తొయ్యబోతూ ఆగిపోయింది. లోపలినుంచి ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. అందులో ఒక స్త్రీ స్వరం కూడా వుంది. ఆ స్వరాన్ని ఆమె గుర్తుపట్టింది. అది తన క్లాస్ మేట్ ప్రియాంకది! వరూధిని స్తబ్దురాలిగా అలాగే వుండిపోయింది. ఆమె మనసు ఏ విషయమూ ఆలోచించటానికి సంసిద్ధంగా లేదు.
ఈ లోపులో లోపలినుంచి తలుపు తెరుచుకుంది. బయటికొస్తున్న ప్రియాంక గుమ్మంవద్ద నిలబడి వున్న వరూధినిని చూసి ఒక్కక్షణం విస్తుపోయింది. అంతలోనే తేరుకుని వెనక్కి చూసింది. సందీప్ మంచంమీద పడుకొని వున్నాడు. బైట నీడ కనబడేసరికి చటుక్కున లేచి గుమ్మం దగ్గరికి వచ్చాడు. వరూధిని ఇంకా అలాగే నిస్తేజంగా నిలబడి వుంది. అయితే సందీప్ మొహంలో ఏ కంగారు గానీ, భయంకానీ కనబడలేదు. "ఫోన్ చెయ్యకుండా వచ్చావేం వరూధిని?" అనడిగాడు మామూలుగా.
వరూధిని పెదాలు వణుకుతున్నాయి. కళ్ళు జేగురు రంగులోకి మారాయి. "యూ.....యూ...." అంది. ఆ తర్వాత ఇంకేం మాట్లాడటానికి నోరు పెగల్లేదు.
సందేప్ చాలా మామూలుగా "కమిన్ వరూధిని" అంటూ ఫ్రిజ్ దగ్గరకెళ్ళి మూడు కూల్ డ్రింక్స్ సీసాలు ఓపెన్ చేసి తీసుకొచ్చాడు. "ఇంకా అలాగే నిలబడిపోయున్నావేంటి? వచ్చి కూర్చో......ప్రియాంకం..... తెలుసుకదా?" అన్నాడు.
అప్పుడు కదిలింది వరూధిని. దాదాపు హిస్టీరిక్ గా మారిపోయినట్టు అతడి భుజాలు పట్టుకొని ఊపేస్తూ "యూ బ్రూట్! నన్ను నమ్మించి మోసం చేస్తావా!" అని గట్టిగా అరవసాగింది.
"వదులు...." అన్నాడు. ఆమె వదల్లేదు.
అప్పుడు కొట్టాడు వరూధిని చెంపమీద. ఆ శబ్దానికి గది దద్దరిల్లింది అంతావేశంలోనూ వరూధిని ఆ హఠాత్ సంఘటనకి స్థాణువై అలాగే నిలబడిపోయింది. ప్రియాంక ఇద్దరివైపూ బిత్తరపోయి చూస్తూంది. సందీప్ తాపీగా తాన్ బాటిల్ తీసుకుని వెళ్ళి కుర్చీలో కూర్చొని తాగుతూ అన్నాడు, "చూడు వరూధిని! నాకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ వున్నారు. నేనెప్పుడూ నిన్ను పెళ్ళి చేసుకుంటాననలేదు. ప్రేమించటం వరకూ ఓ.కే. కానీ పెళ్ళనేది నా డిక్షనరీలోనే లేదు. అదీగాక నీకున్న అంతస్థుకి నాలాటివాడు ఎలా పెళ్ళి చేసుకుంటాడనుకున్నావ్? ఇందులో మోసం ప్రసక్తి ఏముంది? నీకూ. నాకూ ఇష్టమైంది- అనుభవించాం! నాతోపాటు డిన్నర్లకీ, షికార్లకీ తిరిగావ్. నీకోసం చాలా ఖర్చుపెట్టాను. అలా ప్రాక్టికల్ గా ఆలోచించు. అంతేకాని నువ్వేమిటేమిటో ఊహించుకొని నన్ను దానికి జవాబుదారీ చెయ్యకు. అంతవరకూ ఎందుకు- ఈ ప్రియాంకనే తీసుకో. మేమిద్దరం ఒకర్నొకరు ప్రేమించుకుంటున్నాం. కానీ ఎప్పుడూ మామధ్య పెళ్ళి ప్రసక్తి తీసుకురాలేదు. అవునా ప్రియాంకా..."
ప్రియాంక సమాధానం చెప్పలేదు. ఇంకా బిత్తరపోయి చూస్తూ వుంది.
