"మదన్....చాలా కాలంగా నన్నో ప్రశ్న వేధిస్తోంది.... అడగాలంటే భయం. కోప్పడవు కదూ!"
"ఊఁహుఁ! చెప్పు...."
"పోలీస్ డిపార్ట్ మెంట్ లో ట్రైన్ అయినవాడివి కదా? ఓ హత్య చేయటానికి మరొకరి అవసరం ఏవిఁటి నీకు? తలచుకుంటే ఆ పని నీకు సులువు కాదా?"
"పిచ్చి మొహమాఁ....నా స్థితి అసలే ఆన్సర్టన్ గా వుంది. నా ఉద్యోగం మీ అంకుల్ పుణ్యమా అని తుమ్మితే ఊడిపోయే ముక్కులా వుంది. ఇలాంటప్పుడు నేనే స్వయంగా ఇలాంటి పనుల్లో ఇరుక్కుంటే.... ఇంకేమన్నా వుందా? ఉద్యోగం పోతుందనో మరోటోకాదు నా బాధ.... నా శృతి నాకు దూరం అయిపోదూ?"
తాకవలసిన చోటే తాకిందా మాట ఆమెని.
మత్తుగా అతని ఛాతీపై వాలింది.
"ఇంక నేను వెళ్ళనా?" అడిగింది ఉన్నట్టుండి.
"ఈరోజిక్కడ వుండిపోరాదూ? ఎన్నాళ్ళయ్యింది శృతీ నీతో గడిపి...." ఆత్రంగా అన్నాడు.
రెండు నిమిషాలు ఏదో ఆలోచనలో వుండిపోయింది ఆమె.
"సరే....పార్టీలో లేటై ఫ్రెండింట్లోనే పడుకున్నానని చెప్పేస్తా" అంది చివరికి.
ఆమెను మరింత దగ్గరికి తీసుకున్నాడు మదన్.
* * * *
మత్తుగా జోగి తన భుజంపై వాలిన అంకిత చుట్టూ చేయివేసి ఆమెను దగ్గరగా తీసుకుని నుదురు చుంబించాలన్న కోరికను అతి ప్రయత్నంమీద ఆపుకున్నాడు సిద్ధార్థ.
హైవేమీద దూసుకెళుతోంది కారు.
హఠాత్తుగా ఆగిన కారు కుదుపుకి తృళ్ళిపడి లేచింది అంకిత.
"ఏం జరిగింది?" మత్తుగా అడిగింది.
"ట్రాఫిక్ జామ్ అయ్యింది" నెమ్మదిగా అని కారు డోరు తెరచి దిగి ముందుకి నడిచాడు సిద్ధార్థ.
క్యూలో వరుసగా కార్లు, లారీలు, బస్సులూ ఆగి వున్నాయి.
ఫర్లాంగు దూరం ఆగిన ఆ వాహనాలు దాటి ముందుకెళ్ళాడు. ఎదుటివైపునుండి వస్తున్న ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. జామ్ దాటి కాస్త ఖాళీ దొరగ్గానే రివ్వున దూసుకెళుతున్నాయా వాహనాలు.
జరిగిన యాక్సిడెంట్ చూసి కాసేపు ఆలోచిస్తూ నిలబడిపోయాడు. విచిత్రంగా వుందా దృశ్యం. హైదరాబాద్ లో ఆటోమీది కెక్కేసిన స్కూటర్ ఏక్సిడెంట్ చూసినప్పుడు కూడా అంత ఆశ్చర్యం కలగలేదు అతనికి.
రోడ్డుకి ఎడంవైపు ఇట్నుంచి వెళుతున్న ఓ లారీ దాని ఎడంప్రక్కకి ఒరిగి పడి వుంది. ఎదురుగా వచ్చిన మరో లారీ దాని ఎడంప్రక్కకి అంటే సిద్ధార్థ కుడిప్రక్కకి ఒరిగి పడి వుంది. అవి రెండూ గ్రుద్దుకున్న దాఖలాలు లేవు.
అంకితకా దృశ్యం చూపించాలనిపించి వెనక్కి తిరిగాడు.
నెమ్మదిగా నడుచుకుంటూ వరుసగా నించున్న ఒక్కో వాహనమే దాటుకుంటూ తమ కారు సమీపించాడు.
