Previous Page Next Page 
అయినవాళ్ళు_పక్కవాళ్ళు పేజి 25


    రామదాసుకు తనకంటే తక్కువ స్థాయిలో వున్న వుద్యోగి సూక్తులు లాంటివి వర్ణించటం ఆగ్రహం తెప్పించింది. కాని కోపాన్ని అదిమిపట్టి పెదవుల మీదికి బలవంతంగా నవ్వు తెప్పించుకున్నాడు.
    "చూడండి విజయ్ కుమార్. ఇప్పుడు నేనూ మీలా అమాయకంగా ఆలోచించి ఆ అజ్ఞానాంధకారంలో బ్రతికినవాడ్నే. అలా బ్రతికినన్నాళ్ళూ అడుగడుక్కి ఆర్ధిక ఇబ్బందులు...నా భార్యకి హార్టులో మర్మముంటే వేలకు వేలు పోసి ఖరీదైన వాల్వ్ ఆపరేషన్ చేయించలేక ఆమె చచ్చిపోతూంటే నిస్సహాయంగా చూస్తూ వూరుకున్నాను. ఆ శవం హృదయవిదారకంగా అలా తగలబడుతూంటే... అప్పుడే... అప్పుడే...జీవితం నాకు కొత్త పాఠాలు నేర్పింది. అంతే. బతుకు తెరువు తెలుసుకున్నాను. రెండు చేతులా సంపాదిస్తున్నాను. మళ్ళీ పెళ్ళి చేసుకున్నాను. సొంత ఇళ్ళూ, ఇంట్లో అన్ని సౌకర్యాలూ __ జీవితాన్ని జుర్రుకుంటున్నాను."
    విజయ్ మాట్లాడకుండా అలాగే చూస్తున్నాడు.
    రామదాసు అతనిముందు ఓ కవరుంచాడు.
    "ఏమిటి సార్ ఇది?"
    "డబ్బు...అయిదు వేలు. నాకు అడ్డురాకుండా చెప్పింది చెప్పినట్లు చేస్తూ వుంటే ఇలాంటి అయిదువేలు చాలా మీ ముందుకు రెక్కలు వచ్చి వాల్తాయి."
    "నో" అన్నాడు విజయ్.
    అతని కంఠంలోని దృఢ సంకల్పానికి రామదాసు ఉలిక్కిపడ్డాడు.
    "ఏ ఉద్యోగమూ దొరక్క, ఆర్తితో దరఖాస్తులు పంపిస్తూ, ఇంటర్వ్యూలకు అటెండవుతూ, దిగ్రేట్ లెటర్సుతో నిరాశా నిస్పృహలతో కృంగిపోతూన్న దశలో, నా అర్హతల్ని గౌరవించి ఈ ఉద్యోగం నాకు లభించింది."
    "జాయినింగ్ రిపోర్టిచ్చి ఆఫీసులో సీటులో కూచున్నప్పుడు నేను పొందిన పారవశ్యాన్ని ఎన్నటికీ మరిచిపోను. ఏ ఉద్యోగం నాకు అన్నం పెడుతున్నదో, దాన్ని నన్ను గౌరవించనివ్వండి సార్. అది లేనప్పుడు నేను పొందిన మానసిక దుస్థితిని మర్చిపోయి, అధికార మదంతో, అహంకారంతో, అన్యాయంతో, అవినీతితో ప్రవర్తించి కృతఘ్నుడ్ని కాలేను.
    "నా సంపాదనెంత వుందో అందులోనే నా జీవితావసరాలను కుదించుకుంటాను గాని, శక్తికి మించిన సుఖాలను కోరుకోను. ఎక్స్యూజ్ మి సార్. ఇంకెప్పుడూ నన్నిలా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించకండి. అవతల నా సీటులో కూచుని నిర్వర్తించవలసిన బాధ్యత చాలా వుంది వస్తా"
    ఆఫీసర్ పర్మిషన్ కోసం ఎదురుచూడకుండా విజయ్ లేచి విసురుగా బయటికెళ్ళిపోయాడు.
    ఇలాంటి సందర్భాలలో మనిషి ప్రక్కవాళ్ళని అర్థంచేసుకోవటానికి ప్రయత్నించడు సరికదా. అహంకారముతో మండిపడతాడు. ఇప్పుడూ అలాగే జరిగింది.
    రామదాసు ముఖం కోపముతో జేవురించిపోయింది.
    వొళ్ళంతా వేడెక్కి పోయినట్లయింది.
    "రాస్కెల్! నన్నే అవమానిస్తావా? విజయ్ కుమార్? నా మీద తిరుగుబాటు ప్రదర్శిస్తావా? నా ఆజ్ఞని ధిక్కరిస్తావా. నేను తలుచుకుంటే...తలుచుకుంటే కాదు...ఈ క్షణం నుంచే తల్చుకుంటున్నాను. ఇహనుంచి...నువ్వు డ్యూటీకి సరిగ్గా రావు. ఆఫీస్ పని చాలా నిర్లక్ష్యంగా చేస్తావు. వొట్టి లంచగొండివి. నీ మీద అన్నీ బ్యాడ్ రిమార్కులే భయంకరమైన రిమార్కులే. పై అధికారులకు ఫిర్యాదులే. వాళ్ళంతా ఎవరనుకున్నావు? నా గుప్పిట్లో వున్న వ్యక్తులు. విజయ్ కుమార్__! చాలా కొద్ది రోజుల్లో నీకు టెర్మినేషన్"


