Previous Page Next Page 
మౌనం పేజి 25


    "ఎక్స్ క్యూజ్ మి."
   
    డ్రస్ ఛేంజ్  చేసుకుందామని  బెల్ట్  విప్పబోతున్న  కౌశిక్  సంజు స్వరం  వినిపించటంతో తల తిప్పి  వెనక్కి  చూశాడు.

    అతను  డ్రస్  ఛేంజ్  చేసుకోవడానికి  సిద్ధమవుతున్నాడన్న ఆలోచన  లేక, ఆ రూమ్ లోకి రాబోయిన  ఆమే "అయామ్ సారీ" అంటూ వెనక్కి తిరగబోయింది.

    "ఫరవాలేదు....రండి" అన్నాడు బకెల్  తిరిగి  పెట్టుకుని.

    కౌశిక్  అప్పుడే  డ్యూటీ  నుండి వచ్చాడు. తను  రావటం  చూసి అతనితో  ఒక విషయం  చర్చించాలని  వచ్చిందామె.

    "ప్లీజ్ కమ్" మరోసారి  పిలిచాడు.

    ఆమె వెనక్కి  తిరిగి  వచ్చింది.

    కూర్చోమన్నట్లుగా  చేయి  చూపించాడు.

    ఆమె కూర్చుంది.

    "ఏమిటి విశేషాలు?....మీకు  ఈ రోజు  టైమ్  ఎలా  గడిచింది?" అడిగాడు.

    ఆమె వచ్చి అప్పటికి  వారం రోజులు  దాటింది. నిన్నటివరకూ  ఆమెను  ఓ కంట కనిపెడుతూ  ఇంట్లోనే  వున్నాడు. ఈ రోజే  డ్యూటీకి వెళ్ళి  తిరిగి  వచ్చాడు.

    "మాటల్లో  చెప్పలేనంత  బోరుకొట్టింది" నిర్మొహమాటంగా  అన్నదామె.

    "అరె....అదేమిటి  అలా  అంటారు?" క్షణకాలం  తెల్ల మొహం వేశాడతను.

    "మరి....ఈ ఇల్లు  ఒక జైలులాగా  కనిపిస్తోంది."

    "అదేమిటి?"

    "జైలుగాక  మరేమంటారు? బయటికి  వెళ్ళకూడదు."

    "బయటికి వెళ్ళటమెందుకు? ఇంట్లోనే  హాయిగా  టైమ్ పాస్  చేయవచ్చుగా?"

    "ఇంట్లోనా!....ఎవరున్నారని?"   

    "అదేమిటి....మా నాయనమ్మ వుంది, మా నాన్నగారు  వున్నారు. వాళ్ళతో  కబుర్లు  చెప్పచ్చుకదా?"
   
    "వాళ్ళతోనా! మీ నాన్నగారితో  మాట్లాడటం  అసంభవం  ఆయన చాలా సీరియస్ గా వుంటారు."

    ఒకసారి  ఆయనతో  మాట్లాడిన  వాళ్ళు  ఎవరయినా సరే  ఆయనను  లైక్ చేస్తారు. పోనీ  మీకు అంత  భయంగా  వుంటే  మా నాయనమ్మ  వుంది కదా! ఆమెతో  కబుర్లు  చెప్పావచ్చుకదా?"

    "అమ్మో! ఆమెతోనా? నా వల్లకాదు."

    ఫక్కుమని  నవ్వాడు  ఆ సమాధానానికి  కౌశిక్. కారణం నాయనమ్మ కొట్టే  సుత్తి  తెలుసు కాబట్టి.

    "సరేలెండి. మీకు బోర్  ఫీలవకుండా  రేపటి  నుండి ఏదయినా ప్రత్యేకమైన  ఏర్పాటు చేస్తాలెండి."

    "థాంక్స్" అంది  ముక్తసరిగా.

    "సరే! ఎలాగూ  వచ్చారుకదా! మీకో విషయం  చెప్పాలనుకుంటున్నాను. అడిప్పుడే  చెప్పేస్తాను."

    "ఏమిటది?"

    "ఏంలేదు. మీ వైజాగ్ .ప్రోగ్రాం  వాయిదా  వేయటం  కాదు పూర్తిగా రద్దు చేస్తున్నాము."

    అర్ధంకానట్లు  చూసిందామె.

    "అచ్చ తెలుగు  భాషలో  వాయిదా ,రద్దు అనే మాటలు వాడితే  మీకు అర్ధం కాదేమో. మీ వైజాగ్ ప్రోగ్రాం  పోస్ట్ పోన్  చేయటం కాదు....పూర్తిగా  క్యాన్సిల్  చేశాం. ఈ రోజు  ఓ నలుగురు  పోలీస్  అధికారులతో  ఈ విషయం  చర్చించాక  ఈ నిర్ణయానికి వచ్చాను."

    తెల్లముఖం  వేసిందామె.

