కవితని నెలకి ఆరు వందలకి బిల్డింగు ప్లంబర్ గా పార్ట్ టైం రోజుకి ఉదయం ఓ గంట రెండు గంటలు వుండి కంప్లయింట్స్ అటెండయి వెళ్లేట్టు పెట్టుకున్నాం - కవిత రెండు రోజులు డాబా మీదకి వెళ్లి లైన్లు ఎలా మార్చాలో చూసుకుని లెక్కలు రాసుకుంది. ఆ అమ్మాయి ఎంత చక్కగా ప్లాన్ గీసి రెండు రకాల ఎస్టిమేషన్ విత్ మెటీరియల్, వితౌట్ మెటీరియల్ అంటూ చక్కగా విడివిడిగా కావలసిన సామానులు, కూలి, వగైరా రాసిన పద్ధతిలో మంచి ప్రొఫెషనలిజమ్ కన్పించింది. పని కూడా అంత చక్కగా చేయగలదు అన్న నమ్మకం కలిగించింది. ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ అయి కవితకి కాంట్రాక్టు అప్పగించాం.
అనుకున్న దానికన్నా పది రోజుల ముందే ఇరవై రోజులలో పని చక్కగా పూర్తిచేసింది. ఒక్కో అంతస్తుకి వెళ్లే మెయిన్ లైనులోంచి అందరి ఇళ్లకి విడివిడిగా కనక్షను ఇచ్చి నీళ్ల ప్రెషర్ అన్ని అంతస్తులకి ఒకేలా వచ్చేట్టు చేయడంతో మాకు గొడవలు తగ్గి అంతా సంతోషించారు. నీట్ గా చేసిన పనిని అంతా మెచ్చారు. ఒక హెల్పరుని, అన్నని పెట్టుకుని థ్రెడ్డింగ్ ల దగ్గరి నుంచి అన్నీ స్వయంగా చేయించింది.
'ఈ కాంట్రాక్టులో నీకెంత మిగిలింది కవితా' అన్నాను పనంతా ముగిసి పేమెంటు అయ్యాక, కుతూహలంగా అడుగుతున్నా అంతే' అన్నాను.
'ఎక్కువ లేదండి మేడమ్, మొదటిసారి కదా. నా పని మీకు నచ్చాలి, నచ్చి మీరు ఇద్దరు ముగ్గురికి రికమెండ్ చెయ్యాలి. మొదటిసారి లాభం కంటే మంచి వర్కరు అన్న పేరు రావాలి మేడమ్. ఐదువేల దాక మిగిలింది. అందులో మా అన్నయ్యకి ఓ పదిహేను వందలు ఇచ్చాను' అంది.
కవిత తెలివైన ఆలోచన, ముందుచూపుకి మెచ్చుకోలుగా చూశాను.
'మీ అన్నయ్య ఏం చదువుకోలేదా. ఆడపిల్లవి నీవు చదివి ఉద్యోగం చేస్తున్నావు..'
'వాడికి చదువు మీద ధ్యాస లేదండి. ఏడో క్లాసు తప్పి అల్లరి చిల్లరగా తిరుగుతుంటే నేను వాడికి డబ్బు ఆశ చూపి నాకింద హెల్పర్ గా పెట్టుకున్నాను.'
'మేడమ్.. ఈ వీధిలో ఇంకో కొత్త అపార్టుమెంట్స్ కడుతున్నారు. దానికి ప్లంబింగ్ పనులకి కాంట్రాక్టు ఇమ్మని అడిగాను. మీ అపార్ట్ మెంట్స్ కాంట్రాక్టు చేశాననీ, కావలిస్తే అడగమని మీ పేరు చెప్పాను. ఎవరన్నా అడిగితే కాస్త రికమెండ్...'
'దాందేం వుందిలే అడిగితే చెప్తాను' అన్నాను.
