తీవ్రమైన జుగుప్సాభావం తెరలా తృటికాలం ఉమ నావరించుకొంది. ప్రయత్నంమీద ఆ తెరను చీల్చుకుని "మీరు నామాట వినరూ!" అంది లాలనగా.
ఆ స్వరానికి కాదనగలిగేశక్తి ఎవరికీ ఉండదు సామాన్యంగా.
చలపతి కసలు లేదు.
"నీమాట ఏదైనా సరే, శిరసావహిస్తాను."
'శిరసావహిస్తాను' అన్నమాటలు తడుముకొంటూ, నట్టుతూ అన్నాడు చలపతి.
అంతరంగంలో ఒకదానితో ఒకటి పోటీలు పడుతున్న ఆవేదననూ, జాలినీ అణచుకొంటూ మృదువుగా అంది.
"మీరంతా ఎలా గడిపారో అలాగే గడిచింది అని చెప్పండి. అంతకంటే ఇంకేమీ చెప్పకండి, చెప్పవలసిన అవసరంలేదు. ఇంకా ఏమైనా ప్రశ్నిస్తే "ఏం లేదు" అని నవ్వెయ్యండి. మన రహస్యం ఇతరులకు తెలిస్తే నాకు చాలా బాధ కలుగుతుంది."
"వద్దు! వద్దు! బాధపడకు. నీకు బాధ కలగనియ్యను. ఎవ్వరికీ ఏం చెప్పను."
పడుకుని కళ్ళు మూసుకున్నాడు చలపతి. కొద్దిసేపట్లోనే గుర్రు పెడుతున్న భర్తను చూస్తూ ఎప్పటికో కనురెప్పలు వాల్చింది ఉమ.
16
పగలంతా కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తున్నది చాలక రాత్రిళ్ళు ట్యూషన్లు కూడా కుదుర్చుకున్నాడు ప్రభాకరం. పోషణనుబట్టే ఆరోగ్యమూ ఉంటుంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న ప్రభాకరం ఆరోగ్యం ఈ అధికశ్రమతో మరింత దెబ్బతింది. రోజూ రాత్రిళ్ళు టెంపరేచర్ వస్తున్నా ఎవరికీ చెప్పక ఎప్పటికప్పుడు ఏస్ప్రిన్ టాబ్లెట్లు వేసుకుని తాత్కాలికంగా టెంపరేచర్ తగ్గించుకునేవాడు. రాను రాను దగ్గు కూడా ప్రారంభమయింది. పార్వతి కంగారుపడి "డాక్టర్ కు చూపించుకోండి" అంది.
"ఎందుకే! అనవసర ఖర్చు. వేడిచేసి దగ్గొస్తుంది. అదే తగ్గిపోతుంది" అన్నాడు.
పార్వతి అమాయకంగా ఆ మాటలు నమ్మి వేడి తగ్గటానికి నిమ్మకాయ రసమిచ్చింది.
ఆ మరునాటికల్లా బ్రహ్మప్రళయంగా జ్వరం ముంచుకొచ్చి మంచంమీంచి లేవలేకపోయాడు. ఇంక తన అనారోగ్యం దాచటం, పాపం ప్రభాకరానికి చేతకాకపోయింది. ఇంటిల్లిపాదీ కంగారుపడిపోయారు. శోభ అన్న నుదుటిమీద చెయ్యేసి గాభరాపడిపోయింది.
శోభ మనసెంత మెత్తనిదో మాటంత కరకు. సాధారణంగా ముక్కుకు సూటిగా పోయేవాళ్ళంతా అలానే ఉంటారేమో?
"చదువుకొనికూడా ఇంత మూర్ఖంగా ఎలా ప్రవర్తించావన్నయ్యా! రోగాన్నిలా చేజేతులా ముదరబెట్టుకుంటారా? డాక్టర్ని పిలుస్తానుండు" అంటూ ఆందోళనగా లేవబోయింది.
జ్వరంతో ఎర్రగా ఉన్న కనురెప్పలు బరువుగా ఎత్తి శోభను చూస్తూ "నేను చచ్చిపోయినా ఫరవాలేదు. అందుకు నాకు చింత లేదు. కాని నువ్వు మాత్రం నాకు వైద్యం చెయ్యటానికి రావుగారిని పిలుచుకురాకు" అన్నాడు ప్రభాకరం.
అన్న అనారోగ్యంతో వ్యాకులపడుతూన్న శోభ శూలాల్లాంటి ఈ మాటలతో స్తంభించిపోయింది.
