"మేడమ్.... ముందు కాలర్ వదలండి.... మీ పర్స్ తీయాల్సినంత ఖర్మ నాకింకా పట్టలేదు దేవుడి దయవల్ల. ఆ పర్స్ తప్ప మీ దగ్గరేం మిగిలినట్టు లేదు మీ వాలకం చూస్తే. మీకవసరం అయితే మీ పర్స్ లో ఎంత డబ్బు ఉండిందో అంతా యిచ్చి మీరు వెళ్ళవలసిన చోట దింపుతాను కూడా"
ఆమె మొహం ఎర్రబడింది.
తల ఎగరేసి అతని కాలర్ వదిలేసి అక్కడినుండి చరచరా వెళ్ళిపోయి కొద్దిదూరంలో నిల్చుంది. ఇప్పుడు తనేం చెయ్యడం? కనీసం హోటల్ కి వెళ్లడానికయినా డబ్బుల్లేవే. పైగా ఈ ఊళ్ళో తెల్సినవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. ఒక్కటే మార్గం. ఎలాగోలా హోటల్ చేరుకొని కాన్ఫరెన్స్ కొచ్చినవాళ్ళలో ఎవరినైనా తెలిసిన మొహాన్ని పట్టుకుని అప్పిచ్చువాడు వైద్యుడు పద్యం అప్పచెప్పటమే. లేకపోతే కాన్ఫరెన్స్ కన్వీనర్స్ ని కన్విన్సో, కన్ ఫ్యూజో చేసెయ్యడమే. అయినా తనకి బుద్ధుండక్కర్లే! వచ్చింది కాన్ఫరెన్స్ కయితే తగుదునమ్మా అంటూ అడ్డమైన న్యూస్ సేకరణలకీ బయలుదేరిపోవడమే. సుబ్బరంగా ఆఫీస్ డబ్బుతో మూడుపూట్ల సుష్టుగా భోంచేసి ఆ కాన్ఫరెన్స్ ఏదో సరదాగా అటెండయ్యి ఎ.సి.రూంలో పడుకొని గుర్రుపెట్టక ఎందుకొచ్చిన అవస్థలివన్నీ?
ఆ అమ్మాయి ఇలా తన ఆలోచనల్లో తానుండగానే ఎదురుగా కారొకటి వచ్చి ఆగింది.
"హలో.... మీ పర్సు కొట్టేయకపోయినా కొట్టేశానేమోనని అనుమానం కలిగించే దొంగ మొహం అయిపోయింది నాది. అందుకు పరిహారంగా మిమ్మల్ని 'మనోరమా'లో దించాలనుకుంటున్నాను. మీకభ్యంతరం లేకపోతే."
"నేను 'మనోరమా'లో వుంటున్నట్టు మీకెలా తెల్సింది?"
"నేనూ అక్కడే వుంటున్నాను. ఈరోజు ప్రొద్దున్న మిమ్మల్ని అక్కడ చూశాను.
"మీతో రావడం నాకభ్యంతరమైతేనో?"
"నాది దొంగ మొహం మాత్రమేకాదు రేపిస్ట్ మొహంకూడా అనే నిర్ణయానికొచ్చి వెంటనే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మొహం మార్చుకుంటాను"
అంత టెన్షన్ లోనూ అతని మొహంచూసి ఫక్కుమని నవ్వేసింది ఆమె.
మారు మాట్లాడకుండా ఎక్కి కూర్చుంది అతని ప్రక్కన. కారు మనోరమ వైపు కదిలింది.
తలతిప్పి అతణ్ని పరీక్షగా చూసిందామె.
అందంగా వున్నాడతను.
కారు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ దాటుతుండగా ఎదురుగా ఏదో ఊరేగింపు రాసాగింది. ట్రాఫిక్ నెమ్మదిగా కదలసాగింది.
రాజకీయ నాయకుడిపై హత్యా ప్రయత్నానికి నిరసనగా ఆ ఊరేగింపు.
"హత్యా ప్రయత్నం సఫలం కాకపోవడం ఒక రకంగా అదృష్టం" హఠాత్తుగా మౌనాన్ని భంగపరుస్తూ అన్నాడు.
"అదేం?"
"లేకపోతే విపరీతమైన అలజడులై, ఏ కర్ఫ్యూనో వస్తే ఇరుక్కుపోయేవాళ్ళం హోటల్ లో. ముఖ్యంగా మీలాంటి....అమ్మాయి."
"సఫలం అయివుంటే ఒక రకంగా అదృష్టం అయ్యేది" అందామె.
"ఏం?"
"మంచి న్యూస్ ఫస్ట్ హాండ్ గా దొరికేది నాకు"
చిన్నగా నవ్వాడతను.
"మీరు.... ప్రెస్ రిపోర్టరన్నమాట"
"అవును"
"కాన్ఫరెన్స్ కొచ్చారా?"
"అవును"
"రేపు కదా?"
"అవును"
'ఈరోజే వచ్చేశారేం?' అని అడగబోయి మానుకున్నాడు.... దానిక్కూడా 'అవును' అంటుందేమోనని.
నిమిషంపాటు ఎవరూ మాట్లాడుకోలేదు. కారు ఊరేగింపు దాటి మళ్ళీ వేగం పుంజుకుంది.
"నా జీవితంలో ఇంతవరకూ....ముఖ్యంగా ప్రెస్ లో ఇంతవరకూ మీ అంత అందమైన అమ్మాయిని చూడలేదు"
అతనికేసి ఓసారి తలతిప్పి చూసి తిరిగి రోడ్డుమీదికి దృష్టి సారించిందామె.
"థాంక్స్"
"దేనికి? ఇంకా హోటల్ రాలేదుగా"
"లిఫ్ట్ కి కాదు. మీ కాంప్లిమెంట్ కి"
మరో నిమిషంలో కారు హోటల్ కి చేరుకుంది.
కారు దిగి చెప్పిందామె, "థాంక్స్ ఫర్ ది లిఫ్ట్....ఇంతకీ మీ పేరు అడగనేలేదు"
పర్స్ లోంచి తన విజిటింగ్ కార్డుతీసి అందించాడతను. దాన్ని చూడకుండానే.
"ఇందాకటి నా ప్రవర్తనకి నన్ను...."
"క్షమార్పణలక్కర్లేదు....చెప్పానుగా.... నా మొహమే అంత. వట్టి దొంగ మొహం...."
నవ్వాడతను.
"బై...." తన కార్డొకటి అతని కందించి చరచరా నడిచి రిసెప్షన్ చేరుకొందామె.
రూం కీస్ తీసుకుని లిఫ్టెక్కి సెకండ్ ఫ్లోర్ లోకి తన గది చేరుకుందామె.
లోపలినుండి లాక్ చేసుకుంది.
మొహం కడుక్కుని మంచంపైన కూర్చుని పేపర్ తీయబోతూ చూసింది టీపాయ్ పైన.
ఇందాక అతనందించిన కార్డు.
యధాలాపంగా అందుకొని చూసి చిన్నగా ఉలిక్కిపడింది.
"సిద్ధార్థ....ఎడిటర్....ది డెయిలీ...."
ఫోన్ మ్రోగింది....
"హలో"
"హలో మేడమ్....రూం నెంబర్ టు నాట్ త్రీ నుండి మీకు కాల్"
రిసెప్షనిస్ట్ గొంతది.
"కనెక్టిట్"
రెండు క్షణాల తర్వాత లైన్ కలిసింది.