'అవున్లే - అదీకాక - ఇంక రోజూ రాజమండ్రీ రావటం నాకూ కుదరదు. ఇంట్లో ఉండి చక్కపెట్టాల్సిన పనులుంటాయి. పెళ్ళి దగ్గర పడిపోతోంది ' -- అంది విరజ.
"హడావుడి పడుతున్నాం కానీ చాలా పనులు చకచకా ముగిసిపోయాయి. ఇదే స్పీడులో జరిగితే పెళ్ళికి ముందు వారం రోజులు రెస్టు తీసుకోవచ్చు నెమో "--- అన్నాడు రాజారావు.
"రెస్టు సంగతి మరిచిపో - పెళ్ళయ్యేదాకా "-----అంది విరజ.
"ఇంత బాధ్యతగా ఇంటి పనులు చూసేవదినుంటే -----ఈ క్షణం నుంచే రెస్టు తీసేసుకోవచ్చు. మరచిపోవడం అనవసరం" అన్నాడు రాజారావు. ఇత్తడి సామాన్ల కొట్టు దగ్గరే వాళ్ళు మిగతా ముగ్గురి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు.
మోహనరావుకు తిరగటం మహా చిరాగ్గా వుంది. తలోచోటా తలో వస్తువూ ఉన్నాయి. బజారు నాలుగు మూలలా పరుగెత్తాల్సి వస్తోంది. ఇంతా చేసి వస్తువుల ఖరీదెంతో ఉండదు. పావలా సరుకు కోసం పదినిముషాలు నడవాల్సోస్తుంది. ఒక్క గంధపు ఉండలు మినహాయించి అన్నీ కొనడం అయిపోయినట్లే !
సోడాలు తాగుతుండగా కల్యాణి గుర్తు చేసింది -- అన్నయ్యా - గంధపుండలు కొనలేదు "-----అని - అదా మేకివ్వబడిన డ్యూటీ. అంతే కాక ఆ గంధపుండలేలాగుంటాయో చూడాలని కళ్యాణికి చాలా కుతూహలంగా ఉంది.
'అలాగే కొందాములే -----' అని మోహనరావక్కడి నించి బయలుదేరాడు. దారిలో పువ్వులు దుకాణం కనబడింది. ఇంట్లో ఆడవాళ్ళు చాలా మందున్నారు. సరదాగా పువ్వులు కొందామని అతనక్కడ పువ్వుల బేరం చేశాడు. బేరంలో వెంకట్రామణ అతనికి సహాయపడ్డాడు.
పువ్వులు కొనడం కాగానే -----' అన్నయ్యా - గంధపుండలు " అంది కళ్యాణి.
'అలాగే కొందాం" అంటూ మోహనరావు ముందడుగు వేశాడు. ఒకచోట పేవ్ మెంటు మీద ఎవరో తమాషా బొమ్మలమ్ముతున్నాడు. వికృతమైన ముఖాలతో ఆ బొమ్మలు పిల్లలకు చాలా ఆకర్షణీయంగా వుండేలాగున్నాయి. రాజకుమారినీ, మోహిన్నీ దృష్టిలో వుంచుకుని అతను రెండు బొమ్మలు కొన్నాడు. ఇంక ఇత్తడి కొట్ల దగ్గరకు వెడదామా అనుకున్నంతలో "గంధపుండలు " అంది కళ్యాణి. తన డ్యూటీ ని నిర్వహిస్తోంది కళ్యాణి.
మోహనరావు "కనీసం నీగురించయినా అవి కొనక తప్పదులే" అని మార్కెట్ లోకి నడిచాడు. అయితే మోహనరావుది స్థిర చిత్తం కాదు. అతనొక పనిమీద మనసును లగ్నం చేయలేడు. వచ్చిన పనినతను సులభంగా మరచి పోతాడు. ఒక పనికి వెళ్ళి మరోపని చేసుకువచ్చిన సందర్భాలు చాలా వున్నాయి. ఆమె కళ్యాణికి మరీ మరీ చెప్పింది ----- అన్నయ్యకు సరుకులు బాగా గుర్తు చెస్తుండమని.
కాళీగాపోతున్న రిక్షా వాడొకడు మోహనరావుని పలకరించి -- "కోటగుమ్మం కేసి వస్తారాండి" అనడిగాడు.
"కోటగుమ్మం కాదు గానీ - ఇత్తడి సామాన్ల కొట్టుకి వెళ్ళాలి. ముగ్గురున్నాం " అన్నాడు మోహనరావు వివరాలు పూర్తిగా చెబుతూ.
"ఎక్కండి అర్ధరూపాయివ్వండి చాలు" అన్నాడు రిక్షావాడు.
చౌకబేరం గదా అని మోహనరావు రిక్షా ఎక్కేశాడు.
"మరి గంధపుండలు ...." అంటూనే రిక్షా ఎక్కింది కళ్యాణి.
"ఏం ఫరవాలేదు ----ఈవేళ కాకపోతే రేపైనా అవికొని నీకు చూపించాకనే నెన్నిద్రపోతాలే" అన్నాడు మోహనరావు . వీళ్ళు వెళ్ళేసరికి అప్పటికి పది నిమిషాల్నించి ఎదురు చూస్తున్నారక్కడ రాజారావు వగైరాలు.
'అన్ని పనులూ అయ్యాయా?" అడిగింది విరజ.
