Previous Page Next Page 
శారద పేజి 25


    "కాదండీ చిన్నక్కా! మీరు తప్పటడుగు వేస్తున్నారు."

    "కాదు, ఇదే సరియైన మాట మనవంటి వాళ్ళకు" అని నిబ్బరంగా పలికింది శారద. "అన్నీ తెలిసే రవి ఇందుకు పూనుకున్నప్పుడు చోద్యం కానిది, కూడనిది ఏమీలేదు. రవి ఇంతటి అభినందనీయుడా!"

    ఇప్పటికి రాగిణి కృతనిశ్చయురాలైంది. ఒడిలోంచి లేచి కూర్చుని తన ఎర్రబారిన కళ్ళతో శాంతంగా, దృఢంగా ఎదుటి స్త్రీవైపు చూపులు బరిపింది. మళ్ళీ తృటిలో నిశ్చయం అందించిన విజయగర్వంతో కనులు మెరిశాయి. "చిన్నక్కా!" అంది దిటమైన స్వరంతో "నాకొక ప్రమాణం చెయ్యండి."

    "ఏమిటి?" అంది ఆమె ఒకింత చింతించి.

    "మీ ఔచిత్యానికి భంగం తీసుకువచ్చే నీచురాల్ని కాదునేను. నేను చెప్పినట్లు చేస్తానని ప్రమాణం చెయ్యండి..."

    శారదకు ఏమీ పాలుపోలేదు. ప్రమాణం చేసింది.

    ఇంచుమించు చీకటి పడుతుండగా రవి లోపలకు ప్రవేశించినప్పుడు చిన్నక్క చెదిరిపోయివున్న జుత్తు చక్కగా రాగిణి దువ్వుతూ "మీరు స్వంత విషయాలపట్ల కూడా ఇంత నిర్లక్ష్యం చేస్తే నాకు చాలా కష్టంగా వుంది సుమండీ! మీరు మంచిదుస్తులు వేసుకుని, చక్కా తలదువ్వుకుని, శిగలో పూవులు తురుముకుని నాముందు నిల్చుంటే కనులపండుగగా సందర్శించాలని వుంది. నాకోరిక ఎప్పుడు తీరుస్తారో చెప్పండి?" అంటూన్న దృశ్యం కనబడి, అతని ఆలోచనలను తారుమారు చేసి చకితుడ్ని గావించింది.

    "ఎప్పుడు వచ్చారు? చూడనేలేదు" అని రాగిణి తల ఎత్తి చూసి ఊరుకుంది. శారద అంది 'రా రవీ! ఇంత ఆలస్యం చేశావు ఏం?"

    అతను నిల్చున్న ప్రదేశంలోనే వుండిపోయి "ఏం చేశానో నాకు తెలియదు. మరి యిహ పోదామా?" అన్నాడు.

    "సరే"నంటూ ఆమె అందుకాయత్తపడుతుంటే రాగిణి బలవంతంగా కూర్చుండజేసి "పూర్తికానీయండి" అంది. చేసేదిలేక చిన్నక్క మెదలకుండా కూర్చుండిపోయింది.

    "కూర్చోండి" అంది రాగిణి రవిని.   

    "ఇక్కడ కూర్చుంటే ఎంతసేపటికి లేస్తానో నాకు తెలియదు. చిన్నక్కనే ఇంతసేపు మైమరపించి కూర్చోపెట్టేశావంటే నీ శక్తి కొనియాడతగిందే..."

    రాగిణి అతనివంక తీక్షణంగా చూసింది. ఎందుచేతనో అతను పూర్తిగా అధీరుడైవున్నాడు. "మీగురించి అంతా తెలిసింది లెండి. నాకు చెప్పకుండా చాలా విషయాలు దాచారుటగా?" అంది.

    రవి తొట్రుపడి ఎలాగో నిలద్రొక్కుకుని 'గడుసుతనం మాను. నువ్వే ఏదో దాచేశావు. చిన్నక్కకే నేనెన్నో క్షమాపణలు చెప్పుకోవాల్సివుంది. ఆమెకు తెలియనంతటి రహస్య ప్రవర్తన నావల్ల జరిగినందుకు.'

    వీళ్ళిద్దరి పసివాళ్ళకన్నా తీసికట్టుగా వున్న మాటలు విని శారద నవ్వనూలేదు. గంభీరముద్ర దాల్చనూలేదు- ఏదో ఆలోచిస్తోంది.

    చిట్టచివరకు ముగ్గురూ గుమ్మందాకా వచ్చారు. రవి చిన్నక్కతో సహా బయటకు వచ్చాడు. రాగిణి అవతలే నిలబడిపోయి - మరిచిపోకండి చిన్నక్కా తిరిగి ఏనాటికైనా మిమ్మల్ని సందర్శించగలుగుతానో లేదో? అయినా ఎటువంటి పరిస్థితుల్లోనో?" అంది.

