నిఖితతో పరిచయమయ్యాక వాళ్ళిద్దరి మధ్యా వాదోపవాదాలు జరిగేవి. అతడనేవాడు, "నా తల్లిదండ్రులపట్ల నాకేం భయంలేదు. గౌరవం వుంది. విపరీతమైన గౌరవం!"
"నీ తల్లిదండ్రులపట్ల నీకుండాల్సింది గౌరవం కాదు. ఆత్మీయత, ప్రేమ! నీకు నచ్చనిది కూడా వాళ్ళకి నిర్భయంగా చెప్పగలిగినప్పుడే అది ఆత్మీయత అవుతుంది" అని వాదించేది నిఖిత. ఒకే కాలనీలో వున్న చాలాకాలం వరకు వాళ్ళిద్దరి మధ్యా అసలు పరిచయమే లేదు. అది చాలా గమ్మత్తుగా జరిగింది.
ఆఫీసు పనిమీద ఒకరోజు అతను బెంగుళూరు వెళ్ళవలసి వచ్చింది. రెండ్రోజులు ముందుగానే పని జరిగిపోయింది. ఒంటరిగా అక్కడ వుండబుద్ధికాక తిరిగి బయలుదేరాడు ఫస్ట్ క్లాస్ టికెట్ దొరక్క సెకండ్ క్లాస్ లోనే రావలసి వచ్చింది. సాధారణంగా అతడు సెకండ్ క్లాస్ లో ప్రయాణం చెయ్యడు. అలాంటి అవకాశం అతని తల్లిదండ్రులు అసలతనికి ఇవ్వలేదు. ప్రతివాళ్ళూ పలకరించటం, మాటల్లో పెట్టాలని ప్రయత్నించటం అతనికి చాలా చిరాకు కలిగిస్తాయి.
అతను రైలెక్కే సరికి తన సీటున్న టేబుల్ మొత్తం అమ్మాయి లెవరో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. సెండాఫ్ ఇవ్వటానికి వచ్చిన వాళ్ళేమో అనుకొని సర్దుకొని కూర్చున్నాడు. అతడికి చిరాకేసింది. కిటికీ దగ్గిర నిలబడి మాట్లాడుకోవచ్చు కదా అనుకున్నాడు.
రైలు కదిలినా వాళ్ళు కపార్ట్ మెంట్ నించి దిగలేదు. కబుర్లాపలేదు. అతడు ఏ సీట్లో కూర్చున్నాడో ఆ పక్క సీటతను ఇబ్బందిగా ఫీలవుతూ ఇంతకూ "మీ సీటేది?" అని అడిగాడు. అవినాష్ కేం చేయాలో తోచలేదు. ధైర్యం చేసి లేచి, అమ్మాయిల దగ్గర కెళ్ళి "ఈ సీటు నాది. కాస్త పక్కకి జరుగుతారా?" అని అడిగాడు మెల్లగా.
అమ్మాయిల్లో కాస్త పొడుగ్గా వున్న ఒకమ్మాయి "ఈ సీటు మీదని ఎవరన్నారు?" అని ప్రశ్నించింది.
అవినాష్ కొద్దిగా కంగారుపడి "ఇదిగోండి టిక్కెట్. ఇదే సీటునంబర్" అని చూపించాడు. వాళ్ళల్లో ఒకమ్మాయి చొరవగా టికెట్ తీసుకొని చూసి "కౌంటర్లో కొన్నదా? లేకపోతే ఎవరైనా బ్లాక్ లో అమ్ముతుంటే తీసుకున్నావా అవినాష్?" అని అడిగింది. తన పేరు ఆ అమ్మాయి నోటి నుంచి వచ్చేసరికి అతడు ఆశ్చర్యంగా అటు తిరిగి చూశాడు.
ఆమె నిఖిత. చిన్నగా నవ్వుతోంది. ఎదురుగా వున్నది తమ కాలనీ అమ్మాయేనని తెలియగానే అవినాష్ కి కొంచెం ధైర్యంవచ్చింది. అయితే ఆ అమ్మాయి పేరు గుర్తులేదు. "మీరు.......... మీరు......." అని అడిగాడు.
"నా పేరు నిఖిత" అంది. తరువాత పక్కకి జరుగుతూ చొరవగా "ఇక్కడ కూర్చో. టిక్కెట్ కలెక్టర్ వచ్చిన తర్వాత ఏం చేయాలా అన్నది ఆలోచిద్దాం" అంది.
