సముద్ర మట్టానికి రెండువేల అడుగుల ఎత్తున ప్రకృతి పచ్చటి కొప్పు లాంటి అడవి.
"ఎంత చల్లగా ఉందో, ఏ.సీ. ఆన్ చేసినట్టుగా ఉంది" అంటూ వాగు వేపు నడిచింది వైశాలి.
ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో భోజనాలకు ఏర్పాట్లు జరిగాయి.
"పిక్నిక్ లా ఉంది... అయామ్ వెరీ హేపీ" అంది వైశాలి.
"ప్రస్తుతానికి అలాగే వుంటుంది రెండ్రోజులు గడిచాక చూడు- వెనక్కి వెళ్ళిపోతానంటావ్" అన్నాడు నవ్వుతూ ముత్యాలనాయుడు.
"చచ్చినా వెనక్కి వెళ్ళను. మంచి అందమైన ట్రైబల్ ని చూసి ప్రేమించి పెళ్ళి చేసేసుకుని సెటిలైపోతాను"
"నువ్వొచ్చింది అందుకా?" నవ్వుతూ అంది ఇందుమతి.
"ఏవమ్మగారూ నేనూ ట్రైబల్ నే. నాకు గవర్నమెంట్ జాబ్ కూడా వుంది" ఫారెస్టుగార్డు కురవ భీముడు అన్నాడు అమాయకంగా.
అతని జొక్కి అందరూ పడి పడి నవ్వారు.
అరగంట తర్వాత జీపు మళ్ళీ కదిలింది.
"చీకటి పడేలోపల మనం ఏదయినా గిరిజన గ్రామానికి చేరుకుంటే బాగుంటుంది" అన్నాడు యువరాజు.
"ఇకనుంచి మనకు చీకటి- వెల్తురు అనే భేదం వుండకూడదు ఆ ఫోబియాను వదిలేసుకో. అవసరమైతే చీకట్లో మైళ్ళకు మైళ్ళు ప్రయాణం చేయాల్సి ఉంటుంది" అంది వైశాలి కావాలనే.
"ఇంకో పది మైళ్ళ తర్వాత... జీప్ నడవదు అమ్మడూ. కాలి దారి పట్టాలి" అన్నాడు కపాలేశ్వర్ నవ్వుతూ.
"మరి మన లగేజీ?!"
"ఎవరి లగేజి వాళ్ళు మోసుకోవాలి తప్పదు. అసలు హంటింగ్ ప్రారంభమయ్యేది అక్కడ నుంచే" చెప్పాడు గార్డు కురవభీముడు.
"ఎవరి లగేజీని వాళ్ళు మోసుకోవాలా" నీరసంగా అంది వైశాలి.
ఎర్రటి సూర్యుడు రంగు మార్చుకుంటున్నాడు.
దట్టంగా పెరిగిన అడవిలోకి జీపు దూసుకొని పోతోంది.
ఏదో ఆకుపచ్చటి గోళంలోకి, నల్లటి జంతువు ప్రవేసిస్తున్నట్టుగా వుంది జీపు- మసకచీకటిలో ఎర్రగా మెరుస్తున్న తంగెడు పూల చెట్లు.
నెమ్మదిగా చీకటి పడుతోంది.
వెళుతున్న దారి కూడా సన్నబడుతోంది.
వేలకు వేలు మృదంగాలు అకస్మాత్తుగా ధ్వనిచేస్తున్న చప్పుడు... చప్పుడు రాను రాను దగ్గరవుతోంది.
ఆ చప్పుడు వింతగా, ప్రశాంత వాతావరణంలో బాంబ్ బ్లాస్టింగ్ కి కొండలు పగులుతున్నట్లుగా ఉంది.
"ఏమిటా సౌండ్... ట్రైబల్సా" వైశాలి కళ్ళల్లో ఏదో భయం.
"తమ్మాపూర్ జలపాతం- ఆ జలపాతం దాటితేనే తమ్మాపురం గిరిజన గ్రామం" చెప్పాడు గార్డు భీముడు.
"ఆ జలపాతం ఇంకెంత దూరం వుంటుంది?" అడిగింది వైశాలి.
"అయిదు కిలోమీటర్లు. రాత్రి మనం అక్కడే వుంటాం" చెప్పాడు కపాలేశ్వర్.
గూళ్ళకు చేరడానికి వెళుతున్న పక్షులు జీపు శబ్దానికి ఉలిక్కిపడి అరుస్తున్నాయి. దారి పొడుగునా దట్టమైన బూర్జ చెట్లు- నల్ల జీడిచెట్లు ఏదో ప్రళయం వచ్చినట్టుగా రకరకాల పక్షుల రకరకాల ధ్వనులు... ఆ ధ్వనులు అసహనంగా వున్నాయి.
"పక్షులు అరుస్తున్నాయి భయపడా" అడిగిందామె.
