Previous Page Next Page 
మౌనం పేజి 26

    ఆమె తలదించుకుంది. ఆమె దృష్టి ఐస్ క్రీం కప్ మీదే  వుంది.

    "ఇదేం  బాగోలేదేమో!" దీర్ఘాలోచనలో  నుండి  బయటకు  వస్తూ అంది ఆమె.

    "ఏదీ....ఐస్ క్రీమా?"

    ఫక్కుమని నవ్వింది ఆమె. అంత సీరియస్ నెస్ లో కూడా కొద్దిక్షణాలపాటు  ఆమెకు నవ్వు ఆగలేదు.

    "ఛ....ఐస్ క్రీం కాదు."

    "మరేమిటి?"

    అంతలోనే  ఆమె వదనంలో తిరిగి  డల్ నెస్ కనిపించింది.

    "వాట్ హేపెండ్  అర్చనా? నువ్వు అలా డల్ గా వున్నావు! నువ్వు అలా వుంటే నాకు చాలా బాధగా వుంటుంది."

    "ఏమోనండి....మనం తరుచుగా  కలుసుకోవటం....హోటల్స్ లో, రెస్టారెంట్సులో కూర్చోవటం....ఇది మన యిద్దరికీ  మంచిది కాదేమో!"

    "ఏం?"

    అతని ప్రశ్నకు  ఆమె దగ్గర సరైన సమాధానం  లేదు. కారణం ....అతనితో మొదలయిన  స్నేహం ఎక్కడికో  దారిదీస్తుంది  అనే భయం.

    అసలు  ఆమెకు  ఇలా మగవాళ్ళతో  స్నేహాలు  యిష్టం  లేదు. అవి ఆమె వ్యక్తిత్వానికి, ప్రవర్తనకే విరుద్ధం.

    చంద్రకాంత్ తో పరిచయం  అవటం....ఆ పరిచయం  స్నేహంగా  మారటం  యిప్పటికీ ఆశ్చర్యంగానే వున్నాయి ఆమెకు.

    అతని  మాటలకు....

    ప్రవర్తనకు....

    అతనిలోని  సెన్సాఫ్ హ్యూమర్ కు....ఆమె మనస్సు  స్పందిస్తోంది.

    తనకు  తానుగా  వచ్చి అతను పరిచయం  చేసుకోవటం....

    ఆ పరిచయాన్ని  అక్కడితోనే ఆమె తుంచి  వేయాలని అనుకోవటము జరిగింది.

    కానీ....

    మొదటిసారి  చంద్రకాంత్  తనకి ఫోను   చేసినప్పుడు  'క్యాసెట్ ఎలా వుంది?' అని ఫోన్లో అడిగినప్పుడు 'ఇంకెప్పుడూ  ఫోను చేయకండి' అని చెప్పాలనుకుంది.

    కానీ....సభ్యత  అడ్డు వచ్చింది.

    సభ్యత  అడ్డు వచ్చింది అనే బదులు  వీడియోగ్రఫీలో  అతనికున్న  అద్భుతమైన  టాలెంట్ కి  ముగ్ధురాలయి  అతనిని  ఏమీ అనలేకపోయింది అనటం సబబు.

    అది ఆమెకూ తెలుసు.

    చంద్రకాంత్ కంటే  చంద్రకాంత్ లోని కళని, కళాకారుణ్ణి అమితంగా  అభిమానిస్తూ వుంది అనిపిస్తోంది.

    కానీ.... అతను మాత్రం....ఫోన్ చేస్తున్నాడు....తరచుగా....మునుపటికంటే  ఎక్కువగా  ప్రతి రెండు మూడు గంటలకోసారి.

    "మిమ్మల్ని  కలవాలనుంది. ఇందిరాపార్కు  దగ్గరకు రాకూడదా?" అని ఒకసారి ఫోను చేశాడు.

    "ఐయామ్ సారీ" అని నిక్కచ్చిగా  చెప్పేసిందా  రోజు.