టిక్కెట్ కలెక్టర్ ప్రసక్తి రాగానే అవినాష్ కి భయమేసింది. అతను వచ్చి గొడవ చేస్తే ఏం చేయలో తోచలేదు. నిజంగా ఆ అమ్మాయిలన్నట్లు ఇది బ్లాకులో తిక్కెట్టేమో...... ట్రావెలింగ్ ఏజన్సీవాడు తనని మోసం చేశాడేమో...... ఈ రకంగా రకరకాలుగా ఆలోచిస్తూ భయపడసాగాడు. ఇలాంటి ప్రవృత్తి మనుషుల్లో చాలా ఎక్కువగా కనబడుతూ వుంటుంది. చిన్న చిన్న విషయాలకే మనసు పాడు చేసుకొని ఎక్కువగా ఆలోచించటం! టిక్కెట్ కలెక్టర్ వచ్చిన తరువాత ఏం జరుగుతుందా అన్న దానికన్నా, అతను రాకముందే అంతకన్నా ఎక్కువ భయపడటం అతడి మానసిక పరిస్థితి తెలుపుతూంది.
అంతలో టి.టి. రానేవచ్చాడు. రెండు టిక్కెట్లూ పరిశీలించి అవినాష్ ని దిగిపోమ్మన్నాడు. అవినాష్ బిక్కమొహం వేసుకొని నిలబడ్డాను. నిఖిత కల్పించుకొని "ఆయన టిక్కెట్టు మీద కూడా ఈ రోజు తేదీయే వేసి వుంది కాస్త చూడండి" అంది.
"ఛార్ట్ లో మీ పేరుంది. కాబట్టి అతను దిగిపోవలసిందే. కావాలంటే జనరల్ కంపార్ట్ మెంట్ లో ప్రయాణం చేయమనండి" అన్నాడు టి.టి. కాస్త పొగరుగా.
"ఆయన రిజర్వేషన్ చేసుకొని వస్తే జనరల్ కంపార్ట్ మెంట్ లో ఎలా ప్రయాణం చేస్తాడు?" నిఖిత అడిగింది.
టి.టి స్వరం బాగా హెచ్చింది. "అవన్నీ నాకు తెలియవు. ఏవన్నా చెప్పాలనుకుంటే స్టేషన్ లో కంప్లయింట్ ఇవ్వాల్సింది. ఇప్పుడు నేనేం చేయలేను. వచ్చే స్టేషన్ లో దిగి జనరల్ కంపార్ట్ మెంట్ కి వెళ్ళిపోవాలసిందే" అన్నాడు.
నిఖిత కూడా స్వరం హెచ్చించి "అంటే మీ వుద్దేశ్యం రైలు కదులుతూంటే స్టేషన్ మాస్టర్ని వెదికి పట్టుకొని ఫిర్యాదు చేస్తూ కూర్చోవాలా?" అని అడిగింది.
"అవును. అదే రూలు" అన్నాడతను.
"తప్పుచేసింది మీ డిపార్ట్ మెంట్. ఒకటే సీట్ ని ఇద్దరికి ఎలాట్ చేయడం మీ పొరపాటు. ఇప్పుడు కంపార్ట్ మెంట్ లో ఖాళీగా వున్న బెర్త్ ముందుగా ఇతనికి ఇవ్వకుండా ఎవరికన్నా యిస్తే దాన్ని ఏ బేస్ మీద ఇచ్చారో మేమూ చూస్తాం. నేరుగా వెళ్ళి కంప్లయింట్ రాసిస్తాం. స్టేషన్ మాస్టర్ కి కాదు, కన్ స్యూమర్ ఫోరమ్ కి" అంది ఇంగ్లీషులో.
ఆమె ధోరణి చూస్తే రైల్వేబోర్డ్ ఛైర్మన్ ని కూడా ఈ కేసులో ఇరికించేటట్లు కనబడింది. టి.టి. ఆమె అధారిటీకి భయపడినట్టున్నాడు. పక్కసీటు, బెర్త్ కూడా అలాట్ చేసి వెళ్ళిపోయాడు.
అప్పటివరకు నిఖితనే చూస్తూన్న అవినాష్ మనసులో అదోలాంటి సంచలనం ప్రారంభమైంది. స్త్రీలలో అంతటి చొరవ, పరిశీలనాశక్తిమ్ తెలివితేటలు వుంటాయని అతడికి మొట్టమొదటిసారి తెలిసింది. అతడికి అంతకు ముందు తెలిసిన ఒకే ఒక స్త్రీ అతడి తల్లి మాత్రమే.
