Previous Page Next Page 
జనవరి 5 పేజి 25

 

      "ఏమిటది?"
   
    "నువ్వు సన్నగా వుంటావు గదా!"
   
    "ఉంటే....?"
   
    "నిన్ను చూస్తే చాలు భారతదేశం ఎంత బీదదేశ మనేది తెలిసిపోతుంది" అంది అతన్ని కావాలని వుడికిస్తూ.
   
    "నిన్ను చూస్తే దానికి కారణం ఎవరన్నది తెలిసిపోతుందిగా...." అన్నాడు అభిరామ్ ఆమెను వుడికించాలని.
   
    ఒక్కసారి ఫక్కున నవ్వింది క్రాంతి.
   
    అలా కాసేపు నవ్వుతూనే వుండిపోయింది.
   
    "నీకు సెన్సాఫ్ హ్యూమర్ లేదనుకున్నాను. నా అభిప్రాయం తప్పే అయితే..." అంది నవ్వును బలవంతాన ఆపుకుంటూ.
   
    అభిరామ్ కూడా నవ్వాడు.
   
    వాళ్ళు ఓ కాలువను దాటేందుకు బ్రిడ్జికేసి నడుస్తుండగా కెవ్వున కేక వినిపించింది.
   
    ఇద్దరూ ఉలిక్కిపడి కాలువ ఒడ్డుకేసి పరిగెత్తారు. ఓ అమ్మాయి కాలువలో పడి హెల్ప్ హెల్ప్ అంటూ అరుస్తోంది. చుట్టూ మూగిన జనం హాహాకారాలు చేస్తున్నారే తప్ప రక్షించే ప్రయత్నం చేయటం లేదు.
   
    క్రాంతి ఏదో అభిరామ్ కి చెప్పే ప్రయత్నం చేస్తుండగా ఎవరో నీళ్ళలో పడిన శబ్దం వినిపించింది.
   
    వెంటనే అటుకేసి చూసారు.
   
    ఓ వ్యక్తి నీళ్ళలో పడిన అమ్మాయిని రక్షించి కాలువ ఒడ్డుకు తీసుకువచ్చాడు.
   
    "ఛా....ఛా... మంచి అవకాశం పోగొట్టుకున్నావు. అతను చూడెలా రక్షించాడో? అతన్ని బాయ్ ఫ్రెండ్ ని చేసుకున్నా బాగుండేది" అంది క్రాంతి కొంటెగా.
   
    నీళ్ళలో పడిన అమ్మాయిని రక్షించిన వ్యక్తి సీరియస్ గా, అందరికీ వినిపించేలా "ఎవరయ్యా నన్ను నీళ్ళలోకి తోసింది-" అంటూ కోపంగా అరిచేసరికి-
   
    క్రాంతికి పిచ్చెక్కిపోయింది.
   
    అభిరామ్ పెద్దగా నవ్వుకుంటూ ముందుకు కదిలాడు.
   
    అభిరామ్, క్రాంతి తాముండే రూమ్స్ దగ్గరకు వస్తూనే ఇరువేపులకు చూసి ఆశ్చర్యపోయారు.
   
    రెండు గదులకూ తాళాలు వేసి వున్నాయ్.
   
    "మీ అక్క, మా అన్న కలిసి ఎక్కడికయినా వెళ్ళి వుంటారా?" క్రాంతి ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అంది.
   
    "దీనికంతటికీ నువ్వే కారణం- కబుర్లలో పెట్టి ఆలస్యం చేశావు" అన్నాడు అభిరామ్ చిరుకోపం ప్రదర్శిస్తూ.
   
    "సర్లే! ఇప్పుడేం చేద్దాం?" అంది.
   
    "నువ్వెళ్ళి నీ గది ముందు, నేవెళ్ళి నా గది ముందు కూర్చుందాం" అన్నాడు అభిరామ్ తన గదికేసి కదులుతూ.
   
    క్రాంతి మూతిని మూడు వంకర్లు తిప్పుతూ తన గదికేసి వెళ్ళింది.
   
    ఇద్దరూ ఎవరి గది ముందు వారు కూర్చున్నారు.
   
    కొద్ది క్షణాల తరువాత క్రాంతి అభిరామ్ కేసి చూసింది.
   