వరూధిని అక్కడినుంచి వడివడిగా బైటకొచ్చేసింది.
అదే ఆవేశంలో కాలేజీ కాంపౌండుకి కొద్దిగా దూరంగా..... గేటుకి ఎదురుగా..... రోడ్డుకి ఒక ప్రక్క చిన్న టెంట్ వేసింది. అందులో ఒక జంపఖానా పరచి దానిమీద కూర్చుంది. టెంట్ ముందు ఒక బోర్డ్ పెట్టింది.
ఆ బోర్డ్ మీద పెద్దగా- ఆమరణ నిరాహారదీక్ష" అని వ్రాసివుంది. వచ్చేపోయే విద్యార్థులు, విద్యార్థినులు నిలబడి వింతగా చూస్తున్నారు. ఆ హెడ్డింగ్ కింద మరికొన్ని స్లోగన్స్ వ్రాయబడి వున్నాయి.
"పెళ్ళి పేరిట అమ్మాయిని మోసం చేసే సందేప్ దౌర్జన్యం నశించాలి...... వివాహమే ఈ దీక్షకు అంతిమ గమ్యం......."వగైరా.
కూతురు చేస్తున్న పని తల్లిదండ్రులకి మధ్యాహ్నం తెలిసింది. కృష్ణమూర్తి, రుక్మిణి కంగారుపడ్డారు. కొన్ని క్షణాలపాటు వారిద్దరికీ నోట మాటరాలేదు. కూతురు ఇలా చేస్తుందని వాళ్ళు కలలో కూడా వూహించలేదు. ముందు తేరుకున్నది కృష్ణమూర్తి. "ఇదంతా నీ వల్లనే జరిగింది. ఇంట్లో వుండేదానివి పిల్లల విషయం పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు?" అంటూ అరిచాడు.
రుక్మిణి ఇంకా షాక్ లోనే వుంది. కాలేజీ ఎలక్షన్లలో కూతురు బిజీగా తిరుగుతోందని, మంచి పేరు తెచ్చుకుంటోందని అనుకుంది తప్ప ఇలాంటి పరిస్థితి తెచ్చిపెడుతుందని ఆమె ఊహించలేకపోయింది. భర్త కూడా తననే తప్పు పట్టేసరికి తట్టుకోలేకపోయింది. "బావుంది. మధ్యలో నేనేం చేశాను? చిన్నప్పటినుంచీ వాళ్ళకు అలుసిచ్చింది మీరు? నేను మందలించినప్పుడల్లా ఇండివిడ్యుయాలిటీ, వ్యక్తిత్వం అంటూ వాళ్ళ ఎదురుగా నన్ను తిట్టేవారు. ఇక నేను చెప్పింది వాళ్ళు వినిపించుకుంటారా? జరగకూడనిది జరిగేసరికి తప్పు నాదయిపోయింది" అంది గట్టిగా.
"అంటే నీ ఉద్దేశ్యం వాళ్ళు చెడిపోతుంటే చూస్తూ ఆనందించమని చెప్పాననా? పొద్దుటినుంచీ రాత్రిదాకా కష్టపడి సంపాదించుకొస్తున్నానే. ఇంట్లో వుండేదానివి. వాళ్ళే దారిలో వెళుతున్నారో చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదా? ఎప్పుడు చూసినా ఫ్రెండ్సు, క్లబ్బులు అంటూ తిరిగావు. పట్టించుకునేవాళ్ళు లేక వాళ్ళలా తయారయ్యారు" అన్నాడు గట్టిగా. తన వాదనని ఎప్పుడూ అలాగే బలపరుచుకుంటాడతడు.
"క్లబ్బులు, ఫ్రెండ్స్ అంటూ అలవాటు చేసింది కూడా మీరే. బిజినెస్ కమ్యూనిటీలో మన స్టేటస్ నిలబెట్టుకావాలనీ, పెద్దింటి ఆడవాళ్ళు పేకాటకి రామ్మన్నారంటే 'ఇంకేం! అదే మనకు కావలసింది' అని సంతోషపడి నన్ను పంపడం మీరే చేశారు. వరూధిని ఎలక్షన్లలో తిరుగుతోందంటే 'అది నా కూతురు' అని మురిసిపోయింది కూడా మీరే. ఇప్పుడు ప్లేటు ఫిరాయించి నన్ను అంటున్నారు" అంది రుక్మిణి ఏడుస్తూ.
పరిస్థితులన్నీ సజావుగా సాగిపోతున్నంతకాలం ప్రతివారూ ఆదర్శదంపతులే. ఒకరిపట్ల మరొకరికి అవగాహన లేకుండా, ఆలోచనా రహితంగా రోజుల్ని ఈజీగా గడిపేసే దంపతులందరూ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కోవలసిన పరిస్థితే అది.
