అమ్మాయ్ బాల్కనీ లో - పండు వెన్నెల్లో నిలబడి అవుట్ హౌస్ వేపు చూస్తుంది. మీరు అవుట్ హౌస్ కిటికీ దగ్గర నిలబడి ఆమెను చూస్తూ పాట మొదలెడతారు. ఆర్. భీమారావ్ పాట విని తన గదిలో మంచం మీద నుంచి లేచి కూర్చుంటాడు.
అమ్మాయి రెండో చరణం పాడుతుంది.
ఆర్. భీమారావ్ అవుట్ హౌస్ చేరుకుంటాడు.
"ఎవరా పాట పాడింది?" అనడుగుతాడు.
"అబ్బే! నేను కాదండీ! రేడియో -" అంటారు మీరు.
"బ్రతికిపోయావ్ - అంత ఘోరంగా పాడినందుకు నువ్వయితే షూట్ చేసేవాడిని" అని వెళ్ళిపోతాడు.
దృశ్యం నెంబర్ - టూ - విషాదరసం! అమ్మాయి తన గదిలో నిద్ర పోతుంటుంది. మీరు ట్రేలో బెడ్ కాఫీ తీసుకెళ్ళి ఆమె అందమయిన పాదాలు చూసి ముచ్చట పడి , కాళ్ళ దగ్గరే కూర్చుని చేత్తో నెమ్మదిగా పాదాలు స్పృశిస్తారు. అమ్మాయి 'టామీ' అనుకుని గట్టిగా తన్నేసరికి ...."
హటాత్తుగా దీప్ చంద్ లేచి నిలబడ్డాడు.
"మైగాడ్! టైమయిపోయింది! ఈవినింగ్ న్యూస్ పేపర్ - అర్జంటుగా తెమ్మన్నారు - భీమారావ్ గారూ!" అంటూ వడివడిగా వెళ్ళిపోయాడతను.
అమ్మాయీ, భవానీశంకర్ కూడా ఉత్సాహంగా బయటకు నడవసాగారు.
ఖాళీ అటో రిక్షా దగ్గర ఆగిందామె.
"థాంక్యూ- మీరెంతో మార్వలెస్ గా హెల్ప్ చేస్తున్నారు నాకు" అంది తీయగా.
"జస్ట్ హాబీ!"
"అన్నట్లు మీరు 'తెలుగు కిరణం' లో ఏం ఉద్యోగం చేస్తున్నారు?" అంది తీయగా.
"చీఫ్ ఎడిటర్ - మైడియర్ గాళ్!"
"మైగాడ్!" అందామె రెండోసారి.
"మూడోసారి కూడా మైగాడ్ అనుకోవచ్చు! పర్వాలేదు! బైదిబై! మీలాంటి యంగ్ బ్యూటీపుల్, బ్రిలియంట్ గాళ్ - మా పేపర్ కి ఏదయినా కంట్రిబ్యూట్ చేయకూడదు?"
"నేనా?" ఉత్సాహంగా - నమ్మలేనట్లు అడిగిందామె.
"అవును! ఒకసారి మా ఆఫీస్ కి రండి! మనం ఈ విషయం డిస్కస్ చెద్దాం!"
"ఓకె, తప్పకుండా వస్తాను!" అందామె థ్రిల్ ఫీలవుతూ. అటో ఆమెను తీసుకెళ్ళి పోయింది.
*****
తెలుగుకిరణం ఆఫీస్ చాలా హడావుడిగా వుంది.
తన అధ్వర్యంలో వెలువడిన మొట్టమొదటి 'తెలుగుకిరణం' ప్రతి చూస్తున్నాడు భవానీశంకర్. అతని పక్కనే చిరంజీవి కూడా నిలబడి ఉన్నాడు.
పేపర్లో చాలా మార్పులు కనబడుతున్నాయ్.
"తెలుగుకిరణం దినపత్రిక ఎవరిది? మీది, ,మాదీ మనందరిదీ- నేడే మీ తెలుగుకిరణం కాఫీ కోసం ఆర్డర్ చేయండి" అన్న ప్రకటన అన్ని పేజీల్లోనూ కనబడుతోంది.
"ఒక్కరోజులో ఎంత లైఫ్ వచ్చిందో పేపర్ కి గమనించావా మిత్రమా?" అడిగాడు భవానీశంకర్ ఆనందంగా.
