన పట్టిన హోండా, తన సహచరులకు ఒక ఎనిగ్మా...
   
    ఆర్ట్ షోకయ్ రిపేర్ షాప్ యజమాని హోండా పనితనానికి, పట్టుదలకు ప్రతిఫలంగా కొంత పెట్టుబడి అందించింది, తన స్వగ్రామంలో  ఆర్ట్ షోకయ్ బ్రాంచ్ ని ఓపెన్ చేసుకొనేందుకు అనుమతి ఇచ్చాడు.

 Previous Page Next Page