పై రెండు స్క్రిప్ట్ లు కూడా చూడటానికి అంత బాగాలేవు. కానీ మొదటి చేతివ్రాతలో ఒక అక్షరం ఒకలావుంటే మరో అక్షరం సైజు వేరేలావుంది. ఒక అక్షరం పెద్దగా వుంటే మరో అక్షరం చిన్నగావుంది. ఇంకా జాగ్రత్తగా గమనిస్తే ఒకే అక్షరం ఒకచోట ఒకలాగ వ్రాయబడింది. మరోచోట ఇంకోలా వ్రాయబడింది. కానీ, రెండో స్కిప్ట్ చూడటానికి అంత బాగోలేదు. అదివేరే విషయం. కానీ అక్షరాలన్ని మాత్రం ఒకేలాగ వున్నాయి.
ఇప్పుడు మీచేతి వ్రాతను పరిశీలించండి. మీరు ఒక అక్షరం వాక్యం ప్రారంభంలో ఒకలా వ్రాసి, చివరిలో మళ్లీ అదే అక్షరం వ్రాయవలసి వచ్చినప్పుడు మరోలా వ్రాస్తే మీరుమొదటి వర్గానికి చెందినవారన్నమాట. అలా కాకుండా ప్రతీ అక్షరం ఏస్థానంలోనైనా ఒకేలాగ వ్రాస్తే మీరు రెండో వర్గానికి చెందినవారు. ఈ రెండు వర్గాలనీ ఇఫ్పుడు విశ్లేషిద్దాం.
మొదటి వర్గం వారు:
ఒక అక్షరం పెద్దగా, అదే వాక్యంలో మరో అక్షరం చిన్నగా, లేదా - ఒక అక్షరం ఒకచోట ఒకలా, మరోచోట మరోలా, లేదా - ఒక వత్తు ఒక చోట ఒకలా, మరోచోట మరోలా, లేదా - ఒక గుణింతం పెద్దగా అదే గుణింతం వేరేచోట మరోలా... వ్రాసేవాళ్లు ఈ వర్గానికి చెందుతారు. ఒకే అక్షరాన్ని వేర్వేరుగా వ్రాసే వారుకూడా ఇదే వర్గానికి చెందుతారు.
1. ఈ వర్గం వ్యక్తులకు దేనికోసమో నెర్వస్ గా ఫీలవటం,డీలాపడటం, దిగులుపడటం సర్వసామాన్యమైన విషయం.
2. వీళ్లు తమమీద తమకి ఎక్కువ నమ్మకం కలిగివుంటారు. ఇతరులకోసం బతకటం లాంటివి చేయరు.
3. ఆడంబరంగా తయారవటం కంటె, మామూలుగా కంటికింపైన రంగులు గల దుస్తులు ధరించటాన్నే ఇష్టపడతారు.
4.అలాగే నలుగురిళ్లకి వెళ్లి కాలం గడిపేకంటే, ఆ నలుగురూ తమ ఇంటికే వచ్చి కాలం గడపాలని కోరుకుంటారు.
5. పనులు చేయటంలో వీరిని తొందరపెడితే వీరికి అసలు నచ్చదు.
6. కావలసిన దాన్ని కోరి పొందటం కంటే అధికారికంగా అడిగిపుచ్చుకోవడం వీరి అలవాటు.
7. వీరు సహనపరులైనప్పటికీ కోపిష్టిలుగాను, అవసరమైన్పుడు ఖర్చుపెట్టినప్పటికీ స్వార్దపరులు గానూ పేరు పొందుతారు.
8. ఇలాంటి చేతి వ్రాత వున్నవారు స్త్రీలైతే, భర్త వ్యాపారంలో దివాలా తీస్తే నర్సు ఉద్యోగంలో చేరి నైట్ డ్యూటీ చేసి ఇంటికొచ్చి జ్వరంతో బాధపడుతున్నకూతురు/ కొడుకునీ కంటికి రెప్పలా చూసుకోగలను అన్న మానసిక ధైర్యం వీరికి వుంటుంది. నా విధి అంతే అని పరిస్థితులకి లొంగిపోరు. వాటిని తమకు అనుగుణంగా మార్చుకొని ఆనందమయ జీవితం గడపటానికి ఇష్టపడతారు.