"భలే విచిత్రమైన ఏక్సిడెంటూ...." అంటూ డోర్ తెరిచి వాక్యం సగంలోనే ఆపి అలా వుండిపోయాడు.
కారులో అంకిత లేదు.
* * * *
గదిలో వాతావరణం స్థంభించినట్టుగా వుంది.
మంచంమీద మదన్, శృతిల నగ్న శరీరాలు నీలరంగు కాంతిలో నిగనిగా మెరుస్తున్నాయి. శరీరాలకి అక్కడక్కడా పట్టిన చెమట బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. శృతి చుట్టూవున్న తన ఎడంచేతిని సుతారంగా వదిలించుకొని సిగరెట్ అంటించాడు మదన్.
"హుం.... చక్కగావున్న వాతావరణాన్ని ఎందుకు 'మాదీ' పాడుచేస్తావా కంపుతో" అతని ఛాతీపైన తలవుంచి ఎడంకాలతని కాలుపైన వేసి గోముగా అడిగింది శృతి.
"నీకేం తెలుసు?" నీ పెదాల అమృతంతో కలిసి ఈ పొగ గొంతు చేరితే స్వర్గంకన్నా ఎక్కువ సుఖంగా వుంటుంది తెలుసా?"
"అబ్బో పోలీస్ ఆఫీసర్ కి కూడా కవిత్వం తెలుసన్నమాట?"
"ఏం? పోలీస్ ఆఫీసర్ మాత్రం మనిషికాడా?" ఆమెను మళ్ళీ ఎడంచేత్తో చుట్టి తనకేసి అదుముకొంటూ అన్నాడతను.
కాసేపు ఇద్దరూ మౌనంగా వుండిపోయారు.
"అవునూ....సాగర్ కర్చీఫ్ ఎక్కడికెళ్ళి వుంటుందంటావ్?"
"అసలతను తెచ్చుకొని ఉండడు"
"లేదు శృతీ....అంత గట్టిగా చెపుతున్నాడంటే...."
"అసలే టెన్షన్ లో వున్నాడు మర్చిపోయి వుంటాడులే...."
ఆమె తనతో చెప్తోందో తనకి తానే చెప్పుకుంటోందో అర్థంలేదు.
"సర్లే....ఏది ఏమైనా ఇంక తాత్సారం చేయడం మంచిదికాదు. రెండ్రోజుల్లో అన్ని రకాలుగా క్లీన్ గా వుండే రివాల్వర్ ప్రొవైడ్ చేద్దాం అతనికి. వీలయితే వచ్చే శనివారమే మరణ ముహూర్తం భరద్వాజకి."
ఎందుకో శృతి శరీరం జలదరించింది. వారున్న ఆ స్థితిలో అతనంత శాంతంగా ఆ మాట అనడంతో.
ఆమె మనసు అదోలాటి భీతికి లోనయ్యింది మదన్ తో పరిచయం అయ్యాక మొట్టమొదటిసారిగా.
మరింత హత్తుకుపోయిందతనికి.
మళ్ళీ మౌనం వహించాడు మదన్. సిగరెట్ అయిపోవడంతో ఆర్పేశాడు దాన్ని టీపాయ్ పైనున్న యాష్ ట్రేలో వేసి.
"మదన్"
"ఊఁ...."
"కర్చీఫ్ ఏవైఁ వుంటుందంటావ్?"
ఫకాల్న నవ్వేశాడు మదన్.
"ఎందుకు నవ్వుతున్నావ్?"
"మరి లేకపోతే ఏవిఁటి? ఇందాక పెద్ద ధైర్యస్థురాలిలా ఏదేదో అన్నావ్?"
మాట్లాడలేదు శృతి.
తిరిగి తనే అన్నాడు "ఏమీ అయి వుండదులే...."
"మదన్...."
"ఊఁ!"
"నన్ను ఎప్పటికీ వదిలెయ్యవు కదూ?"
"నేనలా కన్పిస్తున్నానా నీ కళ్ళకి? నీకోసం నా భార్యను సయితం వదులుకున్నాను. మీ అంకుల్ తో పోరు తెచ్చుకుని ఉద్యోగాన్ని రిస్క్ చేసుకొన్నాను. నిన్ను వదిలేయడానికేనా...."
"ఆ తరువాత ఎప్పుడయినా అంకితను కలిశావా?"
"ఇప్పుడెందుకా టాపిక్....నీ గుండెలేమంటున్నాయో తెలుసా?"