    అంతలోనే తేరుకుంది.

    "దిసీజ్ టూమచ్. నా మీద  మర్డర్  ఎటమ్ట్ జరుగుతున్నట్లుగా  వేరే ఎవరితోనూ  చెప్పవద్దని  రిక్వెస్ట్ చేశాను.

    అయినా మీరు  ఆ విషయాన్ని  అందరికీ  చెప్పారు. అంతేకాదు....మొదట ప్రోగ్రాం వాయిదా  వేస్తున్నాను అన్నారు. ఇప్పుడు  పూర్తిగా  క్యాన్సిల్ చేశానంటున్నారు. అయామ్ వెరీ సారీ. ఈ క్షణమే  యిక్కడి నుండి  వెళ్ళిపోతాను" ఆమె స్వరం  ఉద్రేకపూరితంగా  వుంది.

    "నో నో....మీరు  సరిగ్గా అర్ధం చేసుకోలేదు" ఇంకా ఏదో అనబోయాడు.

    "నథింగ్ డూయింగ్. మీ వల్ల  నాకేదయినా సహాయం  జరుగుతుందనుకున్నాను. ఏదో ఒక విధంగా  వైజాగ్ లో ప్రోగ్రాం  జరిగేలా  చూస్తారనుకున్నాను. ప్రోగ్రాం కాన్సిల్ చేశానని  గొప్పగా చెబుతున్నారు. అందులో మీ ప్రతిభ ఏముంది? చేతనైతే  ప్రోగ్రాం  జరిపించండి. నన్ను ఎవరూ  చంపకుండా  అడ్డుపడండి. అంతేకానీ  పిరికిపంద కబుర్లు చెప్పకండి. ఐ హేట్ ఇట్....ఈ క్షణమే యిక్కడి  నుండి వెళ్ళిపోతాను. అతని  ఆత్మభిమానం  దెబ్బతినేలా  మాట్లాడసాగింది  ఆమె. పౌరుషం  ఉన్న వ్యక్తి అయితే  "ఆల్ రైట్! మీరు ప్రోగ్రాం యివ్వండి. మీ ప్రాణానికి హాని కలగకుండా  నేను చూస్తాను" అంటారు అని ఆమె వుద్దేశ్యం.

    చిన్నగా  నవ్వాడు  కౌశిక్.

    "ఎందుకు  నవ్వుతున్నారు? నా మాటలు  ఏమయినా  జోక్స్ లా వున్నాయా?"

    "కాదు....నన్ను  రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. అందువల్ల మీకు మీ ప్రయోజనం  వుండదు. నేనేమీ  ఆవేశపడిపోను. బట్....కొంచెం కూల్ గా  వినండి. ఇప్పుడు నేను చెప్పబోయే  విషయం  మీకు నచ్చకపోతే  మీ యిష్టం....ఈ క్షణమే  మీరు వెళ్ళిపోవచ్చు."

    "చెప్పడానికి  యింకేముంది. వైజాగ్ లో కాన్సిల్  చేశానని  చెప్పేశారుగా!"

    "ప్లీజ్....కొంచెం  కూల్ గా  వినండి. దయచేసి  నన్ను మాట్లాడనీయండి. మధ్యలో  అడ్డురావద్దు. నేను చెప్పేది  పూర్తిగా  విన్నాక  మీ ఇష్టం వచ్చినట్లు  చేయమన్నాను కదా!"

    'వినను' అనటం  సభ్యత  కాదు కాబట్టి  సైలెంటుగా కూర్చుందామె.

    రెండు నిమిషాలు  అతను  కూడా  మౌనంగా  కూర్చున్నాడు.  

    కోపంతో జేవురించి  ఎర్రబడిన  ఆమె ముఖంలో  ఒకింత  ప్రశాంతత చోటుచేసుకునేదాకా  అలా నిశ్శబ్దంగానే  కూర్చున్నాడు.

    "చూడండి....మీ మీద  హత్యా  ప్రయత్నం  చేస్తున్న  వ్యక్తులెవరో  మీరు ఏ మాత్రం చెప్పలేని  స్థితిలో  వున్నారు. అది ఒక వ్యక్తా, ఒక పెద్ద గ్యాంగ్ పనా  ఏమిటనేది  ఊహించటం  మాకు కష్టంగా వుంది. ప్రమాదం ఎటు నుంచి వస్తుందో  కూడా తెలియని స్థితిలో  మీ ప్రోగ్రాం కండక్ట్ చేస్తే అదీ ఓపెన్ గా, పబ్లిక్ లో....దానికి నేను బాధ్యత వహించి  మీకు సెక్యూరిటీ యివ్వటం....సాధ్యమా!

    మీ మీద ఒక వ్యక్తో, ఇద్దరో ఎటాక్ చేస్తే నేను రక్షించగలనేమోగాని  ఒక గ్యాంగ్ వచ్చి పడిందనుకోండి.... నేనేమీ సినిమాల్లో హీరోని కాదుగా, ఎన్ని  వందలమందినైనా  ఎదుర్కోటానికి!