అప్పుడే స్వప్న ఓ ఫైల్ తీసుకుని ఆ గదిలో కొచ్చి అతనికేదురుగ్గా ఉన్న కుర్చీలో కూర్చుంది.
"యస్, చెల్లమ్మా! అన్ని దినపత్రికల సర్క్యులేషన్ వివరాలు దొరికాయా?"
"దొరికాయ్" అందామె పైలు తీసి చదువుతూ -
ఆంధ్ర ప్రభ 1,2,731 ప్రతులు
ఆంధ్ర జ్యోతి 50,962 ,,
ఆంధ్ర పత్రిక 41,559 ,,
ఈనాడు 3,47,228 ,,
ఆంధ్ర భూమి 15,908 ,,
ఇంతవరకూ చెప్పి భవానీశంకర్ వంక చూసి చిరునవ్వు నవ్వింది స్వప్న.
"తెలుగుకిరణం కూడా చెప్పమంటారా?"
"కమాన్ చెల్లమ్మా! డోంట్ హేజిటేట్! దాన్ని పెంచటానికే భవానీశంకర్ ది గ్రేట్ ఇక్కడున్నాడు - చెప్పేసేయ్ - ఎంత?"
"13,206-"
చిరంజీవి నీరసంగా కుర్చీలో కూలబడ్డాడు.
"భవానీ ! మన పత్రిక సర్క్యులేషన్ తక్కువని తెలుసు గానీ, ఈనాడుకి అంత ఎక్కువ సర్క్యులేషన్ ఉందని నాకు తెలీలేదు. ఈ లెక్కలో మన పత్రిక సర్క్యులేషన్ కనీసం ఇరవై ఏడు రెట్లు పెరగాలన్న మాట ! అది ఆరునెలల్లో .....ఊహు, కాదు - అయిదు నెలల ఇరవై ఏడు రోజుల్లో . ఇది మానవమాత్రులేవరికి సాధ్యం కాని విషయం!"
"యస్, మైడియర్ ఫ్రెండ్! అందుకే మనం ఈ ఛాలెంజ్ టేకప్ చేశాం! నా దగ్గర క్రిక్కిరిసిపోయిన టాలెంట్ - లేకపోతే న్యూయార్క్ టైమ్స్ కి చీఫ్ కరెస్పాండెంట్ గా ఎలా తీసుకుంటారు?" గర్వంగా అన్నాడు భవానీ శంకర్.
స్వప్న ఆశ్చర్యపోయింది. "మీరు న్యూయార్క్ టైమ్స్ కి కారెస్పాండెంటా?" నమ్మలేనట్లు అడిగిందామె.
"ఆఫ్ కోర్స్ - ఇంకా కాలేదనుకో! కానీ ఆ రోజు ఎంతో దూరం లేదు - రేపో , ఎల్లుండో ఆ మర్నాడో జరుగక మానదు!"
స్వప్న నవ్వుతూ ఫైల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమెతో పాటు చిరంజీవి కూడా బయటకు నడిచాడు, శ్రీరాములు గది తలుపు దగ్గరకొచ్చి వినయంగా నిలబడ్డాడు.
"వాట్ శ్రీరాములు - ఏమిటి సంగతి? మరీ వినయం ఉట్టిపడుతున్నట్లు పెట్టిన ఆ ఫోజు మార్చెయ్! అదంటే మనక్కొంచెం చిరాకు"
శ్రీరాములు ఖంగారు పడ్డాడు.
"సబ్ ఎడిటర్ల ను పిలుచుకు రమ్మన్నారు కదండీ - వచ్చారు."
"లోపలకు రమ్మను - బయట నిలబడటం - 'మే అయ్ కమిన్ ' అనటం లాంటివేమీ లేవిక్కడ! 'డైరెక్ట్ - విత్ ది బాస్ ' - యజమానితో ముఖా ముఖీ - అనేది తెలుగుకిరణం స్లోగన్ నిన్నటి నుంచీ -"
సబ్ ఎడిటర్లు ముగ్గురూ లోపలి కొచ్చి ఖాళీగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు.
"యస్, మైడియర్ బాయ్స్! తెలుగుకిరణం లో న్యూస్ కి మీరిస్తోన్న హెడ్ లైన్స్ , లీడ్ బాడీ సబ్ హెడ్స్ - అన్నీ చూశాను. జర్నలిజం టెక్ట్స్ బుక్స్ నూటికి నూరుపాళ్ళూ ఫాలో అవుతున్నారనడంలో నాకెలాంటి సందేహమూ లేదు యామ్ ఐ కరెక్ట్?"
