Previous Page Next Page 
శారద పేజి 24


    ఆమె చకచక అక్కడ్నుంచి లోపలకు వెళ్ళి గుమ్మం అవతల నిలబడింది. రాగిణి కుంపటిముందు కూర్చుని విసురుతోంది. ఈ వ్యక్తి లోపలికి వచ్చిన సంగతి ఆమె చూడలా. అలాగే పొగమంచు సతమతమవుతూ "ఏమిటండీ చిన్నక్కా! జవాబు చెప్పరా ఏం?" అంది గొంతు కాస్త పెద్దది చేసి.

    "నేనిక్కడే వున్నానమ్మా రాగిణీ!"

    రాగిణి తటాలున వెనుదిరిగి అతివేలమైన సంభ్రమంతో "మీరు పేరుపెట్టి పిలిస్తే ఎంత చక్కగా ఉంది?" అని ఇంకా ఏదో అనబోతూ, ఆమె వదనంలోకి నిదానించి చూసినమీదట తృళ్ళిపడి "ఇదేమిటి? మీలో ఏదో తీవ్రమైన మార్పు కనిపిస్తూందే?" అంది ఆవేదనతో.

    "అబ్బే, ఏముంది?" అంటూ శారద తప్పించుకుందామని ప్రయత్నిస్తూ, రాగిణి ఎంత వారిస్తున్నా అక్కడే చతికిలపడి "ఇహ చెప్పు? మళ్ళీ నిన్ను ఎప్పుడూ కలుసుకోలేనేమోనని నాకు భయంగా వుంది. అంతరంగికంగా కబుర్లాడుకుందాం" అని పలికింది.

    "కానీ నన్నేమీ చెప్పనియ్యటం లేదుగా?"

    "అవును. అది మినహాయించి చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. రాగిణీ! నాకు అక్కవుంది, తమ్ముడు వున్నాడు. కానీ చెల్లెలు లేదు. నీలాంటి చేల్లెలుంటే ఎంత బాగుండునో అని మనసు ఉవ్విళ్ళూరిపోతోంది."

    చప్పున రాగిణి నేత్రాలు చలించాయి. దానిని కప్పిపుచ్చుకోవటానికి శతవిధాలా ప్రయత్నిస్తూ "ఇప్పుడు మాత్రం మించిపోయిందేం వుంది? మీకంటే నాకు ఆప్తురాలైన అక్క ఎవరు ఉన్నారు?" అని తృప్తిగా నిట్టూర్పు విడిచింది.

    "ఈ మాటనిజమే. అయినా నిన్నో విషయం అడుగుదామనుకుంటున్నాను."

    "అయ్యో! మీకింత అనుమానం ఎందుకు? నేను ఒట్టి పనికిమాలినదాన్ని. సంకోచించవలసిన పనిలేదు."

    "దానివల్ల నీకు బాధ కలుగుతుందేమో?"   

    "బాధా?" అని నిర్లక్ష్యంగా నవ్వి "అదంటే నాకట్టే భయంలేదు. నేను కష్టాలుపడిన వ్యక్తినని చెప్పుకోను. ఎందుకంటే నాకు తినడానికి ఇంత వుంది. ఆకలి అన్నది ఎరుగను. ఇంక ఎవరు ఒప్పుకుంటారు? ఈ వ్యక్తి జీవితం కష్టాలమయమనీ, నికృష్టమనీ.... అంతేకాక "ఒంటరికత్తె దానికేం?" అని మా ఇంటిప్రక్క కాపురముంటున్న దంపతులు నేను వినేటట్లు చాలాసార్లు అన్నారు."

    "నువ్వు ఎంత త్రోసిపుచ్చుదామనుకున్నా నీ ముఖం చెబుతూవుందిలే. తోటిస్త్రీని నేను అర్ధంచేసుకోగలను. కానీ నువ్వంత మంచిపని చేయలేదమ్మా."

    శారద చలించలేదు. నిగ్రహంకూడిన కంఠంతో ఇలాఅంది "ఏ అధమపు ఘడియల్లోనైనా నువ్వు దేన్నో సుఖం అనుకుని భ్రమించావంటే నువ్వు జీవితం అంతా పశ్చాత్తప్తురాలవౌతావు. కనీసం ఇప్పుడు లభిస్తున్న ఆనందం కూడా అప్పుడు లభించదు. కానీ నీలాంటి అభాగినిని చూసినప్పుడు కొంత పెద్దదాన్ని అయివుండి కూడా నీకు ఏ సలహా చెప్పాలో తెలియటంలేదు రాగిణీ! నేను ఒకానొక పనిచేసివుంటే ఈనాడు నా బ్రతుకు హేయమూ, దుర్భరమూ అయి వుండేదన్న నమ్మకం ప్రబలిపోయింది. అసలు పిచ్చితల్లీ! ఈ ప్రేమలో నువ్వెందుకు ఇరుక్కున్నావమ్మా?"

