Previous Page Next Page 
తిరిగి దొరికిన జీవితం పేజి 21


    "మధ్యన మీరేం చేశారని క్షమించాలి మిమ్మల్ని?"
    "గీత తొందరపాటుకి, ఆమె తరఫున నేను క్షమాపణ చెప్పుతున్నాను సరోజా. దయచేసి ఆ మాటలు పట్టించుకోకు. గీత తొందరపాటు మనిషి. నేనుగాని, అమ్మగాని నిన్నేం అంటే బాధపడాలి నీవు. గీతకేం తెలియదు. ఎక్కడెలా మాట్లాడాలో తెలియదు...." గీత తరఫున సంజాయిషీ యిస్తూ సమర్ధించుకుంటూ ఏదేదో చెప్పబోయాడు కృష్ణమోహన్. సరోజ అతని గాబరాకి నవ్వింది.
    "అబ్బ! కాబోయే భార్యమీద యీగ వాలనీయరు కాబోలు ఆవిడ పక్షాన ఎంత సమర్ధించుకుంటూ మాట్లాడుతున్నారు" సరోజ వేళాకోళంగా అంది. "అయినా ఆమె తప్పుమాట ఏమీ అనలేదు బాధపడడానికి, ఆవిడ యీ యింటికి కాబోయే కోడలు. తన భర్త సొమ్ము పరాయి వాళ్ళకి దోచిపెడ్తుంటే ఏ ఆడది సహించదు. యిప్పటికైనా ఆవిడ మాటల్లో నిజం మీరు గుర్తించి మెలగండి. యింకా యింకా నామీద మీ డబ్బు వృధా చేయకండి-దయచేసి నన్ను నా త్రోవని పోనీండి..." సరోజ ముందు హాస్యంగా వేళాకోళంగా మాట్లాడినా, ఆఖరికి ఆ మాట చెపుతున్నప్పుడు ఆమె గొంతులో బాధ, ఆవేదన, అనమానం తొంగి చూశాయి.
    "సరోజా, అలా మాట్లాడకు. గీత మాటలు నీవు పట్టించుకోకు. యింతకీ అమ్మ అన్నట్టు యిది నా సొమ్ము కాదు. అమ్మ యిష్టం వచ్చిన రీతిని తన డబ్బు ఖర్చు చేసుకుంటుంది. అదేమని అడగడానికి గీతకే కాదూ నాకూ ఏమీ అక్కు లేదు. ఆ విషయం నీవు గుర్తుంచుకో సరోజా, యింతకంటే ఏం చెప్పలేను. అమ్మనిమాత్రం వదిలిపోకు. నాకోరిక యింతే" అన్నాడు వ్యధగా. సరోజ తలదించుకుంది. "సరే వెళ్ళను యిప్పుడు - కాని యింటికోడలు వచ్చాక మాత్రం అప్పుడు యింక బలవంతపెట్టకండి - మీ అమ్మ గారికి అదే చెప్పాను. మీ వివాహం అయ్యేవరకు వుంటానని మాటిచ్చాను.ఆవిడని బాధించడం యిష్టం లేదు నాకు. ఆవిడకోసం యీమాత్రం అవమానాన్ని సహించగలను." అంటూ వెళ్ళిపోయిన సరోజని చూస్తూ అప్పటికి గండం గడిచిందన్న సంతృప్తి పడ్డాడు కృష్ణమోహన్.
    
