Previous Page
రెక్కలు విప్పిన రివల్యూషన్ పేజి 25


    గవర్నమెంటూ, యూనియన్లూ, కామందులూ, అంతా ప్రజలకోసం పాటుపడేవాళ్లే.
    దేవదూతలరుస్తారు. "ఎన్నికలంటే ద్రోహం" అని.
    రేడియోలు అబద్ధాలనూ, సరళ సంగీతాన్నీ సరఫరా చేస్తాయి.
    ప్రచార సాధనాల పదాతి దళాలు తమ కిరణాలను మనస్సులోని మధుర శూన్యం వైపూ, మధురాతి మధురమైన శరీర సుఖాల వైపూ ప్రసరిస్తాయి-తుపాకి గుళ్లు.
    ఫ్లిన్ వద్ద మచ్చు పటాకీ, పోలీసులు దాడిచేస్తారు. వర్కర్లూ, దేవదూతలూ ఆఖరి బారికేడ్లు అధిరోహిస్తారు-చైతన్యంతో, ఆగ్రహంతో.
    దమనకాండ, వేదన, నిష్శాక్తత, వీరావేశం, ప్రతిఘటన, బాధ. చరిత్ర వేగం తగ్గిస్తుంది. కంచుకోట సోర్బాన్ ఎర్రజెండా ఎగరేస్తుంది. ఒక స్వప్నానికి బందీ, ఇప్పుడు రక్షణ లేనిది.
    వర్కర్లు ఫ్యాక్టరీలకు కదులుతున్నారు. పెట్టుబడి యాజమాన్యంలోని ఫ్యాక్టరీలకు.
    తిండి కొనుక్కోవడానికి శ్రమని అమ్ముకోవడం.
    మిగిలింది కనిపించదు, ప్రజల మనస్సులలో వుంటుంది.
    రొట్టె ఖరీదు అయిదు పైసలు పెరుగుతుంది.
    ఇందు వచ్చు పాత్రలు కార్మిక వర్గం, బూర్జువాజీ.
    ఈ క్రిందివాళ్ళకు మారిన నిర్వచనం:
    ఎ) శ్రమశక్తిని చవకగా అమ్ముకుని బతికేవాళ్ళు.
    బి) సదుపాయాల పరిస్థితుల్లోనూ, స్థానాల్లోనూ పనిచేస్తూ "లాభాల" లో వాటాలు పంచుకునేవాళ్లు.
    పెట్టుబడి
    ప్రకృతిని మార్చగల పరికరాలను తయారుచేసేందుకు ఎప్పటికప్పుడు తన్నుతాను పొడిగించుకునే వ్యవస్థ.
    గరిష్ఠ వస్తూత్పత్తి నిమిత్తం అది సంప్రదాయసిద్ధమైన కార్మిక వర్గం (పీడితులు), బూర్జువా వర్గం (పీడకులు) అనే రెండు వర్గాలను సృష్టించింది. అలా చెయ్యడంలో తన వినాశనానికి తానే దారి ఏర్పాటు చేసింది. కార్మికులు, బూర్జువాజీ ఉభయులూ ఇప్పుడు పెట్టుబడికి దాసులై ఉన్నారు.
    ఉభయులూ దానిలో గర్భితమైన ఆదేశాలకు శిరసువంచుకున్నారు. ఉభయులూ తమ జీవితాలను తామే శాసించుకోవాలని కోరుతున్నారు. మీరు ప్రత్యక్ష చర్య ద్వారా ఈ పని చెయ్యవచ్చు. తద్వారా పెట్టుబడి పరిపాలనకు మూలాధారాలైన రెండు యంత్రాలను (ప్రభుత్వమూ, ధనమూ) రద్దు చెయ్యవచ్చు. పెట్టుబడికి (దాని విస్తరణ రూపమైన లాభంతో సహా) ఇప్పుడు రక్షకులు లేనందువల్ల దాని రోజులు దగ్గరపడ్డాయి.
    కామందులు
    ఒకప్పుడు పెట్టుబడి యొక్క ప్రధాన నిర్ణయాలను చేసేవారు-దాని యంత్రాలను (ప్రభుత్వం- అనగా రాజజీయాలను, ధనం- అనగా ఆర్ధికాన్నీ) అదుపులో ఉంచుకున్నవారు. ఇప్పుడీ జాతి అంతర్ధానమవుతోంది. దాని స్థానాన్ని గ్రాఫులూ, కంప్యూటర్లూ తీసుకుని గరిష్ఠ లాభాలను తెచ్చే నిర్ణయాలను సమకూర్చుతున్నాయి.
    తన్నుతాను పొడిగించుకునే వ్యవస్థకు వారసత్వం పోగొట్టుకున్నవారు.
    నూతన కార్మికులు
    పొలాలలో, ఫ్యాక్టరీలలో, ఆఫీసులలో, లేబరేటరీలలో, అబ్జరేటరీలలో పనిచేసే అంతమందినీ.శ్రమశక్తిని అమ్ముకుని బ్రతికేవాళ్లు (కొందరు సుఖంగా, కొందరు ఇబ్బందులతో). తమ అవసరాలను ఘోషించడానికీ, తమ ఇష్టాలను అనుసరించడానికీ, తమ కాంక్షలను నెరవేర్చుకోవడానికీ, ఆస్కారం లేనివాళ్లు. తాము చెందిన కుటుంబానికి దారి గానీ గమ్యంగానీ ఆశలు గానీ నిర్ణయించలేనివాళ్ళు.
    కమ్యూనిస్టు పార్టీ, సి.జి.టి. ఇత్యాదులు
