బిందుమాది చిరునవ్వుతో తల ఊపింది.
సాహితి భ్రుకుటి ముడిపడింది. వాళ్ళిద్దరికీ ఇంతకు ముందే పరిచయం ఉన్నట్టు తనకు తెలియదు.
బిందుమాధవి సాహితి భుజంమీద చేయి వేసింది.
సాహితి చిరునవ్వున తల పక్కకు తిప్పుకుంది.
"నా మీద నీకింకా కోపం తగ్గలేదా అమ్మా?"
"నీ మీద నాకెందుకు కోపం? నువ్వు నాకేమవుతావని?" సాహితి సూటిగా అన్న మాటలు బిందుమాధవి హృదయానికి గుచ్చుకున్నాయి. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి.
అనూషకు పరిస్థితి అర్థమయింది. "సాహితీ మీరు ఆంటీతో మాట్లాడి రండి" అంటూ అనూష ఆడిటోరియంలోకి వెళ్ళిపోయింది.
కొద్ది దూరం నుంచి వీరేష్ వాళ్ళను గమనిస్తూనే వున్నాడు.
"అమ్మా సాహితీ! నీకు నేను కన్నతల్లిని కాకపోవచ్చు. కాని నా ముందూ వెనకా నువ్వు తప్ప నా అన్నవాళ్ళు ఎవరున్నారమ్మా? నాన్నగారి ఆస్థి ట్రస్టుకి పోతేపోయింది. కాని నేను సంపాదించినదంతా నీదేనమ్మా! నీ పెళ్ళి నా చేతుల మీదగానే జరిపిస్తానమ్మా!" బిందుమాధవి గొంతు ఆర్ధ్రమయింది.
సాహితి బిందుమాధవిని విదిలించుకుని ఒక్కసారిగా ఆడిటోరియంలోకి మెరుపు వేగంతో దూసుకుపోయింది.
బిందుమాధవి స్థాణువులా అక్కడే నిలుచుండిపోయింది.
వీరేష్ ఆమెవైపు కదిలాడు.
ఆడిటోరియంలో అడుగుపెట్టిన సాహితి దృష్టి వేదికమీద నిలిచింది.
అదే క్షణంలో సమ్రాట్ మెడలో కళ్యాణి పూలమాల వేసింది. ఆడిటోరియం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది.
సాహితి మనసు చివుక్కుమంది.
ఆమె మనస్సు ఆ క్షణంలో పరిపరి విధాల ఆలోచించింది.
కళ్యాణి ప్రవర్తన ఎబ్బెట్టుగా అనిపించింది. ఎంత వెర్రి అభిమాని అయితే మాత్రం, పెళ్ళికాని పిల్ల పరాయి పురుషుని మెడలో పూలమాల వేస్తుందా?
తను మాత్రం? సమ్రాట్ అభిమానినని, నా అభిమాన రచయిత అంటూ అతనివెంట పడలేదా? కాని ఇప్పటివరకు తను వాస్తవాన్ని గ్రహించలేకపోయింది.
అతనికి ఉన్న వేలాదిమంది అభిమానులలో తను ఎన్నోది? అభిమానిని అంటూ నిన్న మొన్నటి వరకు అతనిచుట్టూ తిరిగిన తన క్లాస్ మేట్ గౌతమి గతి ఏమయింది?
నిజమే! అతనికి ఉన్న అనేక వేలమంది అభిమానులలో తనూ ఒకతే. తను అతని గురించి పడుతున్న ఆరాటంలో వెయ్యోవంతు అయినా అతను తన గురించి ఆలోచిస్తున్నాడా! అతను ఏనాడైనా తనపట్ల ప్రత్యేకమైన అభిమానం చూపాడా?"
తనకంటే ముందే గౌతమితో అతనికి పరిచయం ఉంది. కళ్యాణి కూడా తనలాగే అతని అభిమాని. అందరిలా తనుకూడా సమ్రాట్ ను అభిమానిస్తున్నది. కాని ఈరోజు ఉదయం తను చూసిన దృశ్యాన్ని సాధారణ విషయంగా తీసుకోలేకపోతున్నది. కారణం తను అతన్ని అభిమానించడమే కాదు. ప్రేమిస్తున్నది కూడా! స్త్రీ సహజమైన ఈర్ష్యాద్వేషాలు క్షణం ఆమెను ఆవహించాయి. విహ్వలిత అయింది.
