Previous Page Next Page 
త్రినేత్రుడు-1 పేజి 23


    ఒక అరగంటసేపు త్రినాధ్ డైరీని పరిశీలించడంలోనే మునిగిపోయాడు.

    ఆ తరువాత అన్నాడు నెమ్మదిగా-

    "వసుంధరాదేవి వాసమ్మగా ఎలా మారిందమ్మా...?" ఓ క్షణం ఆమె ఉలిక్కిపడింది.

    "అంటే... అంటే..." ఆమె గొంతులో ఉద్వేగం. త్రినాధ్ చిరునవ్వుతో అవునన్నట్లు తలూపాడు.

    ఆమె బలహీనమైన శరీరం కొడుకు చదవగలగుతున్నాడన్న ఆనందాన్ని భరించలేకపోయింది.

    మాటలు తడబడ్డాయామెకు.

    కొద్దిక్షణాల నిశ్శబ్దం తరువాత అన్నాడు-

    "నామీద నీకు నమ్మకం వుంటే రేపే నేనాలాకర్ ని తెరిచి సమాధి అయిన దారుణాల్ని తెలుసుకుంటాను."

    ఆ డైరీలో వివరాలు అస్పష్టంగా లింక్ లేనట్లుగా వున్నాయి. కాని త్రినాధ్ కి చిన్న అనుమానం కలిగింది.

    "ఇప్పుడే వద్దు నాన్న. ణా మాట విను. మరికొన్నాళ్ళాగు..." ఆమె కంఠంలో తొంగిచూసిన అభ్యర్ధనకు త్రినాధ్ ఒకింత కదిలిపోయాడు.

    "కాని చిన్న అనుమానం, ఆ వ్యక్తి ఎవరు...?" కొడుకు కళ్ళల్లో తొంగి చూస్తున్న ఆసక్తిని గమనించిందామె.

    అది కూడా చెప్పకపోతే కొడుకు బాధ పడవచ్చని చెప్పటానికే నిర్ణయించుకుంది.

    "అతను నాకు అన్న, పేరు సుదర్శన్ రావు..."

    త్రినాధ్ పక్కలో బాంబుపడ్డట్టు అదిరిపడ్డాడు. కొద్దిక్షణాలు అతని మెదడు మొద్దుబారిపోయింది.


                      *    *    *    *


    పోలీస్ స్టేషన్ లో రాఘవ సీరియస్ గా పచార్లు చేస్తున్నాడు.

    ఎదురుగా త్రినాధ్ కూర్చున్నాడు. కొద్ది నిమిషాల తర్వాత రాఘవ త్రినాధ్ వైపు తిరిగాడు.

    "కొండను ఢీ కొంటున్నావేమో త్రినాధ్ మరొక్కసారి ఆలోచించ కూడదూ?"

    ఎస్.ఐ. రాఘవకు త్రినాధ్ పట్ల కృతజ్ఞత. ఆరోజు రాఘవకు ఇంకా బాగా గుర్తు.

    స్మగ్లింగ్ వ్యవహారాల్లో కాకలు తీరిన ఇద్దరు వ్యక్తులు ఆరోజు మారుతీ థియేటరులోకి వెళ్ళగా చూసి ఓ ఇన్ ఫార్మర్ తనకు ఫోన్ చేశాడు. వార్ని ఫాలో కమ్మని హెడ్ కానిస్టేబుల్ కోటిని, మరో పోలీస్ ని పంపి తాను స్టేషన్ దగ్గర జీప్ సిద్ధం చేసుకొని డేగలా ఎదురుచూస్తుండగా ఫోన్ వచ్చింది... ఆ ఇద్దరు వ్యక్తులు సినిమా మధ్యలోనే లేచి థియేటర్ వెనుకవేపున్న అడవివేపు సాగిపోయారని, వార్ని హెడ్ కానిస్టేబుల్ కోటి అనుసరించాడని, మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కూడా వార్ని అనుసరించారని.

