Previous Page Next Page 
త్రినేత్రుడు-1 పేజి 21


    త్రినాధ్ మాటలకు విజయరామారావు మధ్యలోనే అడ్డొచ్చాడు.

    "కేవలం ఆరువేల నష్టం అతనికో లెక్కా?"

    "నష్టం ఎంతన్నది కాదు పాయింట్. అతనెవరో, ఏమిటో తెలిసి కూడా లెక్కచేయకుండా రేటు పెంచి అతని పొగరును దెబ్బకొట్టటం. అతను క్రుకెడ్ బిజినెస్ మెన్. చూస్తూ చూస్తూ ఐదుపైసలు ఎక్కువ ఇవ్వడానికి కూడా ఇష్టపడడు. తనడిగే రేటుకి మీరు అంగీకరించరు. బెదిరిస్తే నేనున్నాను. కొనటం మానేస్తే కూతురు ఒప్పుకోదు. ఇదీ అసలు డ్రామా..."

    ఆయన త్రినాధ్ వైపు విస్మయంగా చూశాడు.

    "అదనంగా మీకు రానున్న ఆరువేలు నాకు అప్పుగా ఇవ్వండి. వడ్డీతో సహా సాధ్యమైనంత త్వరలో మీ అప్పు తీర్చుకుంటాను..." త్రినాధ్ తను చెప్పటం పూర్తయిందన్నట్టుగా ఆగిపోయాడు.

    "నువ్వేం చదువుకున్నావ్?" ఆయన హఠాత్తుగా అడిగాడు.

    త్రినాధ్ లేచి నిలబడ్డాడు. వెళ్ళొస్తానన్నట్లు ఆయనకు నమస్కరించి వెళ్ళబోతూ ఆగి అన్నాడు. "ఇప్పుడే చదువుకుంటున్నాను. మనిషిని, ఆ మనిషి బలహీనతల్ని, అవసరాల్ని, అహాన్ని, అధికారాన్ని, అంధకారాన్ని, అయోమయాన్ని, నిరాశను, నిస్పృహను, నిస్తేజాన్ని, శూన్యాన్ని, ఆశల్ని, ఆశయాల్ని, ఆదర్శాల్ని, పిరికితనాన్ని, భయాన్ని, ప్రేమను, అభిమానాన్ని, సెంటిమెంట్ ని ఈ చదువుతో అవకాశాలకోసం ఎదురుచూడడం లేదు. నేనే దాని దగ్గరకు వెళ్తున్నాను. నిజానికి నాకు అప్పు పెట్టాల్సిన అవసరం మీకు లేదు. కాని నాకు జరిగిన అవమానం గురించి మీకు హిందూ చెప్పింది. దెబ్బకు దెబ్బ- అవమానానికి- పరాభవం అన్నది నా సూక్తి. మీరు మంచివారని, గతంలో మీరు సుదర్శన్ రావు చేతిలో అవమానింపబడ్డారని హిందూ చెప్పగా ఈ పథకం వేశాను. సాయంత్రంలోపు సుదర్శన్ రావు మనిషి మీ దగ్గరకు వస్తాడు. నిర్ణయం మీకే వదిలేస్తున్నాను...." త్రినాధ్ ఈ మాటలంటూనే బయటకు నడిచాడు.

    బయట త్రినాధ్ కోసం ఎదురుచూస్తున్న హిందూ అతన్ని చూడగానే కళ్ళతోనే ప్రశ్నించింది.

    త్రినాధ్ చిరునవ్వుతో మౌనంగా తలూపాడు.


                     *    *    *    *


    త్రినాధ్ ఆ రోజంతా రోడ్లన్నీ అవిరామంగా తిరుగుతూ ఖాళీ ఇళ్ళ గురించి వాకబు చేశాడు. సాయంత్రం నాలుగవుతుండగా మాలినిని కలుసుకొనేందుకు కాలేజీకి బయలుదేరాడు.


                     *    *    *    *


    "నా రేటది. మీకిష్టమైతే పన్నెండు వేలిచ్చి తీసుకోండి..." విజయరామారావు తెగేసినట్టు చెప్పాడు.

    హఠాత్తుగా ఈయనకింత ధైర్యం ఎలా వచ్చింది? సుదర్శన్ రావు తరపున వచ్చిన వ్యక్తికి ఆశ్చర్యంగా వుంది.

