Previous Page Next Page 
అయినవాళ్ళు_పక్కవాళ్ళు పేజి 24


    అదే సమయానికి సందులోంచి నడిచి వస్తోన్న రాధాప్రియ యీ దృశ్యాన్ని చూసింది. అంతేకాదు. ఆమె కళ్ళకు ఆ ఇరుకు వరండాలో ముక్కలు ముక్కలుగా నేలమీద పడిన చింపేసిన ఉత్తరం ముక్కలు కనిపించాయి.
    ఆమె హృదయం భగ్గుమంది.
    ఏమీ గమనించనట్లు వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.
    సుజాత అతని ఒడిలోంచి లేచి నిలబడింది. "అమ్మో ఆవిడ చూడనే చూసింది" అంది.
    "ఏం? చూస్తే"
    "అది కాదు"
    "ఆవిడ భర్త ఆవిడ్ని ముద్దు పెట్టుకోడా?"
    "అబ్బ. అది కాదండి. ఆవిడ సంగతి మీకు తెలీదండీ"
    "పోన్లే. యీ సంగతి తెలుసుకోకపోవడం వల్ల నష్టం లేదు.


                                            *    *    *    *


    విజయ్ ఆఫీసులో తన సీటులో కూచుని సీరియస్ గా రాసుకుపోతున్నాడు. తల అటూ ఇటూ త్రిప్పటం లేదు.
    "విజయ్" ఓ కోయిల కంఠం అతన్ని పిలిచింది.
    "ఊ" అని పరధ్యానంగా అని తల ప్రక్కకి త్రిప్పి చూశాడు.
    ప్రక్క సీట్లోని అనూరాధ.
    "ఇది మూడోసారి నేను పిలవటం?"
    "సారీ. వినబడలేదు."
    ఒక్కక్షణం నిశ్శబ్దం.
    "ఇంతకీ ఏమిటి పాయింటు?"
    "పాయింటు లేకపోతే పిలవకూడదా?" చిలిపిగా కవ్విస్తున్నట్లుగా అంది.
    "ఆఫీస్ వర్కింగ్ అవర్స్ లో..."
    "కొంత టైము మన కోసం కేటాయించుకోవటం తప్పంటావు."
    "నా దృష్టిలో..."
    "తప్పంటావు. మరీ అంత సిన్సియర్ గా వుండటం పనికిరాదు విజయ్."
    "బహుశా...అది నా వీక్ నెస్ కావచ్చు."
    "విజయ్"
    "చెప్పు"
    "నువ్వు ఇంట్లో కూడా ఇంత సీరియస్ గా వుంటావా?"
    విజయ్ నవ్వాడు.
    "అదిగో ఆ నవ్వే...మధుర మనోహరమైన ఆ మందహాసమే నన్ను పిచ్చిదాన్ని చేసేస్తోంది. అనుకుంది లోలోపల స్పందనలతో కదిలిపోతూ."
    "అంటే ఎలా కుదురుతుంది?"
    "అంటే అక్కడ న్యాచురల్ గా వుంటావు. యిక్కడ నటిస్తావు"
    "నటించటం కాదు. డ్యూటీలో వున్నప్పుడు యిలా వుండటం న్యాచురల్"
    "నాకు ఈ ప్రపంచాన్ని శపించాలని వుంది."
    "ఎందుకు?"
    "చెప్పను"
    విజయ్ మళ్ళీ నవ్వాడు.
    "అదిగో. ఆ నవ్వే..."
    మళ్ళీ రెండు సెకండ్లు నిశ్శబ్దం.
    ఈ ప్రపంచంలో నాకు ఒకే ఒకర్ని చూస్తే జెలసీగా వుంది.
    "ఎవర్ని?"
    ఆమె మాట్లాడకుండా సైలెంటుగా వుండిపోయింది.
    "ఎవర్ని?" అడిగాడు మళ్ళీ.
    "చెప్పను"
    అతను నవ్వాడు. "నువ్వు చాలా మంచి అమ్మాయివి."    
    ఆఫీస్ భాయ్ వచ్చాడు. "సారి. మిమ్మల్ని అయ్యగారు రమ్మంటున్నారు."
    విజయ్ సీటులోంచి లేచి స్ప్రింగ్ డోర్ తీసుకుని "అయ్యగారి" దగ్గరకెళ్ళాడు.
    ఆఫీసర్ ముఖం మామూలుగా ఎప్పుడూ ధుమధుమలాడుతూ వుంటుంది. ఈ వేళ చాలా ప్రసన్నంగా వున్నాడు.
    "రండి. మిష్టర్ విజయ్ కుమార్" అన్నాడు సాదరంగా.
    విజయ్ దగ్గరకెళ్ళాడు.
    "కూచోండి."
    ఆయన కెదురుగా వున్న కుర్చీలో ఒకదాంట్లో కూర్చున్నాడు.
    ఆఫీసర్ గారి ముందు ఓ ఫైల్ వుంది. ఆయన అందులోని పేజీలు అలవోకగా తిరగేస్తూ "ఈ ఫైల్ మీద సంతకం చెయ్యకుండా వదిలేశారేమిటి? దాన్ని మీరు పాస్ చేస్తేగాని నేను ఎప్రూవ్ చెయ్యకూడదని తెలీదా?"
    "తెలుసు సార్"
    "మరి ఎందుకు సైన్ చెయ్యలేదు?"
    "అది అప్లయ్ చేసిన వ్యక్తి ఒక ఛీటర్. అందులో ఏ అంశమూ కరెక్టుగా...అంటే నిబంధనల ప్రకారం పూర్తిచెయ్యబడలేదు.
    అవన్నీ అబద్ధాలని నాకు తోచింది. అందుకే అలా వుంచేశాను.
    "కాని అతను నాకు కావల్సిన వ్యక్తి. ఈ సంఘంలో పలుకుబడి వున్న మనిషి, ముందు ముందు ఆయనవల్ల మనకనేక ప్రయోజనాలుంటాయి. ఉదాహరణకి మీ ప్రమోషన్.
    "క్షమించండి సార్. స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నా ఉద్యోగ ధర్మాన్ని విస్మరించలేను"
    "ఉద్యోగ ధర్మం" అంటూ ఆఫీసర్ రామదాసు హహ్హహ్హహ అంటూ గట్టిగా నవ్వాడు.
    "చూడండి మిష్టర్ విజయ్ కుమార్. ఈ దేశంలో అందరూ మీవంటివాళ్ళే అయితే మీ ధర్మాన్ని మీరు సరిగ్గా నిర్వర్తించవచ్చు. కానీ...
    "క్షమించండి సార్. ఈ దేశంలో ఎవరు ధర్మంగా ప్రవర్తిస్తున్నారో ఎవరు అధర్మంగా ప్రవర్తిస్తున్నారో ఆ లెక్కలు నాకనవసరం. కాని నాకు ఉద్యోగమిచ్చింది నా డ్యూటీ నేను సక్రమంగా చెయ్యడానికి. దానికి విరుద్ధంగా ప్రవర్తించను.

 Previous Page Next Page