Previous Page
Next Page
మహాప్రస్థానం పేజి 26
మిథ్యావాది
మాయంటావా? అంతా
మిథ్యంటావా?
నా ముద్దుల వేదాంతీ?
ఏ మంటావు?
మాయంటావూ? లోకం
మిథ్యంటావూ?
కనబడినది కనబడదని
వినబడినది వినబడదని
జగతి మరపు, స్వప్నం, ని
శ్శబ్దం, ఇది
మాయ! మాయ!
మాయంటావూ? అంతా!
మిథ్యంటావూ?
జమీందారు రోల్సుకారు
మాయంటావూ? బాబూ
ఏమంటావు?
మహారాజు మనీపర్సు
మాయంటావూ? స్వామీ
ఏమంటావు?
మరఫిరంగి, విషవాయువు
మాయంటావూ? ఏం,
ఏమంటావు?
పాలికాపు నుదుటి చెమట,
కూలివాని గుండె చెరువు,
బిచ్చగాని కడుపు కరువు
మాయంటావూ?
తుపానులూ, భూకంపం,
తిరుగుబాట్లు, సంగ్రామం,
సంగ్రామం, సంగ్రామం,
మాయంటావూ? ఏయ్
ఏమంటావు?
జగతి మరపు, స్వప్నం, ని
శ్శబ్దం, ఇది
మాయ! మాయ! మాయ! మాయ!
మాయ! మాయ!
మాయంటావూ? అంతా
మిథ్యంటావూ?
- 1937
* * *
Previous Page
Next Page