    తను వెంటనే జీప్ లో బయలుదేరాడు. ఆ అడవిలో కొన్ని గంటలపాటు శోధించాక స్మగ్లర్స్ రహస్య స్థావరం కనిపించడంతో ఆవేశంగా ముందుకు దూకబోయిన క్షణంలో అనుకోని ప్రమాదం ఒకటి ఎదురైంది. నలుగురు బలమయిన వ్యక్తులు తనను ఒంటరిగా చుట్టుముట్టి, తమ ఆధీనంలోకి తీసుకొని ముగ్గురు తనను క్రింద పరుండబెట్టగా, నాలుగో వ్యక్తి పెద్ద బండను ఎత్తి తన తలకేసి గురిచూసిన క్షణం తనకింకా బాగా గుర్తు.

    తనకి చావు తప్పదని ఘడియల్ని లెక్కపెట్టుకున్న ఆ క్షణంలో మెరుపులా దూకాడు త్రినాధ్.

    తన ప్రాణదాత త్రినాధ్.

    తనను రక్షించడానికి కాకపోయినా థియేటర్ క్యూలో ఎవరో తనను అవమానించారని మొండి పట్టుదలతో ఆరోజు త్రినాధ్ వార్ని అనుసరించి వుండకపోతే తను ఈరోజు వుండేవాడు కాదు. అందుకే రాఘవకు త్రినాధ్ అంటే కృతజ్ఞత.

    దానికితోడు సుదర్శన్ రావు ఎలాంటివాడో కూడా రాఘవకు బాగా తెలుసు.

    "గోవింద యాదవ్ కూడా అంత తేలికైనవాడు కాదు త్రినాధ్. అతన్నెలా ఖాళీ చేయించగలననుకుంటున్నావ్...?"

    రాఘవ మాటలకు త్రినాధ్ మెల్లగా నవ్వాడు.

    అదే మరొకరు తను సలహా చెప్పినప్పుడు అలా నవ్వితే లాఠీతో డొక్కలో పొడిచేవాడు నిర్ధాక్షిణ్యంగా. కాని త్రినాధ్ ప్రాణదాత.

    "యాదవ్ ని కదిలించడం మా పోలీసులక్కూడా భయమే..." రాఘవ మాటల్ని మధ్యలోనే కట్ చేస్తూ అన్నాడు- 

    "మీరు ఆ టైమ్ కి అక్కడకు రాకుండా వుండడమే నాకు సహాయం చేసినట్టవుతుంది."

    రాఘవ బిత్తరపోయి చూశాడు.


                                                   *    *    *    *


    త్రినాధ్ హిందూ రూమ్ కెళ్ళి హీరాలాల్ వద్ద నుంచి 1000 రూపాయలు తీసుకొని అతనికేం సమాధానం చెప్పకుండా వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు.

    సాయంకాలం అవుతోంది.

    అక్కడ హీరాలాల్, అతని భార్య, హిందూ ఆందోళనగా ఎదురు చూస్తున్నారు ఏ వార్త వినవలసి వస్తుందోనని.

    ఇక్కడ గోవింద యాదవ్ ఒక పాతికమంది గూండాలను తీసుకొని బిల్డింగ్ చుట్టూ కాపలా పెట్టించాడు.

    సమయం 6-25 అయింది.

    యాదవ్ బయటకు కనిపించకపోయినా లోలోన త్రినాధ్ పట్ల భయపడుతూనే వున్నాడు.

    సరిగ్గా 6-30కి ఒక రిక్షా ఆ వీధి మలుపు తిరిగింది. దానివెనుకే మరొకటి... అలా వరుసగా దాదాపు వంద రిక్షాలు ఆ వీధిలోకి చేరిపోయాయి.

    ఒక్కసారే ఎందుకన్ని రిక్షాలు ఆ వీధిలోకి వచ్చాయో అర్ధంకాక చుట్టుప్రక్క వాళ్ళు ఆశ్చర్యపోతుండగానే ఓ రిక్షాలోంచి ముందుగా త్రినాధ్ దిగాడు.

    పైన తన గదిలో అసహనంగా పచార్లు చేస్తున్న యాదవ్ త్రినాధ్ ని చూసి ఓ క్షణం ఉలిక్కిపడ్డాడు. అప్పుడనుకున్నాడు త్రినాధ్ సామాన్యుడు కాడని.