    "ప్రే...మ ...." రాగిణికంఠం వణికింది. పంచప్రాణాలూ బిగబట్టుకుని సంశయాన్ని పూర్తిగా నిర్మూలనం కావించుకుని అంది. "ఆయనగారి తెలివి తేటలు అసాధారణమైనవని చెప్పనక్కర్లేదు. ఇప్పుడు నాకు ప్రతిదీ సుబోధకంగా తేటతెల్లం అవుతోంది. కానీ ఈనాడు ప్రపంచంలోకి మిమ్మల్ని ఎందుకు తీసుకువచ్చి తమని తాము కించపరచుకున్నారో ఊహించటం నా శక్తికి మించిన పని. మీరు ఇందాక అన్నదే సరియైనమాట. మళ్ళీ మనం ఎప్పుడూ కలుసుకోవద్దు" అంది రుద్ధకంఠంతో. "కానీ మీరు తప్పుమార్గంలో ఎందుకు ఊహించారు? నేను ఎప్పటి రాగిణిగానే జీవితాంతం ఉండిపోతాను చూస్తూ ఉండండి" అంది.  

    "కానీ భగవంతుడు ఇన్ని చిక్కుపరిస్థితులు ఎందుకు సృష్టిస్తాడు? రవి నాకు కేవలం సన్నిహితుడిగానే వుండి, ఆప్తుడుగాకుండా వుంటే ఎంత సంతోషించేదాన్నో ఈ సమయంలో. కానీ......" ఆమె ఊపిరి బిగబట్టింది. తర్వాత నెమ్మది నెమ్మదిగా శ్వాసవిడుస్తూ అంది. "నాకు జ్యోతిషం తెలియదు. రేపు వాడు నాదగ్గరకు వచ్చి "చిన్నక్కా!" అంటూ ఏదో అడుగుతాడు. అప్పుడు నేను ఏమంటానో తెలుసా రాగిణీ? కఠినంగా మాట్లాడుతున్నానని కోపం తెచ్చుకోకు. ఈ సందర్భంలో నీవుకాక మరెవరయినా వుండి వున్నట్లయితే ఏం చెప్పేదాన్నో తెలియదు. బహుశా వాడంటే నాకున్న నిశ్చలమైన జాలే నా నోటినుంచి మారుమాట పలికింపజాలదు. "నాయనా! నీ ఇష్టం."

    "ఓహో!" అని తల పంకించి మరుక్షణంలో రాగిణి నిరుత్తరురాలైపోయింది. చేస్తున్న పని ఆపివేసి, చేతిలోని విసనకర్ర అవతలకు గిరాటేసి "చిన్నక్కా!" అంటూ ఆవేశంగా ముందుకు వచ్చింది.

    అప్పుడు ఏం జరిగిందో తెలియదు. కానీ రెండు నిముషాలు గడిచాక రాగిణి చిన్నక్క ఒడిలో తల పూర్తిగా ప్రచ్ఛాదనం చేసుకుని, వలవల ఏడుస్తూ "నిజమే, నేను పాపిని. తప్పు చేశాను" అంటూ ఏడుస్తోంది మధ్య మధ్య.

    చిన్నక్క తన మృదుహస్తంతో ఆమె నోరుమూసి "అలా అనకు. రవితో నేను ఈ విషయం చెప్పి తీరతాను" అంది, ముందుకువంగి "నీముందే!"

    "ఉహుఁ వద్దు. మీరలా చేశారంటే మీకళ్లముందే నేను ఉరిపోసుకుని చచ్చిపోతాను. అలా జరగటానికి వీల్లేదు. సిగ్గులేక మీ ఒడిలో పడుకున్నాను గానీ ఆ అర్హత నాకువుందా? ఇహ వినండి, మీరు ఏం చేసినాసరే! నానోరు కట్టివెయ్యలేరు. నేను వితంతువును. అంతేకాక పతితను. ఈ పవిత్రమైన అనురాగం నా ఈ నోచపు బొందిలో ఛీ......ఎలా ప్రవేశించిందో? నన్ను చీదరించుకోరేం మీరు? నేను - చిన్నక్కా!" అంటూ రాగిణి బావురుమని ఏడుస్తూనే పసిపాపలా తన చేతుల్తో ఆమెను వదల్లేనంత బిగువుగా చుట్టేసింది.

    "చాల్లే!" అంది శారద కోపంగా. "ఇటువంటి పిచ్చిమాటలు మాట్లాడావంటే నిన్ను తప్పకుండా చీదరించుకుంటాను. నా వెనుకటి అభిప్రాయం చితికిపోయిందిలే రాగిణీ! నిన్ను రవి స్వీకరించేటట్లు  చేసే పూచీ నాది" ఆమె ఇంకా వదలకపోయేసరికి "ఎందుకు ఏవో పేర్లుపెట్టుకుని నిన్ను నువ్వు నిందించుకుంటావు? మనస్ఫూర్తిగా అంటున్న నా మాటలు నమ్ము. నా కళ్ళకు నువ్వెంతో పవిత్రురాలివై కనిపిస్తున్నావు. నీది నిష్కల్మషమైన హృదయమని నాకంటే మిన్నగా ఎవరూ గుర్తించలేరు. నీలో నేననుకున్న ధైర్యం లేదేమోనన్న అనుమానం తప్ప మరొకటి నాకులేదు రాగిణీ! నీవు నాచేత ఊరికినే వాగించి నన్ను కఠినురాల్ని చేయకు" అని చివరిమాట గద్దించి పలికింది.

 Previous Page Next Page