Previous Page Next Page 
వజ్రాల పంజరం పేజి 24


    అప్పటిదాకా ఫ్రెండ్స్ తో ఏవో మాట్లాడుతున్న ప్రసాదభూపతి యిప్పుడు పూర్తిగా విజూష రుత్విల చర్చ మాత్రమే వింటున్నాడు.

 

    ఆ విషయం విజూషకి తెలిసిపోయింది.

 

    అందుకే టాపిక్ మరింత పెంచాలనుకుంటూ టేబుల్ మీద రుత్వికి దగ్గరగా జరిగి అంది.


 
    "ఓ జోక్ చెప్పనా?"

 

    "నీకు జోక్స్ చెప్పడం కూడా వచ్చా?" అనలేదు రుత్వి.

 

    అసలు విజూషనబడే ఈ అమ్మాయి యీ స్వల్ప కాలంలోనే ఇలా హద్దులు దాటి ఎందుకు ప్రవర్తిస్తుందీ బోధపడక ఆలోచిస్తూనే చెప్పమన్నట్టు తల పంకించాడు.

 

    "నీలాంటి తెలివైన అబ్బాయిని ఓ అమ్మాయి పెళ్లి చేసుకుని వీరావేశంతో ప్రేమించడం మొదలుపెట్టిందట ఒకనాడు సదరు అమ్మాయి భర్తని అడిగిందట. మీరింత  గాఢంగా నన్ను యిష్టపడుతున్నారు కదా. ఒకవేళ నేను  చచ్చిపోతే మళ్లీ పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించింది. దానికి సదరు భర్త ఏమన్నాడో తెలుసా?"

 

    చెప్పు!"

 

    "చేసుకుంటానూ అంటే నీకు కోపం వస్తుంది. చేసుకోనూ అంటే సశ్యకి కోపం వస్తుందీ అని."

 

    ఫకాల్న నవ్విన రుత్వి టక్కున ఆగాడు.

 

    అది జోక్ కావచ్చు.

 

    కానివిజూష సశ్య పేరెందుకు రిఫర్ చేసింది?

 

    అసలు విజూష జోక్ చెప్పినట్టుగా లేదు.

 

    మనసులోని మాటని ఖచ్చితంగా తనకి తెలియచెప్పినట్టుగా వుంది.

 

    ఆ క్షణంలో అతడు తప్పనిసరిగా సశ్య గురించే ఆలోచిస్తుంటాడనుకున్న విజూష "నా పాస్ట్నెస్ నీకు ఇప్పటికి బోధపడి వుంటుంది" అంది చిరు గర్వంగా.


 
    "నిజమే! నువ్వు కనిపించవు"

 

    "గాలిలా" టక్కున అంది విజూష. "కాని చొచ్చుకుపోగలను...."

 

    "గాలి కూడా కనిపిస్తుంది" అన్నాడు రుత్వి.

 

    "ఎవరికి?" అవాక్కయినట్టుగా చూసింది విజూష.

 

    ఆ ఇద్దరి చర్చకి ఇప్పుడు కేవలం ప్రసాదభూపతి మాత్రమే కాదు. అతడితోబాటు వున్న ఫ్రెండ్స్ కూడా రియాక్టయ్యారు విభ్రమంగా....

 

    అదికాదు...

 

    అందులోని ఓ వ్యక్తి విజూషని గుర్తుపట్టి "హాయ్ విజ్జూ! నువ్వా?" అంటూ పలకరించాడు కూడా.

 

     తలతిప్పిన విజూష పలకరించిందెవరో గుర్తించింది. ఓ కాస్మోటిక్స్ కంపెనీ యజమాని ......డాడీ ఫ్రెండు పేరు రాజేంద్రకుమార్.  

 

    "హాయ్ అంకుల్!" సరిగ్గా అప్పుడే తండ్రిని కూడా చూసినట్టు క్షణంపాటు ఆశ్చర్యాన్ని నటించింది.


 
    వెంటనే " డాడీ! మీరూ ఇక్కడే వున్నారా?" అంటూ పలకరించింది.
 


