Previous Page Next Page 
అశ్వభారతం పేజి 27


    గేమ్ మొదలయింది.

    భరత్ అయోమయంగా చూస్తున్నాడు. కళ్ళముందే జరుగుతున్నా నమ్మాలా వద్దా అనేంత సంశయం.

    చూస్తుండగానే ఓ మనిషి తనంతటతానే కాల్చుకొని పడిపోయాడు.

    భరత్ అర్ధం కానట్లు శుక్రాచార్య వేపు చూసాడు. అర్ధమైందా అన్నట్లు చూసాడు శుక్రాచార్య.

    శంకర్ రెడ్డి కయితే స్పృహ తప్పినంత పనయింది. భరత్ విసురుగా కుర్చీలోంచి లేచాడు.

    హేరాయిస్, గంజాయి మార్ఫిన్ వంటి మత్తు పదార్ధాల ఆస్వాదనలో మునిగి తేలుతున్న అక్కడున్న ప్రతి ఒక్కరిలో ప్రపంచాన్ని జయించినంత సంబరం. ప్రపంచం ఏమైతే తమకేమన్న తెగువ.

    భరత్ వడివడిగా బయటకు వచ్చాడు. వళ్ళంతా నెప్పులు, పక్కటెముకలపై వేసిన కుట్లు విడిపోతున్నంతగా బాధ. పళ్ళబిగువున ఓర్చుకుంటున్నాడు.

    శుక్రాచార్య బయటకు వచ్చాడు.

    "ఇది నేను చేయగలిగేది కాదు. ఇంత దారుణంగా నేను చేయలేను. దీనికోసమేనా నన్ను హాస్పిటల్ నుంచి హఠాత్తుగా లేపుకొచ్చేసారు? సారీ అంకుల్" అన్నాడు కాస్త విసురుగానే.

    కోపంగా చూశాడు శుక్రాచార్య.

    నిర్లక్ష్యంగా తల ఎగుర వేసాడు భరత్.

    "నేను హత్యలు చేయను. మీరు చేయించలేరు నాతో. నిర్మొహమాటంగా చెప్పాలంటే మీపై కృతజ్ఞతతో నా లైఫ్ ని రిస్కులో పెట్టుకోవటానికైనా నేను సిద్ధమే. కాని ఇలా ఒకరి లైఫ్ ని అంతం చేయలేను అంటూ దూరంగా ఆపి ఉన్న టాక్సీ దగ్గరకు నడిచాడు శంకర్ రెడ్డి సహాయంతో.


                                                                            *    *    *


    "వృత్తిలో ఇంత నిర్లక్ష్యం పనికిరాదు. ఆరుకుట్లు పడ్డ పేషెంట్ ఎలా ఎగిరిపోతాడు? అతను జాకీ. రేసెస్ లో ఎన్నో దారుణాలు జరుగుతుంటాయి. అతని ప్రత్యర్ధులు ఎవరో అతన్ని ఎత్తుకెళ్ళి ఉండాలి. నీ కంట్రోల్ లో ఉండాల్సిన పేషెంట్, ఎవరి సహాయం లేకుండా నడవలేని పేషెంట్ ఎలా మాయమయ్యాడు? హాప్సితల్ సూపర్నెంట్ త్రివేణిని చెడామడా దులిపేస్తున్నాడు.

    నెత్తురు చుక్క లేనంతగా త్రివేణి ముఖం పాలిపోయింది.

    సిగ్గుతో తలవంచుకుంది. తనకి సంబంధించిన ఏ విషయంలోనూ తననింతవరకు ఎవరూ వేలెత్తి చూపలేదు.

    తొలిసారి ఇది.

    అవమానంతో అణువణువు కుంచించుకు పోయినట్లయింది త్రివేణికి.

    ఆమె కోపమంతా భరత్ మీదకు మళ్ళింది. వచ్చిన దగ్గర్నుంచి తనను టీజ్ చేస్తున్నాడు. ఒక విచిత్రమైన మనిషని అనుకుందే గాని తనను ఇంతగా ఇరకాటంలో పెడతాడని ఊహించలేదు.

    "ఆ పేషంట్ కి ఏదన్నా జరిగితే నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది మైండిట్" కేకలేస్తూ విసురుగా వెనుతిరుగుతున్నంతలో సూపర్నెంట్ కళ్ళల్లో శంకర్ రెడ్డి సహాయంతో వస్తున్న భరత్ పడ్డాడు.

    అప్పుడు రాత్రి ఒంటిగంట కావస్తోంది. సూపర్నెంట్ అర్ధం కానట్లు చూసాడు.

    నలుగురైదుగురు డాక్టర్స్, కాంపౌండర్స్, నర్సులు సెక్యూరిటీ స్టాఫ్ అంతా ప్రాణాలు ఉగ్గబట్టి ఉన్నారు. త్రివేణి తలవంచుకొని ఉంది. సూపర్నెంట్ కళ్ళు ఎర్రగా అగ్నిగోళాల్లా మండిపోతున్నట్టు ఉన్నాయి.

