Previous Page Next Page 
సుడిగుండాపురం రైల్వే హాల్ట్ పేజి 20


    "థాంక్యూ అంకుల్!" ఆనందంతో పొంగిపోతూ అన్నాడతను.
    "నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరు?" అడిగాడు మార్కండేయులు బీర్ తాగుతూ.
    "ఆ అమ్మాయి పేరు సుష్మ అంకుల్! చాలా మంచి యాక్ట్రెస్ అంకుల్! టి.వి.లో ఆగని మమతలు సీరియల్లో నటించింది."
    "ఆ పిల్ల టి.వి. ఆర్టిస్టా?" ఉగ్రుడయిపోతూ అరిచాడు మార్కండేయులు.
    ప్రకాష్ కంగారుపడ్డాడు "అవున్కాదవున్కాదవున్కాదవున్" అన్నాడు మార్కండేయులు మూడ్, ఆలోచనలు చదవడానికి ప్రయత్నించి ఫెయిలయిపోతూ.
    మార్కండేయులు మరింత ఉగ్రుడయిపోయాడు "అలాంటి చెత్త సీరియల్లో అంత చెత్త నటన ప్రదర్శించినందుకు నేనయితే ఆ పిల్ల కనబడితే షూట్ చేసి అవతల పారేసేవాడిని. అలాంటిది నువ్వు ప్రేమిస్తావా? ఎనీ సెన్స్? నీ బ్రెయిన్ వెంటనే చెకప్ చేయించుకో! ఇప్పుడే నా ఫ్రెండ్ న్యూరాలజిస్ట్ కి ఫోన్ చేస్తున్నాను."
    "అదికాదంకుల్- ఆ అమ్మాయి...చాలా మంచి ఆర్టిస్ట్! కాకపోతే ఆ సీరియల్ డైరెక్టర్... ఇంతకుముందు సినిమా హలో బఠానీలమ్మేవాడవటం వలన..."
    "ఓహో! అయితే ఆ పిల్లకు సినిమా బ్యాక్ గ్రౌండ్ కూడా వున్నదమ్మమాట! ప్రకాష్! నీకిది లాస్ట్ వార్నింగ్! సినిమా, టి.వి., స్టేజి...రేడియో లాంటి వాటిల్లో హీరోయిన్స్ ఎవర్నయినా సరే ప్రేమించావో నిన్ను ఈ క్షణంలో బయటకు గెంటేస్తాను. జాగ్రత్త! డూ యూ నో? ఆ హీరోయిన్ ఎవత్తెకో భర్త కాక అరడజనుమంది బోయ్ ఫ్రెండ్సట! రోజుకొకడితో హోటల్ రూమ్ కెళుతుందట! ఆ మాగజైన్ వాడెవడో రాశాడు. బైదిబై నువ్వు ఇవాల్టి నుంచి సినిమా మాగజైన్లు చదువు! ఆ పిల్ల పేరు ఇంకోసారి కలలో కూడా కలవరించకు, తెలిసిందా-వెళ్ళిక."
    ప్రకాష్ నీరుకారిపోయాడు. ఇంక అంకుల్ తో మాట్లాడి ప్రయోజనం లేదని అతనికి తెలుసు. అంకుల్ పట్టిన కుందేలికి అసలు కాళ్ళుండవు. విచారంగా ఇంట్లో నుంచి గార్డెన్ లోకొచ్చాడతను. అనవసరంగా తను అంకుల్ తో ప్రియురాలు టి.వి.ఆర్టిస్టని చెప్పి చిక్కుల్లో పడిపోయాడు.
    ఇప్పుడెలాగా?
    ఎవరు తనను రక్షిస్తారీ పరిస్థితి నుంచి-
    "హలో మైడియర్ యంగ్ మాన్! ఏమిటలా ప్రేమించినమ్మాయి దూరమయిన హీరోలా భారంగా అడుగులు వేస్తూ ఇరాకీ స్కడ్ ల్లాగా మధ్యలో పేలిపోయే నిట్టూర్పులు విడుస్తూ తిరుగుతున్నావు? కథేమిటి బ్రదర్?" అతని భుజం మీద ఆప్యాయంగా చేయి వేస్తూ అడిగాడు భవానీశంకర్.
    ప్రకాష్ ఆశ్చర్యంగా అతనివైపు చూశాడు.
    భవానీశంకర్ పక్కనే ప్రతిమ కూడా నిలబడి వుంది.