    "నన్ను  చెడుగా అర్ధం  చేసుకున్నారా?" అని ఫోను చేశాడు  మరోరోజు.

    "నోనో....అదేం లేదు" అంది  కొంత అయిష్టత, కొంత ఇష్టత కలిపిన గొంతుతో.

    "అయితే  మిమ్మల్ని  చూడాలనుంది. మీ యిష్టం  వచ్చిన  చోటు చెప్పండి  నేనే వస్తాను" అన్నాడు.

    తుళ్ళిపడిందా మాటకి.

    ఇతనితో  వచ్చిన ప్రాబ్లమే ఇది. వేలికి వేస్తే  కాలికి, కాలికి వేస్తే వేలుకి.

    "నేను చెప్పిన  చోటుకి  మీరు రాలేదు. కనీసం  మీరు చెప్పిన  చోటుకి నేను రావటం  కూడా  తప్పేనా?" ఒకింత  బాధ  ధ్వనించింది అతని గొంతులో.

    ఆ అభ్యర్ధన  కాదనలేని  బలహీనత ఆమెది.

    "బిర్లా టెంపుల్ కి రండి" చాలా క్షణాలపాటు  ఆలోచించి...ఒకింత అయిష్టంగానే తప్పనిసరి  అయి ఆమె  అన్న మాట అది.

    అదే రోజు ఆమె చెప్పిన  సమయానికి గంట  ముందే  వచ్చికూర్చుని  ఆమె కోసం  ఎదురుచూశాడు  చంద్రకాంత్.

    ఆమెను  చూసిన  మరుక్షణం  అతని ముఖంలో  కనిపించిన వెలుగు, ఆనందం ఇంతా అంతా కాదు.

    "థాంక్యూ  సోమచ్ అర్చనా! నా అభ్యర్ధన మన్నించి నన్ను కలవటానికి  వచ్చారు. అయాం వెరీ థాంక్ ఫుల్ టు యు. ఈ రోజు మీరు  రాకపోతే నేను పిచ్చివాణ్ణయిపోయేవాడిని" అన్నాడు ఆనందంతో  ఆమె చేయి పట్టుకొని కుదిపేస్తూ.

    ఆమె ఒళ్ళు ఝల్లుమంది.

    అది....ఆమెకు  తొలి పురుషస్పర్శ.

    ఇప్పుడది  దినచర్య  అయిపోయింది.

    "మీరు" అని సంబోధించే అతను  "నువ్వు  అనేటంత  చనువు ఏర్పరచుకున్నాడు.

    కానీ....ఆమె మాత్రం "మీరు" అనే అంటోంది.

    "నువ్వు అంటే నాకు చాలా యిష్టం" అని ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఎన్నోసార్లు  అని వుంటాడతను.

    "నిన్ను  నేను  ప్రేమిస్తున్నాను" అన్న భావాన్ని చాలా స్పష్టంగా వ్యక్తం చేశాడతను.

    కానీ....ఆమె  అతనితో  అటువంటి  మాటలు ఏమీ అనటంలేదు. ఆమెకు  అతనంటే  ఒక రకమైన  ఇష్టం వుంది. ఆ ఇష్టాన్ని  వ్యక్తం చేయటానికి  ఎన్నోరకాల  భయాలు, అనుమానాలు అడ్డం వస్తున్నాయి. షి ఈజ్ ఫ్రిజుడైజ్ డ్ విత్ సెవరల్ ఫియర్స్ అండ్ ఎప్రహెన్షన్స్.

    "నేను చంద్రకాంత్ ని ప్రేమిస్తున్నానా?" అన్న  అనుమానం కూడా ఎన్నోసార్లు  ఆమెలో  వుదయించింది.

    అతని మీది అభిమానం ప్రేమగా  మారకుండా  మొగ్గస్థాయిలోనే  తుంచివేయాలని ఆమె వుద్దేశ్యం.

    కాని....

    చంద్రకాంత్  మాటలు, చేతలు  దానిని మహా వృక్షంగా ఎదిగేలా చేస్తున్నాయి.

