"సక్సెసా? ఇన్సల్ట్ బ్రదర్! మన ప్లాన్లకు పరిస్థితులెలా తారుమారైపోతాయంటే చివరకు మార్కండేయులే సుష్మను చేసుకోమనీ, లేకపోతే ఆస్థి ఇవ్వననీ నీ వెంటపడుతూంటే నువ్వు వద్దని పారిపోతుంటావన్నమాట."
ప్రకాష్ కొంచెం ఇబ్బందిపడ్డాడు "అలా అనకు బ్రదర్! నేను సుష్మను వద్దని పారిపోవటం ఎప్పటికీ జరగదు. అలా అంటే నాక్కొంచెం డిప్రెస్ డ్ గా వుంటుంది."
"ఓర్నీ! పెద్ద మెంటల్ కేస్ లాగున్నావే. నేను మన కెపాసిటీ గురించి చెప్తున్నాన్రా మగడా! నిజంగా నువ్వు సుష్మను చూసి పరుగెడతావని కాదు."
ప్రకాష్ ఆనందంతో పొంగిపోయాడు. "అలా అయితే ఫర్లేదు గురూ! థాంక్యూ వెరీ మచ్! ఇంతకూ మావయ్యను వల్లో వేసుకోడానికి ప్లాన్లేమిటి?"
"నిశ్శబ్దం బ్రదర్! ప్రస్తుతానికి నిశ్శబ్దం!"
"అంటే సైలెంట్ గా వుండటమా?"
"నో!నో!...నిశ్శబ్దంగా ఆయనకు తెలీకుండా ఆయనను లోబరుచుకోవటం. దీన్నే ఇంగ్లీషులో 'సైలెంట్ ఎగ్రెషన్' అంటారు."
"ఫరెగ్జాంపుల్...."
"ప్రతిమా! కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పు. మీ డాడీ కాబట్టి ఆయన లూప్ హోల్స్ నీకు బాగా తెలిసుంటాయి."
"డాడీకి బిజినెస్ లో మంచి లాభాలు సంపాదించిపెట్టే ఐడియా లెవరయినా ఇస్తే వాళ్ళను నెత్తిన పెట్టుకుంటారు. నీకూ తెల్సిన సంగతే కదా?" అడిగింది ప్రతిమ.
"అఫ్ కోర్స్! తెలుసుగానీ మనకలాంటి ఐడియాలు లేవనేకదా మామయ్య బిజినెస్ దరిదాపులకు రానీయటం లేదు నన్ను."
"అయినాగానీ సడెన్ గా నీ బ్రెయిన్ అద్భుతంగా పనిచేస్తున్నట్లు నటించాలన్నమాట. కావాలంటే ఒకటి రెండు ఐడియాలు భవానీశంకర్ సప్లయ్ చేస్తాడులే. వాట్ భవానీ?"
"అఫ్ కోర్స్! నీలాంటి అందవతీ, ధనవతీ చెప్తే ఎదుటివాడు అయిదారు జన్మల వరకూ సరెండర్ అయి వుండాల్సిందే కదా!"
ప్రకాష్ ముఖంలో ఆనందం కనిపించింది "అయితే ఇంక చూస్కో ప్రతిమా! మామయ్య బిజినెస్ దున్నేస్తాం. ప్లాన్ నెంబర్ వన్...ఏమిటి బ్రదర్! త్వరగా చెప్తే ఇంప్లిమెంట్ చేసేస్తాను."
భవానీశంకర్ అతని భుజం తట్టాడు మెచ్చుకోలుగా! "శభాష్! నీకున్న వేగం అద్భుతం బ్రదర్! బిజినెస్ లో బేసిగ్గా నువ్వో రూల్ తెలుసుకోవాలి."
"ఏమిటది?"
"స్లో అండ్ స్టడీ...."
"తెలుసు. విన్స్ ది రేస్! ఎయిత్ క్లాస్ లో చదివాను."
"అక్కడే మటాష్ అయిపోయావ్ బ్రదర్! ఈ రోజుల్లో స్లో అండ్ స్టడీ డై ఇన్ ది రేస్! అర్థమయ్యిందా? కనుక నీ దృష్టి అంతా అంకుల్ తాలూకు సినిమా ఇండస్ట్రీమీద కేంద్రీకరించు. ఫీల్డు బాగా స్టడీ చేసి నా దగ్గరకు రా! అప్పుడు యాక్షన్. ఓ.కె?"
"ఓ.కె" అనేసి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రకాష్.