    త్రినాధ్ రిక్షాలోంచి దిగుతున్న రిక్షావాలాల వేపు ఓసారి మర్మగర్భంగా చూశాడు.

    అంతే- వాళ్ళు రిక్షాల్లో అప్పటివరకూ దాచుకున్న కర్రల్ని, చెయిన్స్ ని సర్రున బయటకు లాగి పారా మిలిటరీ మార్చింగ్ లా రెండు వేపుల నుంచి ఆ బిల్డింగ్ ని కమ్మేశారు.

    అప్పటికప్పుడు నడుంకి బిగించి వుంచుకున్న సైకిల్ చైన్ కి సర్రున అలవోకగా బయటకు లాగాడు త్రినాధ్.

    అప్పటికి కాని ఆ వీధినే వెళ్ళేవాళ్ళకు, చుట్టుపక్కల వాళ్ళకు అర్ధం కాలేదు, మరికొద్ది క్షణాల్లో అక్కడో బీభత్సం జరగబోతోందని.

    త్రినాధ్ సంజ్ఞననుసరించి నలుగురు ఆ వేపుకి, మరో నలుగురు ఈ వైపుకి వెళ్ళి రోడ్ ని బ్లాక్ చేసేశారు.

    త్రినాధ్ ని తక్కువ అంచనా వేశాడు యాదవ్- ఇతని వెనుక ఎంత మందుంటారులే అన్న ఆలోచనతో. కానిప్పుడు చూస్తుంటే వీడు సామాన్యుడు కాడేమోననే జంకు కలిగింది.

    సరీగ్గా ఆ మానసికమైన జంకునే కలిగించాలనుకున్నాడు త్రినాధ్. అన్ని వందలమంది అక్కడున్నా ఏ ఒక్కరూ కిక్కురుమనడం లేదు. విచిత్రమైన నిశ్శబ్దం అలుముకుందక్కడ.

    నిజానికి ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా యాదవ్ అంటే మంటగానే వుంది. అయితే ఇంతకాలం అతన్ని ఖాళీ చేయించే దమ్ము, ధైర్యంలేక అతనికి లొంగినట్లే నటిస్తూ వస్తున్నారు.

    క్రితం రోజు ఎవరో ఒకడు వచ్చి యాదవ్ ని చావచితక్కొట్టి ఖాళీ చేయమని వార్నింగ్ ఇచ్చినట్లు తెల్సుకుని లోలోన సంతోషపడుతున్నారు. ఏదో ఒక గొడవ జరక్కమానదనే భయంతో వాళ్ళు ఆరింటికే షాప్స్ కట్టేసి షట్టర్స్ ముందు నిలబడి దుష్ట సంహారం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

    ఇద్దరో, ముగ్గురో వస్తారు. ఉతికి పారేయండని యాదవ్ సాబ్ చెప్పాడు. తీరా చూస్తే వందమందికి పైగా వున్నారు. ఏం చేయాలో తోచక సందిగ్ధంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు యాదవ్ మనుష్యులు.

    ఆ నడివీధిలో పేరుకున్న నిశ్శబ్దంలోంచి త్రినాధ్ కంఠం పిడుగుపాటులా వినిపించింది.

    "గోవింద యాదవ్- మర్యాదగా లొంగిపొ. నీకు కరెక్టుగా అరగంట మాత్రమే టైమ్ ఇస్తున్నాను. బిల్డింగ్ ఖాళీ చేసేయ్. లేదంటే హరిహరాదులు అడ్డువచ్చినా నన్నాపలేరు."

    అందరూ స్థాణువులైపోయారు.

    ఊపిరి బిగపట్టి చూస్తున్నారు.

    త్రినాధ్ ఓసారి తన చేతిలో వున్న చైన్ ని గాల్లో వూపాడు.

    ఆ రోడ్డున నడిచే సిటీబస్ లు, ఆటోలు, పాదచారులు ఎక్కడికక్కడే, ఎక్కడివారక్కడే ఆగిపోయి వింతగా చూడటం ప్రారంభించారు.

    త్రినాధ్ కదిలాడు.