ఆర్నెల్లు తిరిగేసరికి కవిత పనిలో నిలదొక్కుకుంది. నాలుగు అపార్ట్ మెంట్స్ మెయిన్ టెనెన్స్ ఒప్పుకుంది. రెండు వేలు సంపాదించుకుంటోంది నికరంగా. మధ్య మధ్య కాంట్రాక్టు పనులు, ప్రైవేటు పనులు చేసుకుని బాగానే అర్జిస్తోంది. ఆ అమ్మాయిని చూసి మా బిల్డింగ్ లో పనివాళ్లందరికీ 'చూడండి, ఆడపిల్లయినా ఎలా చేస్తుందో.. మీ పిల్లలకి పన్నెండేళ్ళొచ్చేసరికి కొంప మునిగినట్లు పెళ్లి చేసేసి పంపిస్తున్నారు, చదివించండి కనీసం మెట్రిక్ వరకు' అంటూ చెప్పేదాన్ని.
ఈ అమ్మకిదో చాదస్తం అనుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వేవారు. నాకు తెలుసు వీళ్లని మార్చడం నాతరం కాదని - అయినా పదిసార్లు చెపితే కాస్తయినా బుర్రకెక్కి వాళ్ల బతుకులు బాగుపడతాయని నా ఆశ.
చూస్తుండగా ఏణ్ణర్ధం గడిచింది. కవిత కొత్తగా ప్లంబింగ్ మెటీరియల్ షాపు పట్టింది. 'మేడమ్! ఈ చుట్టుపక్కల అర కిలోమీటరు దూరంలో ప్లంబింగ్ షాపు లేదు. ఓ షాపు తెరిస్తే ఎలా వుంటుంది మేడమ్' అంది ఓ రోజు వచ్చి. నిజమే ఆ మాట - ఆ అమ్మాయి ముందాలోచనకి నిజంగానే ఆశ్చర్యం, సంతోషం కలిగింది.
'తప్పకుండా పెట్టు. మంచి ఆలోచన వచ్చిందే.. మరి డబ్బు...'
'బ్యాంక్ అప్పు ఇస్తుందిట గదా మేడమ్... మిమ్మల్ని ఆ వివరాలు అడగాలని వచ్చాను' అంది.
'బ్యాంకు లోన్ ఇస్తుంది. మరి ష్యూరిటీగా వుండాలి. ఎంత లేదన్నా చిన్న షాపైనా ముప్పై నలభై వేలు లేనిది మెటీరియల్ రాదు గదా, షాపు అద్దె అది.. అంతా కలిసి ఓ యాభై వేలన్నా అవుతుంది మరి.'
'అవును మేడమ్, మా నాన్నని అడిగితే ఇల్లు తనఖా పెట్టి అప్పు తెచ్చుకుని నెలనెలా వాయిదాల మీద అప్పు చెల్లించేందుకు ఒప్పుకున్నారు. మాది మూడు గదుల మిద్దె ఇల్లు. ఆ మాత్రం డబ్బు అప్పు ఇవ్వరా ఇంటిమీద. మేడమ్, ప్లీజ్! మీ బ్యాంకు వారికి చెప్పి లోన్ ఇప్పించగలరా' అంది ఆరాటంగా.
'ష్యూరిటీలు అవి వుండమంటే వుండలేను గానీ మాట సాయం చేయడానికేం. తప్పక చెపుతా. రేపు మీ ఇంటి కాయితాలు అవి తీసుకురా. వెళ్లి మాట్లాడుదాం' అన్నాను.
బ్యాంకు వాళ్లతో మాట్లాడటం, ఇల్లు తనఖా మీద అప్పు ఇవ్వడానికి అంగీకరించి ఇల్లు ఎసెస్ మెంట్ చేయించి, అప్లికేషన్ ఇవ్వడం, లోన్ శాంక్షన్ అవడం, కట్టవలసిన వాయిదాల అగ్రిమెంట్లు అన్నీ పూర్తయి డబ్బు చేతిలో పడేసరికి నెల పదిహేను రోజులయింది. తమ ఇంటికి ఆనుకొని రోడ్డు మీదకి వున్న చిన్న కిరాణా కొట్టు ఖాళీగా వుంటే పదివేలు కట్టి మిగతా పది వాయిదాల మీద ఇచ్చేట్టు వడ్డీ ఇచ్చేట్టు రాసి కొనేసింది. వాష్ బేసిన్, శానిటరీ ఫిట్టంగులు, కొళాయిలు, వాల్వులు, పైపులు, కావల్సిన సామానులు కొంది. చిన్న ఎత్తున ఆరంభించడానికి సరిపోయే మెటీరియల్ కొని, నా సలహా మీద ఆ బస్తీ ఎమ్మెల్యే చేత షాపు ఓపెన్ చేయించి చుట్టుపక్కల అపార్టుమెంట్లకి పాంప్లెటులు పంచింది. షాపులో కొంత సమయం తను తనకి పని వున్నప్పుడు అన్నయ్య కూర్చుంటారు. తన చేతికింద ఓ హెల్పరుని పెట్టుకుంది. అన్న పని నేర్చుకోవడంతో బిల్డింగు మెయిన్ టెనెన్స్ పనులకి హెల్పరుని ఇచ్చి పంపేది.