* * * *
సెక్రటేరియట్ మామూలుగానే పెళ్ళివారిల్లులా కళకళలాడిపోతోంది. తమ తమ కార్యాలు నెరవేర్చదల్చుకున్నవారూ, తమ ప్రత్యర్థుల కార్యాలకు విఘ్నం కలిగించదల్చుకున్నవారూ అందరూ కారిడార్లలో బ్రోకర్ల వెంబడి హడావుడిగా తిరుగుతున్నారు.
జనరంజనీ పబ్లికేషన్స్ సేల్స్ మేనేజర్ మోహన్ రాజ్ కూడా హుషారుగా సెక్రటేరియట్ లోకి జొరబడ్డాడు. తాము పబ్లిష్ చేసిన అడ్డమయిన సాహిత్యం ప్రభుత్వ లైబ్రరీలలో ఎలా కొనిపించాలో, అందుగ్గానూ ఎవరికెంత లంచం ఇవ్వాలో అన్నీ అతనికి కరతలామలకమే.
ఓసారి అతను చదవటం, రాయటం వచ్చిన పద్దెనిమిదిమంది వ్యవసాయ కూలీలను తీసుకొచ్చి రోజు కూలీ మీద వారితో రాత్రింబవళ్ళు వాళ్ళ కిష్టమొచ్చినది రాయించి, ఆ రాసినదాన్ని బోలెడు పిల్లల పుస్తకాల పేర్లతో అచ్చు వేయించి వాటిని 'ఆపరేషన్ బ్లాక్ బోర్డ్' స్కీమ్ లో ప్రభుత్వంతో కొనిపించాడు.
అయితే ఇంతవరకూ తను పుస్తకాలు ప్రభుత్వానికి అంటగట్టే బ్రోకర్లనే పట్టుకోగలిగాడు గానీ ఇలా పుస్తకాన్ని నిషేధించేందుకు కూడా ఏర్పాట్లు చేసే బ్రోకర్లుంటారనే విషయం ఆలోచించలేదు.
తిన్నగా హోమ్ డిపార్ట్ మెంట్ తాలూకు కారిడార్లోకి చేరుకున్నాడతను.
ఒక్కసారిగా అరడజనుమంది అన్నివేపుల నుంచి దూసుకొచ్చి అతనిని చుట్టుముట్టేశారు. "ఏం కావాల్సార్? ఎస్పీ నెవర్నయినా ట్రాన్స్ ఫర్ చేయించాలా? పాతికవేలు ఇవ్వండి పనయిపోతుంది. మిగతా డబ్బు పనయ్యాక ఇవ్వొచు" అన్నాడొకడు.
"ఇన్ స్పెక్టర్నెవర్నయినా బాగా సంపాదన వచ్చే పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ ఫర్ చేయించాలా? పదిలక్షలు ఇవ్వండి చాలు. రేపొద్దున్నకల్లా ఆర్డర్స్ ఇప్పిస్తాను" అన్నాడింకొకతను.
"కానిస్టేబుల్ ఎవరికయినా ప్రమోషన్ కావాలంటే చూస్కోండి యాభయ్ వేలు! సంవత్సరంలో డబుల్ సంపాదించుకోవచ్చు మళ్ళీ" అన్నాడు మరొకడు.
"నా కేస్ వేరు" అన్నాడు మోహన్ రాజ్.
"ఏమిటది? బాంబులు తయారుచేస్తూ పోలీసులకు పట్టుబడ్డావా? ఆ బాపతు కేసులు ఎత్తివేయించడానికి ఆరు లక్షల క్యాష్ డౌన్ చేయాలి."
"అది కాదయ్యా ఒక నవలను బాన్ చేయించాలి."
"అవును!" అందుకు బాన్ చేయించటం?"
"అది బాన్ చేయించటం మాకవసరం. అంతే! ఎంత ఖర్చవుతుందో చెప్పండి."
బ్రోకర్లంతా ముఖాలు చూసుకున్నారు.
"ఏమో సార్! ఇలాంటి కేస్ మేమెప్పుడూ డీల్ చేయలేదు. అది బాన్ చేయించడం వల్ల మీకెంత లాభం వస్తుందో చెప్తే దాన్నిబట్టి రేటు చెప్తాం."
"మాకేం లాభం వుండదు. ఏదో పట్టుదల కొద్దీ చేస్తున్నాం."
"అలాగా- అయితే అయిదు వేలివ్వండి చాలు."
"ఆ! అయిదువేలా? రెండువేలు చేసుకోండి."
"రెండు వేలా? నీయవ్వ మరీ అన్యాయంగా బేరమాడుతున్నావేమయ్యా! మా ఎమ్మెల్యేగారు ఏం తినాలి? డిపార్ట్ మెంట్ ఆఫీసరేం తినాలి? క్లర్క్ లూ, నేనూ ఏం తినాలి?"