రచనా వ్యాసంగానికి సంబంధించి అతడి కమిట్ మెంట్ తెలిసిన స్త్రీగా అయిదు నిమిషాలలో అన్నం కలిపి తీసుకొచ్చింది.
ఇది తొలిసారి కాదు...
పెళ్ళయిన మూడేళ్లలో చాలాసార్లు భాను యిలాగే చేసింది.
భర్తని పసికందులా బుజ్జగించే ఆమెను బాహాటంగా ఏనాడూ అభినందించలేదు తేజ.
కానీ కళ్లతోనే కృతజ్ఞతని వ్యక్తం చేయడం అలవాటుగా మార్చుకున్న వ్యక్తి అతడు.
చాలాసార్లు అనుకున్నాడు మనస్పూర్తిగా -
తను రచయితగా నిలబడటానికి ప్రత్యక్షంగా కాకపోయినా భాను పరోక్షంగా చాలా సహకరిస్తుంది.
ఎప్పుడూ కాగితాలలో కాలక్షేపం చేసే భర్తని భరించటానికి ఒక ఆడదానికి అసాధారణమైన సహనం కావాలి.
అంతకుమించి అభిమానుల ఉత్తరాలు, ఫోన్ కాల్స్ కూడా కంగారు పెట్టించేవిగా వుంటాయి.
సీరియస్ గా తీసుకోలేదు.
అది స్త్రీగా భాను సాధించిన మెచ్యూరిటీయే అయితే తేజ విజయానికి కారణం కూడా అదే.
* * * *
రెండు రోజుల కాలం ఎలా గడిచిపోయిందో ఆర్తికి గుర్తులేదు.
తేజ ఫోన్ లో చెప్పిన కవిత వాక్యాల్ని ఓ కాగితంపై నోట్ చేసుకుంది. తన దగ్గరున్న సి నా రె కలెక్షను అంతా వివరంగా తిరగేసింది.
జవాబు దొరకలేదు.
సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళింది.
కోటి బుక్ స్టాల్స్ లో ఓ రెండు కవితల పుస్తకాల్ని కొంది. చివరికి సాధించింది.
సాయంకాలం అయిదు గంటల సమయంలో తేజాకి ఫోన్ చేయాలని ప్రిపేరవుతుండగా వచ్చాడు భాస్వంత్.
గిల్టీగా ఆగిపోయింది.
ఎందుకు ఆగిందో ఆమెకే తెలీదు.
అసలు తను ఓ అభిమానిగా ఆ రచయితతోనైనా మాట్లాడ్డాన్ని భాస్వంత్ ఎలా రిసీవ్ చేసుకుంటాడో ఆమెకి తెలీదు.
అలాంటి విషయాలలో సంస్కారిలానే ప్రవర్తిస్తాడన్న నమ్మకం వుంది కానీ అతడి ముందే ఫఫోన్ చేయటానికి ధైర్యం చాలలేదు.
"అమ్మ వెళ్లిపోయిందా?" అడిగాడు బట్టలు మార్చుకుంటూ.
ఆ తర్వాత ఇక ఆ చర్చ పొడిగించలేదు.
'వద్దని చెప్పాను' అని ఆర్తి అన్నది అతడి నుంచి చర్చని ఆశించే కానీ భాస్వంత్ అవకాశమివ్వలేదు.
అదే ఆమెను బాధపెట్టింది కూడా.
కేవలం తన అవసరాలను తీర్చటానికే తప్ప మరి దేనికీ భార్య ఉనికిని పట్టించుకోని మనిషిగా మరో మారు నిర్దారణ అయినట్టు ఫీలవుతూ మౌనంగా కాఫీ చేసి తీసుకొచ్చింది.
అప్పటికే స్నానం చేసిన భాస్వంత్ కాఫీ తాగి "రాత్రికి ఆలస్యంగా వస్తాను" అన్నాడు.
"ఎక్కడికి వెళుతున్నారు?" అని అడగలేదామె.