రివ్వున వెనుదిరిగింది సాహితి.
అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం బిందుమాధవి సాహితి కోసమే బయట ఎదురుతెన్నులు చూడడం!
సాహితిలో విజ్ఞత మేల్కొంది. ఆమె కళ్ళకు అడ్డుపడిన పొరలు తొలగిపోయాయి.
తన మంచికోరే బిందుమాధవి పదేపదే "నువ్వాడపిల్లవు, జాగ్రత్త సుమా!" అంటూ హెచ్చరిస్తుంటే, తనామెను అపార్థం చేసుకుంది.
తనను పెంచి పెద్ద చేయడంలో ఆమె ఎంత శ్రమ తీసుకుందో కాని తనామెను కేవలం తన గార్డియన్ గానే చూసింది.
ఆమెను అవమానపరచింది. మనసు కష్టపెట్టింది.
"ఇంటికి వెళదామా ఆంటీ?" సాహితి నోటివెంట అప్రయత్నంగా మాటలు దొర్లాయి.
అది కలో, నిజమో అన్నట్టు బిందుమాధవి కొన్నిక్షణాలు ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయింది.
ఆమె కళ్ళవెంట ఆనందభాష్పాలు రాలాయి. ఒక్కసారి సాహితిని కౌగిలించుకుంది.
ఇన్ స్పెక్టర్ వీరేష్ చిరునవ్వు నవ్వి చేయి ఊపాడు.
వాళ్ళిద్దరూ కారు ఎక్కారు.
* * * *
ఆడిటోరియంలో కార్యక్రమం పూర్తయింది.
ఆహ్వానితులందరూ పేరు పేరుగా సమ్రాట్ ను అభినందించారు.
అందరికీ అతను విధిగా కృతజ్ఞతలను తెలిపాడు.
అతనికి ఏదో వెలితిగా అనిపించింది. అతని కళ్ళు ఎవరికోసమో వెతుకుతున్నాయి. మనసు పరిపరి విధాల ఆరాటపడుతున్నది.
వేదిక దిగివస్తున్న సమ్రాట్ తో కరచాలనం చేశాడు డి.ఎస్.పి. మార్తాండ్.
అతను వ్యక్తిగతంగా మాట్లాడాలన్నట్టు సమ్రాట్ ను పక్కకు తీసుకువెళ్ళి, కళ్యాణి పెళ్ళి ప్రస్తావన తీసుకువచ్చాడు.
ఇప్పటిలో పెళ్లి తన పురోభివృద్ధికి అవరోధమే ననిపించింది సమ్రాట్ కు. అయినా కళ్యాణిని ప్రేమిస్తున్నట్టు కాని, పెళ్లి చేసుకుంటానని కాని తను ఎన్నడూ అనలేదు. కళ్యాణిలేనిపోనివి ఊహించుకుంటున్నది.
"సారీ! ఇప్పట్లో నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు. అయినా, మా ఇంటిలో కులాంతర వివాహానికి ఒప్పుకోరు. నేను కళ్యాణిని చేసుకోవడం ఎట్టి పరిస్థితులలోనూ వీలుకాదు!"
"అవన్నీ నేను చూసుకుంటాను. మీ పెద్దలతో మాట్లాడి వాళ్ళను నేను ఒప్పిస్తాను. కులాంతర వివాహాలు చేసుకోవడం లోకంలో పెద్ద విశేషమేమీకాదు. మా కళ్యాణి మిమ్మల్ని తప్ప వేరెవ్వరినీ చేసుకోనని భీష్మించుక్కూర్చుంది. నాకు మాత్రం ఎవరున్నారు? ఒక్కతే కూతురు. నా ఆస్థి అంతా దానిదే, ఏమంటారు?" క్షణం ఆగాడు అతని జవాబు కోసం ఎదురుచూస్తూ డి.ఎస్.పి. మార్తాండ్.
"అయాం సారీ! మీరనవసరంగా నా గురించి యెక్కువ ఊహించుకుంటున్నారు. కళ్యాణి అంటే నాకు అభిమానం తప్ప, వేరే ఉద్దేశమే లేదు. ఇంతకంటే ఏం చెప్పలేను. దయచేసి అర్థం చేసుకోగలరనుకుంటాను!" నిష్కర్షగా అన్నాడు సమ్రాట్.