    "అంతేనంటారా?" ఆ వ్యక్తి బెదిరింపు ధోరణిలో అడిగాడు.

    "అంతేనంటున్నాను. మరో విషయం. పడగొట్టిన గోడను కూడా మీరే కట్టించాలి. నా నిర్ణయంలో మార్పుండదు. ఇక నువ్వెళ్ళవచ్చు-" తెగేసి చెప్పాడాయన."


                                                 *    *    *    *


    "ఆ ఆరువేలతో ఏం చేయబోతున్నావ్-?" కాలేజీలో ఓ చెట్టు కింద కూర్చుని మాలిని సాలోచనగా అడిగింది.

    త్రినాధ్ అక్కడే పచార్లు చేస్తూ అన్నాడు- "ముందో అడ్రస్సు సంపాదించాలి. ఈరోజు నాలుగైదు ఖాళీ ఇళ్ళు చూశాను."

    "అద్దె భరించగలవా?"

    "భరించలేను. అందుకే ఫెయిర్ హౌస్ ఎన్నుకోలేదు. అద్దెకిచ్చిన వాడికి, తీసుకున్నవాడికి మధ్య గొడవ వున్న బిల్డింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎంక్వైరీ చేయగా ఓనర్ పిరికివాడు కావడంతో అద్దెకున్నవాడిని ఖాళీ చేయించలేకపోతున్నాడట. ఓనర్ ఆ ఇంటిని అమ్మాలనుకొంటున్నాడు. ఇతను తక్కువ రేటుకి నాకే అమ్ము- లేదంటే ఖాళీ చేయను. నీ దిక్కున్న చోట చెప్పుకో వెళ్ళి అని గూండాలను తెచ్చి బెదిరిస్తున్నాడట. ఆ ఓనర్ తో మాట్లాడాను. దాన్ని ఖాళీ నేను చేయిస్తాను. నాకు ఆరునెలలు ఉచితంగా ఇవ్వమన్నాను. అందుకతను ఒప్పుకున్నాడు."

    మాలిని అభినందనగా చూస్తూ చిరునవ్వుతో అంది. "అంటే నీ వ్యాపారాన్ని జబర్దస్తీతో ఆరంభించబోతున్నావన్న మాట."

    "న్యాయం కోసం జబర్దస్తీ. అతనికి న్యాయం నేను చేకూర్చి పెడుతున్నాను కనుక నాకు అడ్రస్సు దొరుకుతుంది."

    త్రినాధ్ కళ్ళలో కనిపించే ఆత్మవిశ్వాసాన్ని చూసి మాలిని సంతృప్తిగా తల పంకించింది.

    "ఆరునెలల తర్వాత?"

    "ఏడో నెలలో ఓనర్ చెప్పే రేటుకి ఆ బిల్డింగ్ ని కొనలేకపోతానా?"

    మాలిని ఓ క్షణం తృళ్ళిపడింది, త్రినాధ్ మాటల్లో తొంగిచూసిన నమ్మకానికి.


                     *    *    *    *


    విజయరామారావు చెప్పిన రేటు విని సుదర్శన్ రావు తోకతొక్కిన త్రాచులా బుసలు కొట్టాడు. కాటువేసి ఆ ధరకి కళ్ళెం వేయాలనుకున్నాడు. కాని, దానికి కొంత కాలయాపన జరుగుతుంది. తన ముద్దుల కూతురు రెండు వారాలలో స్విమ్మింగ్ పూల్ రెడీ అవ్వాలని మొండిపట్టుదలతో వుంది. అందుకే ఆ రేటు ఇవ్వటానికి సిద్ధపడ్డాడు.