రెండవవర్గంవారు:
మొట్టమొదటి వాక్యంలోమొదటి అక్షరం ఎలావ్రాస్తే చివరి వాక్యంలో చివరి అక్షరం కూడా అలాగే వ్రాసేవారు సాదారణంగా ఉదార స్వభావులై వుంటారు. ఏ అక్షరం ఎక్కడ వచ్చినా, ఏ తలకట్టు ఎక్కడొచ్చినా మీరు ఒకేలా వ్రాస్తారు. అలాగని వీరి చేతివ్రాత బాగుండాలని రూల్ ఏమీ లేదు. బాగుండకపోవటంలో కూడా ఒస సిస్టమేటిక్ అప్రోచ్ వీరి వ్రాతలోవుంటుంది.
1. సాంకేతికంగా వీళ్లు ప్రేమించటంలో నిపుణులు. కానీ అది మానసిక సమస్యలను అంత త్వరగా పరిష్కరించడానికి ఉపయోగపడదు. వీరు ప్రతీ విషయాన్నీ భూతద్దంలో పరిశీలి్సతారు. చివరికి ప్రేమను కూడా తమ ప్రియురాలు/ప్రియుడు బహుమతిగా ఒక పౌడర్ డబ్బా తీసుకువస్తే అది కొనటానికి ఎంత ఖర్చు అయిందీ, ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది, దానివల్ల లాభాలు నష్టాలు - ఇలాంటివన్నీ ఆలోచిస్తారే తప్ప ఆ బహుమతి తీసుకోవడంలో వుండే ఆనందాన్ని పొందలేరు.
2. ఈ టైపు వ్యక్తులని సమస్యలు పరిష్కరించమని కోరటం అంత బుద్ది తక్కువ పని ఇంకోటిలేదు. ఉదాహరణకి ఇటువంటి వ్యక్తి మీ భర్త అయి మీ పక్కింటి ఆవిడ మిమ్మల్ని ఎలా బాధపెట్టిందో చెప్పడానికి అతని దగ్గరకు వెళ్తే, సాధారణంగా అతనంతా విని సానుభూతి చూపాలని మీరు కోరుకుంటారు. కానీ ఈ వర్గం వ్యకతి మొట్టమొదట అడిగే ప్రశ్న.
"నువ్వేమన్నావ్ ముందు?"
ఇలా ప్రశ్నలు వేసి మీరు ఎక్కడ తప్పటడగు వేశారో ఎత్తిచూపుతాడే తప్ప అవతల వాళ్ల గురించి ఒక్కమాట కూడా అనడు. చివరకు మీకు విసుగొచ్చి "మీకు చెప్పడం నాదేబుద్ది తక్కువ" అని అరచే వరకూ , పక్కింటివాళ్లతో ఎలామసలుకోవాలో అతను ఉపన్యాసం ఇస్తూనే వుంటాడు. మీరెంత గట్టిగా అరిచినాసరే అతడి అభిప్రాయంలో ఏమార్పు వుండదు. తప్పుమీది అని అతనికి అనిపిస్తే అవతలి వాళ్లు మీకుటుంబానికి ఎంత శత్రువైనా సరే మిమ్మల్ని సపోర్ట్ చెయ్యడు. ఇలాంటి మూర్తీభవించిన న్యాయాన్ని చూడగలగడం ఈ కలికాలంలో అధ్బుతమే కదా!
3. మొదటినుంచీ చివర వరకూ అక్షరాలు ఒకేలా వ్రాస్తే వాళ్లు మిన్ను విరిగి మీద పడ్డా తొణకరు. అయితే తోటివాళ్ల అవసరాల గురించి లోతుగా ఆలోచించలేని మనస్తత్వం వల్ల వీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఏదైనా ఒక విషయం గురించి తమ అమోఘమైన తెలవితేటలతో అధ్బుతమైన విశ్లేషణ చేసేవారు,తమ దగ్గరి వారిని ఏ విషయం సంతోషం పెడుతుందో తెలుసుకో లేక పోవటం ఒక విధంగా దురదృష్టకరం. ఇటువంటి వ్యక్తులు చాలా బ్యాలన్స్ డ్ గా ప్రవర్తిస్తుంటారు. ఇటువంటి వాళ్ల అండవుండటం మంచిదే కానీ వీరినిర్లిప్తతని సహించక తప్పదు. అందకే హిందీలో ఒక గజల్ వుంది. 'కుఛ్ పాసా హైతో, కుఛ్ కోనా హై!'