"మనల్ని చూసి అవి భయపడడం లేదు ఉలిక్కిపడుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న సమయంలో మనల్ని ఎవరైనా డిస్ట్రర్బ్ చేస్తే ఎలా ఫీలవుతాం అలాగన్న మాట. పక్షులు భయంతో అరిచే అరుపులు ఇంకోలా ఉంటాయి. ప్రస్తుతం అవి రిలాక్సు అవుతున్నాయి" కపాలేశ్వర్ చెప్పాడు వైశాలికేసి కాంక్షగా చూస్తూ.
"పక్షులు కూడా రిలాక్స్ అవుతాయా?"
"ఉదయం నుంచి సాయంత్రం వరకూ సూర్యుడి వేడి ఉండడం వల్ల పక్షులు అరవకుండానే తమ పనులు చేసుకుంటాయి. ఎక్కడో అలజడి జరిగితే తప్ప- పడమర దిక్కున సూర్యుడు అస్తమించడంతో భూమి చల్లబడుతుంది. అప్పుడవి గొంతిప్పుతాయి. అలా గొంతిప్పుతున్న సమయంలో మనం వచ్చాం" మళ్ళీ చెప్పాడు కపాలేశ్వర్.
"పక్షులకు కూడా భాష ఉందా ఇప్పుడవి మనల్ని చూసి ఏమనుకుంటాయి" అడిగింది వైశాలి.
"వీళ్ళెవరండీ బాబూ మనల్ని తినడానికొచ్చారు అని అనుకుంటాయి" అన్నాడు గార్డు భీముడు.
ఆ మాటకు చప్పుడు కాకుండానే నవ్వింది ఇందుమతి.
ఆ నవ్వుకు తలతిప్పి చూసాడు యువరాజు.
ఎడమ బుగ్గమీద పడిన సన్నటి వెల్తురు ఇందుమతి ముక్కునున్న ముక్కెర నిప్పుకణికలా మెరిసింది.
అదే సమయంలో ఇందుమతి అతనివేపు చూడడంతో తల తిప్పేసుకున్నాడు యువరాజు.
"ముత్యాలూ నీ కుక్క అరవకుండా, కదలకుండా మెదలకుండా ఉందేంటి" అడిగింది ఇందుమతి.
"అడవిలోకి కుక్కల్ని తీసుకువెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలమ్మా... ఒక్కొక్కప్పుడు కుక్క అరుపువల్ల జంతువులు మన ఉనికి తెలుసుకొని మనమీద పడతాయి... అందుకే కుక్కల్ని పగటిపూట నిద్రపోయేట్టు రాత్రిపూట మెలుకువగా ఉండేట్టు చూసుకోవాలి..."
"అయితే దానికేవిచ్చావ్"
"నల్లమందు... కుక్కమీద దాని నిషా పదిగంటలుంటుంది. మనం పడుకునే సమయానికి అది లేచి తిరుగుతుంది" చెప్పాడు ముత్యాలనాయుడు.
"సాయంత్రం నుంచి అది నావేపే అలా చూస్తుంటే, ఇంకేదో అనుకున్నాను ఇంటా'క్సికేషన్లో ఉందా" అంది వైశాలి.
"మీవేపే చూస్తుంటే ఏవనుకున్నారు. కుక్కచూపుకీ, నక్క చూపుకీ ఏమీ అనుకోకూడదండీ వైశాలిగారూ..." కపాలేశ్వర్ నవ్వుతూ అన్నాడు.
"మరి ఏ చూపుకి అనుకోవాలి" అడిగింది వైశాలి.
సమాధానం నోటివరకూ వచ్చి ఆగిపోయింది కపాలేశ్వర్ కి.
"ఏ చూపుకో తర్వాత చెప్తానుగా తొందరెందుకు ముందున్నాయిగా రెల్లు పొదలు" కసికసిగా అనుకున్నాడు మనసులో-
చిక్కటి చీకట్లో, పచ్చని అడవి కలిసిపోయింది. దట్టంగా పెరిగిన పొదల్లోంచి జీపు వెళ్తోంది నెమ్మదిగా. హెడ్ లైట్స్ వెలుగులో మట్టిరోడ్డు జిరాఫీ లాంటి చర్మంలా కనిపిస్తోంది.
ఆకాశంలో-
ఎవరో పట్టుకున్న కిరోషిన్ లాంతరులా చంద్రుడు మిణుకు మినుకు మంటున్నాడు.
రాను రాను జలపాతం సవ్వడి రొదలా మారింది.
అప్పుడు-
అకస్మాత్తుగా-
"ఫైర్... ఫైర్" అని అరిచింది వైశాలి గట్టిగా.
ఆమె గొంతు శబ్దం దూరంగా కొండల్లో గింగుర్లు కొట్టింది వింతగా.
"ఎక్కడ ఫైర్" అడిగాడు గార్డు భీముడు కంగారుగా.