    జరిగిందంతా ఎంతో బాధపడిపోతూ చెప్పటం ప్రారంభించాడు కె.యస్.ప్రకాష్. "అదికాదు నేను సుష్మ అనే అమ్మాయిని ప్రేమించాను గురూ! అంటే ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది గురూ. అంటే ఆమె నన్ను ప్రేమించింది, నేను ఆమెను ప్రేమించాను గురూ. అంటే మేమిద్దరమూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నాం గురూ. అంటే ఆమె నన్నెంతగా ప్రేమించిందో నేనూ ఆమెను అంతగా ప్రేమించాను బ్రదర్. అంటే మేమిద్దరం మా ఇద్దరిలో చెరొకరినీ...."
    ప్రతిమకు మతిపోయింది. భవానీశంకర్ అతని భుజం తట్టాడు ఆప్యాయంగా. "అర్థమైంది బ్రదర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలాగా భాషను విరివిగా వుపయోగించకు. దానివలన వినేవారికీ, చదివేవారికీ మూర్ఛ, ఎలర్జీ, మతి చలించుట లాంటి దీర్ఘ రోగములు సంక్రమించే అవకాశాలున్నాయి. అంచేత భాషను పొదుపుగా, అర్థవంతంగా ఉపయోగించు ఫ్రెండ్!"
    కె.యస్.ప్రకాష్ ప్రేమ తాలూకు కోమాలోంచి బయటికొచ్చి నిట్టూర్పు విడిచాడు.
    "అయాం సారీ!" అన్నాడు గిల్టీగా.
    "ఏం ఫర్లేదు బ్రదర్! ఫర్ గెటిట్!"
    "అనవసరంగా చాలా బాషను వాడేశాను"
    "అఫ్ కోర్స్! అవసరమయినదానికంటే ఎక్కువ వాడేసిన మాట నిజం"
    "ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'చక్కనయిన హైద్రాబాద్- చదువుకున్న హైద్రాబాద్' అంటూ భాషను ఎడాపెడా వృధా చేస్తున్నట్లు..."
    "ఎగ్జాక్ట్ లీ బ్రదర్!"
    "నిజానికి ఇండియన్ సిటీస్ అన్నింటిలో, చదువులో హైద్రాబాద్ ఎంతో వెనుకపడి వున్నప్పటికీ కూడా ఆ స్లోగన్ ఇవ్వటం హారిబుల్."
    "హారిబ్లీ హారిబుల్"
    "అయితే జరిగిందంతా నేను క్లుప్తంగా చెప్తాను"
    "చాలా క్లుప్తంగా చెప్పాలి"
    "ఆల్ రైట్! నేనూ, సుష్మా అనే టీ.వి. ఆర్టిస్ట్ ప్రేమించుకున్నాం. కానీ ఎవరో సినీతారకు ఎంతోమంది బోయ్ ఫ్రెండ్స్ వున్నారనీ, అందువలన నేను ఆ అమ్మాయిని చేసుకోడానికి వీల్లేదని మార్కండేయులంకుల్ వార్నింగిచ్చారు."
    "ఓహో" అన్నాడు భవానీశంకర్.
    "ఓహో" అంది ప్రతిమ.
    "సోదేర్ యూ ఆర్" అన్నాడు ఇంగ్లీషులో.
    "ఎస్. అయామ్ దేర్" తను కూడా ఇంగ్లీషులోనే అన్నాడు కె.యస్.ప్రకాష్.
    "ఇప్పుడు నువ్వు అంకుల్ ని కాదని ఆ పిల్లను పెళ్ళి చేసుకుంటే ఆస్తి మటాష్ అయిపోతుంది. అంతేనా?"
    "అంతేకాదు! నా ఆస్థినంతా అనాథ శరణాలయానికి ఇచ్చేస్తాడు మావయ్య."
    "వెరీ బ్యాడ్ సిట్యుయేషన్"
    "కొశ్చెన్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్" ఒప్పుకున్నాడు ప్రకాష్.
    "అయినాగానీ మనం ఏమాత్రం నిరుత్సాహపడనక్కర్లేదు. భవిష్యత్తు ఉజ్వలంగా వుంది. ఉత్సాహంగా ఉంది" అన్నాడు భవానీశంకర్.
    ప్రకాష్ ఆశ్చర్యంగా అతనివైపు చూశాడు.
    ప్రతిమ నవ్వింది "అవును ప్రకాష్! భవానీశంకర్ నేనూ కలిసి నిన్నూ, సుష్మనూ ఒకటి చేసేస్తాం. ఎలా అని అడగకు. మా డాడీని ఒప్పించేందుకు ఏదొక ఉపాయం ప్లాన్ చేద్దాంలే."
    "నిజంగా మన ప్లాన్లు సక్సెస్ అవుతాయా గురూ?" కొంచెం అనుమానంగా అడిగాడు.

 Previous Page Next Page