నిజమే.
కాని అది అప్పుడప్పుడు మాత్రమే తాత్కాలికంగా వుండే మెరపుకాంతి కాకూడదు. నిరంతరం వెలిగిపోయే ఓ అఖండజ్యోతి అయివుండాలి.
ఉండాలి అనుకోవడం వేరు. వుండటం వేరు.
ఈ పవిత్ర చక్రం ఎందుకు గాడి తప్పుతోంది?
మనిషి విషయం వదిలేద్దాం ఇప్పుడా మనిషిని భార్య, భర్త అనే పాత్రలవరకే కుదించి మథించుకుంటూ పోదాం.
మొదటిది- ఇద్దరూ ఒకరికొకరు అలవాటు పడ్డారా? లేక ప్రేమించుకుంటున్నారా?
ఒక్క సత్యం గమనించండి. ప్రవాహంలాంటి శైలితో, భాషాభేషజంతో, ఉక్కిరిబిక్కిరి చేసే ఉపమాన విన్యాసాలతో ఈ గ్రంథాన్ని రాసుకుంటూ పోతే 'ఆహా' అనో 'అద్భుత'మనో అనిపింపచేస్తుంది గాని, అది జీవిత యధార్ధాన్ని ఎక్కడో మిస్ చేస్తుంది. సూటిగా, సరళంగా ప్రతి అక్షరం స్పష్టంగా వుండేలా చేయటమే ఈ రచన ఉద్దేశం.
ఎందుకంటే జీవితమే ఓ గందరగోళం దాన్ని గురించే చేసే రచన గందరగోళం కాకూడదు.
ఉద్యోగిని అయిన భార్య గురించి కాకుండా మామూలు గృహిణిలా వున్న భార్య గురించి ఆలోచిద్దాం.
ఆమె గృహిణి కాబట్టి, ఇంటిపనులు చక్కదిద్దుకుంటూ, ఆర్ధికంగా అతనిమీద ఆధారపడి వుంటుంది.
మంచిదే అంతకన్నా వేరే మార్గం లేదుకాబట్టి కాని... ఈ ఆధారపడటం అతన్ని పీల్చి పిప్పి చేసే స్థితివరకూ వెళ్ళిపోతే ఎలా?
ఇది క్రూరంగా అంటూన్న మాట కాదు. చాలా కుటుంబాలను పరిశీలించి విధిగా అంటున్నమాట.
'ఇది కావాలి' అని అడిగే హక్కు భార్యకు వుంది. కాని ఆ 'ఇది కావాలి'కి ఓ స్వయం నియంత్రణ అవసరం కాదా?
ప్రతి భార్యా సుఖపడాలి. సుఖపడి తీరాలి. కాని వాళ్ళకున్న వనరులను బట్టి సుఖాన్ని కొంత శాతాన్ని మించి పొందటం సాధ్యంకాదనే యధార్ధాన్ని గ్రహించి తీరాలి.
'నేను కష్టపడిపోతున్నాను. నాకేమీ జరగటంలేదు' అన్న ఆలోచనా ఊబి ఆమెను ఇంకా కిందికి లాగేస్తూ వుంటుంది.
'నా జీవితంలో పొందవల్సింది పొందలేకపోతున్నాను' అన్న నిస్పృహ ఆమె ఆలోచనలను బాలెన్స్ తప్పేలా చేస్తుంది.
అసంతృప్తి, అసంతృప్తి, అసంతృప్తి.
ఈ అసంతృప్తి వాళ్ళ దాంపత్యజీవితాలను పీల్చి పిప్పి చేస్తోంది.
"నా భార్య నాకు తగింది కాదండీ!" అనే బడుద్దాయిలను చాలామందిని చూశాను.
"నా భర్త వట్టి టేస్ట్ లేని మనిషి ఆయనతో ఎడ్జస్టు కావటం చాలా కష్టం" అని సెల్ఫ్ పిటీతో కొట్టుకుపోయే ఆడవాళ్ళను చాలామందిని చూశాను.
దుఃఖమెందుకొస్తుంది. దాన్నిగురించి వివరంగా వేరే అధ్యాయాల్లో చర్చిద్దాం.
ఇప్పుడు క్లుప్తంగా-
మనకు లేని వాటిగురించి, మనకు దక్కని వాటిగురించి, ఇంకా నిజం చెప్పాలంటే మన అర్హత, స్థాయి, పరిమితులను పక్కనపెట్టి మనగురించి మనం ఎక్కువగా ఊహించుకోవటం వల్ల దుఃఖం కలుగుతూ వుంటుంది.
