Previous Page Next Page 
మబ్బు విడిపోయింది పేజి 24


    మురళి బుద్ధిగా తలఊపి వెళ్లిపోయాడు.
    "రేపటినుండీ వాడిని బాగా చెక్ చేసి పంపిస్తాను మాస్టారు" అంది సత్యవతి.
    కాంతారావు నవ్వి "ఇక్కడ చెక్ చేసి పంపిస్తే అక్కడ సంపాదించుకుంటాడు. ఈ పరిస్థితులిలా ఉన్నంతకాలం మనబోటి వాళ్ళం ఏం చెయ్యలేం!" అన్నాడు.
    చంద్రశేఖర్ కి దంపతులిద్దరూ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. వాళ్లిచ్చిన కాఫీ ఫలహారాలు తీసుకుని ఇంటికి వచ్చేశాడు, అప్పటికే ఇంటికి వచ్చి మరునాటి పరీక్షకు చదువుకుంటోంది మంజు.
    "మీ పరీక్షలెలా జరుగుతున్నాయమ్మా?" అని అడిగాడు మంజుని చంద్రశేఖర్.
    "బాగానే జరుగుతున్నాయి నాన్నా!"
    "బాగానే అంటే? కాపీలు బాగాకొట్టి వ్రాస్తున్నారా?"
    "కొందరు చీటీలు తెచ్చుకున్నారు. కానీ మా మేడం చూసి ఇచ్చెయ్యమంటే ఇచ్చేశారు."
    ఆడపిల్లలు సాత్వికమైనవాళ్ళు. సాగితే, వాళ్ళూ కాపీలు కొట్టటానికి తయారవుతారు. కానీ దౌర్జన్యాలకి దిగరు, ఆడపిల్లల కాలేజీలలోకూడా కొన్ని కాలేజీలలో కాపీలు బాగా సాగుతున్నాయని విన్నాడు. పోనీ మంజు చదువుతోన్న కాలేజిలలాంటి కొన్ని కాలేజీలలో నయినా కాపీలు సాగకుండా ఉంటే, అదైనా మంచిదే!
    ఏ విధమయిన అక్రమాలూ జరగకుండా ఉండాలని స్పాట్ వేల్యుయేషన్ ప్రారంభించారు. అక్కడి విచిత్రాలు ఇన్నీ అన్నీ కావు! ఒక లెక్చరర్ కి పాతిక పేపర్లు దిద్దాకకాని, తను దిద్దుతున్నది టేమిల్ మీడియం పేపర్లు అని తెలియలేదు. అప్పుడు నెమ్మదిగా కళ్ళుతెరచి "ఇవి నా పేపర్లుకావు. నేను టేమిల్ మీడియం కరెక్టు చెయ్యలేను." అని ఇచ్చేశాడు.
    మరొక లెక్చరర్ తన పేపర్లలో ఒక్కొక్కళ్ళకీ యాభైకి అరవై, డెబ్బయ్, మార్కులిచ్చాడు. చీఫ్ చూసి "ఇదేమి" టని అడిగితే "అరె! టోటల్ యాభై మార్కులా? నేను అలవాటుగా నూరు మార్కులనుకున్నాను" అని నాలుక కరుచుకున్నాడు.
    ఇక పేపర్లు చూద్దామంటే, కాపీలు కొట్టినట్లు స్పష్టంగా తెలుస్తున్నాయి. పుస్తకాలలో చూసి "మీరు వెనుకటి ప్రకరణములో చదివినట్లు...." "పై బొమ్మలో వివరించిన విధముగా" ఇట్లాంటివి కూడా తు.చ తప్పకుండా వ్రాసేశారు విద్యార్ధులు.
