Previous Page Next Page 
తులసి పేజి 26

    "బాబూ"


    అబ్రకదబ్ర ఆగేడు.

    "మా ఇంటికేం ప్రమాదం లేదుగా"

    కసితో, రోషంతో "లేదు" అన్నాడు వెనుదిరక్కుండానే.

    అతడు కారు దగ్గరికొచ్చి కూర్చుని తలుపు వేయబోతూ వుంటే లోపల్నుంచి పెద్ద కూతురు పరుగెత్తుకు వచ్చింది.

    "మీరు స్కాట్ లాండ్ యార్డ్ వెళ్ళారా?"

    "వెళ్ళాను"

    "జేమ్స్ బాండ్ ని చూసేరా?"

    "చూసేను -ఏం?"

    "రియల్లీ మాట్లాడేరా" ఉద్విగ్నతతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి.

    "అప్పుడప్పుడు -ఏం?"

    ఆమె ఆనందం పట్టలేక కెవ్వున అరిచి డోర్ లోంచి చెయ్యి లోపలికి పెట్టి "ఆటోగ్రాఫ్ ప్లీజ్" అంది.
 
    "చేతిమీదేనా?"

    ".......ప్లీజ్....."

    చేతిమీద సంతకం (పెన్ -తో) పెట్టేడు.
    ఆమె దానివైపే చూసుకుంటూ వుండగా కారు కదిలింది. చల్లటిగాలి రివ్వున వీస్తూంది. అతనికి నవ్వు వచ్చింది.

    నడుమునొప్పి చేతబడేమో అని భయపడే అనాగరికుడైన గ్రామస్తుని చూసి హేతువాది హేళన చేస్తాడు. చదువుకున్న వాళ్ళ అనాగరికతని చూసి ఇంకా తెలివైన వాడు నవ్వుకొంటాడు.

    ఇంతకీ శ్రీనివాసపిళ్ళయ్ ఏమయ్యాడు?

                                               9

    "హేతువాదం" అన్నాడు పండిత్. "మనకి తెలియనిదంతా లేదనుకోవడం హేతువాదం కాదు"

    తులసి పెన్ తో పుస్తకంలో పిచ్చిగీతలు గీస్తూంది.

    పండిత్ చెబుతున్నాడు.

    "ఒకరు ఒక చేతిని తాయెత్తు కట్టుకున్నారంటే, అది తమ సంతృప్తికి అయుండకపోవచ్చు సర్! కేవలం ఇంట్లో వాళ్ళ కోసం అయివుండొచ్చుగా"

    "అందమైన ఆత్మ వంచన అన్నాడు" పండిత్.

    క్లాసు ఘొల్లుమంది. తులసి మొహం ఎర్రగా కందిపోయింది. అది గమనించి పండిత్ అనునయిస్తున్నట్టు అన్నాడు - "మీరు చదువుకునే వాళ్ళు. మీ ఇంట్లో వాళ్ళు ఏదో ఒకదాన్ని నమ్మి మీ చేతికి తాయెత్తులు కట్టినా, మీమీద తమ అభిప్రాయాలు రుద్దినా నమ్మి దానని మీరు ఎదుర్కోవాలి అంటే వాళ్ళతో దెబ్బలాడమని కాదు. వాళ్ళని మీకున్న హేతువాదంతో వప్పించాలి. ఒక గుడ్డలో కట్టిన చిన్న రాగి ముక్క మిమ్మల్నెలా రక్షిస్తుంది అని ప్రశ్నించాలి."

                                                *    *    *

    ఆ సాయంత్రం తులసి తల్లితో ఘర్షణ పడింది.

    "ఏదో చిన్న తాయెత్తు నా ఆరోగ్యాన్ని కాపాడుతుందా?"

    "నాకు తెలీదమ్మా" అంది శారద. "ఎవరో సంతాన్ ఫకీరట! పది సంవత్సరాల క్రితం నీ చేతికి కట్టాడు. ఇరవైరెండేళ్ళ వయసు వచ్చేవరకూ విప్పొద్దని మీ నాన్నగారికి చెప్పాడు"

    తులసి తన గదిలోకి వచ్చేసింది. సాయంత్రం ఆరయ్యింది. బాగా చీకటిపడింది.

    తాయెత్తు.

    జాకెట్ క్రింద - చేతికి కట్టబడి వుంది. దాదాపు శిదిలావస్థలో వుంది అది. పది సంవత్సరాల నుంచీ నీళ్ళకి తడిసీ రాపిడికి నలిగీ.....

    ఆమెకి నవ్వొచ్చింది. పండిత్ చెప్పేవరకూ తనకు దాని గురించి గుర్తులేదు. ఇన్ని ప్రయోగాలు చేస్తున్న తను, తన విషయంలో ఇంత చిన్న దాన్ని మర్చిపోయింది. ఆమె కత్తెర తీసుకుని టాయిలెట్ లోకి వెళ్ళింది. చేతిమీద వున్న జాకెట్ కొద్దిగా పైకెత్తి కత్తెరతో కట్ చేసింది. టప్ మన్న శబ్దంతో తాడు తెగింది. దాన్ని టాయిలెట్ లో వేసి ఫ్లెష్ అవుట్ లాగింది. పెద్ద శబ్దంతో నీళ్ళు నిండుకున్నాయి. డ్రైనేజ్ గుండా నీళ్ళు వెళ్ళిపోతున్న చప్పుడూ నీళ్ళతోపాటు తాయెత్తు కూడా వెళ్ళిపోయింది.
       
                                         *    *    *

 Previous Page Next Page