"ఏమిటే నిద్ర పట్టడం లేదా? ఇటు తిరుగు అంటూ దగ్గరకు లాక్కోబోయాడామె భర్త.
"ఛీ. చెయ్యి తియ్యండి" అంటూ కడిగిపారేసి అటు తిరిగి దూరంగా పడుకుంది.
* * * *
ఉదయం ఎనిమిదయినా మరిది నిద్ర లేవకపోయేసరికి సుజాతకు అనుమానమొచ్చి దగ్గరకెళ్ళి "వినోద్" అని పిల్చింది.
అతను గాఢనిద్రలో వున్నాడేమో పలకలేదు.
"వినోద్" అని మళ్ళీ పిలుస్తూ నుదుటిమీద చేయి వేసింది.
వళ్ళు సలసలా కాగిపోతుంది.
"అయ్యో అనుకుంటూ వినోద్, వినోద్" అని మళ్ళీ పిలుస్తూ కొంచెం తట్టినట్లుగా చేసింది.
అతను కళ్ళు విప్పాడు.
"వదినా" అన్నాడు.
"నీకు జ్వరంగా వుంది వినోద్ చెప్పవేంటి"
"తెలియలేదు వదినా. రాత్రంతా వొళ్ళు నొప్పులుగా వుంది. నిద్రపట్టకపోతే ఏమిటో అనుకున్నాను. తెల్లవారుజాము నుంచీ నిద్ర పట్టేసింది.
సుజాత ధర్మామీటర్ తీసుకొచ్చి టెంపరేచర్ చూసింది.
నూట నాలుగు డిగ్రీలుంది.
"అయ్యో. అనుకుంటూ యింట్లో పేరాసిటమాల్ టాబ్లెటుంటే తీసుకొచ్చి వేసింది. ఆనక డాక్టర్ దగ్గరకి వెళదాం వినోద్" అంది.
సాధారణంగా వినోద్ చిన్న చిన్న సుస్తీలను లెక్కపెట్టడు. నూరు ఒకటి, నూరు రెండు డిగ్రీల జ్వరంతో కూడా రెస్టూ గిస్టూ లేకుండా తిరిగేస్తూ వుంటాడు. ఆకలికి వుండలేక పోతున్నాను అంటూ శుభ్రంగా ఆవకాయ, సాంబారూ వేసుకుని అన్నం తినేస్తాడు. "అబ్బ యీ మందులు నేను మింగలేను బాబూ" అంటూ మెడిసిన్స్ తీసుకోకుండా తటా యిస్తాడు. అటువంటిది యీవేళ ఒక్కరోజు జ్వరానికే కదల్లేకుండా నీరసంగా అయిపోయాడు.
వినోద్ కు జ్వరమొచ్చిందని యింట్లో అందరూ ఒకరొకరుగా వచ్చి చూసారు.
సుశీలమ్మగారు "ఒరేయ్ నువ్వసలే కేర్ లెస్ గా వుంటావుగాని డాక్టరుగారి దగ్గరకెళ్ళి చూపించుకుని వెంటనే యాంటీబయాటిక్ స్టార్టు చెయ్యి. పనిలో పని నీతోపాటు నేను కూడా వచ్చి చూపించుకుంటాను. ఈ మధ్య నాకు లెఫ్టు షల్టర్ జాయింట్ నొప్పిగా వుంది. పైకి లేవడం లేదు" అంది.
వినోద్ నవ్వి వూరుకున్నాడు.
"ఒరేయ్ నిన్ను చూస్తే అనుమానంగా వుందిరా" అంది మాధురి.
"ఎందుకే?"
"నీకు జ్వరమొచ్చిందని అందరూ తెగ గారాబం చేస్తున్నారు. సేవలు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నాక్కూడా జ్వరమొస్తే బాగుండుననిపిస్తోంది"
గారాబం బాగానే వుంటుందిగాని దాంతోబాటు బోలెడు మందులు మింగటం, డాక్టర్లు చేసే ఇంజక్షన్లు, వీటన్నిటికి తోడు భయంకరమైన నీరసం_ఇవన్నీ భరించాలి గుర్తుంచుకో."