"యస్సార్!" గర్వంగా అన్నడోకతను.
"వెరీ గుడ్! ఇలా టక్కున సమాధానాలు చెప్పే బాలురన్న కూడా నాకెంతో ఇష్టం! మీలాంటి టేక్స్త్స్ పుస్తకాల బట్టీ పరుల్ని శాశ్వతంగా దూరం చేసుకోవడం నిజంగా - నాకెంతో బాధగా ఉంది!"
ముగ్గురూ ఉలిక్కి పడ్డారు.
"అదేమిటి సార్- మేమెందుకు దూరమవుతాం?"
"కేవలం తెలుగు కిరణం క్షేమం కోరి!"
"బాబాయ్! అంతపని చేయకండి సార్! మా తప్పు లేవయినా ఉంటే చెప్పండి! సరిదిద్దుకుంటాం! అంతేగాని......"
"అల్ రైట్ - రేపట్నుంచీ 'తెలుగుకిరణం' లో ఎక్కడా నాకు టెక్ట్స్ పుస్తకం కనిపించకూడదు ! అంతేకాదు ! పుస్తకాల్లోని బాష కూడా ఉండకూడదు. కేవలం - మనం మాట్లాడుకునే భాష పదాలు, సామెతలు - ఇవే ఉండాలి! అర్ధమయిందా?"
"అయింది సార్!"
"అయితే ఈ హెడ్ లైన్ ఎలా రాస్తారో చెప్పండి! "ఆంధ్రప్రదేశ్ లో అనేకచోట్ల గవర్నర్ గడ్డి బొమ్మ దహనకాండ! కమాన్ క్విక్-"
"ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ గడ్డి బొమ్మ దహనం - " అన్నాడు ఒకతను.
"గవర్నర్ గడ్డిబొమ్మ దహనం-" అన్నాడు ఇంకోతను.
భవానీశంకర్ నవ్వాడు.
"అది అందరూ ఇచ్చే హెడ్ లైన్స్!- తెలుగు కిరణానికో ప్రత్యేకత ఉండాలంటే హెడ్ లైన్స్ ఇలా ఉండాలి."
"ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ గడ్డిబొమ్మలు దహనం - పశువుల దైన్యస్థితి- అర్ధమయిందా?"
"అయింది సార్! అలా సెటైర్ జోడిస్తే నిజంగానే చాలా అద్భుతంగా ఉంటుంది -"
భవానీ సంతృప్తిగా చూశాడు.
"యూకేన్ గో -"
ముగ్గురూ బయటికెళ్ళిపోయారు.
భవానీశంకర్ ఎడిటోరియల్ రాసుకొంటుండగా ఒకావిడ కోపంతో లోపలకు జొరబడింది.
"యస్ - మేడమ్! మీకేమయినా సహాయం...."
"ఏరీ- శివతాండవంగారెక్కడ!" మండిపడుతూ అడిగింది.
"శివతాండవమా! అంటే మాజీ చీఫ్ ఎడిటర్ గురించా మీరడిగేది? అయన మెడికల్ టీం సలహా మీద హూరైజన్ లో కెళ్ళి పోయారు మేడమ్! ఇప్పుడప్పుడే తిరిగి వస్తారన్న నమ్మకం లేదు! బైదిబై మీ వివరాలేమిటో సంక్షిప్తీకరిస్తే...."
ఆమె కొంచెం శాంతించింది.
"నా పేరు చంటి చాముండేశ్వరి, రచయిత్రిని."
భవానీశంకర్ ఆశ్చర్యంగా కుర్చులోంచి లేచి నిలబడ్డాడు.
"నా అభిమాన రచయిత్రి చంటి చాముండేశ్వరి ' మీరేనా?" అన్నాడు నమ్మలేనట్టు చూస్తూ.
"అంటే .....మీరు ....నా ....నవలలు ...."
"యస్ మేడమ్! పూర్తిగా కొని చదివెంత అభిమాన పాఠకుడిని , మా ఇంట్లో అన్ని గోడల మీదా బొగ్గుతో మీ బొమ్మే గీశాను. చిన్నప్పుడు ."