                                       *    *    *
    
    "హల్లో...సరోజగారూ....నమస్కారం" ప్రభాకర్ నమస్కారం చేస్తూ పలకరించాడు. షాపులో బట్టలు చూస్తూన్న సరోజ అతనికి ప్రతి నమస్కారం చేస్తూ ఓ మీరు వచ్చారా అంది. ప్రక్కనున్న కృష్ణమోహన్ ఎవరన్నట్టు చూశాడు...
    "ఈయన మా ఆఫీసులో పనిచేస్తున్నారు. బాస్ కి పర్సనల్ అసిస్టెంటు...యీయన కృష్ణమోహన్ డాక్టరు. వీరింట్లోనే నేను వుండేది" అంటూ ఇద్దరికి పరిచయం చేసింది సరోజ. "గాల్డ్ టూ మీట్ యు..." అంటూ పలకరించుకున్నారు యిద్దరూ.
    "చీరలు కొంటున్నారా....నాకో చీర సెలక్టుచేసి పెట్టండి మా అక్క పండగకి వస్తూంది. చీరల సెలక్షన్ తెలియదే ఎలా అనుకుంటున్నాను. సరిగా సమయానికి మీరు కనిపించారు. నాకో మంచిచీర తీసిపెట్టండి." చనువుగా నవ్వుతూ అన్నాడు ప్రభాకర్.
    "ఓ దానికేం భాగ్యం--" నవ్వి అంది సరోజ.
    సరిగా అదే సమయంలో ఆ షాపులోకి గీత వచ్చింది. తని చూస్తూ "గీతా నీవూ వచ్చావా అరే ఎలా తెల్సింది" అన్నాడు కృష్ణమోహన్.
    'గీతా!' అన్నాడు ప్రభాకర్ గొణిగినట్లు-కృష్ణ మోహన్ ని ముందుచూసిన గీత ఆనందంగా గబగబా ఎదురురాబోయి, ప్రక్కనే సరోజని చూసి మొహం చిట్లించింది మరికాస్త ప్రక్కగా వున్న ప్రభాకర్ ని చూడగానే చటుక్కున ఆమె ఆగిపోయింది సర్పద్రష్టలా నిశ్చేష్టురాలై పోయింది ఒక్క క్షణం. "గీతా!" అన్నాడు ప్రభాకర్. గీత గాబరాతో భయంతో ఒక్క క్షణం వణికి అంతలోనే తెప్పరిల్లి గబ గబ పారిపోయి కారులో కూర్చొని తలుపు దబాలున వేసి కారు స్టార్టు చేసి వెళ్ళిపోయింది, గీతా అంటూ గుమ్మం దగ్గరికి వచ్చి పిలిచిన కృష్ణమోహన్ వంక చూడకుండా. కృష్ణ మోహన్ ఆమె ప్రవర్తనకి తెల్లబోయాడు. సరోజ ఆశ్చర్యంగా ప్రశ్నార్ధకంగా కృష్ణమోహన్ వంక చూసింది. ప్రభాకర్ ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేనట్లు అలాగే చూస్తున్నాడు. "గీత మీకు తెలుసునా?..." కృష్ణమోహన్ ప్రభాకర్ ని చూస్తూ ఏదో అనుమానం లేచి అడిగాడు. ప్రభాకర్ ఒక్క క్షణం తత్తరపడి "ఆ...ఆ ....తెలుసు....ఆ.....ఏదో కాస్త పరిచయం....కాలేజీలో....జూనియర్..." అంటూ ఏదో ఏదో జవాబు చెప్పాడు. కృష్ణమోహన్ "ఆహా..." అన్నాడు. "సరోజా, అయిందా పదవెడదాం" బిల్లు చెల్లిస్తూ అన్నాడు.
    "వస్తానండి" ప్రభాకర్ దగ్గిర శలవు తీసుకుని సరోజ, కృష్ణమోహన్ వెళ్ళిపోయారు. ప్రభాకర్ "గీతా" అంటూ గొణుక్కున్నాడు.
    
                                    *    *    *
    
    "గీతా నిన్న బట్టలషాపుకి వచ్చి ఎందుకలా కొంపమునిగినట్లు పిలుస్తున్నా వినిపించుకోకుండా పరిగెత్తి వెళ్ళి పోయావు?" మర్నాడు సాయంత్రం గీతని అడిగాడు కృష్ణ మోహన్ - ఆమెవంక పట్టి పట్టి చూస్తూ. ఎదురు చూసిన ప్రశ్నరాగానే అంతవరకు ఉదయంనించి జవాబు ఆలోచించి పెట్టుకున్న గీత ఒక్కక్షణం గబహరా పడిపోయింది. ఆ వెంటనే సర్దుకుంటూ కోపం అభినయించి-"నీకు చెప్పాలా ఎందుకో... నీవు అన్నీ నాకు చెప్పే చేస్తున్నావా....బట్టల షాపుకి వెడ్తున్నట్టు మీ సరోజగారికి బట్టలు కొంటున్నట్టు నాకేమైనా చెప్పావా....నాతో ఎగ్జిబిషన్ కి రావడానికి తీరదన్నావు గాని మీ సరోజని వెంటబెట్టుకు వెళ్ళడానికి తీరికయిందా పాపం...." ప్రశ్నకి జవాబు చెప్పకుండా తీక్షణంగా ఎదురు ప్రశ్నించింది.

 Previous Page Next Page