"ఆ" అన్నాడు మోహనరావు.
"వదినా -గంధపుండలు కొనలేదు" అంది కళ్యాణి.
"బాగా అంటించావు నాకు. లాంచీ దిగినప్పటి నుంచీ గంధపుండలు, గంధపుండలు అని చంపేస్తోంది. తినే సరుకును కుంటోందో ఏమో" అన్నాడు మోహనరావు.
'ఛీ ---" అంది కళ్యాణి సిగ్గుపడుతూ.
"ఏమైతే ఏం. మీరు మాత్రం కొనలేదుగా ' అంది విరజ.
"కొనలేదు కానీ ఇంకమీదట - ఆ విషయం గుర్తు చేయడానికి అది నా కూడా రానక్కరలేదు. దాని ఫోటో ఒకటి చేతిలో వుంటే చాలు. చూసినప్పుడల్లా గంధపుండలు గుర్తుకొస్తాయి ' అన్నాడు మోహనరావు.
టైము రమారమి అయిదు కావస్తోంది . అందరూ సామానుతో సహా హోటల్లో దూరారు. కడుపు నిండా టిఫిన్ తిని బయటపడి సిటీ బస్సెక్కి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద దిగారు. మనుషులు చాలామంది వున్నారు కాబట్టి తలో బిందీ, చెంబు వగైరా సర్దుకుని నడుచుకుంటూ బొబ్బర్లంక చేరారు. నడకాట్టే అలవాటు లేని విరజకు కష్టమే అనిపించింది. కానీ మోహనరావు సరదా కబుర్లతో నవ్విస్తూ శ్రమ తెలియకుండా చేశాడు. గంధపుండల మీద దారిలో కూడా జోకులు పడ్డాయి
బొబ్బర్లంక నించి రిక్షా ఎక్కి ఇల్లు చేరారు. గుమ్మంలో అడుగు పెడుతుండగానే 'పెళ్ళివారి దగ్గర్నుంచి కబురు వచ్చింది. రేపు భీమరాజు బావగారే స్వయంగా ధవళేశ్వరం వస్తున్నారట. రెండు వేలూ తీసుకురమ్మని కబురొచ్చింది" అన్నాడు వెంకట్రామయ్య.
"దాన్దేముంది--అలాగే కానిద్దాం" అన్నాడు రాజారావు.
ఎండలో తిరిగారేమో వాళ్ళందరి ముఖాలు బాగా వాడిపోయి వున్నాయి. "లోపల కెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి" అన్నాడు వెంకట్రామయ్య.
"గంధపుండలు కొంటె కానీ కళ్యాణి నన్ను విశ్రాంతి తీసుకోనివ్వదు" అన్నాడు మోహనరావు.
* * * *
మరుసటి దినం రాజారావు తండ్రితో కలిసి ధవళేశ్వరం వెళ్ళాడు. భీమరాజు గారు తమ్ముడి ఇంట్లో బస చేశాడు. పెళ్ళికి సంబంధించిన కొన్ని వ్యవహారాలు తమ్ముడితో స్వయంగా మాట్లాడ్డానికి వచ్చేడట అయన. రెండు వేలూ అందుకున్నాక ఆయన ముఖంలో పరిపూర్ణ తృప్తి కనబడుతుంది.
"మీకింక పదిహేను వందలివ్వాల్సి వుంది. ఆఖరున భజంత్రీలు . పల్లకీ వగైరా ఖర్చులు ముగిశాక -- అన్నీ లెక్క చూసుకుందాం" అన్నాడు వెంకట్రామయ్య.
"దానిదేముందీ -----మీరెలాగంటే అలాగే" అన్నాడు భీమరాజు.
రాజారావు, వెంకట్రామయ్య వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు.
15
"ఇంక పెళ్ళి పదిరోజుల్లో కొచ్చేసింది " అన్నాడు మోహనరావు.
"ఇప్పుడు మనం తాపీగా అన్నీ చర్చించాలి. మిగిలిపోయిన పనులేమిటీ అన్నది చూస్కోవాలి" అన్నాడు రాజారావు.
'అవును - ఎవరు మొదలు పెడతారు".....మోహనరావు సందేహం.
"సరే నేను మొదలు పెడుతున్నాను......ముందు పెళ్ళివారు వచ్చారనుకొండి ...."
"పెళ్ళి వారికంటే ముందు వంట బ్రహ్మలోస్తారు. ఒకరోజు ముందుగా మిఠాయి, అరిశలు చేయాలి కదా" అంది వసుంధర.
"సరే వంట బ్రాహ్మలే వచ్చారనుకుందాం - వాళ్ళకేం కావాలి...."
"దొడ్లో గాడి పొయ్యి. పొయ్యి లోకి కట్టెలు, పొయ్యి మీదకు పాత్ర సామాను. పాత్ర సామానుల్లోకి దినుసులు" విరజ చెప్పింది.
"అన్నట్లు పంచదార వచ్చిందా" అనడిగాడు మోహనరావు.
ఆ గ్రామంలో ఒక పెద్ద రైతుకు దగ్గరలో వున్న మరో గ్రామంలో పంచదార మిల్లుంది. అతనొక బస్తా పంచార వెంకట్రామయ్య గారికి కంట్రోలు రేటుకిస్తానాని వాగ్దానం చేశాడు. అది తీసుకురావడం శ్రీకాంత్ బాధ్యత.