Previous Page Next Page 
ఆత్మబలి పేజి 24

   
    ఒంటరిగా గదిలో తన ఎదురుగా ఉన్న తేజోమూర్తిని చూసి కంగారుగా వణికిపోయాడు చలపతి.
    ఉమ వంగి చలపతి పాదాలకు నమస్కరించింది. తేలుకుట్టినట్లు నాలుగడుగులు దూరంగా వేశాడు చలపతి.
    "నువ్వు...నాకు నమస్కారం చేస్తున్నావా? నువ్వు బి.యస్.సి. పాసయ్యావు!!!" గాభరాగా అన్నాడు చలపతి.
    "నేను మీ భార్యను." ప్రసన్నహాసంతో సమాధానమిచ్చింది ఉమ.
    "ఉమా! నువ్వు.."
    "చెప్పండి. నా దగ్గిర మీకు సంకోచమెందుకు?"
    "నువ్వు లేచిపోతావా? చచ్చిపోతావా?"
    తృళ్ళిపడింది ఉమ. తీక్షణ స్వరంతో "ఇదేవిఁటీ?" అంది.
    ఉమ కంఠస్వరంలోని తైక్షాణ్యానికి వణికాడు చలపతి.
    "నేను కాదు. వాళ్ళు.... వాళ్ళంతా అన్నారు. నువ్వేమో విధిలేక నన్ను చేసుకున్నావట. మరేమో, కొంచెం రోజుల్లోనే లేచన్నాపోతావుట. చచ్చన్నా పోతావుట! నాతో సంసారం చెయ్యలేవుట!"
    చలపతి కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతున్నాయి. ఉమ అతని ముఖంలోకి నిదానించి చూసింది.
    మాంటిసరీమెథడ్స్ లో ఎక్కడో చదివినట్లు జ్ఞాపకం.
    చిన్నపిల్లలకు జ్ఞానం వచ్చిన దగ్గరనుండీ విద్యార్థిదశ ప్రారంభమైనట్లే! వాళ్ళు తమ తల్లిదండ్రులనూ, పరిసరాలనూ ఎంతో జాగ్రత్తగా పరిశీలించి, తాము పరిశీలించింది అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరు తల్లిదండ్రులీ విషయం మరిచిపోతూ ఉంటారు. స్వెట్టర్ అల్లకంలో మధ్య మధ్య కొన్ని నిట్టింగ్స్ వదిలేసి పూర్తిచేస్తే స్వెట్టర్ ఆకారం వచ్చినా వదిలేసిన నిట్టింగ్స్ వెలితిగా కనిపిస్తూనే ఉంటాయి. జాగ్రత్తగా పెంచబడని పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వాళ్ళ వ్యక్తిత్వాలు ఈ నిట్టింగ్స్ వదిలిన స్వెట్టర్స్ లాగే ఉంటాయి.
    తన భర్త వ్యక్తిత్వపు స్వెట్టర్ అల్లకంలో అశ్రద్ధవలననో, అజ్ఞానం వల్లనో వదిలేయబడిన నిట్టింగ్స్ కు వేయబడిన తప్పుడు ముళ్ళకు అంతే లేదు. తాను ప్రయత్నించి తన భర్త వ్యక్తిత్వాన్ని పునర్నిర్మించుకోగలదా? అందుకు అవకాశం ఉందా?
    "ఏవిఁటాలోచిస్తున్నావు? లేచిపోదామా? చచ్చిపోదామా అనా? నువ్వు లేచిపోయినా సహిస్తాను కాని, చచ్చిపోకు."
    చలపతి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఉమ జాలిగా చూసింది అతనివంక.
    "నేను లేచిపోను - చచ్చిపోను - బ్రతికినంతకాలమూ మీ భార్యగా బతుకుతాను."
    చలపతి ముఖం వికసించింది.
    "చచ్చిపోనని ఒట్టుపెట్టు." అంటూ చెయ్యి జాపాడు. ఉమ అతనిచేతిలో చెయ్యేసింది. ఆ చేతి నతడలాగే పట్టుకుంటాడని ఆశించింది. కాని చలపతి వదిలేశాడు. వదిలేసి బెంబేలుగా ఉమ వంక చూస్తూ "నేను..నువ్వు... నువ్వు...నేను..." అని గొణిగాడు.