విజయ్ కుమార్ వచ్చాడు. "నువ్వు లాభం లేదురా" అన్నాడు.
"ఏమిటన్నయ్యా"
"కాస్త ఫీవర్ కే డీలాపడిపోయావు. నేనయితే నూట నాలుగు కాదు కదా, నూట ఆరు వచ్చినా చలించను. ఎందుకంటే నేను హీరోని"
"కొయ్యండి కొయ్యండి" అంది సుజాత.
"నా ప్రతిభని శంకిస్తున్నావా?"
"మీ ప్రతిభ గురించి నాకు చెప్పకండి. తొంభయి తొమ్మిది రాగానే మంచం దిగకుండా ఆపసోపాలు, అప్పగింతలు, కలవరింతలు, ఎప్పుడో చనిపోయిన మీ అమ్మమ్మగారు తెల్లచీర కట్టుకుని కల్లోకి రావటం..."
"అంతేనంటావా?"
"అంతే మరి."
పదిగంటలకు అతనాఫీసుకు వెళుతూండగా "వినోద్ ని హాస్పటల్ కి..." అంది.
"అవన్నీ చూసుకోవటానికి కొండంత వదినవి నువ్వుండగా నాకేమిటి చింత?"
"అంతేనంటారా?"
అంతే మరి.
* * * *
విమలాదేవి రాధాప్రియ పోర్షన్ లో కొచ్చింది.
రాధాప్రియ చాలా సీరియస్ గా వుంది.
"ఏమిటలా వున్నారు?" అనడిగింది విమలాదేవి.
"ఈ పాడు ప్రపంచంలో బతకటమెలాగో తెలీటంలేదు" అంది రాధాప్రియ.
"ఏమిటండీ? ఏం జరిగింది?"
"వాడు లేడూ? ఆ స్కౌండ్రల్..."
"ఎవరండి?"
"వినోద్ గాడు"
"వాడా? ఏం చేశాడు?"
"ఎవరూ లేకుండా చూసి యింట్లో జొరబడి నా చెయ్యి పట్టుకున్నాడు."
"ఏమిటి అంతలోనే" అటు విమలాదేవి కళ్ళు పెద్దవి చేసి. ఆమె ఆ దృశ్యం మరో పథంలో ఊహించుకుంటోంది. తానూ యింట్లో ఎన్నిసార్లు ఒంటరిగా వుండే అవకాశం తటస్థించింది. అతనింట్లో జొరబడి చెయ్యి పట్టుకోలేదే. కుర్రాడు బాగా వుంటాడు. అందంగా వుండటమే గాకుండా మేస్క్యులైన్ గా వుంటాడు.
"అమ్మా! అంతపని చేశాడా?" అంది ఆశ్చర్యం ప్రకటిస్తూ.
రాధాప్రియ చాలా అవమానం జరిగిన ఫీలింగ్స్ కళ్ళలో ప్రదర్శిస్తూ తల ఊపింది.
"మీరు చాలా అందంగా వుంటారు కదండి. వెధవకి మరి చలించి వుంటుంది."
"అయితే మాత్రం నాకిలాంటి వ్యవహారాలంటే పరమ అసహ్యం. నేను పతివ్రతను."
"ఒక్క చెయ్యి పట్టుకుని వూరుకున్నాడా? ఇంకేమన్నా..."
"అంతవరకూ రానిస్తానా? గీచిపెట్టి చెంపకాయ కొట్టాను."
"మంచిపని చేశారు."
"వాడకంత కోరిగ్గా వుంటే యింట్లోనే వుందిగా ఆ వన్నెలాడి, దాంతోనే సాగించమనండి. అంతేగాని మనలాంటి వాళ్ళ జోలికొస్తాడా?"