వైశాలి చేత్తో కొండలవేపు చూపించింది-
నవ్వాడు గార్డు భీముడు. "అక్కడెక్కడో అగ్గయితే ఇక్కడెందుకమ్మా తోక కాలిన దానిలా అరుస్తావు... ఆ నిప్పు ఇక్కడకు రాదు" చెప్పాడు ముత్యాలనాయుడు.
"ఆ ఫైర్ ఇక్కడకు రాదా" భయం, భయంగా అంది వైశాలి.
"రాదు ట్రైబల్స్ పోడు వ్యవసాయం చెయ్యడం కోసం కొండల ఏటవాలు ప్రాంతాన్ని కాలుస్తారు. కొన్ని రోజులు అలా కాలాక ఆ భూమిని చదును చేస్తారు. ఆ నిప్పు- అలాగే వుంటుంది అడవిలోకి రాదు" చెప్పాడు ముత్యాలనాయుడు.
"దగ్గర్లో కొండ మండుతోందంటే దానర్ధం ఊరు దగ్గర పడిందని కపాలేశ్వర్ అన్నాడు ఎలర్ట్ అవుతూ.
మరో ఇరవై నిమిషాల తర్వాత జీపు మైదానంలాంటి ప్రదేశంలో ఆగింది. వంద అడుగులు దూరంలో జలపాతం- సుడులు తిరుగుతూ కొండల మీంచి దుముకుతోంది.
జీపును ఆపుచేసి దిగాడు యువరాజు.
హెడ్ లైట్స్ వెలుగులో ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తోంది ఇందుమతి.
"వాటే బ్యూటీఫుల్ ప్లేస్... ఇలాంటి ప్లేస్ లో ఓ బిల్డింగ్ కట్టుకుని ఉంటే ఎంత బాగుంటుందో" అంది వైశాలి.
"సెంట్రల్లీ... ఏసీ బిల్డింగయితే చాలా బాగుంటుంది కదూ" వెక్కిరింతగా అన్నాడు యువరాజు.
"ముత్యాలూ నువ్వు కేంప్ ఫైర్ ని తయారుచెయ్యి. యువరాజూ నువ్వూ, కపాలేశ్వర్ భీముడి సహాయం తీసుకుని రెండు టెంట్లు వెయ్యండి" ఆర్డర్ జారీ చేసింది ఇందుమతి.
"ఓ.కే. మేడమ్ కమాన్ కపాలేశ్వర్" జీపులో ఉన్న లగేజీ వేపు నడిచాడు యువరాజు.
గంట గడిచింది.
కేంప్ టెంట్లు తయారైపోయాయి. దూరంగా ముత్యాలనాయుడు రాజేసిన నిప్పు వెలుగులో జలపాతం వింతగా మెరుస్తోంది.
మగవాళ్ళందరూ జలపాతం దగ్గర స్నానం చేసివచ్చి కూర్చున్నారు.
మంట వెలుగులో వంటిని తుడుచుకుంటున్న యువరాజు కండల్ని, గుండెని ఆశగా చూస్తోంది వైశాలి.
ఆ చూపుల్ని పసికట్టింది ఇందుమతి.
"వైశాలీ... మనం కూడా స్నానాలు చేద్దామా" అంది ఇందుమతి.
"నేనూ అదే అనబోయాను. ఇకనుంచి మనం రాత్రిపూటే స్నానాలు చెయ్యాలనుకుంటాను" అంది వైశాలి.
"తప్పదుగా" అంటూ ఇందుమతి సూట్ కేస్ లోంచి టవల్, సోపూ తీసుకుని ముందుకు నడిచింది.
వైశాలి ఆమెని అనుసరించింది.
ఆకాశంలో దట్టమయిన మబ్బులు ఒక్కటొక్కటే మాయమైపోతున్నాయి. నెమలిపురిలా వెన్నెల అలుముకుంటోంది.
ఎక్కడనుంచో ఉండుండీ ఏవో పక్షుల అరుపులు, ఒక కిలీ మీటరు దూరంలో ఉన్న గిరిజన గ్రామం నుంచి ఎలుగెత్తి విన్పిస్తున్న పాటలు, వాద్యాల రొద... జలపాతం హోరులో కలిసిపోతున్నాయి.
అంతెత్తు కొండలమీంచి దూకుతున్న జలపాతం రాళ్ళగుట్టల మీంచి పారుతోంది.
ఒడ్డున నుంచుంది వైశాలి.
నీళ్ళల్లోకి నెమ్మదిగా దిగింది ఇందుమతి.
"ట్రైబల్ విలేజ్ లోంచి, ఏదో మ్యూజిక్... సాంగ్స్ విన్పిస్తున్నాయి... భోజనాలయ్యాక ఆ విలేజ్ కి వెళ్దామా" అంది వైశాలి.