ఇనస్పెక్టర్ తనలో తనే ఏదో గొణుక్కుంటూ ఆ కంప్లెయింటు వైపు చూశాడు. తరువాత బెల్ కొట్టి జవానుని పిలిచి, హాస్టల్ కి వెళ్ళి మురళీ అనే అబ్బాయిని పిలుచుకు రమ్మన్నాడు. జవాను వెళ్ళిపోగానే "మీకు నిశ్చయంగా తెలుసా ? మీ ఇంటికి వచ్చినతని పేరు మురళికృష్ణ అని?" అని మళ్ళీ ఇంకొకసారి అడిగాడు.
"తెలుసు. మా అమ్మాయి చెప్పింది."
"ఆమెనోసారి పిలిపించండి__"
నరసింహం కోపంగా, "అమ్మాయిని పోలీస్ స్టేషన్ కా? ఎందుకు?" అని అడిగాడు.
"మీరు చెప్పే మురళి నిన్నరాత్రి తొమ్మిదిన్నర నుంచీ పన్నెండింటి వరకూ ఇక్కడే వున్నాడు కాబట్టి-"
"వ్వాట్ ?" అని నరసింహం నోరు తెరిచాడు.
ఈ లోపులో మురళి వచ్చాడు. "ఏం సార్ పిలిచారుట. వాడు దొరికాడా ?"
"నీలాగే తిరుగుతున్న వాడి సంగతేనా నువ్వు చెప్పేది. వాడు ఈసారి నీ ప్రాణాలమీదకే తెచ్చాడోయ్. ఇదిగో ఈ నర్సింహంగారి కూతురితోనే నీ పేరుమీద రొమాన్సు మొదలుపెట్టాడట."
నరసింహం ఉలిక్కిపడి- కోపంగా, "రోమాన్సేమిటి నాన్సెన్స్ ! వచ్చి మాట్లాడాడంతే" సరిదిద్దాడు.
"ఎవరు రాధతోనా ?" అదిరిపడి మురళి అన్నాడు.
"అవును. అందుకే నిన్ను అరెస్టు చేయమంటున్నాడు."
"ఇనస్పెక్టర్ గారూ! మీరు వెంటనే వాడిని పట్టుకోవాలి. లేకపోతే మరెన్ని ఘోరాలు చేస్తాడో వాడు" మురళి అంటూండగా రామలింగం వచ్చాడు.
"ఎవరో పోలీసు వచ్చి హాస్టల్ నుంచి మురళిని పిలిచికెళ్ళాడంటే కంగారుగా వచ్చాను. ఏమిటి సంగతి?" అంటూ నర్సింహాన్ని చూసి, "ఏం బావా ఇలా వచ్చావ్ ?" అని అడిగాడు.
ఇనస్పెక్టర్ జరిగినదంతా చెప్పి, "ఆ టైమ్ లో ఈ అబ్బాయి న దగ్గరే వున్నాడని బల్లగుద్ది చెప్పగలను" అన్నాడు.
"మొన్న మంగలి షాపులో ఇదే గొడవైంది కదూ !"
"అవును సార్ ! నా పేరు మీద వాడు అప్పులు కూడా తీసుకున్నాడు. అందుకే పోలీస్ కంప్లెయింటు ఇవ్వటానికి నేను నిన్నరాత్రి ఇక్కడకు వచ్చాను. అది చూచి వాడు అక్కడికి వెళ్ళి నా రాధతో ..."
"నీ రాధతో ఏమిటోయ్ ? బొడ్డుకోసి పేరు పెట్టావా ?" అరిచాడు నర్శింహం.
"లేదు. కానీ చేతిలోకి చెయ్యి తీసుకుని ప్రామిస్ చేశాను. చిన్నప్పుడే పెళ్ళి చేసుకున్న మేము, అదృష్టవశాత్తు తిరిగి కలుసుకున్నాము. ప్రేమించుకున్నాము. ఈసారి నిజం పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాము."
నరసింహం కుర్చీలోంచి చివాలున లేచి, "ఇనస్పెక్టర్ గారూ" ఆ తుపాకీ ఇలా ఇవ్వండి. వీడిని షూట్ చేసి పారేస్తాను" అన్నాడు.
"ఇది పోలీస్ స్టేషను ... బాటిల్ ఫీల్డ్ కాదు ... మీ మే గొడవలు బయటకెళ్ళి తీర్చుకోండి- పోతే మీరిచ్చిన కంప్లెయింటు మీద చర్య తొందర్లోనే తీసుకుని, నిన్నరాత్రి మీ ఇంటికొచ్చిన వాడిని తప్పక పట్టుకు తీరతాం. ఆ దొంగా, ఈ మురళీ ఒకేలా వుంటారు కాబట్టి, ఈ మురళి ఫోటో పేపర్లో వేసి, ఫలానా రోజు రాధ అనే అమ్మాయితో రాత్రి పదింటికి బాల్కనీ మీద..."
"ఆపండీ !" అని అరిచి, ఇనస్పెక్టర్ చేతిలో కాగితం లాక్కున్నాడు నరసింహం. "మీరేం చెయ్యనవసరంలేదు. ఇది ప్రైవేటు వ్యవహారం నేను చూసుకోగలను" అంటూ బయటకు నడిచాడు.
వెనుకే రామలింగం బయల్దేరాడు.
"బావా ! నువ్వు ఆవేశపడి మొత్తం వ్యవహారాన్నంతా పాడుచేస్తున్నావు. ఈ మురళి ఎవరనుకుంటున్నావు? చిన్నప్పుడు మన రాధ మెడలో దండ వేసినవాడే..."
"అయితే అవ్వొచ్చు గాక. గాలికి తిరిగే దిమ్మరికి నా కూతుర్ని ఇమ్మంటావా ?"
"ఇవ్వటం ఏమిటి బావా? పదిహేను సంవత్సరాల క్రితమే ఇచ్చేశావు. ఇప్పుడు కాదంటే ఆ మురళి ఊరుకుంటాడా? అందర్నీ బజారుకి లాగుతాడు. పోనీ నీ కూతురేమైనా తక్కువ తిన్నదా అంటే అదీలేదు. దానిచేత తిరిగి నుదుట బొట్టు పెట్టించటానికి ఎంత కష్టపడ్డామో నువ్వే ఆలోచించు. అటువంటిది అదృష్టవశాత్తు తిరిగి తన మొగుడ్ని కలుసుకుంది. ఇప్పుడు నువ్వు కాదంటే ఏ నుయ్యో, గొయ్యో చూసుకుంటుంది."
నరసింహం ఆలోచనలో పడ్డాడు.
"అంతేనంటావా ?"
"నిశ్చయంగా అంతే !"
"నాక్కొంచెం ఆలోచించుకోవటానికి టైమివ్వు." అంటూ నరసింహం వెళ్ళిపోయాడు. అతడలా వెళ్ళాడో లేదో వెనుకనుంచి మురళి గాలిలా వచ్చి రామలింగం చేతులు పట్టుకుని ఊపేస్తూ "థాంక్స్- థాంక్స్ గురూగారూ! మీ ఋణం ఎలా తీర్చుకోను?" అన్నాడు.
"హాస్టల్ లో మరి నన్ను అల్లరి పెట్టకుండా-"
* * *
ఇంటికి వెళ్ళాడన్న మాటేగానీ నరసింహం దీర్ఘాలోచన్లో వున్నాడు.
ఇన్నేళ్ళ తరువాత, పాతబడి పోయిందనుకున్న సమస్య తిరిగి తలెత్తింది.