    ప్రేమలు....పెళ్ళిళ్ళు....తన తల్లిదండ్రులకు  ఏ మాత్రం  యిష్టం వుండవు. తనకీ  యిష్టం వుండవు.

    మరి....చంద్రకాంత్  పట్ల తనకి  వున్నది  ప్రేమా? కాదా?

    ప్రేమయితే దాని పరిణామాలు  ఎలా వుంటాయో?

    ఆమెలో  సంఘర్షణ, ఘర్షణ.

    మానసిక  అశాంతి....ఆందోళన....

    ఇవన్నీ  కలిపి  ఆమెలో  ఆ రోజు  ఆ సమయంలో  మౌనం రూపంలో  బహిర్గతమవుతున్నాయి.

    "అర్చనా! ప్లీజ్ డోంట్ బి మూడీ. నాకు చాలా బాధగా  వుంటుంది. నావల్ల ఏమయినా తప్పు జరిగిందా?

    ఆమె మౌనాన్ని  భరించలేక అడిగాడు  చంద్రకాంత్.

    చురుకుగా  తలతిప్పి  అతన్ని  చూసిందామె.

    "నథింగ్ చంద్రకాంత్! మీవల్ల  జరిగిన  తప్పు  ఏమీ లేదు" వీలయినంత మామూలుగా వుండటానికి  ప్రయత్నిస్తూ అంది ఆమె.

    "మరి....ఆ....మౌనానికి  అర్ధం  ఏమిటి?"

    "మౌనం కాదండి"

    "మరి?"

    "భయం"

    "భయమా? ఎందుకు?"

    "ఎందుకు  అంటే మన పరిచయం  స్నేహం స్థాయిని  దాటి ముందుకు వెళుతోందని నా అనుమానం."

    "అనుమానం కాదు. నిజం! స్నేహం  స్థాయిని  ఏనాడో దాటిపోయాను నేను. నువ్వంటే నాకు ప్రాణం....ఇష్టం."

    "........."

    "చూడు అర్చనా! నా కళ్ళలోకి  చూసి చెప్పు  నేనంటే  నీకిష్టం లేదా? ప్రేమ లేదా?"

    ".........."

    "అర్చనా! యువార్ ఎ హిపోక్రాట్."

    చురుకుగా  చూసిందతని  వైపు.

    "అవును! నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నేనంటే నీకిష్టం. కానీ ఏనాడూ  ఆ మాట అనవు. నీ ప్రేమని వ్యక్తం చేయవు. ఎందుకు? వై?" ఒకింత  ఆవేశంగా  పలికిందతని కంఠం.

    "ఏమని  చెప్పగలదు? ఆమె మనస్సులోని విషయాన్ని  చదివినంత  స్పష్టంగా చెబుతున్నాడతను.

    "ఐ లవ్ యూ అర్చనా! నిన్ను  పిచ్చిగా  ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను  అంతకంటే ఎక్కువగా  ప్రేమిస్తున్నావు కదా!"

    ఆమెను హిప్నటైజ్ చేస్తున్నట్లుగా  వున్నాయి అతని మాటలు.

    ఆమె నుండి మౌనమే  అంగీకారంగా  తీసుకోవచ్చా?

    ".........."

    టేబుల్ మీద వున్న  ఆమె చేతి మీద అతని  చేతిని  వుంచాడు.

    అతని చేతిని  తొలగించే  ప్రయత్నం  చేయలేదామె.

    ఆమె చేతిని  అలాగే పట్టుకొని  పైకి  ఎత్తాడు.

    ఆమె చూపులు నేలమీద వున్నాయి.

    ఆమె చేతిని  అతని పెదవులకి  తాకించాడు.

    చిన్నగా  శబ్దం  చేశాయతని  పెదవులు.

    విద్యుత్  ఘాతం  తగిలినట్లయి  ఒళ్ళు  జలదరించిందామెకు.


                      *    *    *    *   

 Previous Page Next Page