Previous Page Next Page 
జయ - విజయ పేజి 22


    విజయకింకేం మాట్లాడాలో తెలీలేదు. జయ తప్పక తన మాట అంగీకరిస్తుందని అనుకుంది. కానీ ఇంత తేలిగ్గా కొట్టిపారేస్తుందనుకోలేదు.
    ఆ మర్నాడే వసుంధర వాళ్ళక్కయ్య నుంచి జయను వెంటనే రావలసిందంటూ ఉత్తరం రావడం, అదే రోజు రాత్రికి జయ హైద్రాబాద్ ప్రయాణం కట్టడం అకస్మాత్తుగా జరిగిపోయాయి.
    బస్ స్టాండుకి వసుంధర అక్క విమల వచ్చింది.
    ఆమెతోపాటు హాస్టల్ కెళ్ళింది జయ. ఆరోజు విమల శెలవు పెట్టి జయతోపాటు ఆమె ఉద్యోగంలో చేరాల్సిన ఆఫీస్ బయల్దేరింది. చాలా చిన్న ఆఫీసది. అంతా కలిపి ఎనిమిదిమంది పనిచేస్తున్నారు.
    మేనేజర్ ఆమె తెచ్చిన ఉత్తరం చూడగానే "ఓహో! నరహరిగారు చెప్పింది మీ గురించేనన్న మాట! ఎప్పుడు జాయినవుతారు?" అంటూ అడిగాడు.
    "రేపట్నుంచి చేరతానండీ!" అని చెప్పింది జయ.
    "సరే! ఆఫీసు ఉదయం తొమ్మిది గంటల నుంచీ సాయంత్రం నాలుగ్గంటల వరకూ పనిచేస్తుంది. మధ్యలో పన్నెండు నుంచి ఒంటిగంట వరకూ లంచ్ టైమ్. ఓకే..."
    "సరేనండీ!"
    విమలతోపాటు మళ్ళీ హాస్టల్ కు చేరుకుందామె. అదేరోజు ఆమెకూడా అదే హాస్టల్లో చేరిపోయింది.
    ఆ రోజంతా ఇద్దరూ సిటీ అంతా బస్సుల్లో తిరుగుతూ గడిపారు.
    మర్నాడు ఎనిమిది గంటలకే బయల్దేరి ఆఫీసుకి చేరుకుంది జయ. ఆ ఆఫీసులో తనొక్కతే ఆడపిల్ల.
    "ఓ వారంరోజులు పని చూస్తూండండి. ఆ తరువాత మీకే అలవాటయిపోతుంది." చెప్పాడు సూపర్ వైజర్.
    రెండోరోజు సాయంత్రం ఆమె ఆఫీసునుంచి బయటకొచ్చి బస్ స్టాప్ దగ్గర నిలబడింది.
    "హలో నమస్కారం!" అంటూ హఠాత్తుగా ఆమె దగ్గరకొచ్చాడు చంద్రకాంత్.
    అతన్ని చూస్తూనే ఉక్కిరిబిక్కిరయింది జయ.
    "మీరా!" అంది షాక్ నుంచి కోలుకుంటూ.
    "ముమ్మాటికీ నేనే! నేనిక్కడ ఉండడంలో ఆశ్చర్యంలేదు గానీ మీరిక్కడెలా వున్నారో చెప్పండి ముందు. అదీ నాకు తెలీకుండా! ఇలా వస్తున్నట్లు నాకు నాల్రోజుల క్రితం చెప్పనే లేదు మీరు." అతని కంఠంలో నిష్టూరం ధ్వనించింది.
    "అనుకోకుండా ఇక్కడ ఉద్యోగం వచ్చింది. అందుకని మొన్నే వచ్చాను." తడబడుతూ చెప్పింది జయ.
    "ఉద్యోగం రావడం ఏమిటి? మరి అక్కడి ఉద్యోగం వదిలేశారా?"
    "ఎందుకని?"    
    "నాకు అంతగా నచ్చలేదది. అదీగాక సిటీలో కొంతకాలం ఉద్యోగం చేయాలనిపించింది."
    "ఇంతకూ ఇక్కడ ఏ ఆఫీసులో ఉద్యోగం చేయడం?"
    దూరంగా కనబడుతున్న తమ ఆఫీసు చూపించి వివరాలు చెప్పింది జయ.
    "అబ్బ! నాకెంతో ఆనందంగా వుందీరోజు! మీరు యిక్కడ కనబడితేనే నాకు ప్రాణం లేచివచ్చినట్లయింది. దానికి తోడు యింక యిక్కడే ఉంటారని తెలియడం.చాలు! దేవుడనేవాడున్నాడని నాకిప్పుడు నమ్మకం కలిగింది. లేకపోతే యింత త్వరగా నా ప్రార్థనలు ఫలిస్తాయా" జయ నవ్వేసింది.
    "ఏమని ప్రార్థించారు దేవుడిని?"
    "ఇంకేముంది! మీరు అనుక్షణం నాకు సమీపంగా వుండాలని."
    జయ ఖంగారు పడింది. అతని మాటల వెనకవున్న అతని అభీష్టం తనకు అర్థమైంది. ఇంతసేపూ అతను విజయకు రాసిన ఉత్తరం గురించి పూర్తిగా మర్చిపోయింది. తను తనను వివాహం చేసుకోవాలన్న కోరిక ఎంత బలంగా వుందో ఆ ఉత్తరమే చెపుతుంది. ఆ విషయాలన్నీ పూర్తిగా మర్చిపోవాలని మళ్ళీ వాటిల్లోనే యిరుక్కుపోయింది. ఇప్పుడిక ఈ నాటకానికి తెర పడాల్సిందే. జరిగిందంతా అతి త్వరలోనే అతనికి చెప్పక తప్పదు. లేకపోతే అతని జీవితమే కాదు తమ జీవితాలు కూడా సమస్యల పాలవుతాయి.
    "మీరు ఉండడం ఎక్కడ?" అడిగాడతను.
    "వర్కింగ్ వుమెన్ హాస్టల్లో."
    "ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తారక్కడ? పదండి. కాఫీ, ఫలహారం చేసి వెళ్దాం" జయ సందిగ్ధంలో పడింది.
    అతనితో పరిచయాన్ని పెంచుకుని పరిస్థితిని మరింత క్లిష్టం చేసుకోవడం తనకిష్టం లేదు.
    కానీ అతని మాటల్లోని అధికారం నుంచి తప్పించుకోవడం కూడా తనకు సాధ్యమయ్యే విషయం కాదు. తను అతని సొత్తు అయినట్లు, తనమీద పూర్తి అధికారం వున్నట్లు...
    "ఏమిటింకా ఆలోచిస్తున్నారు? పదండి."
    తనకు తెలీకుండానే, వద్దనుకుంటూనే అతన్ననుసరించింది జయ. ఇద్దరూ పక్క పక్కనే నడువసాగారు.
    "నేను రాసిన ఉత్తరం అందిందా మీకు?" హఠాత్తుగా ఆగిపోయి అడిగాడతను.
    "ఆ! అందింది."
    "వెరీగుడ్! అయితే నా మనసులోని విషయాలన్నీ మీకు తెలిసిపోయినట్లే!" తేలికపడ్డ మనసుతో అన్నాడతను.
    ఇద్దరూ తిరిగి నడవసాగారు.

 Previous Page Next Page