                                    9


    రాధాప్రియ దిగులుగా కూర్చున్నది.
    "ఏమిటండీ? అలా డల్ గా వున్నారు?" అంటూ విమలాదేవి లోపలికొచ్చింది.
    రాధాప్రియ మూడ్ లోకి వచ్చింది. "నాకో విషయం చెప్పండి"
    "ఏమిటండీ?"
    "మిమ్మల్ని మీ వారు ముద్దులు పెట్టుకుంటారా లేదా?"
    విమలాదేవి బోలెడు సిగ్గుపడిపోయింది.
    "చెప్పండి. ఫర్వాలేదు"
    "నిజం చెప్పాలంటే...మావారు మిగతా వ్యవహారంలో కన్నా ముద్దులలోనే ఎక్కువ శైలి ప్రదర్శిస్తారు."
    "నీ బొంద, నీ లావుపాటి పెదాలూ, బొద్దుల మీసాల మొగుడూ, మీ మొహాలకి ముద్దులూ, వాటికో శైలీ కూడానా?" అనుకుంది రాధాప్రియ.
    ఏదో పాయింటు లేకపోతే రాధాప్రియ ఓ టాపిక్ లేవనెత్తదని విమలాదేవికి తెలుసు.
    "ఇంతకీ ముద్దుల ప్రసక్తి తీసుకొచ్చారు?" అనడిగింది.
    "అది లేదూ సుజాత, మహ దానికొక్కదానికె మొగుడున్నట్లు, ముద్దులు దానికొక్కదానికే చేతయినట్లు బహిరంగ ప్రదర్శనలిస్తోన్నది.
    "మీరు చూశారా?"
    "చూడటమేమిటి? చూసేటట్లు చేస్తోంటే?"
    "ఛీ ఛీ, సిగ్గులేకుండా" అన్నది విమలాదేవి కళ్ళు పెద్దవి చేసి_అసహ్యించుకుంటున్న ముఖం పెట్టి. అంతగొప్ప దృశ్యము తాను చూడకుండా మిస్సయి పోయానే అని లోలోపల చాలా బాధపడుతోన్నది.
    రాధాప్రియ కళ్ళల్లో రకరకాల భావాలు దొర్లుతున్నాయి.
    "అయినా ఆ మరిదిగాడితో కులుకుతూందన్నారుగా. మళ్ళీ ఇదేమిటి యీ నంగనాచి వేషాలు? మొగుడ్ని కాకా పట్టటానికేనా?"
    "అంతేగా మరి?"
    "పోనీ ఒక పని చేస్తే"
    రాధాప్రియ ఏమిటన్నట్లుగా చూసింది.
    "ఆమె మొగుడుగాడికి దాని రంకు వేషాలు తెలీజేసి అదంటే అసహ్యం పుట్టేటట్టు చేస్తే__"

 Previous Page Next Page