Previous Page Next Page 
పెళ్ళి చేసి చూడు పేజి 21

 


    వెంకటేశు ఉత్సాహంగా కాయలు నరికేస్తున్నాడు. అతను నరికే వేగానికి సరిపడ వేగంలో కాయల్నతనికి అందించలేక పోతున్నారు ముగ్గురు కూడా. అందువల్ల మధ్య మధ్యలో వెంకటేశుకి విరామం దొరుకుతుంది. అతని చేత పాటలు పాడించుకుని విన్నారు మిగతా అందరూ.
    వెంకటేశు పద్యాలు చాలా బాగా పాడుతాడు. ముఖ్యంగా జెండా పై కపిరాజు అతని ప్రత్యేకత. సిగ్గుపడుతూ పాడిన ఉత్సాహంగానే పాడేడతను. కృష్ణారాయభారం పద్యాలు. మాటలు సాగదీసినా - అదీ ఒక అందంగానే ఉందనుకున్నారంతా.
    ఆవకాయ పెట్టడం అయిపోగానే అలసటను ప్రకటించాడు మోహనరావు - "వీడేపని చేయనే లేదు. కాయలు కూడా కాసేపు తుడిచాడంతే ---" అన్నాడు బాబు. అతను కాయలు తుడిచేక ముక్కల్లో జీడి వేరు చేయడంలో కూడా సహాయపడ్డాడు. మోహనరావు మాత్రం కబుర్లు చెబుతూ అందర్నీ నవ్వించాడు -తనేపనీ చేయకుండా.
    "ఒరేయ్ పనిచేసే వాడికి వినోదం చాలా ముఖ్యం. అందరికీ చేతనయ్యేది కాదు. నేను పనిచెయ లేదని నువ్వనుకుంటున్నావు కానీ మీపని త్వరగా పూర్తయిందంటే అందుకు నేనే కారణం. నా కట్టుర్ల లోపడి మీకు టైము , శ్రమ రెండూ తెలియకుండా పోయాయి...." అన్నాడు మోహనరావు.
    'అయినా ఎవరు పనిచేశారో చేయలేదో నీకెందుకురా----' మార్కులు తీయించేసే బుద్ది ఇప్పటికీ పోలేదు - నీకు - " అన్నాడు రాజారావు.
    "అదేమిటి?" అంది వసుంధర.
    "వీడు చెప్పేదాకా అన్నయ్య అందరితో సమంగా పనిచేయలేదని మనమెవ్వరూ గ్రహించలేదు. అంటే వాడికీ అందరితో సమంగా మార్కులు పడ్డాయి. కానీ అసలు సంగతి బహిర్గతం చేసి మనమంతా అన్నయ్యకు వేసిన మార్కులు తీయించేశాడు. చిన్నప్పుడు మేం చదువుకునే రోజుల్లో కూడా వీడిలాగే చేస్తుండేవాడు-' అన్నాడు రాజారావు.
    బాబు ముసిముసిగా నవ్వాడు. రాజారావు విషయాన్ని వివరించాడు.
    చదువుకునే రోజుల్లో బాబు పరీక్ష పేపర్లి చ్చినప్పుడా టోటల్సు మరోసారి వెరిఫై చేసేవాడు. తేడా వుంటే టీచరు వద్దకు తీసుకు వెళ్ళి సరి చేయించుకునేవాడు. తన పేపర్ల విషయంలోనే కాక అందరి పేపర్ల విషయంలోనూ కూడా ఖచ్చితంగా ఉండేవాడు. మొదట్లో బాబు పేపరడిగితే ఎందుకోననుకుని ఇచ్చేవారు. అయితే తప్పు కూడికల కారణంగా అయిదారుగురికి మార్కు లెక్కు వేశారని చెప్పి - మార్కులు తీయించేశాడు బాబు. అప్పట్నించీ బాబు కెవ్వరూ పేపర్లిచ్చేవారు కాదు. మార్కులు లెక్క పెట్టుకుంటున్న సమయంలో బాబు వస్తే దాచేసేవారు. అయినా బాబు రహస్యంగా నిఘా వేసి ఉంచేవాడు.
    "ఊరకపోయినప్పటికీ అప్పుడే పెట్టిన ఆవకాయ దదోరుచి ...." అన్నాడు రాజారావు. అతనావకాయ ప్రియుడు.
    'ఆవకాయ అయింది కానీ ఇంకా అప్పడాలు పెట్టడం కాలేదు -----' అంది పార్వతమ్మ.
    "పెడదాం ---దేనికైనా టైము రావాలి. దైవ సంకల్ప ముండాలి ...." అన్నాడు శ్రీకాంత్.
    'అప్పుడా లోత్తబోయే రోజున విరోచనాలు రాకుండా మాత్రలు సిద్దంగా ఉంచుకోండి ----" అన్నాడు మోహనరావు.
    "ఇంక సత్తెప్ప సంగతి మరిచిపోవే - రేపు నేనే మినప్పప్పాడించి తీసుకువస్తాను...." అన్నాడు వెంకట్రామణ.
    'అయితే ఆ చేత్తోనే కంది పొడి కూడా ఆడించి తీసుకురా నాయనా - మీ పెద్ద వదిన పోళ్లు వేపి ఇస్తుంది ---"
    కందిపొడి పోల్లకు విరజ పెట్టింది పేరు. అయినా అత్తగారలా అనేసరికి కాస్త మొహమాట పడుతూ -----" పెద్ద ఎత్తులో అయితే బాగారాదు నాకు ..." అంది. కానీ అలా అనడంలోనే అంగీకారమూ ఉంది.
    'అందుకే మాటిచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నేనైతే అన్నమాట నిలుపుకోగలనని నమ్మకమున్నప్పుడే మాటిస్తాను. వెంకట్రమణ -అనుభవించు...."అన్నాడు రాజారావు.
    "అనుభవించడమేం కర్మ - ఈరోజా సత్తెప్పగాణ్ణి సాధించి తీరతాను ...." అన్నాడు వెంకట్రమణ.
    "అట్నించి నరుక్కొస్తున్నావన్న మాట - విజయోస్తు " అంది వసుంధర.
    "ఎలాగో అలా ఆ సత్తెప్పగాణ్ణి పట్టుకున్నావంటే .....ఇంకా అప్పాల పిండి ఆడించాలి. సెనగపిండి ఆడించాలి....." పార్వతమ్మ లిస్టు తీసింది.
    "తమ్ముడూ - పారిపో !" అన్నాడు మోహానరావు.
    "ఏమిట్రా మీ వేళాకోళం ---" విసుగ్గా అంది పార్వతమ్మ.
    "వేళాకోళం కాదె ------ఇంతకాలమూ సత్తెప్ప అప్పడాల పిండి ఆడించడం కోసమే ననుకున్నారు. కానీ ఇప్పుడు వాడి గురుతర బాధ్యత తెలిసి వచ్చింది ....'
    "పెళ్ళంటే మాటలనుకున్నారేమిటి--- శుభలేఖ లేయించి ఆవకాయ పెడితే అయిపోలేదు. ఇంకా చాలావుంది ముందు పని ....' అంది పార్వతమ్మ.
    "అలాగా - నేను అప్పదాలూ వదియాలూ ఉంటే చాలనుకున్నాను" --అన్నాడు రాజారావు.
    "వెధవల్లారా - ఇంతప్పట్నించి పెంచాను- ఇప్పుడేన్ని మాటలు నేర్చార్రా "-----అంది పార్వతమ్మ ఆశ్చర్యంగా పిల్లల్ని చూస్తూ.
    హటాత్తుగా అక్కడున్న పిల్లలందరికీ జ్ఞానోదయమైంది. ఎవరి మీదైతే తామప్పుడు జోకులు వేస్తున్నారో ఆవ్యక్తి గర్భవాసం. చేశారు తాము. ఆమె సంరక్షణలో పెరిగి ఇంత వారయ్యారు తాము.