    ఒక్కలిప్తమాత్రం తాను విన్నవీ, చదివినవీ తొలిరాత్రి అనుభవాలు మస్తిష్కంలో మెరిసి గుండెలు కలుక్కుమన్నాయి. అంతలోనే నిబ్బరించుకొంది.
    "నేనూ సామాన్యమానవమాత్రురాలినే! ఆత్మసంయమనం సాధించటానికి ఇంకా ఎంతో ఎదగాలి" అనుకొని నవ్వుకొంది.
    "ఉమా! దిగులుగా కనిపిస్తావు. ఎందుకు దిగులు? నీ సంతోషం కోసం నీ చిరునవ్వు కోసం ఏదైనా చేస్తాను. నువ్వు నవ్వుతూ కనపడకపోతే నేను సహించలేను ఉమా!" ఆందోళనగా అన్నాడు చలపతి. ఉమ ఆశ్చర్యంగా చూసింది. 'ఇతడు బొత్తిగా మూర్ఖుడు కాడు. విషయ పరిజ్ఞానం ఉంది. అంతేకాదు ప్రేమించగల హృదయం ఉంది. తనను గాఢంగా, వెఱ్ఱిగా ప్రేమిస్తున్నాడు. ఈ పునాదిమీదనే ఇతని వ్యక్తిత్వాన్ని పునర్నిర్మించుకోవాలి. తపస్సుచేసి ఇతనిని సాధారణ వ్యక్తిగా మలచి, తర్వాత భార్యగా సంసారం చెయ్యాలి. ఒకరకమైన సోమరి మార్గంలో పయనించే మనసు కర్తవ్య పథంలో పడటం చాలా కష్టం. ఇతనికి తనలో ఉన్న ఆకర్షణనే ఆధారంగా తీసుకుని, ఇతని మనసు కర్తవ్య పథం వైపు తిప్పాలి. ఈనాడే తన సర్వస్వమూ అర్పించేస్తే ఆ ఆకర్షణ అధికకాలం నిలవకపోవచ్చు. అతని శ్రేయస్సును కోరి అతడొక స్థిరవ్యక్తిత్వంతో నిలిచేవరకూ అతనికి దూరంగా ఉండాలి.
    మంచం మీంచి దిండు తీసి క్రిందవేసుకుని కటికనేలమీద పడుకొంది ఉమ.
    కొద్దిక్షణాలు దీనంగా ఉమవైపు చూసి, తర్వాత బెదురుగా, "క్రింద పడుకుంటున్నావా?" అన్నాడు. ఉమ చిరునవ్వుతో అతనివైపు చూసింది.
    "మీరు బి.ఏ. పాసయ్యేవరకూ నేను క్రిందే పడుకుంటాను."
    చలపతి ఎగిరిపడ్డాడు.
    "నేను బి.ఏ. పాసవటమేవిఁటి? నాకు చదువబ్బదు."
    "మహరాజులా అబ్బుతుంది. నేను సహాయం చేస్తానుగా!"
    "చదువా?" దిగాలుపడిపోతూ అన్నాడు చలపతి. ఉమ కిలకిల నవ్వింది.
    "చదువంటే కష్టమనుకుంటున్నారేవిఁటీ? అలవాటు లేక అలా అనుకుంటున్నారు కాని అలవాటైతే అసలేదో ఒకటి చదవటం మానలేరు. ఆ అలవాటు నేను చేస్తానుగా!"
    ఉమ మాటలు నిజమా అబద్దమా అని ఆలోచించగలిగే శక్తి లేదు చలపతికి.
    "నేను చదువుతానా?"
    "ఇంకొక్క అయిదుసంవత్సరాలలో మీరు బి.ఏ. పాసయి తీరతారు." దృఢంగా అంది ఉమ.
    "నేను మెట్రిక్ పదిసార్లు ఫెయిలయ్యాను."
    "ఈసారి ఫెయిల్ కానీయను."
    "అమ్మా వాళ్ళు 'రాత్రేం జరిగిందిరా' అంటే ఇదంతా చెప్పనా?"
    ఉలిక్కిపడింది ఉమ.
    "వాళ్ళకెందుకు చెప్పటం? భార్యాభర్తలమాటలు భార్యభర్తల మధ్యే ఉండాలి."
    "మరి అమ్మ 'రాత్రేం జరిగిందో నాకు చెప్పాలిరోయ్! అది పెంకెతనం చేస్తే నన్ను పిలు' అంది" అమాయకంగా అన్నాడు.

 Previous Page Next Page