Previous Page Next Page 
కాంక్రీట్ జంగిల్ పేజి 22


    "కూర్చోమంటున్నానుగా....కూర్చోవయ్యా...." మళ్ళీ అన్నాడు జగపతి.

    వర్మకు కాళ్ళు వణుకుతున్నాయి అతని ఎదురుగా కూర్చోవడానికి.

    చివరకు ఎలాగో ధైర్యం చేసి కూర్చున్నాడు.

    జగపతి సోఫాలోనుంచి లేచాడు.

    తనను కూర్చోమని ఆయనెందుకు లేస్తాడు. వర్మకు అంతా అయోమయంగా వున్నది. అతని గుండె వేగంగా కొట్టుకుంటున్నది.

    జగపతి విస్కిసీసా, రెండు గ్లాసులు సోడాలను తెచ్చి టీపాయ్ మీద పెట్టి సోఫాలో కూర్చుంటూ వర్మవైపు సీరియస్ గా చూశాడు. "వర్మగారూ....మీకు ఇద్దరు భార్యలనుకుంటాను" వర్మకు అసలే మోకాళ్ళు మొద్దుబారుతున్నాయి. దానికితోడు తనను 'గారూ' అని బహువచనంలో సంబోధించేసరికి వర్మకు మోకాళ్ళలోని ప్రకంపనం కాస్తా శరీరంలోకి ప్రవహించింది.

    "ఆ....అవునండీ" లేదంటే ఏం గొడవ వస్తుందోనని గొణిగాడతను.

    వర్మ తనను చూసి పూర్తిగా బెదిరిపోతున్నాడన్నా విషయం జగపతికి అర్ధమయింది.

    విస్కీబాటిల్ తెరిచి రెండు గ్లాసుల్లోకి కొద్దిగా ఒంపి సోడా కలిపి ఒక గ్లాసును పెదవులకు తాకిస్తూ వర్మవైపు తమాషాగా చూశాడు జగపతి.

    అంతవరకూ ఆ గ్లాసువైపు ఆశగా చూస్తూ పెదవులు చప్పరిస్తున్న వర్మ తడబడుతూ తలవంచుకున్నాడు.

    విస్కీని రెండు గుటకలు వేశాడు జగపతి.

    "వర్మగారూ....నేను మిమ్మల్ని ఏదో పనిష్మెంట్ ఇవ్వడానికి పిలిపించలేదు. మీ దగ్గర నాకు తెలివీ విషయాలు తెలుసుకోవాలని మిమ్మల్ని రమ్మన్నానే తప్ప మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. కాస్తంత ఫ్రీగా మాట్లాడండి...." గ్లాసును ఖాళీచేసి టీపాయ్ మీద వుంచుతూ చెప్పాడు జగపతి.

    అప్పటికి వర్మకు కొంచెం ధైర్యం చిక్కపట్టినట్టయింది.
 
    "దానిదేముందండి....అడగండి చెప్తాను"

    "వర్మా....డ్రింక్ తాగే అలవాటుందా నీకు?"

    "ఏదో....కొద్దిగా...." సిగ్గుపడుతూ అన్నాడతను.

    "కమాన్ వర్మా....హవ్ ఇట్" రెండవ గ్లాసును ఆఫర్ చేశాడు జగపతి.

    వద్దు సార్" మొహమాటపడ్డాడు వర్మ.

    "తీసుకో వర్మా....ఫర్వాలేదు నేనే తీసుకో మంటున్నానుగా....నేను ఇప్పుడు నీకు బాస్ ను కాదు. ఒక స్నేహితుడ్ని....వియ్ ఆర్ ఫ్రెండ్స్....దట్సాల్"

    తప్పదన్నట్టు బెరుకు బెరుకుగా గ్లాసు తీసుకున్నాడతను.

    జగపతి ఒక నిమిషం తరువాత మళ్ళీ గ్లాసులను నింపాడు.

    వర్మకు క్రమంగా మత్తు ఎక్కుతోంది.

    బాటిల్ ఖాళీ అయిపోవచ్చింది.

    వర్మ పూర్తి నిషాలో వున్నాడు.

    జగపతి కావాలనే చాలా తక్కువగా తీసుకోవడంతో మామూలుగానే వున్నాడు.

    "సారూ....నా అదురుష్టం సారూ....కంపెనీ ఓనర్ అయివుండి మీరే ఒక వర్కర్ ని పిలిచి....అమృతం పోశారంటే....నా అదృష్టం సారూ...."

    వర్మకు మత్తులో తానేం మాట్లాడుతున్నాడో కూడా తెలీడంలేదు.

    "అది సరేగాని వర్మా....నాకు ఒక విషయం చెప్పు"

    "అడగండి....ఏ విషయమయినా కక్కేత్తాను"

    "నీకు ఇద్దరు పెళ్ళాలు కదా....ఎలా మెయింటిన్ చేస్తున్నావోయ్"
 
    వర్మ పిచ్చిగా నవ్వినట్టు నవ్వాడు.

    "అలా నవ్వుతానెందుకు?"

    "మీరు బలేవారు షార్....మీకు తెలవదేమో....నాకు మూడోది కూడా వుంది"
 
    "మూడో పెళ్ళాం కూడానా?"

    "అవును మరి...."

    "నువ్వు సామాన్యుడివి కాదురా బాబూ....ఇంతకూ వాళ్ళను ప్రేమించి పెళ్ళి చేసుకున్నావా లేక...."

    "ఒకదాన్నేమో ప్రేమించే చేసుకున్నానండి. రెండో దాన్ని మా అమ్మానాన్నలు కట్టబెట్టారు. ఇంక మూడోది అనుకోకుండా తటస్థపడి నా సెటప్పయి పోయింది.

    "ఎంత అదృష్టవంతుడివి. నీకా భగవంతుడు మంచి రాత రాశాడోయ్. ఇంతకూ ఆ ముగ్గురిలో నీకు ఎవరంటే ఇష్టం?"

    "మూడో సెటప్పంటేనే ఇష్టమండీ" నిషాలోనూ తల గోక్కుంటూ అన్నాడు వర్మ.

    నువ్వు నీ సెటప్పుని ఎలా లైన్ లో పడేశావోయ్ వర్మా...."

    "ఓయబ్బో....అది సెప్తే శానా శరితమవుతుందండీ"

    "ఫర్లేదు. చెప్పవోయ్"

    "ఓసారి సినిమాహాల్లో పరిచయం అయింది. అప్పటినుంచి ప్రతిరోజూ ఆమెకోసం బీట్ వేశానండి. ఎక్కడకు వెళ్ళినా కలియుగ కృష్ణుడులా వెంటపడేవాణ్ని. చిట్టచివరకు పాపం ఒప్పేసుకుందండి పిచ్చిది అంతే బాసూ. సెటిలై పోయింది"

    "మొత్తానికి ముగ్గురు అమ్మాయిల మొగుడివయ్యావు. నేనే చాలా దురదృష్టవంతుడినోయ్...." జగపతి గొంతులో దిగులు.

    "ఎందుకండీ?"

    "నా పెళ్ళాం మీద నాకు కోరిక కలగడంలేదు. ఒక సరసం, శృంగారం లాంటివేమీ దానికి తెలీవు...."

    "అయ్యో పాపం. పోనీ సెటప్పుల్లో ఒక సెటప్పుని పంపించమంటారా....అది అడగడానికనా నన్ను పిలిపించింది...."

    "అదేమీ కాదుకానీ....నీ సలహా కావాలి"

    "ఏంటో చెప్పండి....సిటికెలో పరిష్కరిత్తాను...."

    "నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను...."
 

 Previous Page Next Page