"ఆ విషయం ఆలోచించుకోవాల్సింది అతను. మీరు పెంచి పెద్ద చేశారు కాబట్టి, ఒక కొడుకుగా మీ వృద్ధాప్యంలో బాధ్యత తీసుకోవలసిన అవసరం అతనికి తప్పకుండా వుంది. అది అతను నెరువేరుస్తాడు. అంతే తప్ప అతనికి ఇష్టంలేని పని చేయమనే హక్కు నాకు, మీకు, ఈ ప్రపంచంలో మరెవరికీ లేదంకుల్"
ఈ వాదనకి ఏం ఎదురు చెప్పాలో శంకరానికి అర్థంకాలేదు.
వాదనలో ఓడిపోతున్న మనిషి ఔచిత్యాన్ని వదిలేస్తాడు. శంకరం కూడా అలాగే తనేం మాట్లాడుతున్నాడో ఆలోచించకుండా ఒక మాట అన్నాడు. "నువ్వింత పొగరుబోతుదానివి, కుత్సితమైన దానివి కాబట్టే నీ తల్లిదండ్రులిద్దరూ అలా జబ్బున పడ్డారు. ఇప్పుడు మా ఉసురుకూడా నీకు తగిలిందంటే వాళ్ళకి ఈ భూమ్మీద నూకలుండవ్!"
నిఖిత పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఆ అమ్మాయి ఎప్పుడూ అంత ఆవేశపడలేదు. అతికష్టం మీద తనని తాను సంభాళించుకుంటూ లేచి నిలబడి నమస్కారం చేసింది. "వెళ్ళిరండి అంకుల్ ప్లీజ్" అంది.
శంకరానికి తనేం మాట్లాడాడో అప్పుడర్థమైంది. అంత మాటకి కూడా ఓర్పుతో, సహనంతో, మర్యాదతో జవాబిచ్చిన ఆ అమ్మాయి సంస్కారం ముందు తన వ్యక్తిత్వం ఏమతో అల్పంగా తోచింది. అయితే అటువంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకొని బాధపడే మనస్తత్వం కాదు అతనిది. కరుగ్గా "ఆఖరిమాట చెప్పు. మా అబ్బాయిని వదిలేస్తావా, లేదా?" అన్నాడు.
"ఆంటీతో మాట్లాడతాను. అంకుల్ మీరెళ్ళిరండి" అని అక్కడిక తను ఆగకుండా లోపలి వెళ్ళిపోయింది నిఖిత.
* * *
ఆస్పత్రిలో పడకమీదున్న పార్వతి నిఖిత రావటం చూడగానే మొహం ప్రక్కకి తిప్పుకుంది.
"నేను మిమ్మల్ని పరామర్శించటానికిగానీ, మీ అబ్బాయిని పెళ్ళి చేసుకోను అని మాటివ్వటానికిగానీ రాలేదు" పక్కన వున్న స్టూల్ లాక్కుని కూర్చుంటూ, మనసులో విషయం డైరెక్టుగా చెప్పింది నిఖిత.
"మరి దేనికొచ్చావ్? వాడినే చేసుకుంటానని చెప్పగానే నా బి.పి. పెరిగి నేను చస్తే చూసి ఆనందిద్దామని వచ్చావా?" వెటకారము, కోపము మిళితమైన స్వరంతో అంది పార్వతి.
"అలాంటి కుసంస్కారం నాకు లేదు. నిజం చెప్పాలంటే నా తల్లిదండ్రులు మీకంటే పెద్ద జబ్బులతో బాధపడుతున్నారు. అయినా అంకుల్ మా యింటికొచ్చి, వాళ్ళమీద చెలరేగి నానామాటలు అనేసి వెళ్ళిపోయారు".
"ఓహొ, అయితే పగ తీర్చుకోవటానికి వచ్చావన్నమాట".
"పగ తీర్చుకోవాలంటే అవినాష్ ని ఈ పూటే రిజిస్ట్రార్ ఆఫీసుకు తీసికెళ్ళి పెళ్ళి చేసుకునేదాన్ని".
"అంత పనీ చేయగలవులే. వాడు పూర్తిగా నీ మాయలో పడిపోయాడుగా. ఇంతకీ ఇప్పుడెందుకొచ్చావ్ ఆ విషయం చెప్పు".