గొడవలు, స్పర్ధలూ, నిరంతర ఘర్షణలూ, విడిపోవడాలూ...
ఒకళ్ళనొకళ్ళు కాల్చుకు తినటాలూ.
అతని వయసు నలభై అయిదు సంవత్సరాలుంటాయి. చాలా దిగులుగా, జీవిత మంతా పోగొట్టుకున్నవాడిలా కనిపిస్తున్నాడు. "నా భార్యతో నేను జీవించలేకపోతున్నాను" అన్నాడు.
"ఎందుకని?"
"ఆమె నిరంతరం నన్ను పెట్టే పోరు భరించలేకుండా వున్నాను."
అతని ముఖంలోకి చూశాను. అతనికి చాలా చెప్పాలని వున్నదని గ్రహించాను. బహుశా... నా దగ్గర లోపల ఉన్నదంతా కక్కేయాలన్నంత ఉద్వేగంతో వున్నట్లు అర్ధమవుతోంది.
"చెప్పండి" అన్నాను.
"స్వేచ్చలేని బ్రతుకు ఎంత దుర్భరమో తెలుసుకున్నాను."
"పెళ్ళయ్యాక.... స్వేచ్చకు నిర్వచనాలు మార్చేసుకోవలసిన బాధ్యత వున్నదేమో!"
"బాధ్యతను నేనెప్పుడూ గౌరవించాను. జీవితపు నిబంధనలనూ, వాటి తాలూకు ఆజ్ఞలను శిరసావహించాను. నేను పలాయనవాదిని కాను. సుఖంగా, సౌఖ్యంగా సంతోషంగా, నిండుగా హాయిగా, బ్రతకాలన్న తపన వున్నవాన్నే."
"మరి?"
"అదంతా నిర్ధాక్షిణ్యంగా చెరిగిపోతూంది. నా గ్రిప్ కన్నా తన పిడికిలి ఎంత బలమైనదో తెలుసుకున్నాను."
అతనిలోంచి మాటలు పొంగుతున్నాయి. నేను వింటున్నాను.
"మొండితనం, రాక్షసత్వం ఎంత బలమైనదో వాటిముందు ఎంత పెద్ద మగాడైనా ఎంత నిస్సహాయుడైపోతాడో తెలుసుకుంటున్నాను.
"అనుక్షణం కాల్చుకు తింటుంది. ఎలాగంటే...
"ఎక్కడికెళ్ళావు? ఇల్లు ఇప్పటికి గుర్తువచ్చిందా? వాడెవడు? వాడితో గుసగుసలాడుతున్నావు? ఏపాటి మీ తమ్ముడితో మంతనాలు చేస్తున్నావు? ఫోన్ లో ఎవరితో ఇంతసేపు? ఏమిటి మీ అమ్మగారితో మాట్లాడుతూ స్వరం తగ్గించేశావు?
"నా తమ్ముడితో, తల్లితో మామూలుగా మాట్లాడుతున్నా అదేదో రహస్యం, కుట్ర ఫోన్ లో మాట్లాడితే రిసీవర్ పెట్టేయగానే 'ఎవరు?' అని అడుగుతుంది తనకు సంబంధం లేని మనిషైనా సరే.
"నాకేవో రహస్యాలున్నాయనుకుంటుంది"
"నన్ను అనుక్షణం ఓ నేరం చేసినవాన్ని చూసినట్లు చూస్తుంది."
"క్యాజువల్ గా మాట్లాడుతున్నప్పుడు కూడా ఎక్కడ తప్పు దొరుకుతుందా, అందులోంచి ఎలా పాయింటు తీసి రాద్దాంతం చేద్దామా అన్న ధోరణిలోనే ఎప్పుడూ వుంటుంది."
"చెప్పుడు మాటలు వినటంలో గొప్ప సంతోషమనుభవిస్తూ వుంటుంది. పనివాళ్ళతో, తన దగ్గర బంధువులతో నా గురించి చెబుతూ, వాళ్ళు శ్రేయోభిలాషులై నట్లూ, వాళ్ళ సానుభూతి పొందుతూ, తాను ఎంత అన్యాయానికి గురైపోయిందో నిరంతరం చర్చిస్తూ వుంటుంది."