"ఆశ్చర్యమేమంటే తను అంటూ 'నేనేమన్నాను?' అని అన్నమాటలు నేను అన్నట్లు భ్రమింపచేస్తూ, చూసేవాళ్ళకి కూడా తానేమీ అననట్లూ, అన్నిమాటలూ నేనే అన్నట్టూ సీను సృష్టిస్తుంది."
"ఎప్పుడైనా కోపమొచ్చి నేనుకూడ రెచ్చిపోతేనో, చెయ్యి చేసుకుంటేనో... ఇన్ని నిద్రమాత్రలుమింగేస్తుంది. కిరసనాయిలు ఒంటిమీద పోసుకుని అంటించుకునే ప్రయత్నం చేస్తుంది. రెండు మూడుసార్లు కాలవలో దూకడానికి వెళ్ళింది.
"నేను నా మొగుడి కారణంగానే చచ్చిపోతున్నాను' అని ఉత్తరం రాసిపెట్టి ఓసారి కిరసనాయిల్ పోసి అంటించుకుంటే ఇరుగూపొరుగూ వాళ్ళు చూసి ఆర్పేసి హాస్పిటల్లో చేర్చారు. పోలీసులు నన్ను భయంకరమైన వాడిగా చిత్రిస్తూ నానా ప్రశ్నలూ వేసి, చివరకు కొన్నివేలు లంచం తీసుకుని వదిలిపెట్టారు.
"అన్నట్టు ఒకసారి ఉద్యోగం పోయి, సంపాదన లేక నానా అగచాట్లు పడ్డాను. ఆ రోజుల్లో నన్ను ఒక పురుగును చూసినట్లు చూసింది.
"రోజూ ఓ గలభా, అల్లరీ హింసా.
"నిజం చెప్పాలంటే ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. వణికిపోతున్నాను."
"ఏం చెయ్యాలి? ఈ సమస్యకు పరిష్కారమేమిటి? నాకు హాయిగా, ప్రశాంతంగా బ్రతకాలని ఎంతో కోరికగా వుంది. ఆ జీవితం నాకు అందటం లేదు. అన్యోన్యమైన దాంపత్య జీవితం అనుభవించాలని వుంది. అది చెయ్యి జారిపోయిందన్న సత్యం ఆకళింపు చేసుకోలేకపోతున్నాను. మా ఇద్దరిమధ్యా ద్వేషమే కాని ప్రేమ అనేది లేదు. అదెప్పుడో అంతరించిపోయింది. నాకు చచ్చిపోవాలని వుంది. కాని చావంటే భయం. తనని చంపేసేటంతటి సామర్ధ్యం నాకు లేదు. నన్నసహ్యించుకోకండి. తను ఏ జబ్బోవచ్చి చచ్చిపోతే బావుండునన్న క్రూరమైన ఆలోచనలు నాకొస్తున్నాయి. నేనేదో స్వర్గసుఖాలను అనుభవించాలన్న కోరికతో కాదు. భయం లేకుండా, ప్రశాంతంగా గడపాలనీ..."
సరిగ్గా ఈ వ్యక్తి వచ్చిన రెండురోజులకే ఇంకో స్త్రీ వచ్చింది. నలభయ్యేళ్ళుంటాయి.
చాలామంది 'నలభయ్యేళ్ళు' అన్న పదం చూడగానే చాలా వయసు అనుకుంటారు. కాని, నిజమైన, గంభీరమైన, నిర్దుష్టమైన జీవితం అప్పుడే మొదలవుతుంది. మీరు నన్ను అపార్ధం చేసుకోకపోతే అది రెండో యవ్వనం 'యవ్వనం' అనే పదాన్ని వక్రీకరించుకోకండి. జీవితంలో ఏది పోగొట్టుకున్నామో ఖాయం చేసుకున్న వయసది. త్వరత్వరగా ఏదో సాధించాలని తహతహలాడే వయసది.
ఆమె చెప్పిన కథ. "ఎన్నో ఆశలతో సంసారజీవితంలోకి అడుగుపెట్టాను. భార్యాభర్తలది ఓ అమరబంధంగా, ఎవరికీ అడుగుపెట్టటానికి వీల్లేనంతటి బలీయమైన ప్రేమశక్తిగా ఊహించుకున్నాను.
భార్యాభర్తలకుండే ప్రేమ అనే అద్భుతాన్ని ఎన్నో మనోహర రూపాలతో చిత్రించుకున్నాను.
"అతనిలో నేనాశించిన రీతిలో ఎలాంటి మానసిక స్పందనా కనబడలేదు. అసలు అతనిలో ఏముందో తెలీదు. నేను చెప్పేది వింటున్నాడో లేదో తెలీదు. ఏమీ చెప్పదు.
