"సో.... మీరు ఏ కోవకి చెందిన అమ్మాయిగా అనుకోవాలి?"
ఆర్దోక్తిగా అంది విజూష తత్తరపడుతూ.
"నేను మిమ్మల్ని ద్వేషించలేదు."
"అంటే..." గుంభనంగా నవ్వాడు రుత్వి.
"మిమ్మల్ని నేను వూహల సౌధంలోకి లాక్కుపోయానన్నమాట."
క్షణంపాటు అతడి కళ్లలోకి చూసి అంతలోకి తల తిప్పుకుంది విజూష.
ఎన్ని లిప్తలకాలమో ఆమెకు తెలీదు.
విజూష "కలిసి నీ గొంతు త్రోవల సెలలుగట్టి అలలు ఉప్పొంగి నా హృదయాంచలములబారి దాహానబీటలవారిన......" కృష్ణశాస్త్రి పాట అయ్యింది కొంతసేపు.
"శంఖాలూ పూరించి కిన్నెర్లు మీటించి శంకరాభరణ రాగాలాపన కంఠియైన"
బాపిరాజు కవితగా మారింది మరింత కల్సి.
అది ఉద్వేగమో లేక తండ్రినెదిరించాలన్న తపనో ఆమెకే తెలీదు గభాలున పైకి లేచి -
"సో.... వెళదామా?" అంది యిందాకతనిస్తానన్న పార్టీ గుర్తుచేస్తూ.
ఎక్కడికో, ఏ రెస్టారెంటుకో రుత్వికే తెలీదు.
ఆమె నడుస్తుంటే మౌనంగా అనుసరించాడు.
ఆ క్షణంలో ఆమె ఆలోచిస్తున్నది ఒక్కటే!
రుత్విని ఏ రెస్టారెంటుకోకాక కంట్రీ క్లబ్ కి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది.
అలా తన స్థాయి గురించి అతనికి తెలియచెప్పడం ఆమె అభిమతం కాదు.
సరిగ్గా ఆ సమయంలో ప్రసాదభూపతి స్నేహితులతో బాటు కంట్రీక్లబ్ లో వుంటాడు.
అక్కడ రుత్వితో బాటు తాను తండ్రి దృష్టిలో పడాలి.
తండ్రి ఆలోచనలకి భిన్నంగా తాను నడుచుకోవాలనుకుంటున్నవిషయం ఆయనకి పరోక్షంగా తెలియచెప్పాలి.
ఆ తరువాత పర్యవసానం ఏమైనాగాని తన తండ్రి కెనడా సంబంధం ఖాయం చేసయకముందే తన ప్రొటెస్ట్ ని ఘాటుగా అర్దమయ్యేట్టు చేసి వీలైతే రుత్విమీద తనకున్న ఇష్టాన్ని అక్కడే వివరించాలి.
ఆ తరువాత రుత్వితో ఆమె మాట్లాడలేదు.
మరో పది నిముషాలలో రుత్వితోబాటు కారులో కంట్రీ క్లబ్బుని చేరుకుంది.
లంచ్ సమయంలో క్లబ్ ఖరీదైన మనుషులతో నిండివుంది...
నగరంలో అరిస్టోక్రాట్ ఫేమస్ కి చెందినవాళ్లు బిజినెస్ టైకూన్స్ క్లబ్బు హాలు మొదలుకొని రెస్టారెంట్ గదుల్లో టేబుల్స్ ముందు కూర్చుని వుండగా ఓ మూలకి రుత్విని తీసుకువెళ్లింది విజూష.
ఆ టేబుల్ కి సమీపంలోనే ప్రసాదభూపతి స్నేహితుల్తో ముచ్చటిస్తున్నాడు సీరియస్ గా.
తండ్రిని ఆమె చూసింది.
కాని ప్రసాదభూపతి విజూషని చూడలేదు.
వెంటనే తన తండ్రి తామిద్దర్నీ గమనించాలని ఆమె కూడా అనుకోలేదు.
స్టీవార్డుని పిలిచి రుత్వి ప్రమేయం లేకుండానే లంచ్ డిషెస్ ఆర్డర్ చేసింది తను యిష్టప్రకారం.
ముందు అవాక్కయ్యాడు రుత్వి.
అదికాదు...
రుత్వి ఈ స్వల్పపరిచయంలోనే చాలా దూకుడుగా వ్యవహరిస్తాడని బోధపడిపోయింది.
ఆమెలో ఈ మార్పుకి కారణం అర్దంకాని రుత్వి " ఇది న్యాయంగా లేదు" అన్నాడు.
టాపిక్ ని తానే ప్రారంభిస్తూ...
ఈస్టేట్ మెంటు విజూష ముందే వూహించింది.
"తినేవాడ్ని నేను కాబట్టి లెక్కప్రకారం ఏం కావాలన్నదీ నేను అడగాలి" అన్నాడు రుత్వి.
"కాని ఇక్కడికి తీసుకొచ్చింది నాకిష్టమైనది మీచేత తినిపించాలని"
"మీకు ఇష్టమైనవి నేను తిని తీరాలా?"
"నేనంటూ మీకు యిష్టమైనప్పుడు తింటే తప్పేమిటి?"కాస్త గొంతు స్థాయి పెంచింది.
ఆమె వూహ తప్పు కాలేదు.
ప్రసాదభూపతి ఆమెను చూశాడు.
అదొక్కటే కాదు...
ఆమెతోబాటు రుత్విని గమనించాడు.
"పైగా నువ్వో విషయం ఒప్పుకోవాలి" అంది అల్లరిగా నవ్వుతూ.
హఠాత్తుగా యీ ఏకవచన సంభోదనేమిటో తెలీని రుత్వి "క్లియర్ గా చెప్పండి" అన్నాడు సాలోచనగా.
"ఇలా సంశయం ప్రకటించేది.. అదే ఓ అందమైన అమ్మాయి ముందు యిలా ద్వేషించేటప్పుడు... రెండోది ఆ అమ్మాయిని ఇదిగా చాలా ఇష్టపడ్డప్పుడు...."
రెప్పలార్చకుండా చూశాడు రుత్వి.
తను వాడిన మాటల్నే ఇక్కడ తనమీద ప్రయోగిస్తుంది విజూష.
"సో! నన్ను నువ్వు ద్వేషిస్తున్నావా?"
ఈసారి మరింత గొంతు స్థాయిని పెంచింది విజూష.
"లేదు" అన్న వెంటనే "అయితే గాఢంగా ప్రేమిస్తున్నావా?" అని అడుగుతుందన్న విషయం బోధపడ్డ రుత్వి యిక ఆ చర్చని పొడిగించాలనుకోలేదు.
"ఓకే..... మీరు చెప్పిన లంచ్ ని కాదనకుండా తీసుకుంటాను."
"కాదనకుండా తీసుకునేది లంచ్ ని మాత్రమేనా?"
మరో అస్త్రం సంధించింది విజూష మళ్లీ.
"ఇవ్వకపోయినా నువ్వు అర్దం చేసుకోగలవు విజూషా!" ఈసారి రుత్వి కూడా ఏకవచనంతో సంబోధించాడు "అయినా ఓ సందేహం"
"అడుగు!"
"నువ్వు ఫాస్ట్ అనుకున్నానుగాని మీర ఇంత అనుకోలేదు. "
"కొన్ని వాస్తవాలు కొన్ని సందర్బాలలోనే ఎక్స్ ప్లోజ్ చేయాలి"
ఇది ఖచ్చితంగా విజూష వుద్దేశించింది ఆమె తండ్రికే....