    పాత కార్మిక వర్గపు పరిస్థితులను మెరుగుపరచడానికి ఏర్పడ్డ సంస్థలు. పాత బూర్జువాయిజాన్ని పడగొట్టడానికి వీలయిన ఆయుధాలు. ఇప్పుడు పతనావస్థలో ఉన్న పెట్టుబడిదారీ ప్రతినిధులతో చేతులు కలుపుతున్నారు. నూతన వ్యవస్థలో తాము అంతర్ధానంకాక తప్పదన్న భయమే ఇందుకు కారణం.
    ప్రచార సాధనాలు
    కొత్త కార్మికులు తమ బానిసత్వాన్ని గుర్తించుకోకుండా ఉండడానికీ, బలాన్ని తెలుసుకోకుండా ఉండడానికీ చేసే ఉపకరణాలు. అంతేకాక కొత్త కార్మికులను శాశ్వతంగా గజిబిజితోనూ, దాస్య హృదయాలతోనూ ముంచెత్తి వారి ఆస్తులతోనే వారికి సంకెళ్లు వేసే పనిముట్లు. పాతబ్ది ఇప్పుడు శూన్యమైన చట్టం (రాజ్యాంగం, ధనం) అంటే విపరీతమైన భక్తి. తమతమ వ్యక్తిగత భవిష్యత్తు పట్ల భయం. సమిష్టి భవిష్యత్తు మీద అసలే ఆశలు లేవు.
    యువతరం
    దారిద్ర్యం అంటే భయమా, ఐశ్వర్యం, (ఆస్తి) అంటే భక్తీ లేనివారు. వేరువేరు చైతన్య స్థాయిలో వీళ్లు - నేటి వ్యవస్థను క్రమపద్ధతిలో ఎప్పటికప్పుడు సవాలు చెయ్యడం ద్వారా తమ భవిష్యత్తును తమ చేతుల్లోకి తీసుకొనక తప్పదని తెలుసుకున్నవారు. వీరిలో దేవదూతలకి మరీ బాగా తెలుసు- ఏ పద్ధతుల ద్వారా, ఏ చర్యలద్వారా ఈ సవాలు సర్వశక్తివంతం చెయ్యవచ్చునని.
    స్వప్నం
    పెట్టుబడినీ, దాని లాభాలనీ రద్దు చెయ్యడం-దాని బాహ్య స్వరూపాయిన రాజ్యాంగాన్నీ ధనాన్నీ రద్దు చెయ్యడం.
    కార్మికుల (నూతన కార్మికుల) అజమాయిషీ - అధికారం అప్పగించడమనేది లేదు. ఎప్పటికప్పుడు ప్రతినిధి వర్గాల సభలు నిర్ణయాలు తీసుకోవాలి.
    ఎవరెవరి అభిరుచిని బట్టి, అవసరమైన శ్రమతో అందరూ కలిసి పనిచేస్తారు.
    (యంత్రాల మీద అజమాయిషీ కావచ్చు, శరీర కష్టం కావచ్చు.)
    శరీర శ్రమకీ (అనేది ఉంటే), మానసిక శ్రమకీ ఎటువంటి భేదమూ ఉండదు.
    మానసిక శ్రమలో, అవసరమైనప్పుడు అందరూ పాల్గొంటారు. శరీర శ్రమని అందరూ పంచుకుంటారు. స్వయం నిర్ణయాధికారం వల్ల వెలుపలి ఒత్తిడులు (రాజ్యాంగమూ, ధనమూ) అస్తమించి అంతర్థానమవుతాయి.
    ఆ తర్వాత ఇంకా కనిపెట్టవలసిన హృదయ భావనలూ, నూతనాలోచనలూ.
    దేవదూతలు
    యువతరం(కొందరు కారు), వర్కర్లూ స్టూడెంట్లూ (కొందరు కారు) ఏదో స్థాయి ఉత్సాహంతోనూ, అవగానతోనూ స్వప్నాన్ని దర్శించి, దాన్ని వాస్తవం చెయ్యడానికి చర్య తీసుకుంటారు. మార్గాలు అనంతం. వాటిలో కొన్ని అత్యవసరం.
    భరతవాక్యం
    కథ నీతిదాయకమైనది, మళ్లీ జరిపించలేనిది.
    మరిన్నీ, ఫ్రాన్సు ఒకే ఒక దేశం, కాని ఫ్రాన్సు ఒంటరిది కాదు.
    సర్దుబాటుల బహిస్వరూపాలు, విప్లవాల సంబరాల తర్వాత చారిత్రకనీరసతాలు, విప్లవ వాహకులను నిరోధించలేవు. దాని శత్రువులను కికురించలేవు.
    ఎవరూ ఊహించలేనిది జరిగినప్పుడు, అసంభవంలా కనిపించేదేదో అతి సమీపంలో ఉంటుంది.
    దానికి సూచనలు అనేకం.
                                                              ముప్ఫెతార్ వీధి, పారిస్ -5
                                                             సంఘటనలు జరిగిన వెంటనే,
                                                                       జూన్, 1968

                             * సమాప్తం *

 Previous Page