ఉమ పెళ్లి హడావుడిలో వారంరోజులుగా శోభ రావుగారిని కలుసుకోలేదు. ఆ రోజు వెళ్దామనుకుంటూండగా ప్రభాకరం అనారోగ్యం గురించి తెలిసింది.
క్షణకాలం రోషంతో శోభ కళ్ళు భగ్గుమన్నాయి. నిలువెల్లా వణికింది. అంతలో అన్న పరిస్థితి గుర్తుకొచ్చి తమాయించుకుంది. కాని నోటిని నిగ్రహించుకోలేకపోయింది.
"నీ యిష్టమొచ్చిన డాక్టర్నే పిలిపించుకో అన్నయ్యా! ఫీజు రెడీగా ఉంటే సరి!"
ఉమ వివాహంతో అప్పులతో బాగా కృంగిపోయి ఉన్నాడు ప్రభాకరం. అతనిప్పుడే చిన్న దెబ్బనూ సహించేలా లేడు. శోభ మాటలతో దెబ్బతిన్న త్రాచులా పార్వతివైపు తిరిగి "పారూ! నీ మెడలో మంగళసూత్రాలు రెండు నా వైద్యానికి సరిపోవా?" అన్నాడు.
పార్వతి తన చేత్తో భర్త నోటిని మూసి, క్రూరంగా శోభను చూస్తూ ఏడుస్తూ వెళ్ళిపోయింది.
శోభకు మనసు కలుక్కుమంది. అలా తొందరపడి మాట్లాడినందుకు తనను తాను తిట్టుకొంది. కాని, ఇప్పుడేం చెయ్యాలి? ఉమ పెళ్ళి పూర్తయింది. ఇంట్లో డబ్బూ పూర్తయింది. ఫస్టు ఇంకా పదిహేను రోజులుంది. ఇప్పుడు డాక్టర్ ఫీజు ఎలా తేవాలి? అదీగాక రమ్మనంగానే తమ ఇంటికొచ్చే మంచిడాక్టరెవరు?
ఉమ పెళ్ళినాటినుంచీ కామాక్షమ్మ ఏదీ పట్టించుకోవటంలేదు. అడిగిన దానికి మాత్రం సమాధానం చెపుతుంది. పార్వతి అయోమయం. పిల్లలు చిన్నవాళ్ళు. ఏది జరిగినా, తనవల్లే జరగాలి. అన్న పరుషంగా మాట్లాడాడని పంతాలకుపోయి అన్న ఆరోగ్యం నాశనం కావటం సహించలేదు. అన్న మూర్ఖత్వం తనకు తెలుసు. రావుగారితో వైద్యం చేయించుకోడు. ఆఫీస్ లో ఎవరిదగ్గరైనా అప్పు దొరుకుతుందేమో? తనకు సెలవులు కూడా లేవు. చిరాగ్గా ఆఫీస్ లో కూర్చున్న శోభను సమీపించాడు మూర్తి.
"అలా ఉన్నారేం?"
"కొన్ని చికాకుల్లో ఉన్నాను. మీరు నాకో సహాయం చెయ్యగలరా?"
"సంతోషంగా చేస్తాను. ఏం కావాలి?"
"మీకు తెలిసిన మంచి డాక్టరెవరైనా ఉంటే మా ఇంటికి పిలిపించండి."
ఉలిక్కిపడ్డాడు మూర్తి.
"డాక్టరా?" అన్నాడు సంతోషంతోనూ, సంభ్రమంతోనూ ఉక్కిరిబిక్కిరవుతూ.
అతని భావం అర్థమయింది శోభకు. "అవును." అంది తలవంచుకుని.
"సరే! డాక్టర్ శేఖర్ అని నాకు తెలిసినాయన ఉన్నారు. మంచి డాక్టరే! సాయంత్రం మీ ఇంటికి తీసుకొస్తాను."
"థాంక్స్. ఇంకొకటి." శోభ సందేహంగా ఆగిపోయింది.
"చెప్పండి. మొహమాటపడకండి."
"ఉమ పెళ్లితో మా ఇంట్లో డబ్బంతా అయిపోయింది. అన్నయ్యకు జ్వరం తీవ్రంగా ఉంది. డాక్టర్ ఫీజు కూడా లేదు. ఒక వంద ఉంటే సర్దగలరా? ఫస్టుకిచ్చేస్తాను."