    "కమ్ హియర్!" ఆహ్వానించాడు రాజేంద్రకుమార్.

 

    విజూష సంశయిస్తుంటే "కమాన్ బేబీ!" మీ ఫ్రెండ్ ని పరిచయం చేయ్" అంటూ రెట్టించడంతో తనపని మరింత సులభమైనట్టు లేచి టేబుల్ దగ్గరికి నడిచింది.

 

    "హి ఈజ్ రుత్వి. కంప్యూటర్ ఇంజనీర్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్" అంటూ టేబుల్ ముందు కూర్చుంది.

 

    ఆమెను అనుసరించిన రుత్వి అందరోతానూ కరచాలనం చేసి తప్పని పరిస్థితుల్లో తనూ ఆమె సమీపంలో కూర్చున్నాడు.

 

    "నీ బెస్ట్ ఫ్రెండ్ కి ఐక్యూ కూడా ఎక్కువన్నమాట" అన్నాడు నలభై అయిదేళ్ల రాజేంద్రకుమార్.

 

    "బహుశా అతీంద్రియ శక్తికూడా వుండి వుండాలి" అలా ఎగతాళిగా అన్నది ఎవరోకాదు ప్రసాదభూపతి. "లేకపోతే గాలి కనిపిస్తుంది అనటమేమిటి?"

 

    హటాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.

 

    "నేను చెప్పింది అబద్దం కాదు"

 

    స్థిరంగా అన్నాడు రుత్వి.

 

    "అయితే గాలి కనిపించేది ఎలాగో చెప్పగలవా?"

 

    "కనిపిస్తుంది కాని మనసుకి కాదు."

 

    "మరి?"

 

    "సైన్సుకి"

 

    "బుల్ షిట్" అసహనంగా అన్నాడు ప్రసాదభూపతి.

 

    "మాటల గారడీతో మభ్ పెడుతున్నావ్."

 

    విజూషకి బోధపడిపోయింది తండ్రి ప్రస్తుత మానసిక  పరిస్థితి.

 

    తను వూహించినట్టే రుత్వి విషయంలో మండిపడుతున్నాడు.

 

    "సైంటిఫిక్ గా డిటైల్స్ అటుంచండి. ముందు మీరు నా ప్రశ్నకి జవాబు చెప్పండి" రుత్వి కూడా బెట్స్ కి దిగాడు ప్రసాదభూపతితో.

 

    "మీరు ఎప్పుడయినా డాక్టర్ ని కలుసుకున్నప్పుడు 'ఇక్కడ నొప్పి' అంటూ చెప్పారా?"

 

    "ఎస్"

 

    "అంటే నొప్పి మీకు కనిపించిందా?"

 

    ప్రసాదభూపతి క్షణం తొట్రుపడి "నొప్పి అన్నది  కనిపించదు. అనిపిస్తుంది." అన్నాడు. "అందుకే ఫలానా చోట నొప్పిగా వుందని డాక్టర్ కి చెబుతాం"

 

    "ఫలానా చోట నొప్పి అంటున్నారూ అంటే మీకు అది కనిపించినట్టేగా? అనిపించడమంటారేం?"

 

    వెంటనే జవాబు చెప్పలేకపోయాడు ప్రసాదభూపతి.

 

    "గాలి కూడా అంతే.. ప్రాణి బ్రతకటానికి అవసరమైన గాలిని మనం కదిలే చెట్ల  ఆకుల్లో, జెండాల రెపరెపల్లో, గట్టిగా పీల్చేటప్పుడు మానసిక రంధ్రాలకి అయ్యే స్పర్శలో మనమూ చూడొచ్చుగా."

 

    "నేనున్నది భౌతికంగా" గుర్తుచేశాడు ప్రసాదభూపతి.

 

    "భౌతికంగా చూడగలిగేది సైన్సు మాత్రమే అన్నానుగా."

 

    "సైన్సు అయినా ఎలా చూడగలదు?" మొండిగా అన్నాడు ప్రసాద భూపతి.

 Previous Page Next Page