Previous Page Next Page 
పడుచుదనం రైలుబండి పేజి 21


    "అలా అనుకోలేదే వందనా! సారీయే! వెరీవెరీ సారీయే! కవిత వినిపించానుగాని ఇలా అని అలా అనుకోలేదే."


    "సరేలే! ఊరికినే బాధపడిపోకు." సుందరి వీపుమీద చెయ్యేసి నిదురపోతూ బుజ్జగింపుగా అంది వందన.


    "తెలుసో తెలీకో నిన్ను బాధపెట్టాను. వీళ్ళు కూడ బాధపడే ఉంటారు. ఆ బాధని తుడిచెయ్యాల్సిన బాధ్యత కూడ నామీద ఉంది కదా! కనుక మరో కవిత వినిపిస్తాను. మా బామ్మ వారానికి రెండుసార్లు కందిపచ్చడి చేసేది. ఆ కందిపచ్చడి ముద్దలో అరనేతి గిన్నెడు నెయ్యి కలుపుకుని తింటుంటే అమృతంలా ఉండేది...ఆపై స్వర్గం కనబడుతుండేది. ఇప్పుడా కంది పచ్చడి గుర్తుకొచ్చింది. ఆ వెంటనే కవిత కూడ వచ్చేసింది. ఈ కవితపేరు "కందియా పచ్చడి." వినండి చెలులారా! వీనుల విందుగా.


    "నేను పంపిన కంది పచ్చడి
    ప్రచురించిందో వారపత్రిక
    బాగుందని లేఖల వర్షం
    కురిసింది మరువారం
    ఇదే కందిపచ్చడి బాగుంది
    అన్నారు నిన్న మొన్న అటు మొన్న!
    ఏమొచ్చిందీ రోగం దీనికి!
    అదే పచ్చడి ఆరోజు చేసిందే కదా!
    అని నామీద ఎగిరి పడింది
    మా యావిడ."


    "ఎలా వుందే! కంది పచ్చడి కవిత! బాగా నవ్వొచ్చిందా! హాయిగా ఎంజాయ్ చేసేలా ఉందా! లేకపోతే ఇప్పటికిప్పుడే కందిపచ్చడి కమ్మని నేతితో నాలుగు ముద్దలు తినాలని ఉందా!" సుందర సుకుమారి అడిగింది.


    ఒక్కళ్ళూ పలకలేదు. అప్పటికే ముగ్గురు నిద్రాదేవి ఒడిలో దూరి సుందర స్వప్నాలు కంటూ నిద్ర తీస్తున్నారు. ప్రమదయితే చిన్నపాటి గుర్రు కూడ పెడుతున్నది.


    "మీ నిద్ర దొంగలుతోలా! మీకు నిజంగా నిద్ర వచ్చిందంటే! లేక నిద్ర నటిస్తున్నారా! మీరు మాట్లాడటం లేదు అంటే నిద్రపోతున్నట్టే లెక్క. మీరు హాయిగా నిద్రపోనేల! నేను మీకు కాపలా కాస్తూ కూర్చోనేల! నేను మాత్రం నిద్రపోలేనా...ఏమిటి?" అలా అనుకొంటూ సుందర సుకుమారి బహు సుందరంగా కళ్ళు మూసుకుంది.


    సుందర సుకుమారికి నిద్ర విషయంలోను...తిండి విషయంలోను నో ప్రాబ్లం. అలా పడుకుందో లేదో ఇలా నిద్రపోయింది.


    పది నిమిషాల తర్వాత...


    ఓ తలకాయ కిటికీ దగ్గరకి వచ్చి లోపలికి తొంగి చూసింది. ఏదో అర్థమైనట్టు తలపంకించి వెళ్ళిపోయింది.


    ఇదేమీ తెలియని నలుగురు హాయిగా ఆదమరచి నిద్రపోతూనే ఉన్నారు.


                                        10


    సాయంత్రం నాలుగు గంటలవేళ.


    నలుగురు స్నానం చేసి బయటికెళ్ళడానికి తయారవుతున్నారు.


    ఇలా జర్నీ చేయడం...హోటల్లో దిగటం...బయట కొత్త ప్రదేశాలు చూడటం వీధుల్లో చక్కర్లు కొట్టడం...మొత్తానికి చాలా సరదాగా ఉంది. హోటల్ గదిలో ఉన్నప్పుడు మధ్య మధ్య బోర్ కొట్టినా__ బయట తిరిగేటప్పుడు మాత్రం గంటలు నిమిషాల్లా గడిచిపోతున్నాయ్.


    మగవాళ్ళు ఇల్లు విడిచి బయటికెళితే వాళ్ళకి ఇంక ఇల్లు ఇంట్లో మనుషులు గుర్తుకురారు. ఆడపిల్లలకి అలా కాదు. వాళ్ళు ఎక్కడున్నా ఆఖరికి స్వర్గంలో వున్నా సరే ఇల్లు...ఇంట్లో తాలూకా మనుషులు గుర్తుకొస్తూనే ఉంటారు.


    వందనకి రాణికి ప్రమదకి వాళ్ళ అమ్మానాన్న గుర్తుకొస్తుంటే సుందర సుకుమారికి మాత్రం వాళ్ళ బామ్మ గుర్తుకొస్తోంది.


    "అప్పుడే మా బామ్మ వంటతిని అయిదురోజులయింది. తిండిలేక కాస్త చిక్కాను కదూ!" సుందర సుకుమారి అడుగుతుంటే వాళ్ళకి నవ్వొచ్చేది.


    "నువ్వేమీ చిక్కలేదే తల్లీ! మేము లావయ్యాం ఎలా అంటే మీ బామ్మ చేసిచ్చిన నేతి మిఠాయిలు తింటున్నాం కదా! దాంతో ఆటోమేటిగ్గా కాస్త లావయ్యాం. మా లావు చూసి నువ్వు చిక్కిపోయానని అనుకుంటున్నావ్. అంతేనే తల్లీ! దిగులు పడకు." వందన నవ్వుతూ అంది.


    "మరె౧ మరే!" అంటూ వంత పాడారు రాణి, ప్రమద.


    తను లావుగా ఉన్నానని సుందర సుకుమారి నలుసంత కూడా దిగులు పడదు. మరీ సన్నగా ఉన్నవాళ్ళని చూస్తే "ఏంటో పాపం! వీళ్ళు వారానికి ఓసారయినా భోంచేస్తున్నారో...లేదో! తుమ్మితే ఊడిపోయే ముక్కులు... గాలి కెగిరిపోయే గడ్డిపోచలు." అనుకుంటూ ఉంటుంది. తన లావుమీద తనే జోకులేసుకోగల విశాల హృదయనేత్రి సుందర సుకుమారి.


    అందరు కబుర్లు చెప్పుకుంటూ తయారయ్యారు. కిటికీ తలుపులు లోపల వేసేసి...రూమ్ బయటికొచ్చి తాళం వేసేసి సరాసరి కిందకి వెళ్ళారు.

 Previous Page Next Page