రామస్వామి మౌనాన్ని ముందు అర్దం చేసుకున్నది ప్రసాదభూపతి.
"ఇక బయలుదేరుదామా?" అన్నాడు రామస్వామిని చూస్తూ.
"రైట్"
రామస్వామి ఇక లేచేవాడే.
"పారిపోతున్నారేం అంకుల్?" టక్కున అడిగింది విజూష.
"జవాబు తెలీనప్పుడు చేతకాదని చెప్పడం సాంప్రదాయం. పైగా యిందాక రుత్విని ఇంతలా హర్ట్ చేసిన మీరు సిగ్గొదిలి...."
"విజూషా" ఆర్దోక్తిగా అరిచాడు ప్రసాదభూపతి.
ఆ కేకకి సమీపంలో టేబుల్స్ ముందున్న వాళ్ళంతా అటుచూశారు.
రాజేంద్రకుమార్ కిదంతా 'ఎంబరాసింగ్ గా' అనిపించి "కూల్ డౌన్ ప్రసాద్! కూర్చో" అన్నాడు.
"లేదూ అంటే జవాబు తెలుసుకుని వెళితే బెటరు" రుత్వి అన్నాడు.
ఉద్విగ్నంగా చూసాడు రామస్వామి.
అంటే.....
అతడికి జవాబు తెలిసే యీ ప్రశ్న వేసాడన్నమాట.
"తప్పులేదంకుల్" రుత్వి రెట్టించాడు.
"మనకి తెలీనివి చిన్న వాళ్లదగ్గరయినా నేర్చుకోవచ్చు."
ఒక స్థాయికి చెందిన యిద్దరు ప్రముఖ వ్యాపారవేత్తల చేష్టలుడిగి నిలబడ్డ ఆ స్థితి అలాంటి స్థితిలో వుంటే తప్ప అర్దం కానిది.
"సరే.. .మీకు తెలీని ఆ జవాబు నేనే చెబుతాను" అన్నాడు రుత్వి.
"అవసరంలేదు" అనరిచేవాడే రామస్వామి.
కానీ చుట్టూ వున్న జనం ముందు పోయేది తన పరువే.
"విమానంలో ప్రయాణంచేసే పాసింజరుకి విమానం నడపడంలో అనుభవం అవసరంలేదు.
కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరంలేదు మిస్టర్ రామస్వామి రాజేంద్రకుమార్ నచ్చచెప్పాడు.
ఈ విశ్లేషణ నచ్చిందేమో టక్కున సీటులో సెటిలయిపోయాడు రామస్వామి.
"పూర్వకాలంలో దేశాలమధ్య ప్రయాణం ఎక్కువ జరిగేది. సముద్రాల ద్వారానే అని మీకు తెలుసు" అందరివేపూ చూసాడు రుత్వి.
"అయితే అప్పుడు ఓడల వేగాన్ని తెలుసుకునే సాధనాలుండేవి కావు అందుకే మోటుగా ఓ నాటు పద్దతిని ఎన్నుకున్నారట."
క్షణం ఆగి.....
"నాటు కాబట్టి నాటికల్ మైల్ అని వచ్చింది అనురకోకండి" అన్నాడు రుత్వి.
ఆ తర్వాత అందరికీ అర్దమయ్యేలా వివరంగా చెప్పాడు రుత్వి.
"ఆ రోజుల్లో ఓడలమీద ప్రయాణం చేసేటప్పుడు ఓ తాడుకి ఒక కొసని బరువయిన కలపదుంగని కట్టినీటిలో పడేసేవారు.
ఓడ నడుస్తుంటే తాడుని పెట్టేవారు. అది నియమిత కాలంలో ఎంత దూరం పోయిందో చూసి వేగం కనుక్కునేవారు."
"అయితే దానికి నాటికల్ మైల్ అనే పేరెలా వచ్చింది?" అసహనంగా అన్నాడు రామస్వామి.
"కాస్త ఓపిక పట్టండి సర్" నవ్వాపుకోలేకపోయాడు రుత్వి.
"ఇంగ్లీషులో K Not అంటే తెలుగులో ముడి అనర్దం. పూర్వం ఓడలోని నావికులు పొడవాటి తాడుకి సమాన దూరంలో ముడులు వేసేవారు. నావికుడు నిర్ణీతకాలంలో నీటిలోకి త్రాటిని వదులుతూ తన చేతిలో వున్నముడులని లెక్కపెట్టేవాడు.
అలా వేగాన్ని కనుక్కునేవాడు.. సముద్రపు మైలుని నాటికల్ మైల్ గా కొలవడం మొదలయింది యిలానే."
"అయితే మామూలు మైలుకి నాటికల్ మైలుకీ తేడా ఏమిటట" వ్యగ్యంగా అడిగాడు రామస్వామి.
"ఉంది సర్" చెప్పాడు రుత్వి. "మామూలు మైలుకి అడుగులు '5280'.... అదే నాటికల్ మైలుకి అయితే '6080' అడుగులు."
ఆ తర్వాత ఇక అక్కడ నిలబడలేదు రామస్వామి.
అవమానభారంతో ప్రసాదభూపతితో పాటు వెళ్లిపోయాడు.
చాలా సేపటిదాకా తేరుకోలేకపోయాడు రుత్వి.
విజూషని ఎందుకో కలిసి, ఎక్కడికో వెళ్లి అక్కడనుంచి కంట్రీక్లబ్బుకి వచ్చి ఇంత రాద్దాంతానికి తాను కారణమయినందుకు బాధగా వుంది.
అసలు విజూష సమక్షంలో తనూ మొండివాడుగా ఎలా ప్రవర్తించాడో ఇప్పటికి బోధపడటంలేదు.
ఆ తర్వాత క్లబ్బునుంచి బయటికి వెళ్లాక రుత్విని విడిచిపెట్టలేదు విజూష.
ఏ ఆశయంతో రుత్విని క్లబ్బుకి తీసుకువచ్చిందో అసలు ఏ ఛాలెంజ్ తో అతడికి తను దగ్గర కావాలనుకుందో గుర్తుకొచ్చి అతడిమీద అదే రోజు పూర్తి గెలుపుని సాధించటానికి నిర్ణయించుకుంది.
తండ్రికి కోపాన్ని రప్పించిందని తెలుసు.
రాత్రి ఇంటికి వెళ్లాక" ఇంతసేపూ వున్నది ఎవరితో" అని అంటాడనీ తెలుసు.
ఆయినా పట్టించుకోకూడదనుకుంది.
రాత్రి పది గంటలదాకా రుత్వితోబాటు ఎక్కడెక్కడో తిరిగిన విజూష కొన్ని గంటల వ్యవధిలో అతడిపై ఏర్పడ్డ ఇష్టాన్ని అతడికి వ్యక్తం చేయాలని కారు ఓ మూల ఆపింది.
నిర్మానుష్యంగా వున్న రోడ్డునీ, చీకటిని చీల్చుతున్న విద్యుద్దీపాలతో తోరణాల్ని చూస్తూ తన మనుసుని రుత్విముందు పదిచేదే!
అదుగో...
సరిగ్గా అప్పుడు ఓ లారీ వేగంగా రావటాన్ని చూసింది.
అదికాదు...
కేవలం తమ కారుని, కారులో వున్న తమ ప్రాణాల్ని తీయడమే ధ్యేయమన్నట్టు ముందుకు దూసుకొచ్చి ఏం చేయాలో ఆమె ఆలోచించేలోగానే భయానకంగా గుద్దింది.