అరగంటసేపు ఒకర్నొకరు నిందించుకున్న తర్వాత కూల్ అయ్యారిద్దరూ.
"పద, కాలేజీకి వెళ్ళి దాన్ని నాలుగు తిట్టో, తన్నో ఇంటికి తీసుకొద్దాం. తర్వాత కాళ్ళూ, చేతులూ విరగ్గొట్టి గదిలో పడేస్తాను" అంటూ లేచాడు కృష్ణమూర్తి.
వాళ్ళిద్దరూ కాలేజీకి చేరేసరికి, చాలా పెద్ద గుంపు తయారయింది. కాలేజీ అమ్మాయిలతో టెంట్ నిండిపోయింది. వారిమధ్యా ఎక్కడో కూర్చొని వుంది వరూధిని. ఆమె మెడనిండా దండలున్నాయి. అంతమందిలో కూతుర్ని విడిగా పిలిచి ఎలా మందలించాలో అర్థంకాలేదు కృష్ణమూర్తికి అంతమంది సపోర్టు చేస్తున్నారంటే వరూధిని చేస్తున్నది తప్పు కాదేమోనన్న భావం కూడా కల్గింది.
ఇంతలో ఒకమ్మాయి "రండి అంకుల్, ఆంటీ" వచ్చి కూర్చోండి. మహిళా సమాజంవాళ్ళు, ప్రెస్ రిపోర్టర్లు కూడా వస్తున్నారు. ఆడపిల్లల్ని నమ్మించి మోసంచేసే వెధవలకి యిలాగే గట్టిగా బుద్ది చెప్పాలని మీరూ నొక్కి చెప్పండి" అంటూ ఆహ్వానించింది. ఆమె ఎలక్షన్లలో సందీప్ కి వ్యతిరేకంగా పోటీచేసి ఓడిపోయిన ఒక అభ్యర్థి. కృష్ణమూర్తి పూర్తిగా చల్లబడిపోయాడు. కూతురు చేస్తున్నదాంట్లో ఎలాంటి తప్పూ కనబడలేదు. ఈ లోపులో ప్రెస్ వాళ్ళు వచ్చారు. రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు తీసుకున్నారు.
"పెళ్ళి కాకుండానే ఒక యువకుడికి శారీరకంగా దగ్గరవడం తప్పుగా అనిపించలేదా మీకు?" అడిగిందో లేడీ రిపోర్టరు.
"ప్రేమ అంటే నమ్మకం. మనం ఎన్నో సినిమాల్లో చూశాం. హీరో హీరోయిన్లు వర్షంలో తడిసి, పెళ్ళి కాకుండానే దగ్గరవటం, ఏదో కారణాలవల్ల పెళ్ళి జరగకపోవడం, ఆమె బిడ్డని కని పోషించడం..... ఆమె తప్పు చేసినట్లు మనకి అనిపించదు. పైగా గొప్ప త్యాగమయిగా ఆమెపట్ల సానుభూతి చూపిస్తాం. హీరో హీరోయిన్లు ముసలివాళ్ళయ్యాక కలిసినా పొంగిపోతాం. అలాంటి సినిమాలు పదే పదే చూసి, వందేసి రోజులు ఆడిస్తాం. కానీ నిజ జీవితంలో ఒక అమ్మాయి ప్రేమించిన వ్యక్తిపట్ల నమ్మకంతో అతడికి దగ్గరయితే ఆమెను అవమానించడం, వెక్కిరించడం, సంఘంలో చీడపురుగు అనడం జరుగుతుంది. ఇది అన్యాయం కాదా? ఇలాంటి అన్యాయాలు సమసిపోవాలనే నేనీ దీక్ష పట్టింది" అంది వరూధిని ఆవేశంగా.
"హియర్, హియర్" చాలామంది చప్పట్లు కొట్టారు. కూతురు అలా మాట్లాడుతుంటే తల్లిదండ్రులు కూడా మురిసిపోయారు.
"సందీప్ మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటానని ప్రామిస్ చేశాడంటున్నారు. దానికి సాక్ష్యం మీ దగ్గరుందా?"
"అదుంటే డైరెక్టుగా కోర్టుకి వెళ్ళేదాన్ని. ఆయన ప్రేమించిన వ్యక్తి ప్రామిస్ లన్నీ రికార్డు చేసుకునే ఉద్దేశ్యం వుంటే అది 'ప్రేమ' అవుతుందా?"