    కారులో ఎక్కబోతూ శారద వెనుదిరిగి చూసి "ఎంతమాట! తప్పకుండా కలుసుకుందాం. అదీ ఇలాగే సంతోషదాయకంగా వుంటుందని వాంఛిస్తాను.

    "సంతోషదాయకం! అవునవును" అంటూ రాగిణి అక్కడే నిలబడి చూడసాగింది.

    రవి మనస్సు ఏమీ స్థిమితంగా లేదు. అవ్యక్తాందోళన ఒకటి అతన్ని ధీమాగా కృంగదీస్తోంది. చాలాసేపు రాగిణితో ఓ మాట చెప్పాలని తటపటాయిస్తూ వుండిపోయాడు. కానీ నోటివరకూ వచ్చిన మాటలు అక్కడే నిలిచిపోయాయి.

    తన అసమర్ధతకూ, ఈ పరిస్థితి వచ్చినందుకూ తనని తాని నిందించుకుంటూ వెళ్ళి కారులో చిన్నక్క ప్రక్కన కూర్చున్నాడు. కారు కదిలింది.

    మలుపు తిరగబోతున్న సమయాన వెనుక అద్దంలోంచి తొంగి చూడగా, రాగిణి ఇంకా అలాగే లోపల నిలబడి తొంగిచూడటం గ్రహించి చివికిపోయిన హృదయంతో ఆమె ప్రక్కన దిటపు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ కూర్చుని మౌనంగా ఊరుకున్నాడు.

    ఇద్దరూ విచిత్రమైన  భావసముద్రంలో మునిగి తేలుతున్నారు. వాళ్ళిద్దర్నీ విడిచివెళ్లాక ఏం జరిగిందో వీశమైనా అతనికి తెలీదు. మధనకూ, తెలుసుకోవాలన్న ఉబలాటానికి ఏమీ లోటులేదు. కానీ చిరుగాలైనా వీచని సమయంలో తన సౌందర్యాన్నీ, సౌకుమార్యాన్నీ కానరాకుండా కప్పిపుచ్చుతూ చెదరక నీలిమేఘంగా వున్న ఆమె గంభీరతను చూసి జంకుతూ కూర్చున్నాడు. కొంతసేపు గడిచాక అదీ సాగలేదు.

    "చిన్నక్కా! రాగిణి గురించి నువ్వేమనుకుంటున్నావు?" అన్నాడు ఏదోక్షణాన తనకు తెలియకుండానే.

    శారద ఏమీ పలకలేదు . చూడనుకూడా చూడలేదు.

    "ఆమె చాలా విచిత్రవ్యక్తి కదూ?"

    శారదలో మార్పులేదు.

    "తెలివితేటలు గలదికూడా అనుకుంటాను?"

    అప్పటికీ ఆమెనుంచి ఏమీ ప్రత్యుత్తరం రాలేకపోయేసరికి ఓరిమి నశించి ఆమెవైపు తిరిగి "చాలా మంచిది. ఏం?" అన్నాడు.  

    శారద ఆశ్చర్యంగా అతనివైపు తిరిగింది. రెప్పవాల్చకుండా కొన్ని క్షణాలు పరికించి "అవునుగావును" అంటూ మళ్ళీ తన ఎప్పటి ధోరణిలో పడిపోయి ఆలోచనలలో మునిగిపోయింది.

    రవి సిగ్గుతో కుమిలిపోయాడు. చప్పున వేగంగా పోతూన్న ఈ కారునుంచి క్రిందకు దూకేసి ప్రాణాలతో బయటపడి, ఎ మారుమూలకో పారిపోయి తల మాత్రం కనిపించకుండా దాచుకుంటే బాగుండును. ఏదైతే చేయకూదడను కున్నాడో అది చేస్తున్నాడు. ఏమైతే ప్రేలకూడదనుకున్నాడో అది ప్రేలుతున్నాడు.

    హాస్పిటల్ కి చేరేసరికి ఏడుదాటింది. ఆమె హడావుడిగా తీవ్రమైన గుండె అదటుతో లోపలకు ప్రవేశించి చూసేసరికి గోవిందరావుగారు కళ్ళు తెరిచి పడుకుని దిగులుగా వున్నారు.
 
    చప్పుడువిని తల ప్రక్కకి త్రిప్పిచూసి "వచ్చావా! గంటసేపటినుంచి తపించిపోతున్నాను. పాడునిద్ర ఇంకా కాసేపు అలా వుండిపోయినా బాగుండేది" అన్నాడు ముఖం ఇంత చేసుకుని.

 Previous Page Next Page