"నిన్న అంకుల్ ఒక మాట అన్నారు. పిల్లలు రెక్కలొచ్చేవరకు ఆగి, ఆ తరవాత ఎగిరిపోతారు అని చెప్పి! చిన్నతనం నుంచీ పెంచీ పెద్ద చేసీ, తమకున్నదంతా ఖర్చుపెట్టి పిల్లల్ని చదివిస్తే- ఆ పిల్లలు ప్రేమ మాయలోపడి, ఆ విషయం ఇంట్లో చెప్పకుండా కొన్ని సంవత్సరాలు తల్లిదండ్రుల్ని మోసం చేసి, తమకి శక్తిరాగానే పక్షులాగా ఎగిరిపోవటం ఆటవిక న్యాయం అని అంకుల్ అన్నమాట నాకెందుకో మనసులో సూటిగా గుచ్చుకుంది. నిజమే, పద్దెనిమిదేళ్ళ ఆడపిల్ల ఇరవై ఏళ్ళ కుర్రవాడ్ని ప్రేమిస్తే వాళ్ళు ఇంట్లోంచి బయటికెళ్ళి సొంతంగా కాపురం పెడదామనుకున్నా పెట్టలేరు. ఆ కుర్రవాడు తన కాళ్ళమీద సొంతంగా నిలబడేవరకు ఆ అమ్మాయి కూడా ఇంట్లో ఆ విషయం చెప్పదు. చెప్పదు. పద్దెమినిది సంవత్సరాలు పెంచి పోషించిన తల్లిదండ్రుల్నే మోసం చేయగలిగిన అమ్మాయి, ఆ తరువాత నైతిక విలువలకి ఏ మాత్రం గౌరవం ఇస్తుంది అని నాకు అనిపించింది. ఈ పరిస్థితిలొ యువతీ యువకులు ఏం చేయాలి? తల్లిదండ్రులమీద గౌరవం వుండవలసిన మాట నిజమే. కానీ ఒకరినొకరు అర్థం చేసుకున్న అబ్బాయీ అమ్మాయీ కేవలం గౌరవం కోసం తమ భవిష్యత్తుని బలి చేయాల్సిందేనా? అవినాష్, నేను ఒకరినొకరం ప్రేమించుకున్నాం. అతనికి బాధ్యత లేమీలేవు. కానీ నాకు మరికొన్ని బాధ్యతలున్నాయి. కనీసం ఒక సంవత్సరం వరకూ నేను వివాహం చేసుకోలేను. ముందు మా తల్లిదండ్రుల విషయం చూడాలి. అలా అని చెప్పి మీకు తెలియకుండా అవినాష్ నేనూ రహస్యంగా కలుసుకోవటం, మా అవసరం తీరేవరకు మిమ్మల్ని మోసం చేశామన్న అపప్రధ మాకొద్దు. అందుకే ఆ విషయం మీకు డైరెక్టుగా చెప్పటానికి నేనిక్కడికి వచ్చాను".
సూటిగా, నిర్భయంగా, నిజాయితీగా చెబుతున్న నిఖితతో ఏం మాట్లాడాలొ పార్వతికి తోచలేదు. ఆ అమ్మాయి చెప్పినదాంట్లో తర్కంగానీ, సంస్కారంగానీ అర్థం చేసుకునే స్థితిలొ పార్వతి లేదు. వెటకారం నిండిన స్వరంతో అదోలా నవ్వుతూ అంది, "నువ్వా సంవత్సరం పాటు వాడిని కలవకుండా వుంటే వాడు నీ విషయం తప్పకుండా మర్చిపోతాడు".
నిఖిత నెమ్మదిగా తలెత్తి పార్వతివైపు సూటిగా చూసింది. "నిజంగా సంవత్సరంపాటు కలవకపోతే అవినాష్ నన్ను మర్చిపోయిన పక్షంలో నేను అలాంటి వాడిని పెళ్ళి చేసుకోనందుకు అదృష్టవంతురాలిగా భావిస్తాను. కానీ, సంవత్సరం తర్వాత కూడా అతను అదే అభిప్రాయంలో వుంటే మాత్రం మా పెళ్ళి జరిగి తీరుతుంది" అని లేచి నిలబడి, "వెళ్ళొస్తాను ఆంటీ" అని నమస్కారం చేసి అక్కడినుంచి కదిలింది.