మళ్ళీ అదే మాట తెలిసిన వారయితే మిమ్మల్ని గుర్తు పెట్టటానికి!
అప్పారావు ఒక్క నిమిషం ఆలోచిస్తూ వుండిపోయాడు. ఆపై బలంగా రాజారావు చేతిమీద చరిచి అరే ఫూల్! నీ జోక్స్ నీ తమాషాలూ ఇంకా మానలేదన్నమాట!! అన్నాడు.
వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీకయినా బ్రెయిన్ లూజ్ వుండాలి నా కయినా వుండాలి. నా పేరు అనంతం కాదు రాజారావు అని చెప్పాను.
విసుగ్గా అన్నాడు.
బేరర్ కుర్రాడు టిఫెన్ ప్లేటు తెచ్చి టేబుల్ పైన పెట్టి వెళ్ళాడు.
చూడు అనంతం! నా పేరు అప్పారావునే. అప్పులడిగిన మాట వాస్తవమే. ఇది వరలో ఐదు పది కావాలని అడిగేవాడిని నీవిచ్చేవాడివి అప్పటికి నా పరిస్థితులు సరిగా లేక తీర్చలేదు. అది మనసులో పెట్టుకుని నన్ను గుర్తించనట్లు నటిస్తావురా? అప్పారావు దీనంగా ముఖం పెట్టి అన్నాడు.
రాజారావు జాలిగా చూశాడు అప్పారావు వైపు.
మీరు చెప్పే అనంతం గారికి నాలు పోలికలుండి ఉంటాయి. అది గ్రహించక మీరు పొరబడి వుంటారు?
నా ఎదురుగా నీవు కూర్చుని పోలికలంటావేమిటిరా అప్పారావు ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడని ఎన్ని సార్లనే వాడివి?
నా పేరు రాజారావు. ఈ విషయం గురించి ఇహ మాట్లాడకండి కాఫీని సేవిస్తూ వార్నింగ్ ఇస్తున్నట్లే అన్నాడు రాజారావు.
ఈ విషయంలో అప్పారావు తగ్గదలుచుకోలేదు.
చూడు అనంత పద్మనాభశాస్త్రి నేచెప్పేది సాంతం విని వాదించు. అయిదేళ్ళ క్రితం మనం ప్రాణ స్నేహితులం. నే అప్పులు చేయడం నీకిష్టం వుండేది కాదు. మాటలకు ముందు అప్పు చేయటం ఓ పెద్ద తప్పు అంటూండేవాడివి.
అయిదేళ్ళ క్రితం నువ్వు రంగూన్ వెళ్ళావు అక్కడ చిన్న వ్యాపారం పెట్టి పెద్ద బిజినెస్ మాన్ వయ్యావని తెలిసింది. డబ్బు సంపాదించిన మనిషి నీవు నలగలేదా.
అయిదేళ్ళ క్రితం ఎర్రగా బుర్రగా వంకులు తిరిగిన నల్లని క్రాపుతో ఎలా వున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. డబ్బు సంపాదించావు గాబట్టి ఖరీదైన దుస్తులు వేసుకున్నావు అంతే తేడా అదేకాక కుడి కంటికింద కందిగింజంత పుట్టుమచ్చ పెదవి పక్కన అరంగుళం గాటు, ఇడ్లీలో పూరికూర నంజుకుతినే అలవాటు కాఫీ తాగేటప్పుడు నెమ్మదిగా సిప్ చేస్తూ తాగటం మాటకు ముందు నొసలు ముడేయటం ఇంకే వివరాలు కావాలిరా నువ్వే అనంత పద్మనాభశాస్త్రివని చెప్పడానికి? కళ్ళార్పకుండా రాజారావుని చూస్తూ అన్నాడు అప్పారావు.
అయిందా కధ అన్నాడు రాజారావు తాపీగా. గతుక్కు మన్నాడు అప్పారావు.
నిన్ను నేను గుర్తించానురా అనంతం. నువ్వే బహుశ నన్ను గుర్తించి వుండవు. ఈ అయిదేళ్ళలో చాలా చాలా మార్పు వచ్చింది. నా శ్రీమతి ఐదుగురి పిల్లలకి తల్లి అయింది. నా ఉద్యోగం ఎదుగూ బొదుగూ లేనిది. ఆఫ్ ట్రాల్ ఒక గుమస్తా గాడిని చొక్కా చిరిగితే తొడుక్కోటం తప్పదు.
