Previous Page Next Page 
తులసి పేజి 25

    "అబ్బో -ఇప్పటి మాటా అది! పది సంవత్సరాల క్రితం......"

    "అదే తరువాత ఎక్కడయినా కనపడ్డాడా?"

    "కనపడ్డాడు!"

    అబ్రకదబ్ర ఉద్విగ్నతతో "ఎక్కడ"అన్నాడు.

    "రోడ్డుమీద"

    ఆయన సెన్సాఫ్ హ్యూమర్ ని ఆస్వాదించే స్థితిలో లేడు అతడు.

    "ఎంత కాలం క్రితం వరకూ మీకు కనపడ్డాడు"

    "దాదాపు మూడు నాలుగు సంవత్సరాల క్రితం" అన్నాడాయన. "రోడ్డుమీద నడుస్తూ ఉన్నట్టుండి తనమీద ఏదో పడినట్టు చేతులు అడ్డు పెట్టుకునేవాడు. 'టప్.....టపా టపా టప్' అనరిచేవాడు. చిన్న పిల్లలందరూ గుంపుగా వెనక పడేవారు. తర్వాత అంటే ఓ మూడు నాలుగు సంవత్సరాలు అయిందనుకుంటా - కనబడడం మానేసేడు. ఏమయ్యాడు తెలీదు."

    పెద్దమ్మాయి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది.

    ఈయన ఏదో అబద్ధం చెబుతున్నాడు. అబద్దం - అబద్ధం

    "ఈ ఇల్లు మీరు కొన్నారా?" కాఫీ సిప్ చేస్తూ అడిగాడు.

    "ఔను, ఏం?"

    "ఎవరి దగ్గర" తాపీగా ప్రశ్నించేడు.

    అప్పటివరకు మామూలుగా వున్న ఆయన మొహం చప్పున మారిపోయింది. కుర్చీలోంచి లేచి "మీరెవరు?" అన్నాడు.

    అబ్రకదబ్ర  కుర్చీ వెనక్కివాలి "స్టార్ డిటెక్టివ్ ఏజన్సీ అపిలియేటెడ్ టూ స్కాట్ లాండ్ యార్డ్" అన్నాడు. ఆ రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ చెయ్యి సన్నగా వణకడం స్పష్టంగా తెలుస్తూంది.

    ఆయన బలహీనమైన గొంతుతో "నేను డబ్బు ఇచ్చే ఈ ఇల్లు కొనుకున్నాను" అన్నాడు.

    "ఎవరికి?"

    "పిళ్ళై తమ్ముడికి"

    "అతడెవడు"

    "శ్రీనివాస పిళ్ళై ఒక మఠానికి ట్రస్టీ"

    "తెలుసు, పది సంవత్సరాల క్రితం పిచ్చెక్కక ముందు"

    "మేం ఆ ట్రస్ట్ కి నెల నెలా అద్దె పంపుతూ వుండేవాళ్ళం. మా ఆవిడ అంటూ వుండేది -ఇంటి యజమాని మనముందే రోడ్లమీదే పిచ్చెక్కి తిరుగుతూంటే మన కెందుకండీ వాళ్ళ కెవరికో నెలనెలా అద్దె పంపించడం అని- కానీ నేను ఒప్పుకోలేదు. అలా దాదాపు ఏడు సంవత్సరాలు జరిగింది"

    "తరువాత"

    "ఒక రోజు పిళ్ళైని అతని తమ్ముడు తీసుకొచ్చాడు ఈ ఇల్లు మాకు అమ్మేస్తున్నానన్నాడు"

    "ఆ పిచ్చి వాడికి నేను తమ్ముణ్ని అని ఎవరో వస్తే మీరు నమ్మేటట్టు చేసింది. ఏడు సంవత్సరాల నుంచి అద్దె కడుతున్నాం అది ఎవరికి కడుతున్నామో తెలియకుండా నెల నెలా అద్దె కడుతున్నాం. అది ఎటుపోతుందో తెలీదు"

    "ఎంత కొన్నారీ ఇల్లు"

    "పదిహేను వేలకు"

    అబ్రకదబ్ర చేతిలో కాఫీ తొణికింది. లక్షపైగా చేసే ఇల్లు పదిహేను వేలకు -

    "ఎవరికిచ్చారు ఆ డబ్బు"

    "పిళ్ళయ్ తమ్ముడికి"

    "తర్వాతేం జరిగింది"

    "ఇల్లు రిజిస్ట్రేషన్ జరిగిపోయింది"

    "నేనడుగుతూంది పిళ్ళయ్ సంగతి" అసహనంగా అన్నాడు అబ్రకదబ్ర

    "ఆ తరువాత అతడు కనబడలేదు. "

    "అంటే... చంపేసేరా?"

    ఆయన ఒక్కసారిగా కుర్చీలో కూలబడ్డాడు. వందేళ్ళు మీదపడ్డట్టు కృంగిపోయాడు.

    "నాకూ అనుమానం వచ్చిందిబాబూ. కానీ ఏం చెయ్యను? ఇల్లు రిజిస్టరు అయిపోయంది. తర్వాత ఎవరూ నన్ను ప్రశ్నించలేదు. నేనూ అద్దె కట్టడం మానేశాను. నెమ్మదిగా ఆ విషయం మర్చిపోయాను. ఆ తమ్ముడు పిళ్ళైని ఏం చేసేడో"

    అబ్రకదబ్ర కన్నార్పకుండా ఆయనవేపు చూసేడు. ఆయన మాటల్లో నిజం వుండవచ్చును. కానీ దాని వెనుక ఎంత చేదు నగ్నసత్యం.

    మంత్రగాళ్ళు మనుష్యుల్ని చంపుతారు. చేతబడులు చేస్తాడు. హింసిస్తాడు. కానీ నాగరికత ముసుగులో మనిషి, సాటి మనిషిని ఎంత తేలిగ్గా చంపుతున్నాడు. ఈ రిటైల్డ్ డిప్యూటీ కలెక్టర్ తన ఇంటికోసం రోడ్డు వెంట తిరిగే ఓ పిచ్చి వాడి మరణాన్ని ఎంత సహజమైన ఆత్మవంచనతో ఒప్పుకుంటున్నాడు. ఇంతకన్నా చేతబడి చేసేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు?

    అతడు లేచి "వెళ్లొస్తాను" అన్నాడు.

    మెట్లు దిగుతుంటే వెనుకనుంచి ఆయన కంఠం వినిపించింది.

 Previous Page Next Page