    అతను ఎటో చూస్తూ కనిపించాడు. క్రాన్తి నిట్టూర్చింది. ఇంకొద్ది క్షణాలకు అభిరామ్ క్రాంతికేసి చూసాడు.
   
    క్రాంతి ఎటో చూస్తూ కనిపించింది. అతను నవ్వుకున్నాడు. ఈలోపు యింటి ఓనర్ కూతురు కాళ్ళ కడ్డుపడుతున్న పట్టు పరికిణీని చేత్తో పైకి లాక్కుంటూ పరుగు పరుగున అభిరామ్ దగ్గరకు వచ్చింది.
   
    "మీ సిస్టర్, ఎదురింటి గదిలో వుండే అబ్బాయి ఇప్పుడే ఎక్కడికో వెళ్లారు. మీరొస్తే భోంచేసి వస్తామని చెప్పమన్నారు. అవునూ! ఇంతసేపు వున్నారెందుకు?" అని అడిగింది.
   
    అభిరామ్ వేలెట్టి రోడ్డుకి ఆవల వున్న గది ముందు కూర్చున్న క్రాంతిని చూపించాడు.
   
    ఆ అమ్మాయి క్రాంతికేసి చూసింది. క్రాంతి అభిరామ్ కేసే చూస్తూ వుండటాన్ని గమనించింది. ఆపై చిన్నగా నవ్వి "గిట్టుబాటు సీన్లా" అంది ఏదో అర్ధం చేసుకోగలిగినట్లుగా ఫోజు పెడుతూ.
   
    "గిట్టుబాటు సీన్లా! అంటే?" అభిరామ్ ఆ అమ్మాయి కేసి ఆసక్తిగా చూస్తూ అడిగాడు.
   
    "ఓసోస్! నీకు తెలీనట్లు అదసలు మీ మగవాళ్ళు వాడే మాటేగా?" అంది కళ్ళను చక్రాల్లా తిప్పుతూ.
   
    "మగవాళ్ళు వాడేదా? నిజంగా నాకు తెలీదు ఏమిటది?" అభిరామ్ ఆ అమ్మాయి చురుకుదనాన్ని గమనిస్తూ అడిగాడు.
   
    "మీరు ఏదయినా ఇంగ్లీష్ సినిమాకి వెళ్లేముందు అందులో ఏమయినా గిట్టుబాటు సీన్లున్నాయా అని అనుకుంటారు. గిట్టుబాటు సీన్లు అంటే తెలుసా? అదీ చెప్పాలా?"
   
    "చెప్పాలి" అన్నాడు అభిరామ్ చిన్నగా నవ్వుతూ.
   
    "మిమ్మల్ని బాగుచేయటం నా వల్ల కాదు బాబూ! ఏం కుర్రాళ్ళో ఏమిటో? బొత్తిగా ఏమీ తెలీవు. చెప్పలేక నేను చచ్చిపోతున్నాను. చెప్పక తప్పదా?" అంది అలసిపోయినట్లు ఫీలవుతూ.
   
    "తప్పదు" అన్నాడు అభిరామ్.
   
    "టాప్ లెస్.....అందులో హీరోయిన్ టాప్ లెస్ గా కనిపిస్తుందా లేదా అని...."
   
    అంది అభిరామ్ ప్రక్కనే చతికిలబడుతూ.
   
    అభిరామ్ కి విషయం అర్ధమయి ఒక్కసారి పెద్దగా నవ్వాడు.
   
    అతని నువ్వుచూసి క్రాంతి ఉలిక్కిపడింది. ప్రక్కనే వున్న అమ్మాయిని చూసి ఉడుక్కుంటూ లేచి వేగంగా ఇటుకేసే రాసాగింది.
   
    ఆ అమ్మాయి కచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తోంది. లేదంటే నేను మీ ప్రక్కన కూర్చోగానే విసురుగా లేచి యిటుకేసే రాదు. వస్తాను - నాకు మరో ప్రాబ్లమ్ వుంది. నేను మీ పక్కన కూర్చునుండగా నా బాయ్ ఫ్రెండ్ చూస్తే అవీ-యివీ కొనిపెట్టడు" అంటూ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయిందా అమ్మాయి.
   