ఆరు నెలల్లో షాపు నిలదొక్కుకుంది. సామాను పెరిగింది. అమ్మకాలు పెరిగాయి. ఆదాయం పెరిగింది. లాభం వాయిదాల చెల్లింపుకి వెడుతూంది.
షాపులో కూర్చున్న కవిత మీద చాలా కళ్లు పడ్డాయి. కవిత మీద అనడం కంటే కవిత షాపు మీద అంటే బాగుంటుంది. చదువుకుంది. సంపాదించే పిల్ల మరి! అలా పడ్డ వాళ్లలో బి.కాం. చదివి, కొన్ని కంప్యూటర్ కోర్సులు చదివి, ఉద్యోగాల వేటలో విజయం సాధించలేక బేవార్స్ గా తిరిగే సుధీర్ కవితకి వల వేశాడు. షాపు చుట్టూ తిరిగాడు. కవిత దృష్టిలో పడి, మాటలతో మొదలుపెట్టి, పరిచయం పెంచుకుని తన వాళ్లని కవిత ఇంటికి పంపి పిల్లనివ్వండి అని అడిగి మరీ పెళ్లికి అందరిచేత ఊఁ అనిపించేవరకు కవితని ఎన్ని రకాలుగా ఆకర్షించాలో అన్ని రకాలుగా ఆకర్షించి విజయం సాధించాడు. పాతికేళ్ల కూతురికి పెళ్లి చెయ్యాలి. చదువుకున్న కుర్రాడు, తండ్రికి గవర్నమెంటు నౌకరి, మిద్దె ఇల్లు, ఒక్కడే కొడుకు. ఇంతకంటే మంచి సంబంధం తమకి దొరకదు అనుకుని సుధీర్ చేత మూడు ముళ్లు వేయించేశారు. 'నీవొక్కర్తివి ఇంక ఇంత కష్టపడొద్దు. షాపు సంగతి నాకొదిలెయ్. ప్లంబింగ్ పనులు నీవు చూసుకో, చూసుకో షాపు ఎలా మార్చేస్తానో' అని ప్రేమ ఒలకబోసి షాపులో సెటిల్ అయిపోయాడు. పక్కనున్న ఇంకో చిన్న షాపు బేరం చేసి కొనేసి మధ్య గోడ తీసి షాపు పెద్దది చేసి, కిటికీలు, గుమ్మాలు మార్చి, రంగులు వేయించి, క్యాష్ కౌంటర్ మార్పించి, దాని వెనకాల కూర్చున్నాడు. సామాన్లు పెరిగాయి. కంప్యూటర్ వుంటే స్టాకు వివరాలు, కొనడాలు, అమ్మకాల లెక్కలు సులువు అని ఓ సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ కొని తన కంప్యూటర్ పరిజ్ఞానంతో లెక్కలేసి చూపి కవితని మురిపించాడు. పాపం కవిత పైపులు, వాల్వులు, నట్టులు బిగించుకుంటుంటే, సుధీర్ ఫ్యాను కింద కూర్చుని కంప్యూటర్ మీద చాటింగ్ లు, బ్రౌజింగ్ లు చేస్తూ, గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటాడు కస్టమర్లు లేనప్పుడు. ఆ అమ్మాయి షాపు ముందు నుంచి వెడుతుంటే ఎంతో ఎదిగిన ఆ అమ్మాయిని చూసి 'ముదితల్ నేర్వగ రాని విద్య కలదే' అనిపించి ఒక్క క్షణం గర్వంగా అనిపించినా, వెంటనే 'సొమ్మొకడిది, సోకొకడిది' అన్న నానుడి గుర్తురాక మానదు నాకు.
(పత్రిక - మే 2003)
* * * * *