                                                 *    *    *    *


    "తొలిసారి అతని ముఖంలో దెబ్బతిన్న భావాన్ని ఆనందంగా తిలకించాను. ఏమీ చేయలేకపోతున్నానన్న నిస్సహాయతను చూశాను. సెభాష్- ఈ తరం యువతంటే నీలా వుండాలి. నీకు ఆరువేలు కాదు. పన్నెండువేలు ఇస్తున్నాను. నాకు హిందూ అంతా చెప్పింది. నీ మహాయజ్ఞానికి నాదో సమిధ. నిజంగా పైకి రావాలనుకునేవాడు కారణాలు వెతక్కూడదు. కాలయాపన చేయకూడదు. ప్రభుత్వాల్ని, వ్యవస్థను, రాజకీయ నాయకుల్ని, బ్యూరోక్రసీని, బంధుప్రీతిని, రికమండేషన్స్ ని, లంచాల్ని ఎంత తిట్టినా ప్రయోజనం శూన్యం. అది లేదని తెలిసినప్పుడు ఫ్రస్టేట్ అవడం, నిస్పృహకు గురికావడం, ఆత్మహత్యలు చేసుకోవటం రాజీపడటం తెలుసు ఈ దేశం యువతకు, అవికావు లక్ష్యం, శ్రమను, తెలివితేటల్ని ఉపయోగించటమే పరిష్కారం... అది నీవలన సాధ్యపడబోతోందని, దాన్ని నువ్వు నిరూపించబోతున్నావని తెసులుకుని ఆనందిస్తున్నాను ఒక గురువుగా ఎందరికో విద్యాబుద్ధులు నేర్పాను. ఒక్కరూ పైకెదిగినట్టు నాకు దృష్టాంతరాలు కనిపించలేదు. విద్య నేర్పగా వచ్చిన నా కష్టార్జితం నన్ను ఇన్నాళ్ళు వెక్కిరించింది. నా విద్య, నాలాంటి లక్షలాది గురువుల విద్య వేళ్ళ మీద లెక్కెట్టగల ప్రయోజకుల్ని తయారుచేసింది. అందుకే సిగ్గుపడుతున్నాను. నేనిస్తున్నది తక్కువే కావచ్చు. కాని మనిషి తలచుకుంటే ఎంత తక్కువతోనైనా ఎంతెక్కువ సాధించవచ్చో నిరూపించు. నా ఆశీస్సులు నీకెప్పుడూ వుంటాయి..." అంటూ చెమర్చిన కళ్ళతోనే పన్నెండువేలు తీసి టీపాయ్ మీద పెట్టాడు విజయరామారావు.

    త్రినాధ్ కృతజ్ఞతగా నమస్కరించి "మాటమీద నిలబడడం నాకు గొప్ప తృప్తినిస్తుంది..." అంటూ అందులోంచి ఆరువేలు మాత్రమే తీసుకొని, చటుక్కున జేబులోంచి తెల్లకాగితం తీసి దానిమీద తను ఆరువేలు అప్పుగా తీసుకున్నట్టు, త్వరలోనే తీరుస్తానన్నట్టు రాసి సంతకం చేసి ఆ కాగితాన్ని విజయరామారావుకి అందించాడు.

    ఆయన ఆశ్చర్యపోతూ చూస్తుండగానే త్రినాధ్ బయటకు నడిచాడు.

    హిందూ త్రినాధ్ ని అనుసరించింది.

    సరీగ్గా పదిరోజులక్రితం వేలిముద్ర వేసిన తను ఇప్పుడు సంతకం పెట్టాడు... తనకే విచిత్రంగా వుంది... అది గుర్తుకు తెచ్చుకుని నిశ్శబ్దంగా నవ్వుకున్నాడు త్రినాధ్.


                 *    *    *    *



    చౌరాస్తాకి దగ్గరలో మెయిన్ రోడ్ మీదుంది హీరాలాల్ బిల్డింగ్. క్రింద షాప్స్ అన్నీ అద్దెకిచ్చాడు. ఫస్ట్ ఫ్లోర్ గోవింద్ యాదవ్ కి అద్దెకిచ్చాడు. ఆ బిల్డింగ్ వెనుక వున్న రెండు గదుల ఇంట్లో హీరాలాల్ కుటుంబం నివసిస్తోంది.

    గోవింద యాదవ్ కమీషన్ వ్యాపారం చేస్తుంటాడు. అతనా ఫ్లోర్ అద్దెకు తీసుకొని ఇరవై ఏళ్ళయింది. అప్పట్లో ఇచ్చిన రెండొందల అద్దె ఇప్పటికీ ఇస్తున్నాడు. అద్దె పెంచమని హీరాలాల్ అడిగినప్పుడల్లా గూండాలను తీసుకువచ్చి బెదిరిస్తుంటాడు. ఈ బాధ పడలేక ఇష్టంలేక పోయినా బిల్డింగ్ ని అమ్మేద్దామనే నిర్ణయానికొచ్చాడు హీరాలాల్. దానికీ యాదవ్ అడ్డు తగులుతున్నాడు. బిల్డింగ్ కొనటానికి వచ్చే వాళ్ళంతా యాదవ్ ని చూసి భయపడి జారుకుంటున్నారు.