"అసలు మాట్లాడడని కాదు. తన అభిప్రాయమేదో తెలుసుకోలేని విధంగా మాట్లాడతాడు.
"ఆ ముఖంలో ఆపేక్షా తెలీదు. చిరునవ్వూ వుండదు. ఏ భావమూ కనబడదు.
"ఒకసారి పుట్టింటికి వెళ్ళినప్పుడు.... చలంగారి ప్రేమలేఖలు చదివి ఎంతో ఉత్తేజితురాలినయాను. ఎంత గొప్పగా రాశాడు! స్త్రీ పురుషుల మధ్య ఉండవలసిన ప్రేమమాధుర్యాన్ని గురించి అంతగా తాపత్రయపడిన రచయిత వున్నాడా అనిపించింది. ఆ భావోద్రేకంలో ఆయనలో నిద్రాణమై వున్న ప్రేమశక్తిని కదిలించాలని ప్రతిరోజూ ఓ ఉత్తరం చొప్పున రాశాను. నా ప్రేమ తరంగాలన్నీ ఆ ఉత్తరాల్లోని ప్రతి అక్షరంలో పొదిగేశాను.
"తర్వాత నేను మళ్ళీ ఆయన దగ్గరకు వెళ్ళినపుడు ఆయన ముఖకవళికల్ని ఆతృతగా పరిశీలించాను. ఎలాంటి మార్పూ కనబడలేదు. ఆ రాత్రి... అనుభవం అన్నీ మామూలుగా జరిగిపోయాయి.
"మర్నాడు ఉండబట్టలేక అడిగేశాను. ఆ ఉత్తరాలగురించి...
"మొదటి రెండు మూడు చదివాను. నాకేం అర్ధంకాలేదు. మిగతావి కవరుకూడా చింపలేదు. అదిగో అక్కడ కట్టకట్టి భద్రంగా పడేశాను" అన్నాడు.
"నా గొంతు ఎవరో నొక్కేసినట్లయింది. అందమైన, సుకుమార మధురభావాలన్నీ నిర్దాక్షిణ్యంగా ఎవరో తొక్కేసినట్లయింది.
"ఆయనకూ, నాకు ఎంత దూరమో అర్ధమైంది."
"ఆయన ప్రాక్టికల్ మనిషి నేను సంపూర్ణమైన మనిషిని."
"ఒకవేళ నాలో ఏమైనా లోపముందా? ఈ ప్రశ్న ఎన్నోసార్లు వేసుకుని రాజీపడటానికి ప్రయత్నించాను. సాధ్యపడటంలేదు.
"పిల్లలు పుట్టారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మా యిద్దరిమధ్యా దూరం పెరుగుతూందే గాని తగ్గటంలేదు. ఎవరి స్వభావాల్లో వాళ్ళు బిగుసుకుపోయి భరించలేనితనంగా, దుర్భరంగా, జీవించటం దుస్సహంగా తయారవుతోంది.
"భార్యాభర్తలంటే భయంకరమైన రాజీయా?
"ఆలోచనల్ని చంపేసుకుంటూ, నిరంతర హత్యలతో బ్రతకటమా?"
"తాను అనుకున్న జీవితానికి ఆశపడటం, వెతుక్కోవటం తప్పా?"
"నేను మానసికంగా చచ్చిపోయి విసిగిపోయాను. ఇంకా నా జీవితం అయి పోలేదు. ఎంతో మిగిలివుంది. అందుకని తప్పుపని చేయాలని నేననుకోవటం లేదు. జీవితంనుంచి పారిపోవాలనుకోవటంలేదు. వుండి, సార్ధకం చేసుకోవాలన్న తపన.
"ఏం చెయ్యాలి?"
"ఏం చెయ్యాలి?"
* * *
మరో భార్య...
"అతను శాడిస్ట్... నన్ను జుర్రుకుంటాడు. అతన్నుంచి హింసేగానీ, నాకేమీ లభించదు..."
ఇంకో స్త్రీ...
"అతను డబ్బుమనిషి ప్రతిదీ డబ్బుతో ఆలోచిస్తాడు. నాకోసం పదిరూపాయలు ఖర్చుపెడితే వందసార్లు గింజుకుంటాడు. ఆ డబ్బు తాపత్రయాన్ని భరించలేక పోతున్నాను."
అలాగే...
ఇద్దరిమధ్య నిరంతర పోరాటాలు.
ఒకరినొకరు హింసించుకోవటాలు.
మౌనంగా భరించటాలు.
నిస్సహాయమైన నిస్సత్తువలు.
అప్రయోజకంగా లొంగిపోవటాలు.