అడక్కుండా చెపితే ఆమె ఆనందించాలనుకుంది.
పది నిమిషాలలో డ్రెస్ చేసుకుని "రాత్రికి భోంచేయను. ఓ ఫ్రెండ్ కొడుకు పుట్టినరోజుకి పిలిచాడు" అన్నాడు.
అంటే తను అక్కడే భోంచేసి వస్తానని అతడు పరోక్షంగా తెలియచెప్పాడు.
ఇక్కడ భాస్వంత్ ఉద్దేశ్యం ఓ ఫంక్షన్ కి వెళుతున్నాననడంకాదు. రాత్రికి తనకోసం అన్నం వండొద్దని తెలియచెప్పడం మాత్రమే.
అయితే ఆర్తి మనసు కలుక్కుమన్న విషయాన్ని అతడు గమనించలేదు.
ఒక ఫ్రెండ్ ఇంటి దగ్గర జరగబోయే ఫంక్షన్ కి - అదీ భార్య సమేతంగా వెళ్ళాల్సిన దానికి ఎందుకు తనను పిలవటం లేదా అనుకుంది అలవాటుగా.
అదీ అరనిమిషంపాటే.
కొన్ని దురదృష్టకరమైన సంఘటనలకి కారణాలు వుండవు. తనేమిటి అన్నది అర్దంకాకుండా వుండటానికే అతడలా ప్రవర్తిస్తాడో లేక భార్యంటే కొన్నింటికి తప్ప అన్నిటా అవసరంకాని ఓ ప్రాణిగా భావిస్తాడో అర్దం చేసుకోటానికి ఇప్పటికి చాలా శ్రమించింది కానీ ఇదమిత్థంగా జవాబు తెలుసుకోలేకపోయింది.
ఆమె ఆలోచనల్లో మునిగి వుండగానే భాస్వంత్ వెళ్ళిపోయాడు.
ఆమె కళ్లు చెమర్చాయి.
అది బాధ కాదు. తనపై తనకు వేసిన జాలిలాంటి భావం. జుగుప్సాకరమైన సెల్ఫ్ సిటీ.
భాస్వంత్ నేచర్ ఎప్పటికీ అర్దంకాదా?
పురుషాహంకారంలో తనను మానసికంగా దగ్గరకానివ్వడు. అన్నీ యిస్తాడు. కానీ దేనినీ షేర్ చేసుకోడు. తన అవసరాల్ని తీరుస్తాడు. కానీ మనసు అరల్లోకి మాత్రం తొంగి చూడనివ్వడు. ఎంత దగ్గరగా వెళ్లాలని వున్నా నీ పరిధిలో నువ్వుండు అన్నట్టు ప్రవర్తిస్తాడు. ఇష్టంలేని పెళ్లి చేసుకున్నాడా? అదేం కాదే. పెళ్లిచూపుల్లో చూడగానే తనను అంగీకరించాడే. మరి తనను మనిషిగా ఎందుకు భావించడు?
తను మనసారా నవ్వి ఎంతకాలమైంది?
ప్రేమ, ఆప్యాయతలు ప్రోదిచేసుకున్న పొదరిల్లులా కాకపోయినా మనశ్సాంతిగా ఎలా వుండగలదని?
తనేం సినిమాల్లోలానో, కథల్లోలానో ప్రతిక్షణమూ భర్త నీడలోనే కళ్లల్లోకి చూస్తూ కూర్చోవాలనో, కార్లలో షికార్లు చేస్తూ వాస్తవానికి దూరంగా బ్రతకాలని కలలుకనలేదే. కన్నతల్లిదండ్రుల్నీ - పుట్టిన ఊరునీ, బంధుమిత్రుల్నీ వదిలి జీవితాంతం నీకు తోడుగా, నీడగా నీ సహచరిగా వుంటానని వచ్చిన ఆడపిల్లకి భర్త ప్రేమ దొరక్కపోతే ఆ బ్రతుకెంత భారంగా వుంటుంది.