తర్వాత రైల్లో ఇద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఆమె ఇంటర్ వరకు మాత్రమే చదివిందని, ప్రైవేటు గా ఇంటి దగ్గరే డిగ్రీ పూర్తీచేసిందని తెలిసి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఇద్దరూ స్టేషన్ లో దిగి ఒకే ఆటోలో కాలనీకొచ్చారు. అలా రావటానికి అవినాష్ భయపడ్డాడేమో కానీ నిఖిత మాత్రం చాలా మాములుగా తీసుకుంది.
4
ఫ్రస్ట్రేషన్!
'అసంతృప్తి' అనేది మనిషిని రెండు రకాలుగా మారుస్తుంది.
జీవితంలో ఏదైనా సాధించాలనే అసంతృప్తి, తపనగా మారి మనిషిని గొప్పవాడ్ని చెయ్యొచ్చు. లేదా అసంతృప్తితో జీవితంలో ఏదైనా సాధించాలన్న కసి, ఏమీ చేయలేని నిస్సహాయతవల్ల అనాలోచితమైన చర్యలకి దారి తీయొచ్చు.
ప్రస్తుతం వరూధిని అసంతృప్తితో వుంది.
మున్సిపల్ కౌన్సిలర్ కొడుకు సుభాష్ తో కలిసి పార్క్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి అతనితో 'వేశ్య' అని ముద్ర వేయబడిన తర్వాత వరూధిని ఆవేశంతో కంపించిపోయింది. ఇన్ స్పెక్టర్ 'మగవాళ్లు ఎలా వుంటారనే'ది సోదాహరణంగా నిరూపించాడు. అయితే ఇన్ స్పెక్టర్ అనుకున్నట్లు ఆ అమ్మాయి ఇక ఆ వ్యవహారాలన్నీ కట్టిపెట్టి చదువుమీద ఏకాగ్రతని నిలిపాలి అనుకోలేదు. ఆమెలో కసి మరింత ఎక్కువైంది.
ఈ కసి మగవాళ్ళ మీద! సుభాష్ ని ఎలాగైనా అవమాన పరచాలని నిశ్చయించుకుంది. సుభాష్ ని అవమానపరచటానికి ఆమె ఎన్నుకున్న ఆయుధం 'సందీప్!'
సందీప్ ఆ కాలేజీలోనే చదువుకొనే మరొక యువకుడు. అతడు ఆ సంవత్సరం కాలేజీ యూనియన్ ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాడు. అతడు వచ్చి వరూధినిని ఈసారి ఎన్నికల్లో సపోర్ట్ చేయమని అభ్యర్థించాడు.
వరూధినికి ఇదొక గొప్ప అవకాశంగా దొరికింది. సుభాష్ ని అసూయతో దగ్ధమై పోయేలా చేయాలంటే సందీప్ కి చేరువ కావాలని అనుకొంది. దాదాపు నెలరోజులపాటు ఆమె విశ్రాంతి అనేది లేకుండా సందీప్ తో కలిసి పనిచేసింది. బస్సుల్లో, బస్టాండుల్లో, కాలేజీ గోడలమీదా పాంప్లెట్లు అంటించడం దగ్గరనుంచి స్వయంగా అందరి దగ్గరికెళ్ళి సందీప్ కి ఓటేయమని అడగటం వరకు నిర్విరామంగా కృషిచేసింది. అంత అందమైన అమ్మాయి స్వయంగా వచ్చి అడగటంతో ఎవరూ కాదనలేకపోయారు.
ఎలక్షన్స్ లో సందీప్ అత్యంత మోజారిటీతో గెలిచాడు. "నా ఈ గెలుపుకి వరూధిని కారణం! నా ఈ అభినందనలన్నీ ఆమెకే చెందాలి" అని పబ్లిక్ గా చెప్పాడు. ఆ సాయంత్రం అతను ఫైవ్ స్టార్ హొటల్ లో డిన్నరిచ్చాడు. ఆ డిన్నర్ కి సుభాష్ కూడా వచ్చేలా చూసిందామె. సందీప్ సుభాష్ కన్నా చాలా పై అంతస్థులో వున్నాడు. సుభాష్ కేవలం మున్సిపల్ కౌన్సిలర్ కొడుకే.
........ఆమెకి ఆ రాత్రి జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోయింది. సుభాష్ చాలా మౌనంగా......ఓడిపోయినట్టు కనబడటం ఆమె అహాన్ని బాగా సంతృప్తి పరిచింది. సందీప్ తో అవసరమైన దానికన్నా ఎక్కువ చనువుగా తిరిగింది. హొటల్లో మీదపడి మరీ మాట్లాడింది.