                                                  14
    మోహనరావు,విరజ, రాజారావు, శ్రీకాంత్, వెంకట్రమణ, లక్ష్మీ,అందరిలోకి ఆఖరుదైన కళ్యాణి - రాజమండ్రి బయల్దేరారు.
    రాజమండ్రి వెళ్ళాలంటే ఆ ఊర్నించి రిక్షా ఎక్కి బొబ్బర్లంక వెళ్ళాలి. బొబ్బర్లంకలో లాంచీ ఎక్కాలి.
    ఎండలు చెరిగేస్తున్నాయి. రాజారావు , విరజ , శ్రీకాంత్, లక్ష్మీ -- ఈ నలుగురూ ఒక జట్టు. మోహనరావు , వెంకట్రమణ, కళ్యాణి ఈ ముగ్గురూ ఒక జట్టు. మొదటి జట్టు లోని వారి మొట్టమొదటి డ్యూటీ పెళ్ళి కూతురి చీర కొనడం. అది లక్ష్మీ స్వయంగా సెలక్టు చేసుకుంటుంది. తర్వాత పానకం బిందెలు , కాళ్ళు కడుగు పళ్ళెం వగైరాలు కొనడానికి ఇత్తడి సామాన్ల కొట్టు కు వెళ్ళాలి.
    మోహనరావు , వెంకట్రామణ , కళ్యాణిల డ్యూటీ ---పూజా ద్రవ్యాలు కొనడం. సోమయాజులుగారేమిటో రకరకాల వస్తువులు వ్రాశాడు. నవధాన్యాలనీ, గంధపుండలనీ- ఏవేవో పేర్లున్నాయి. అవన్నీ ఎక్కడ దొరుకుతాయో కూడా సరిగ్గా తెలియదు. వాకబు మీద వెళ్ళాలి.
    ఎండగా ఉంది కాబట్టి వీళ్ళందరూ భోజనాలు చేసే బయల్దేరారు. ఒంటిగంట లాంచీ ఎక్కారు. ఎండ దెబ్బకు చాలా సోడాలు తాగారు. లక్ష్మీ చీర సెలక్టు చేయడానికి సుమారు రెండు గంటలు పట్టేసింది. మూడున్నర ప్రాంతాల్లో ఇత్తడి సామాను కొట్లో ప్రవేశించారు.
    'ఆఖరి లాంచీ నాలుగు గంటలకు ....' అన్నాడు శ్రీకాంత్.
    "ఇంకా లాంచీ ఆశ పెట్టుకోవద్దు. కానీ అవసరమైన పక్షంలో నువ్వు నడవగలవా వదినా" అని అడిగాడు రాజారావు.
    "నడవలేమనుకుంటే ఎలా - పాపం పెళ్ళి కూతుర్ని కూడా నడిపించాల్సోస్తుందని బాధగా వుంది"--అంది విరజ.
    "ఆనకట్టల మీద నడవటం ఈ పెళ్ళి కూతురికి కొత్త కాదు "--- అంది లక్ష్మీ సిగ్గుపడుతూ.
    ఇత్తడి సామాన్ల కొట్లో గంట పట్టేసింది. మొత్తం మీద మంచి సరుకే దొరికింది. " మిగతా చిల్లర పనులన్నీ మేం చూసుకుంటాం లే వదినా - ఈ పనిమాత్రం మావల్ల కాదు కాబట్టి..... అన్నాడు రాజారావు.

 Previous Page Next Page