కూతురి మాటల్ని కళ్ళు విప్పారితం చేసుకుని వింటూన్న రుక్మిణి మధ్యలో కలుగచేసుకుని- "మా ఇంటికి వచ్చినప్పుడు కూడా సందీప్, అదే ఉద్దేశ్యం వెలిబుచ్చాడు. వాళ్ళ మమ్మీ, డాడీ విదేశాల్లో వున్నారని, రాగానే ఇంటికి తీసుకొస్తానని కూడా చెప్పాడు" అది.
కృష్ణమూర్తి భార్యని మెచ్చుకోలుగా చూశాడు. వరూధిని కూడా తల్లివైపు ఆశ్చర్యంగా చూసింది. సందీప్ ని ఒకసారి తను బలవంతంగా ఇంటికీ తీసుకెళ్ళింది. 'మీ అమ్మా వాళ్ళను తీసుకురా' అని తల్లి పదే పదే అడిగితే 'విదేశాల కెళ్ళారు. రాగానే తీసుకొస్తాను' అన్నాడు అతడు. దాన్నింత సందర్భానుసారంగా తల్లి ఉపయోగించడం గొప్ప విషయం. తల్లి తెలివితేటలకి మురిసిపోయింది.
రుక్మిణి ఆలోచనలు వేరే విధంగా వున్నాయి. సందీప్ అల్లుడయితే వచ్చే లాభాలు అప్పుడే బేరీజు వేసుకుంటోంది. దాదాపు కూతురి పెళ్ళి అయిపోయిందనే వూహించేసుకుంటోంది.
"మీ అమ్మాయి చేస్తున్నా ఈ సమ్మె సమంజనీయమైనదని మీరూ నమ్ముతున్నారా?" ఒక విలేఖరి డైరెక్టుగా కృష్ణమూర్తినే అడిగాడు.
"మా అమ్మాయి కాదు. ఏ ఆడపిల్ల అయినా ఇలాంటి అన్యాయానికి గురిఅయినప్పుడు, అది బహిరంగపరచి పోరాడడం చాలా చాలా అవసరం. అప్పుడు గానీ ఆడపిల్లలతో ఆడుకునే అబ్బాయిలకు బుద్ధిరాదు" అన్నాడు కృష్ణమూర్తి ఆవేశంగా.
మరోసారి చప్పట్లు మార్మోగాయి.
5
అర్థరాత్రి పన్నెండుదాటాక మెలకువ వచ్చింది వరూధినికి.
టెంట్ బయట ఒక వ్యక్తి నిల్చుని వున్నాడు. ముందామెకి భయం వేసింది. కానీ ఆ యువకుడు అక్కడే నిలబడి వున్నాడు. చీకట్లో పోలిక స్పష్టంగా తెలియటం లేదు.
కూతురితోపాటు రుక్మిణి కూడా టెంట్ లోనే పడుకుని వుంది. ఆమె గాఢనిద్రలోనే వుంది. అంతక్రితం రోజు రాత్రి తోడుగా వున్న స్నేహితురాళ్ళు ఇద్దరూ ఇంట్లో పనుందని ఆ రోజు రాలేదు.
తల్లిని నిద్ర లేపాలనుకుంటూండగానే ఆ యువకుడు వెలుగులోకి వచ్చాడు.
అతడు సుభాష్!
ఆ రోజు పార్కులో ఇన్ స్పెక్టర్ పట్టుకున్నప్పుడు ఆమెని ఒక వేశ్యగా చిత్రీకరించి వెళ్ళిపోయినా మున్సిపల్ కౌన్సిలర్ కొడుకు. నిజానికి అతడి మీద కసితో సందీప్ కి చేరువైంది.
ఆ టైమ్ లో అతడిని అక్కడ వూహించలేదు వరూధిని. ఆమె ఆశ్చర్యంలో వుండగానే సుభాష్ ఆమెని బయటికి రమ్మనట్టు సైగచేశాడు.
బయటంతా నిర్మానుష్యంగా వుంది. ఆమె మొదటి తల్లిని నిద్ర లేపుదామనుకుంది. కానీ తరువాత ఆ ఆలోచన విరమించుకుని తనే బయటకొచ్చింది.
వరూధినికి బాగా నిస్సట్టుగా వుంది. అయినా ఓపిక తెచ్చుకుని సుభాష్ దగ్గిరకు వచ్చింది. సుభాష్ పట్ల వున్న అసహ్యమూ, కోపమూ కన్నా ఆ సమయంలో అతను ఎందుకొచ్చాడన్న ఉత్సుకతే ఎక్కువవుంది.