అక్కడకు సమీపంగానే వున్న పెద్ద హోటల్లోకి నడిచి ఫ్యామిలీ రూమ్ లో కూర్చున్నారిరువురూ. ఆ గదంతా జంటలతో నిండిపోయి వుంది. ఎవరి సందడిలో వారున్నారు.
"విజయగారూ! నా ఉత్తరం మీకేమీ కోపం కలిగించలేదు కదా" సౌమ్యంగా అడిగాడతను.
"ఊహు!" ఏం చెప్పాలో తెలీక అంది జయ.
"అయితే మరి నాకా అదృష్టం ఎప్పుడు కలిగిస్తారు" ఆత్రుతగా అడిగాడు.
జయ కలవరపడిపోయింది.
"అతను వివాహం గురించి అడుగుతున్నాడు! ఇప్పుడెలా ఈ తలనొప్పి నుంచి తప్పించుకోవడం? ఇంత త్వరగా ఇది ఈ దశకు చేరుకుంటుందనుకోలేదు తను.
"నేనింకా ఏమీ నిర్ణయించుకోలేదండీ!" తల వంచుకు చెప్పింది జయ.
అతను నిరాశ చెందాడు.
ఇద్దరూ మౌనంగా కాఫీ ఫలహారాలు ముగించారు.
"సరే విజయగారూ! నామీద మీకు దయ కలిగేంతవరకూ వేచి వుంటాను! కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి! మీరు పక్కన లేకపోతే నా జీవితం మిజరబుల్ అయిపోతుంది." దీనంగా అన్నాడతను.
జయ ఏమీ మాట్లాడలేదు. అతన్ని చూస్తుంటే బాధతో నిండిపోతోంది హృదయం. అతను తనమీద పెంచుకుంటున్న ప్రేమకూ, తనూ విజయా అతన్ని మోసగిస్తున్న తీరుకీ అశాంతి పెరిగిపోతోంది తనలో.
ఇద్దరూ హోటల్నుంచి బయల్దేరారు.
జయ మనస్సులో ఉవ్వెత్తున ఆలోచనలు చెలరేగుతున్నాయి.
ఆటో స్టాండ్ లోని ఓ ఆటో రిక్షా పిలిచాడతను.
"కూర్చోండి! మీ హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తూ అన్నాడతను చొరవగా.
జయ ఆటోలో కూర్చుంది. అతనూ ఆమె పక్కన కూర్చున్నాడు. ఆటో బయల్దేరింది.
"విజయగారూ! నాకోసం ఓ సహాయం చేయగలరా?" అడిగాడతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ.
"ఏమిటది?" అడిగింది జయ.
"రోజూ సాయంత్రం కాసేపయినా మీరు నాతో గడపాలి. కనీసం ఒక్కసారి కనిపించినా చాలు!"
జయకు గుండెలు ఝల్లుమన్నాయి.
ప్రతిరోజూ అతనిని కలుసుకుని అతనితో తనే విజయ నయినట్లు ఎంతకాలం నటించగలదు? ఊహు! తను అందుకు ఒప్పుకోకూడదు. ఏదొక సాకు చెప్పి తప్పించుకోవాలి.
"సారీ చంద్రకాంత్ గారూ! సాయంత్రం పూట నేను టైప్ నేర్చుకోవాలనుకుంటున్నాను." అంది తెగించి.
"ఓ! సరే. పోనీ కనీసం వారానికో రోజయినా_ఆదివారం ఎలాగూ మీరు ఖాళీగానే ఉంటారు కదా" ఆశగా అడిగాడతను.
ఇంక అతనిని కాదనటం భావ్యంగా కనిపించలేదు జయకు.
"సరే" అంది అంగీకరిస్తూ.
ఆటో హాస్టల్ ముందాగింది.
"థాంక్యూ" అన్నాడతను చిరునవ్వుతో.
జయ దిగి హాస్టల్లోకి నడిచింది.
ఆ రాత్రి చాలాసేపు నిద్రపట్టలేదామెకి.
ఉండుండి చంద్రకాంత్ తో గడిపిన క్షణాలే గుర్తుకొస్తున్నాయ్. ఎంత జోవియల్ గా మాట్లాడగలడు తను.
మాట్లాడుతున్నకొద్దీ అతని మాటలు వినాలనిపిస్తుంది.
అతను గొప్ప అందగాడు కాకపోయినా అతనిలో ఏదో అంశం తనను విపరీతంగా ఆకర్షిస్తోంది.
బహుశా అది అతని ఎసర్జివ్ నెస్ కావచ్చు.
తలుపు తట్టిన చప్పుడయింది.
జయ చటుక్కున లేచి కూర్చుంది.
ఇంత రాత్రిలో ఎవరు తలుపుకొడుతున్నారు.
లేచి తలుపు తెరిచిందామె.
ఎదురుగ్గా చంద్రకాంత్.
నిశ్చేష్టురాలయింది.
"మీరా?"
"అవును" లోపలికి నడుస్తూ అన్నాడతను.
"ఇంత రాత్రిలో - అసలు హాస్టల్ లోపలకు రానిచ్చారు మిమ్మలను."
"వేర్ దేరీజ్ విల్ దేరీజ్ వే"
అంటే గోడ దూకి వచ్చారా?"
"అవును."
"తన గుండె ఝల్లుమంది.