కుటుంబ భారంతో సగం నెత్తిమీద జుట్టు వూడింది. ఆ వున్న నాలుగు పాయలూ వెండి రూపం దాల్చాయి. అయినంత మాత్రాన నన్ను గుర్తుపట్టలేరా? ఈ తపా అయినా రాజారావు గుర్తు పడతాడేమోనని ఆశగా చూశాడు అప్పారావు.
అయిందా కధ?
రాజారావు తాపీగా అన్నాడు.
ఒరేయ్ అనంతం నీతో లాభం లేదురా! ఇది వరకు అంతే నన్ను గంటల తరబడి ఏడిపించే వాడివి. ఇప్పుడూ అలాగే నాటకం ఆడుతున్నావు. కానియ్యి రేపు నువ్వు నా ఇంటికి పరుగెత్తుకొచ్చి ఒరేయ్ అప్పారావు నిన్న నాటకం ఆడారా నేను. రాజారావుని కాదు అనంత పద్మనాభశాస్త్రిని నేను. నేను నీ స్నేహితుడిని. అనకపోతావా సరేలే రేపు ఎలాగో మా ఇంటి కొస్తావుగా. అప్పుడిచ్చేస్తాను ఓ టెన్ రూపీస్ వుంటే ఇవ్వరా! ఇదివరకు లాగా ఎగెయ్యనులే రేపు ఇస్తాగా అయి.
అప్పారావు మాటలు సాంతం వినకుండానే రాజారావు కుర్చీలోంచి చర్రున లేచాడు.
చూడు మిష్టర్! నీ పేరు అప్పారావు అని అన్నావు కదా సార్ధక నామధేయుడివి. పదిరూపాయలు అప్పుకోసమా ఈ కట్టుకధ అల్లావు?
ఇంతకన్నా నీకు జరుగుబాటు లేదు. ఒక పది రూపాయలు కావాలని అడిగితే ఇచ్చేవాడిని. ఈ రాజారావుతో జోక్ చేయడానికి ప్రయత్నించకు. ఫలితం అనుభవించాల్సి వుంటుంది. గుడ్ బై" అంటూ రాజారావు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఇవతలకి వచ్చేసాడు.
అప్పారావు అంటూ నోరు తెరిచి అలా వుండిపోయాడు.
అంతవరకు ఈ ఇరువురి సంభాషణ వింటున్న వెనుక టేబులు వద్ద కూర్చున్న లాంగ్ కోటు నెత్తిన హ్యాటు కూలింగ్ గ్లాసెస్ గల ఓ పొడుగాటి వ్యక్తి రాజారావు కుర్చీలోంచి లేవడం చూసి తనూ లేచాడు.
22
సాయంత్రం 5 గంటలయింది.
పెద్ద బజారు వచ్చే పోయే జనంతో, వాహనములతో కిటకిట లాడుతున్నది.
రాజారావు దీర్ఘంగా ఆలోచిస్తూ చిన్నగా పేవ్ మెంట్ మీద నడుస్తున్నాడు.
అదే పేవ్ మెంట్ మీద రాజారావుకు ఎదురుగా వస్తున్న సుందరం రాజారావును చూశాడు. చూస్తూనే నాలుగు అంగలలో రాజారావును సమీపించి రాజారావు భుజాల మీద చేయివేసి బలంగా వూపుతూ అరే అనంతం ఎప్పుడు వచ్చావు రంగూను నుంచి? ఏం మారలేదు సుమా? ఐదేళ్ళ క్రిందట ఎలా వున్నావో ఇప్పుడు కూడా అలాగే వున్నావు. ఏమిటి విశేషములు?" అన్నాడు రాజారావు భుజాల మీదనున్న సుందరం చేతులు తొలగిస్తూ మీరు__అన్నాడు.
"మీరేమిట్రా? నేనురా నీ సుందరంను. ఆ రోజులలో నన్ను సుకుమార సుందరా అని ఏడిపిస్తూ వుండేవాడివి మరచిపోయావా? అవును లేవోయ్ రంగూను వాతావరణము డబ్బు బిజినెస్ అణాకాని వెధవని నేను గుర్తుంటానా?" సుందరం చిరుకోపంతో అన్నాడు.