    ఒక్క చూపులోనే అక్కడ అంతకుముందు చెలరేగిన తుఫాన్ ని ఊహించగలిగాడు.

    త్రివేణి తలెత్తి భరత్ వేపు కోపంగా చూసింది. "వ్వాట్ సూపర్నెంట్ ఏమైంది? అడిగాడు భరత్ శంకర్ రెడ్డి మీద తన బలవంతా మోపి వరండా మెట్లెక్కుతూ.

    హాస్పిటల్....హాస్పిటలంతా అల్లకల్లోలమయ్యే పరిస్థితి సృష్టించి ఏమీ తెలియనట్లుగా అడిగినట్లు అనిపించింది సూపర్నెంట్ కి భరత్ పరామర్శ.   

    ఎక్కడికి వెళ్ళారు__? ఇది మీ ఇల్లా....? ఎప్పుడుబడితే అప్పుడు వెళ్ళటానికి? అంటూ సూపర్నెంట్ త్రివేణీవేపు గుర్రుగా చూట్టాన్ని భరత్ గమనించకపోలేదు.

    "ఎక్కడికి వెళ్ళలేదే!"

    "గంటన్నర నుంచి మీరు బెడ్ మీద లేరు. తలుపులు బార్లా తీసున్నాయి....కోపంగానే అడిగాడు సూపర్నెంట్.

    "ఎక్కడికి వెళ్ళలేదు, రూంలో బోర్ గా ఉంటే నేను మా రెడ్డి సాయంతో హాస్పిటల్ వెనుక ఉన్న చెట్ల దగ్గర కూర్చుని వస్తున్నాను. అయినా వాట్ హేపెన్డు?"

    సూపర్నెంట్ కోసం కాస్త చల్లారింది.

    "ఈ ఆవరణలో అయినా డాక్టర్ పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు అంటూ త్రివేణీవేపు తిరిగి "ఇంజక్షన్ ఇచ్చావా!" అడిగాడు విసురుగా.

    త్రివేణీకి ఏం చెప్పాలో తోచక కంగారు పడుతున్నంతలో భరత్ అన్నారు "ఇచ్చారు. ఆవిడ ఇచ్చి వెళ్ళాకే అలా వెళ్ళాం."

    "చూడు త్రివేణి! ఇంకోసారి ఇలా జరిగితే నిన్ను సస్పెండ్ చేయాల్సివస్తుంది జాగ్రత్త...." అంటూ దూకుడుగా వెళ్ళిపోయాడు.

    తుఫాన్ వెలిసినట్లయింది.

    కాస్తలో ప్రమాదం తప్పిపోయినందుకు గుండెలమీద చేయి వేసుకొని ఊపిరి తీసుకుంది.

    అప్పటికే కాంపౌండర్స్ భరత్ ను అతని గదికి చేర్చారు. హడావుడిగా ఇంజక్షన్ తీసుకుని భరత్ గదిలోకి వెళ్ళింది త్రివేణి. భరత్ బాధగా కళ్ళు మూసుకుని ఉన్నాడు.

    త్రివేణి దగ్గరకెళ్ళి చూసింది.

    కుడివేపు కుట్లు వేసిన దగ్గర షర్టు అంతా నెత్తురుతో తడిసిపోయింది. అప్పటివరకూ ఉన్న కోపం తగ్గిపోయింది త్రివేణీలో.

    ఆషా సహాయంతో అరగంటలో మరలా కట్టుకట్టి, ఇంజెక్షన్ ఇచ్చింది.

    ట్రీట్ మెంట్ ఆఖరులో భరత్ కళ్ళు తెరిచాడు. "సారీ డాక్టర్ అన్నాడు.

    "ఎందుకలా చేసారు....?" అడిగింది ఆషా. "నాకు బాగా కావల్సిన వ్యక్తి వచ్చి అర్జంటుగా తీసుకెళ్ళిపోయాడు" బాధను ఓర్చుకుంటూ అన్నాడు.

    "వాళ్ళకైనా బుద్ధి ఉండఖ్కర్లేదూ....పేషెంట్ ని ఆ పరితితుల్లో తీసుకెళ్ళవచ్చా....? అడిగింది త్రివేణి.

    మౌనంగా చూస్తుండిపోయాడు భరత్. తన తండ్రి పెంచిన వ్యక్తి అతనేనని, తమకు ఆంక్షలు విధించి మూడొంతులు ఆదాయం అతనికే పంపిస్తూ వచ్చాడని తెలిస్తే త్రివేణీ ఫీలింగ్స్ ఎలా ఉండేవో?!

    తనను పెంచి పెద్దచేసిన శుక్రాచార్య కూతురే అని భరత్ కి కూడా తెలియకపోవటం ఓ విచిత్రమైన పరిస్థితి.

