Previous Page Next Page 
మబ్బు విడిపోయింది పేజి 25


    మురళి ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు. చూసి కూడా సరిగా రాయలేక రవి సెకండ్ క్లాసులో పాసయ్యాడు. కష్టపడి చదివి పరీక్షలు వ్రాసిన మంజు సెకండ్ క్లాస్ లో పాసయింది.


                                     11


    సరోజ, కుమార్ పార్కులో కూచుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అంతలో అక్కడికి కొందరు స్టూడెంట్స్ వచ్చి వాళ్ళిద్దరినీ చూశారు-ఒక జంటని అలా చూసి ఏం మాట్లాడకుండా ఊరుకోవటం వాళ్ళతరం కాలేదు.
    "ఒరేయ్! చారణాగాడికి సన్నజాజిమొగ్గ దొరికిందిరోయ్!" అన్నాడొకడు.
    ఆ మాటలు వినటంతోనే మిగిలిన వాళ్ళకీ హుషారొచ్చింది.
    "చారణాగాడు సార్ ఇంట్లో పాగా వేశాడు కదురా! పాపం, సన్నజాజి అదే పందిరనుకుని అల్లుకుని పోయింది."
    "ఓ సన్నజాజీ! నీకు చారణాగాడి కథ తెలుసునా? సుట్టలు కొంటానికి కారణాలు నువ్వూ ఇయ్యగలవా?"
    "కొంపదీసి సన్నజాజి కూడా 'సుట్టలు కొంటానికి చారణా' బాపతు కాదుకదా!"
    "ఏమో! అయితే కావచ్చు!"
    "అంతకుముందు కాకపోతే, ఇకముందు అవుతుంది"
    "ఒక్క సన్నజాజి విలువ-చారణా-"
    ఘొల్లున నవ్వులు-అరుపులు.
    అదంతా సరోజకేమీ అర్ధంకాలేదు.
    "చారణా సుట్టలేమిటీ? నువ్వు చుట్ట త్రాగుతావా?"
    "ఏం? త్రాగితే, నాతో స్నేహం మానేస్తావా?"
    "చచ్చినా మానను- నేనూ చుట్ట త్రాగటం నేర్చుకుంటాను__ నేను పతివ్రతని.
    "నీకు పుణ్య ముంటుంది__అంత పాతివ్రత్యం ఇప్పటినుంచీ ప్రదర్శించకు-" అని జరిగినదంతా చెప్పాడు కుమార్.
    సరోజ తెల్లబోయి "ఏమిటి? ఇప్పటికీ ఇంకా ఈ కులభేదాలున్నాయా, విద్యార్ధుల్లో కూడా?" అంది.
    "లేవు-ఏ మాత్రంలేవు__మా క్లాసులో షెడ్యూల్డ్ కాస్ట్ కి చెందినవాళ్ళు చాలామంది ఉన్నారు-వాళ్ళతో మిగిలిన వాళ్ళంతా బాగా కలసి మెలసి ఉంటారు-అందరూ ఒక చోటే లంచ్ కూడా తీసుకుంటారు."
    "మరి....?"
    "అసలు రహస్య మేమిటంటే మిగిలిన షెడ్యూల్డ్ కాస్ట్ విద్యార్ధులు కులం పేరుకి మాత్రమే వెనుకబడిన కులాలవాళ్ళు కాని, జీవితంలో అంతగా వెనుకబడ్డ వాళ్ళు కారు- వాళ్ళ తండ్రులందరూ, చిన్నవో, పెద్దవో, ఏవో ఉద్యోగాలు చేసుకుంటున్నవాళ్ళే! గుడిసెల్లో ఉంటున్న వాళ్లెవరూ లేరు__గుడిసెల్లో ఉంటున్నవాళ్ళు, ప్రభుత్వం ఎన్ని సదుపాయాలూ కల్పించినా తమ పిల్లలను డిగ్రీ కోర్సులవరకూ చదివించే దశకు ఈ నాటికీ చేరుకోలేదు__ఎక్కడో పేపర్లలో ప్రకటించు కోవటానికి ఒకరో, ఇద్దరో, ఉంటే చాలా గొప్ప....మా మామ్మ నన్ను వెతుక్కుంటూ కాలేజీకి రావటంతో, ఆ దశలో ఉన్న వ్యక్తి నాకు రక్త సంబంధీకు రాలని తెలియటంతో నేను వీళ్ళకి లోకువయి పోయాను__షెడ్యూల్డ్ కాస్ట్ విద్యార్ధులు ఆ సంఘటన జరిగిన తరువాత వచ్చి నాతో పోట్లాడారు- "నువ్వు సుఖంగా చంద్రశేఖర్ సార్ ఇంట్లో పెరుగుతున్నావు__అదృష్ట వంతుడివి- ఆ దెయ్యాన్ని కాలేజికి ఎందుకు రానిచ్చావ్? ఏదైనా మాట్లాడాలని ఉంటే ఆ తరువాత రహస్యంగా ఎక్కడైనా మాట్లాడకూడదు? పోనీ చంద్రశేఖరంసార్ ఇంటికే రమ్మనకూడదూ? అందరూ ఎవరో కూలిమనిషి అనుకునేవారు! ఛ! ఛ! నలుగురిలో మామ్మా అంటూ ఆ ముష్టిదానితో ముచ్చటలు పెట్టుకుంటావు__మా పరువంతా తీసేశావు" అని.
    "మనం చాలా పురోగమించాలి. కులభేదాలు మాసిపోతున్నాయి. కాదనలేను__కానీ, ఆ కులభేదాల నశింపు వెనక పరిస్థితులింకా ఇలాగే ఉన్నాయి. అటు బ్రాహ్మణ విద్యార్దులూ నాతో కలవటంలేదు__గబ్బిలాయిలా ఉంది నా పరిస్థితి."
    "వాళ్ళంతా నిన్నలా ఏడిపిస్తోంటే నోరు మూసుకుని ఊరుకుంటావా?"
    "ఏం చెయ్యమంటావే!"

 Previous Page Next Page