Previous Page Next Page 
రాగవాహిని పేజి 21

    నిన్న ఆమె. నేడు ఇంకొకరు. రేపు మరొకరు.

    చూడు సత్యా!

    దుఃఖం ఎంత చిత్రమైంది?

    మనవాళ్ళు కానీ, మన బంధువులుకానీ చనిపోతే కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తాం.

    అదే మన పక్కింటివాళ్ళో మన వీధివాళ్ళో పోతే అయ్యో అని విచారం మాత్రమే ప్రకటిస్తాం. సానుభూతి వాక్యాలుగా స్మశాన వైరాగ్యాన్ని బోధిస్తాం. అదే ఊళ్ళో వ్యక్తి అయితే- పెద్ద ఊరయితే తెలీనే తెలీదు. కాస్త పేరున్న వాడయితే అయ్యో అలాగా అంటాం.

    కానీ మనకి తెలీకుండానే ఈ ప్రపంచంలో ఎంతమంది మరణిస్తున్నారో! ఒక మనిషి ఊపిరి పీల్చేంత కాలంలో ఒక మరణం సంభవిస్తూ వుంటుందట ఊహించుకో!

    గుండె పగిలిపోతుంది.

    మరణమనేది మనిషికి అతి సహజం. పుట్టుకన్నా మిధ్యేమో కానీ చావుమాత్రం తధ్యం,

    ఈ చావు పుట్టుకలు ద్వంద్వాలు! మనం వీటినుంచి తప్పించుకోలేం."

    మధ్య మధ్య వెక్కుతూ అతనివేపు వికతగా చూస్తూ అతని మాటలు వింటూ మళ్ళీ అమ్మమ్మని గుర్తుకి తెచ్చుకుని ఏడుస్తూ మొత్తం అతని మాటలన్నీ వింది.

    "సతీష్!"

    నువ్వెన్నయినా చెప్పు, నాకు అమ్మమ్మని తెచ్చివ్వగలవా? ఇవన్నీ శుష్కవాదాలు సతీష్. మనిషికి మనిషి మాత్రం నిజం. మిగతా అంతా కల్పన.

    ఈ వేదాలు, ఈ శాస్త్రాలు, ఈ ఉపనిషత్తులు యివన్నీ వ్యర్ధం. ఎంత వేదాంతికైన ఎంతటి జ్ఞానికైనా యీ చావు పుట్టుకలవల్ల దుఃఖం, ఆనందం తప్పదు. అది తప్పనినాడు యీ విషయాలవల్ల ఫలితం ఏమిటి?

    సతీష్ బదులు పలుకలేదు.

    దుఃఖం తగ్గిందనుకున్నాడు.

    కార్లో అమ్మమ్మ చావుని చూసి ఏడ్చిన సత్య వేరు--- దహనం వేళ తల్లడిల్లిపోయిన సత్య వేరు-ఇంటికొచ్చిన సత్యలో దుఃఖం వేరు- ఇప్పటి సత్య వేరు.

    దుఃఖాన్ని కాలమే తీరుస్తుందనుకున్నాడు సతీష్.

    అందుకే మౌనం వహించాడు.

    "సతీష్! సతీష్!"

    నా కింకెవరున్నారు?

    చిన్నప్పుడే తల్లిపోయింది. తండ్రి పోయాడు. ఇన్నేళ్ళుగా పెంచి పెద్దచేసిన అమ్మమ్మ పోయింది. అసలు ఆమె చావుకి నేనే కారణం అనుకుంటే నా గుండె చెరువైపోతోంది.

    ఇక నాకు దిక్కెవరు?

    చెప్పు సతీష్? చెప్పు.

    "నేనెందుకు బ్రతకాలి. ఎవరికోసం బ్రతకాలి?"

    ఏదో ఆలోచన ఉదృతంగా రావటంతో విపరీతంగా వెక్కుతూ కన్నీరు ధారా ప్రవాహంగా రెండు కళ్ళనుండి స్రవిస్తూ ఉండగా అప్పటికి వున్న ఒకే ఒక ఆధారమైన సతీష్ ని ప్రశ్నించింది సత్య.

    నిట్టూర్చేడు సతీష్.

    మళ్ళీ మొదటికి వెళ్ళిందనుకుని "సత్యా! ఎవరున్నారని నన్నే అడుగుతావేం! నేను లేనా? మా అయ్యగాడు లేరా? జానకమ్మ లేదా? మేమంతా నీకేమీ కామా?" మృదువుగా ప్రశ్నించేడు.

    కారుతోన్న కన్నీళ్ళని తుడుచుకుంది.

    అధోవదనయై అదురుతోన్న పెదాలతో "నేను మీ అయ్యగారి కేమవుతాను? నువ్వు ఆ సమయంలో నన్ను కాపాడేవు- ఇంటికి తెచ్చి రక్షణ యిచ్చేవు. పుణ్యానికి వెళితే పాపం ఎదురైందన్నట్టు నావల్ల నీకు ఇంకా చిక్కులొచ్చేయ్.

    రేపు-హఠాత్తుగా మీ అయ్యగారు వచ్చేస్తే-నేను ఎవరని ఆయనడిగితే ఏం చెపుతావ్?

    నడిరోడ్డులో అనగా దిక్కులేనిదిగా నిలబడాలి నేను.

    పైగా-పైగా-నేను హంతకిని...." అంది.

    "సత్యా! ఆ విషయం మరిచిపో - నీకు అప్పుడే చెప్పాను. అది హత్య కాదని-ఒకవేళ అయినా దొరికేవరకూ నీవు దోషివి కావు. చిక్కితేనే దొంగ. చిక్కకపోతే దొర అనే సామెత వినలేవా? ఆ మాటకొస్తే నువ్వు ప్రభుత్వాని కంటే గొప్పదానివి. నిన్నేం చేయలేక పోయింది కదా ఈ ప్రభుత్వం."

    "కానీ సతీష్! అంతరాత్మ...."

    "బోడి అంతరాత్మ.... మనలాటి మధ్యతరగతివాళ్ళకే ఈ సెంటిమెంట్స్ జబ్బు. అట్టడుగువర్గాల వాళ్ళయినా పై వర్గం వాళ్ళయినా ఈ చావు పుట్టుకలకి-తప్పొప్పులకి- అంతగా ప్రాధాన్యం యివ్వరు."

    "ఏమో...."

    "ఇక నువ్వా విషయమై తర్కించవద్దు. ఆ మాటకొస్తే అతను చనిపోయాడని నిర్ధారణేమిటి? పేపరు న్యూస్ లేదు - పోలీస్ రిపోర్టులేదు."

    ఆ మాట వినగానే ఆమె కళ్ళు మిలమిల మెరిసేయ్.

    "అలా.... అలా....జరిగుండచ్చా?" అంది తడబడుతూ.

    "యేం ఎందుకు జరక్కూడదు. లక్షణంగా జరిగి వుండొచ్చు కానయితే మనకి తెలీదు. అంతే!"

    "సతీష్! సతీష్! ఎంత మంచిమాట చెప్పేవు?"

 Previous Page Next Page