    ఇక తెలుగులో తమాషాలకు అంతేలేదు. ఒక విద్యార్ధి తెలిసో, తెలియకో "దిలీపుని సంతాన నిరోధమునకు కారణము(దిలీపునకు సంతానము కలగకుండుటకు కారణము)" అని వ్రాస్తే ఇంచుమించు రెండు వందలమంది విద్యార్ధులు అదే వ్రాశారు. ఇంకా దారుణం! నాటకం పేరు "తెలుగు తెలుగు" అది ఎలా మారిందో, ఎందుకు మారిందో ఒక విద్యార్ధి పేపర్లో "ఆంధ్ర వైభవం"గా మారింది. ఇక ఒక కట్టలో పేపర్లన్నింటిలోనూ 'తెలుగు తెలుగు' మాయమయి ఆంధ్ర వైభవమే మిగిలింది. గైడ్లలో అచ్చుతప్పులు చిన్న తప్పులేకాకుండా ఆన్సర్ పేపర్లలో దిగాయి. ఇదంతా చూసి చంద్రశేఖర్ "కాపీలు కొట్టినట్లు ఇంత స్పష్టంగా తెలుస్తోంది కదా! మనం మార్కులు తగ్గించటానికి వీల్లేదా?" అన్నాడు చీఫ్ తో.
    ఆయన నవ్వి "ఎలా? ఆ విద్యార్ధి "నేను కంఠతాపట్టి ఉన్నది ఉన్నట్లుగా వ్రాశాను" అంటాడు. లేదని మనం నిరూపించగలమా? కాపీ కొట్టినట్లు మనం అనుమానిస్తే చాలదు. కాపీ కొట్టాడని రిపోర్ట్ చెయ్యాలి. ఆ తరువాత దానిని నిరూపించాలి. ఎందుకొచ్చిన తలకాయనొప్పి? ఏదో మార్కులు పారెయ్యండి. పోనీ అంత అనుమానం ఉందంటున్నారు గనుక, ఎక్కడ ఏ కాస్త తప్పుదొరికినా మార్కులు కోసెయ్యండి." అన్నాడు.
    కాపీలుకొట్టి తమ ముందు పడేసిన ఆ పేపర్ల మీద లెక్చరర్లు కూడా విసుగ్గా ఏవో మార్కులు పడేస్తున్నారు.
    పరీక్షా ఫలితాలు వచ్చాయి. చంద్రశేఖర్ మాటలు నమ్ముకొని కాపీ కొట్టకుండా వ్రాసిన కొద్దిమంది విద్యార్ధులు చాలా దారుణమైన ఆశాభంగాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.
    "సార్! నేను ఎంతో బాగా వ్రాశాను. అయినా నాకు యాభై మార్కులే వచ్చాయి," అన్నాడొక విద్యార్ధి ఎంతో బాధపడుతూ.
    అందరూ కాపీకొట్టి వ్రాశారనే అపోహతో ఏ ఒక్కరికీ మంచి మార్కులియ్యలేదు. సముద్రంలో కాకిరెట్టలా కొద్దిమంది విద్యార్ధులు కాపీలు కొట్టకుండా వ్రాసినా దానికి గుర్తింపు లేకపోయింది.
    "సార్! యేం కాపీలు కొట్టకుండా రాస్తే మాకు నలభై మార్కులే వచ్చాయి. మిగిలినవాళ్ళు కాపీలు కొట్టి రాస్తే అరవై మార్కులొచ్చాయి." అన్నారు అక్కసుగా మరికొందరు విద్యార్ధులు. పాపం, కాపీలు కొట్టకుండా వ్రాసిన మరికొందరు విద్యార్ధులు ఫెయిల్ కూడా అయ్యారు. వాళ్ళు చంద్రశేఖర్ దగ్గరకొచ్చి ఏడ్చి "మీ మాట విని దెబ్బ తిన్నాం. హాయిగా, మేమూ చూసి రాసేస్తే దర్జాగా పాసయ్యే వాళ్ళం. మాకు తెలుగులోనే పోయింది" అన్నారు.
    ఫలితాలు బాగా లేనందుకు చంద్రశేఖర్ ని యాజమాన్యం సంజాయిషీ అడిగింది. చంద్రశేఖర్ సరిగ్గా పాఠాలు బోధించటం లేదనీ, ఆ కారణంవల్లనే విద్యార్ధులు పరీక్షలలో తప్పారనీ, ఆరోపించింది. మూర్తిలాంటి లెక్చరర్లని మంచి ఫలితాలు సాధించినందుకు అభినందించింది.    

 Previous Page Next Page