    సాయంకాలపు చీకట్లు ముసురుకుంటున్నాయి.

    యాదవ్ కి సాయంత్రమే వ్యాపారం జోరుగా వుంటుంది.

    సరీగ్గా ఆ సమయాన్నే ఎన్నుకున్నాడు త్రినాధ్.

    హీరాలాల్ వణికిపోతున్నాడు. "నిన్న వచ్చి వెళ్ళిన కుర్రాడు ఈ రోజు సరీగ్గా 6-30 గంటలకి వస్తానన్నాడు. వస్తాడంటావా...?" భార్యవేపు ఆందోళనగా చూస్తూ అడిగాడు.

    సరీగ్గా అక్కడకు 6-30కి చేరుకున్నాడు త్రినాధ్. కిటికీలోంచి హీరాలాల్ త్రినాధ్ ని చూసి కళ్ళతోనే సైగచేశాడు.

    త్రినాధ్ మెట్లెక్కి సరాసరి యాదవ్ గదిలోకే వెళ్ళాడు.

    త్రినాధ్ ని చూసి ఎవరో కస్టమర్ అనుకున్న యాదవ్ "ఏం కావాలి బే...?" అనడిగాడు పొగరుగా.

    "చిన్న కమీషన్ పనిమీద వచ్చాను..." అన్నాడు త్రినాధ్ మానసికంగా యుద్ధానికి సిద్ధపడుతూ.

    ఆ మాట వినగానే యాదవ్ ఆనందపడిపోతూ "చెప్పు బే..." అంటూ గబగబా చప్పట్లు కొట్టాడు. ఒక ఆజానుబాహుడు పరిగెత్తుకొచ్చాడు.

    "దో చాయ్ లావో" అని త్రినాధ్ వేపు తిరిగాడు.

    "చెప్పు బే..."

    "గోవింద యాదవ్, ఇకనుంచి ఈ బిల్డింగ్ కి నెలకు రెండు వేలివ్వాలి. లేదంటే ఖాళీ చేయాలి..."

    నిశ్శబ్దంగా వున్న ఆ ఎయిర్ కండీషన్డ్ గదిలో త్రినాధ్ మాటలు కంచుగంటల్లా ఖంగ్ మన్నాయి.

    ముందో క్షణం అతనేమన్నాడో అర్ధంకాక అయోమయంగా చూశాడు యాదవ్. అర్ధం కాగానే యాదవ్ మండిపోయాడు. కళ్ళు ఎర్రగా రక్తం చిమ్ముతున్నట్లుగా తయారయ్యాయి.

    "నువ్వెవడివి బే... ఎన్ని గుండెలు నీకు ఆ మాట చెప్పటానికి? ఆ ముసలి వెధవ పంపించాడా నిన్ను? నేనెవరో తెలుసా? ఈ పేటకే దాదాని..." నిప్పులు చెరిగాడు తన మాటల్లో యాదవ్.

    త్రినాధ్ గతంలో ఇలాంటి చిల్లర తగాదాల్ని, గొడవల్ని చాలా చూస్తున్నాడు. అతనికి తమాషాగా వుంది.

    "నగరానికి దాదా పెద్దా? పేటకి దాదా పెద్దా...?"

    వస్తూన్న నవ్వును బలవంతాన అణచుకుంటూ అడిగాడు త్రినాధ్.

    "నగరానికి దాదాయే పెద్ద..." యాదవ్ కోపంగా సమాధానం ఇచ్చాడు.

    అప్పుడు యాదవ్ ఉలిక్కిపడి త్రినాధ్ వేపు పరిశీలనగా చూశాడు.

    అప్పటికే యాదవ్ కండబలాన్ని అంచనా వేసిన త్రినాధ్ చటుక్కున తలుపు గడియవేసి, టెలిఫోన్ వైర్ ని సాకెట్ లోంచి పీకేశాడు.

 Previous Page Next Page