    ఒక్కొక్క అడుగే వేస్తూ మెట్లవేపు సాగాడు. గాలి కూడా స్తంభించి పోయిందా అన్నంత నిశ్శబ్దంగా వుందా ప్రాంతం...

    త్రినాధ్ ఒక్కడే, ఒంటరిగా అలా యాదవ్ వైపు సాగిపోతుండడం అందరికీ విస్మయంగాను, థ్రిల్లింగ్ గానూ వుంది.

    యాదవ్ సైకలాజికల్ గా అప్ సెట్ అవడంతో వెంటనే ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నాడు.

    త్రినాధ్ మెట్లెక్కుతున్నది స్పష్టంగా కనిపిస్తోంది యాదవ్ కి.

    ఏదో ఒకటి చేయాలి... లేదంటే....?

    యాదవ్ చటుక్కున ఫోన్ ఎత్తి పోలీస్ స్టేషన్ నెంబర్ డైల్ చేశాడు. రింగ్ అవుతోంది కాని ఎవరూ ఆవైపు లిఫ్ట్ చేయడం లేదు. అతనికి చెమటలు పట్టేశాయి.

    త్రినాధ్ మెట్లన్నీ ఎక్కేసి తలెత్తగానే ఇద్దరు బలిష్టంగా ఉన్న వ్యక్తులు తనవేపే క్రోధంగా చూస్తూ కనిపించారు.

    త్రినాధ్ మనసులో అనుకున్నాడు- కొద్దిపాటి యుద్ధమైనా తప్పదేమోనని.

    ఆ పాటికే ఆ ఇద్దరూ అమాంతం త్రినాధ్ పైకి దూకారు.

    అలాంటిదేదో జరుగుతుందని ముందే వూహించిన త్రినాధ్ ని ఆ ఇద్దర్ని నిరోధించటం అంత కష్టమేం కాదు.

చిన్నప్పటి నుంచి వీధి పోరాటాల్లో పాల్గొన్న అనుభవం ఇప్పుడతనికి పనికొచ్చింది.

    అనాలోచితంగా దూకేవాడికి, ఆలోచనగా అడ్డుకొనే వాడికి మధ్య చాలా తేడా వుంది.

    త్రినాధ్ కావాలనే ముందు అంతగా ప్రతిఘటించకుండా రెండు, మూడు దెబ్బలు తిని వార్ని తనకు అతి చేరువుగా రానిచ్చాడు.

    ఒక్కసారి గుండె నిండా ఊపిరి తీసుకున్నాడు. అంతే - ఇనుప ముక్కలాంటి అతని రెండు చేతులు గాల్లో లేచాయి. ఆ మరుక్షణం ఆ ఇద్దరూ చావుకేక లేస్తూ మెడలు పట్టుకొని కూలిపోయారు.

    క్రింద వున్న వాళ్ళంతా ఒక్కసారి ఆనందంగా ఈలలు వేశారు గుంపుగా ముందుకు కదులుతూ.

    యాదవ్ గది ముందు కాపలాగా వున్న మరో ఇద్దరు గూండాలు చేష్టలు దక్కి అపర శివుడిలా వున్న త్రినాధ్ ని చూసి ఒకింత జంకారు.

    వారిదర్ని కూడా నేల కరిపించటం త్రినాధ్ కి పెద్ద కష్టం కాలేదు.

    ఆ మరుక్షణం త్రినాధ్ చేతిలో యాదవ్ గొంతు ఇరుక్కుంది.

    ఈలోపు క్రింద వున్న రిక్షావాలాలు నలుగురేసి చొప్పున యాదవ్ మనుష్యుల్ని అష్టదిగ్భంధనం చేసేశారు.

    సరీగ్గా 7-30కి యాదవ్, అతని మనుష్యులు రోడ్డుమీదున్నారు.


                      *    *    *    *


    "చట్టం, న్యాయస్థానం, ప్రతుత్వ యంత్రాంగం హీరాలాల్ కి చేకూర్చలేని న్యాయాన్ని నేను చేకూర్చాను. దీన్ని మీరు దౌర్జన్యమన్నా, మరేదన్నా నాకు అభ్యంతరం లేదు."

 Previous Page Next Page