                       *    *    *    *    *
   
    "అయితే మీరూ అక్కడకు వెళ్ళారన్న మాట..." మేఖల అడిగింది.
   
    "ఔను ఆ ప్రకటనలో ఏదో విశేషముందనిపించింది. ఒక రాయి వేసి చూద్దామనిపించి వెళ్దాం" అన్నాడు విమల్.
   
    ఆ యిద్దరూ ఇప్పుడు ఓ హోటల్ లో ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు.
   
    "మీరెంత తీసుకున్నారు?" మేఖలకు విమల్ ఒక ఎనిగ్మాగా కనిపిస్తున్నాడు.
   
    తాను అందగత్తెనని తనను చూసినవాళ్ళు మెచ్చుకోవడం కాదు. తనకూ నమ్మకమే. తనను చూసిన వాళ్ళెవరూ వెంటనే దృష్టిని మరల్చుకోలేరు. అదీ తనకు తెలుసు. కాని..... ఇతనేమిటి ఎటో చూస్తూ తనసలు స్త్రీయే కానట్లుగా బిహేవ్ చేస్తాడు?" ఆలోచనలు పూర్తవగానే ఆమెకు విమల్ మీద అంతకు ముందే కలిగిన ఆసక్తి రెట్టింపయ్యింది.
   
    "యాభై వేలు..." అన్నాడతను ఏదో ఆలోచిస్తూ.
   
    "మరి నేనెంత తీసుకున్నది అడగరేం?"
   
    "చెప్పండి."
   
    "లక్ష."
   
    "ఏం చేస్తారా లక్షతో?" చాలాసేపటికి ఆమెకేసి చూస్తూ అడిగాడు.
   
    "నాకు చేతనైన చిన్న బిజినెస్ ను ప్రారంభిస్తాను. రాత్రింబవళ్ళు శ్రమించి దానిని వృద్దిలోకి తీసుకువస్తాను. నా  ద్వారా మరికొందరు నిరుద్యోగులకు దారి చూపిస్తాను. నా పరిధిలో నాకు తోచింది. నేను చేయగలిగింది అదొక్కటేనని నా అభిప్రాయం" అంది మేఖల.
   
    ఆ యిద్దరి మధ్యా ఒకింతసేపు నిశ్శబ్దం అలుముకుంది.
   
    "మరి మీరేం చేస్తారో చెప్పలేదు" నిశ్శబ్దాన్ని చీలుస్తూ అడిగింది మేఖల.
   
    "డబ్బు చేతికొస్తే కొందరు జల్సా చేస్తారు. వాళ్ళు జీవితాన్ని తేలిగ్గా తీసుకుంటారు. మరికొందరు వ్యసనాలకు ఖర్చు చేస్తారు. వాళ్ళు బలహీనులు. ఇంకొందరు ఏం చేయాలో తెలీక వృధా చేస్తారు. వాళ్ళు  తెలివిహీనులు. ఉన్న డబ్బంతా ఖర్చయ్యే వరకు దేనిగురించీ ఆలోచించరు మరెందరో వాళ్ళు సోమరిపోతులు. ఉన్న డబ్బుతో చిన్న వ్యాపారాన్ని ఆరంభించి అభివృద్ధిలోకి వెళ్ళేందుకు మీలాంటి వాళ్ళు ప్రయత్నిస్తారు."
   
    "ఈ మార్గాలేవీ నాకు రుచించటం లేదు" విమల్ ఒకింత నిరాశగా అన్నాడు.
   
    ఆమెకో క్షణం ఆశ్చర్యం వేసింది.
   
    "మరి మీరే మార్గాన్ని ఎన్నుకోవాలనుకుంటున్నారు?"
   
    "నా దేశ సమస్యకి, తిరోగమన విధానాలకు, పేదరికానికీ, నిరుద్యోగానికి శాశ్వత పరిష్కారాన్ని చెప్పి, ప్రపంచ దేశాల సరసన మనదేశం తలెత్తుకు నిలబడేలా చేయాలని వుంది" అన్నాడు ట్రాన్స్ లో వున్నట్లుగా విమల్.

 Previous Page Next Page