    భరత్ మీద త్రివేణి కోపం సానుభూతిగా మారిపోయింది.

    సరిగ్గా అదే సమయంలో శుక్రాచార్యతో అతని భార్య జీవితంలో తొలిసారి ధైర్యంచేసి మాట్లాడుతోంది.

    "ఈ రోజు హాస్పిటల్ నుంచి ఎవరో పేషంట్ హఠాత్తుగా మాయమయ్యాడట. అమ్మాయిని సస్పెండ్ కూడా చేయవచ్చట. పక్కవీధిలో ఉండే గాంధీ హాప్సిటల్ కాంపౌండర్ ఇందాకేవచ్చి చెప్పి వెళ్ళాడు." అంది తలవంచుకొని.

    ఓక్షణం ఉలిక్కిపడ్డాడు శుక్రాచార్య. మౌనంగానే ఉండాలనుకున్న శుక్రాచార్యకు, భార్య దిగులుగా ఉండటం చూసి ఇక ఆగలేకపోయాడు.

    "నువ్వేం దిగులు పడకు ఏం కాదులే. అక్కడ దాకా వస్తే నేను చూసుకుంటాను...." అన్నాడు.

    భర్త ఓదార్పుకి ఆశ్చర్యపోయింది ఆమె.


                                                                         *    *    *   


    "మిస్టర్ సుదర్శన్....నీకు రాయల్ కింగ్ ఎక్కడుందో కావాలి అవునా....?" అడిగాడు శుక్రాచార్య.

    "అవసరమే. కాని ఈ విషయం మీకెలా తెల్సింది...." ఆశ్చర్యంగా అడిగాడు సుదర్శన్.

    "అది అనవసర విషయం. నీకా ఇన్ ఫర్ మేషన్ కావాలంటే ఈ రాత్రికే నా వెంట ఓ క్లక్ కి రావాలి...."

    "ఓ.కె. వస్తాను" అన్నాడు సుదర్శన్ శుక్రాచార్యవైపు సంభ్రమంగా చూస్తూ.

    "బాస్ భరత్ ఆరోగ్యంపట్ల ఆందోళన పడుతున్నాడు....

    "ఆశ్చర్యమే"

    "వచ్చే వీక్ రేసెస్ నాటికి భరత్ జాకీగా రాగలడా అని"

    "అదన్న మాట అసలు విషయం"

    సుదర్శన్ మౌనంగా ఉండిపోయాడు.

    "వస్తాడు, వచ్చేస్తాడు.... మీ బాస్ ఎక్కడ....?" వెనుక గ్రౌండ్ లో ఉన్నారు. 

    మరేమీ మాట్లాడకుండా ఆ వేపు సాగిపోయాడు వడివడిగా శుక్రాచార్య.

    "రండి శుక్రాచార్యా! మీ కోసమే ఎదురు చూస్తున్నాను" అన్నాడు శశాంక బిస్కెట్సు కుక్కలకి ఒక్కొక్కటి విసిరేస్తూ.

    శుక్రాచార్య తాపీగా వచ్చి శశాంక ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.

    శశాంక తప్ప అక్కడున్న అందరూ అతని ధైర్యానికి ఆశ్చర్యపోయారు.

    తమకు తెలిసినంతవరకు తమ బాస్ శశాంక తేజదత్త ఎదురుగా అతని పర్మిషన్ లేకుండా కూర్చునే ధైర్యం ఇంతవరకు ఎవరూ చేయలేదు!

    శుక్రాచార్య ప్రవర్తన శశాంకకు కూడా మంటగానే ఉంది. కాని అతని చేతిలో తన కొడుకును కాపాడే వజ్రాయుధం, తన గుర్రాల్ని గెలిపించగల బ్రహ్మాస్త్రం ఉంది. అందుకే నిగ్రహించుకుంటున్నాడు.

    "నెస్ట్ రేసెస్ లో భూపతి పధకం ఏమై ఉంటుంది?" అడిగాడు శశాంక.

    "మనం చేసినట్లే మోసం చేయాలని భూపతి ప్లాన్ వేస్తుండాలి. రాబోయే వీకెండ్ రేస్ లో "స్కైవాకర్" అనే గుర్రాన్ని విన్నింగ్ ఛాన్సెస్ బాగా ఉన్నాయి. ఆ గుర్రం ఓనర్ తో ఈపాటికి భూపతి కుమ్మక్కయి ఉంటాడు. కనుక అది ముందుగా వారు వేసుకునే ప్లాన్ ప్రకారం సెకండ్ ప్లేస్ లో రావచ్చు. సెకండ్ ప్లేస్ లో రాగల అవకాశాలున్న "టెంపుల్ కోర్టు" అనే గుర్రం ఫస్ట్ రావచ్చు. కనుక మీరు "టెంపుల్ కోర్టు" మీద కాయాలి...." శుక్రాచార్య ఓ పధకం ప్రకారం మాట్లాడుతున్నాడు.

 Previous Page Next Page