రెండురోజుల తర్వాత ఒంటరిగా వున్నప్పుడు సందీప్ 'ఐ లవ్ యూ వరూధిని' అన్నాడు. ఆమె పొంగిపోయింది. మర్నాడు సందీప్ ఆమెని ఇంటికి ఆహ్వానించాడు. ఈసారి ఆమెకొక్కదానికే పార్టీ అన్నాడు. ఇద్దరూ కలిసి లంచ్ చేసిన తర్వాత ఆమెని బెడ్ రూంలోకి తీసికెళ్ళాడు.
ఇది రెండో అనుభవం! మొదటి అనుభవంలో వుండే భయం, వణుకు ఈసారి ఆమెలో లేవు. అందువల్ల చాలా సులభంగా అతనికి ఆమె తనని తాను అర్పించుకుంది. అతను ముద్దు పెట్టుకుంటూంటే తను కూడా సహకరించింది. అతడు ఆమెని నెమ్మది నెమ్మదిగా ఆక్రమించుకుంటుంటే ఆమెకి సుభాష్ గుర్తొచ్చాడు. సందీప్ భారీగా సుభాష్ కళ్ళ ముందు కార్లో తిరుగుతుంటే అతను ఎలా కుతకుతలాడిపోతాడో ఊహించుకుంటూ ఆ అనుభవాన్ని ఆమె ఆస్వాదించింది.
దాదాపు రెండు నెలలపాటు వీరి ప్రేమ వ్యవహారం నిరాటంకంగా సాగింది. కాలేజీకి శలవులిచ్చారు. ఆ మరుసటిరోజు జరిగింది ఒక దురదృష్టకరమైన సంఘటన......అయిదోసారి ఫోన్ చేసిన తర్వాత వరూధినికి అనుమానమొచ్చింది. సందీప్ యింట్లోనే వున్నాడు కానీ నౌకర్లు లేడని చెబుతున్నారని!
మరోసారి నెంబర్ డయల్ చేసింది. "చిన్నబాబు లేరమ్మా, బయటి కెళ్ళారు" అని చెప్పి టక్కున ఫోన్ పెట్టేశాడు నౌకరు. వరూధిని అనుమానం బలపడింది. అయితే ఆ అనుమానం సందీప్ పట్లకాదు. అతనికి ఆరోగ్యం బాగలేదేమో, ఆ విషయం తెలిస్తే తను గాభరా పడుతుందని అలా చెప్పిస్తున్నాడేమో అనుకుంది.
ప్రేమికుడ్ని అంత తొందరగా అపార్థం చేసుకోవటానికి ఏ అమ్మాయి మనసూ ఒప్పుకోదు.
అయితే వాస్తవం వేరు. ఆమె సందేప్ ఇంటికి ఆటోలో బయలుదేరింది. అతనింటికి చేరే సరికి దాదాపు అరగంట పట్టింది. గేటు దగ్గర గూర్ఖా నవ్వుతూ సలాంకొట్టి గేటు తెరిచాడు.
"చిన్నబాబు ఇంట్లోనే వున్నారా?" అని అడిగింది.
"వున్నారనుకుంటానమ్మా. నేనిప్పుడే వచ్చాను. రెండుకార్లు వున్నాయంటే ఇంట్లోనే వున్నారన్నమాట" అన్నాడు.
ఆ ఇల్లు, ఆ గుర్ఖా ఆమెకి సుపరిచితమే. ఏ సమయంలో వచ్చినా నౌకర్లు అతిమర్యాద ఇచ్చి గౌరవించేవారు. త్వరలో ఆమె ఇంటి యజమానురాలు కాబోతుందని తెలిసినట్లే ప్రవర్తిస్తారు. వరూధిని ఇంట్లోకి ప్రవేశించింది. ముందు హాల్లో ఎవరూ లేరు. సందీప్ గది పై అంతస్థులో వుంది. ఆమె మెట్లెక్కి పైకెళ్లింది. గది తలుపులు దగ్గరగా వేసున్నాయి.
అతడికి నిజంగానే అనారోగ్యంగావుండి వుంటుంది. లేకపోతే ఈ వేళలో గదిలో అలా పడుకొని ఎందుకుంటాడు అనుకుంది. ఇప్పుడు తనని చూస్తే ఏమనుకుంటాడు. "నీ ప్రేమ ఎంత గొప్పది వరూధిని? చెప్పకుండానే నా అనారోగ్యం గురించి తెలుసుకొని వచ్చావంటే అది నిజంగా నీ ప్రేమ మహాత్యమే" అంటాడా- అనుకుంటూ తలుపు మీద చెయ్యివేసింది.