    ఆఫ్ కోర్సు....మీరు సింగర్ కాబట్టి  కొద్దిపాటి  పోలీసులు ప్రోగ్రాం దగ్గర  వుంటారు. వాళ్ళు ఏదయినా చిన్న అల్లర్లు  జరిగితే  ఆపగలరుగానీ, మీ ప్రాణాలకు  మాత్రం  ఖచ్చితంగా  అడ్డుపడలేరు.

    సంజు ప్రాణానికి  రక్షణలేదు.... అందువల్ల  టైట్  సెక్యూరిటీ కావాలి అని నేను ఒక్కమాట  రిటెన్ కంప్లైంట్ ఇచ్చానంటే వందమంది గన్ మాన్ లు దిగుతారు. కానీ అక్కడుండే సెక్యూరిటీ, ఆడియన్స్ ని స్టేజీకి ఫర్లాంగు దూరంలో  కూర్చో పెడతారు. మీ పాత స్నేహితుల్ని  కాని, అభిమానుల్ని  కాని, పురుగుని కూడా దగ్గరకు  రానివ్వరు. మీ ప్రోగ్రాం ఏమాత్రం రక్తి కట్టదు. అది మీకు యిష్టం లేదు."

    నిశ్శబ్దంగా  వింటోంది  ఆమె.

    "మీ ప్రోగ్రాం  దిగ్విజయంగా  జరగాలంటే, మాస్టర్ ప్లాన్ ఒకటి ఆలోచించాను."

    "ఏమిటది?" ఆతృతగా  అడిగిందామె.

    "ప్రోగ్రాం  అద్భుతంగా  జరుగుతుంది. ప్లస్ మీ దగ్గరకు  కూడా ఎవరూ రాలేని ఏర్పాట్లు  చేయచ్చు. మీ మీద  ఎటమ్ట్ జరుగుతోంది. ఎవరికీ  చెప్పకుండానే  మీకు హెవీ  సెక్యూరిటీ ఏర్పాట్లు చేయించవచ్చు. చివరికి కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవుతుంది."

    "ఎలా?" ఒకింత  ఆశ్చర్యంగా, ఉత్సాహంగా అడిగింది.

    "అదే చెబుతాను" అంటూ  కొంచెం  ముందుగా  వంగి చెప్ప నారంభించాడు.
   

                     *    *    *    *


    సంధ్యాసమయపు  నీలినీడలు  చిక్కబడి  నల్ల బడుతున్నాయి.

    నల్లబడుతున్న  చీకటితో అప్పటివరకు  మసకగా  వెలుగుతున్నాయా అనిపిస్తున్న  టాంక్ బండ్ మీది లైట్సు ప్రస్ఫుటంగా  అగుపిస్తూ  కాంతులు విరజిమ్ముతున్నాయి.

    ఆ కాంతులు  తాలూకు  ప్రతిబింబాలు  నీటి మీద పడి  మెరుస్తున్నాయి.

    టాంక్ బండ్ మీద నుంచి  వచ్చేపోయే  వాహనాలు హెడ్ లైట్సు కాంతి  ఆ నీటి మీద పడి పొడవైన  బంగారు తీగల్లా  అనిపిస్తున్నాయి.

    అప్పటికి  ఐదు  నిమిషాలుగా  ఆ దృశ్యాన్నే  రెప్పవాల్చకుండా  చూస్తోంది  అర్చన.

    ఆమె దృష్టి అయితే  అటువైపే  వుంది కానీ ఆలోచనలు  ఎటో పరిభ్రమిస్తున్నాయి.

    ఐస్ క్రీం  కప్ లోని  స్ట్రాబెర్రిఫ్రూట్ ని స్పూన్ తో  అందుకుని  నోట్లో వేసుకున్నాడు చంద్రకాంత్.

    అతని  చూపులు  రెప్పవాల్చకుండా ఆమెనే చూస్తున్నాయి.

    "అర్చనా!" పిలిచాడు.

    ఆమె దృష్టి అతని వైపు మారలేదు.

    స్పూన్ తో  ఆమె చేతి గాజుల మీద  చిన్నగా  శబ్దం చేశాడు.

    ఉలిక్కిపడి  తల తిప్పిందామె.

    "వాట్ హేపెండ్? ఈ రోజు ఏమిటి  చాలా మూడీగా  వున్నావు?" ఒకింత ఆందోళనగా  మారింది అతని స్వరం.

    "అబ్బే....అదేం లేదు" అంది  మామూలుగా  అవటానికి  ప్రయత్నిస్తూ అర్చన.

    అతని కళ్ళు సూటిగా  ఆమె కళ్ళలోకి  చూశాయి.
 

 Previous Page Next Page